July 23, 2013

మహాభారతం లో భీష్ముని పాత్ర (సూక్ష్మంగా)

మహాభారతం లో భీష్ముని పాత్ర (సూక్ష్మంగా)

నవదేవతావసువులలో తొమ్మిదవవాడైన "ద్యౌ" అను వసువు, వశిష్ఠుని శాపకారణంగా భూలోకంలో మానవ అవతారంలో భీష్మునిగా అవతరించెను. బాల్యంలోనే సాంగోపాంగవేదవిద్యలను అభ్యసించిన వేదవిదుడు. అస్త్రవిద్యను అభ్యసించే రోజులలోనే ఇతను బాణములను ప్రయోగించి గంగా ప్రవాహాన్ని కూడా నిరోధించగల్గిన అస్త్ర విద్యా పారంగతుడు. ఇతని అసలు పేరు దేవవ్రతుడు.

శంతన మహారాజు, దాశరాజు కుమార్తె సత్యవతిని మోహించి, వివాహమాడవలెనన్న కాంక్షతో ఉండగా, సత్యవతి తండ్రి దాశరాజు విధించిన షరతుకు అంగీకరించి, తాను శాశ్వత బ్రహ్మచర్యమును ఆచరించెదనని పలికిన భీషణ ప్రతిజ్ఞా దురంధరుడు. ఆ కఠోర శపథానికి సంతసించిన శంతనుడు  స్వేచ్ఛా మరణాన్ని వరంగా భీష్మునకు ప్రసాదించాడు.

తండ్రి కొరకు రాజ్యాన్ని, గృహస్థ జీవన సౌఖ్యాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు భీష్ముడు. సత్యప్రతిజ్ఞాపాలనను, శపథాన్ని చిత్తశుద్ధితో ఆచరించినవాడు. అస్త్రవిద్యను నేర్పిన గురువైన పరశురామునితో కూడా యుద్ధము చేసిన ప్రతిజ్ఞా పాలకుడు భీష్ముడు.

మహాభారతయుద్ధంలో  భీష్ముడు నిష్పక్షపాత బుద్ధితో చేసిన యుద్ధము అర్జునుని, శక్తిని క్షీణింపచేయగా, ఆయుధం చేపట్టనని ప్రతినబూనిన శ్రీకృష్ణుడు కూడా భీష్ముని పట్ల ఆగ్రహంతో, చక్రం ధరించి, కొరడాను ఝుళిపించి మరియొకసారి యుద్ధమునకు తలపడగా, భీష్ముడు కరములను జోడించి "పరమాత్మా ! పరంధామా ! రావయ్యా ! నన్ను సంహరించు, నీ కరములలో అస్తమించటం నాకు మహద్భాగ్యం." అంటూ మోకరిల్లాడు భీష్ముడు.

అపారజ్ఞానమును పొందిన భీష్ముడు అజ్ఞానం ఇతరతరాలకు అందాలన్న తపనతో ధర్మరాజుకు వర్ణాశ్రమ ఫలాలు, రాజధర్మాలు, మోక్షధర్మాలు, ఆపద్ధర్మాలు వంటి ఎన్నో అద్భుతవిషయాలను బోధించిన ధీశా. రాజసూయయాగ సందర్భంలో అగ్రపూజ విషయంలో శ్రీకృష్ణభగవానుడే ఆదిపూజకు తగినవాడని తెలిపిన జ్ఞాని.

ధర్మరాజుకు బోధించిన విష్ణుసహస్రనామస్తోత్రంలో ప్రతి అక్షరంలో భక్తి కనిపిస్తుంది. అన్ని వర్ణాలవారికి, వర్గాలవారికి ఆదర్శప్రాయుడై పితృకర్మల సమయంలో అందరినుండి తర్పణాలను స్వీకరిస్తున్న ఆర్తధర్మరక్షకుడు.

ఆయనకు గల అపారభక్తి వల్లనే అంత్యదశలో శ్రీకృష్ణులవారి విశ్వస్వరూపాన్ని దర్శించి, తరించి, పరమపదాన్ని పొందిన ధన్యజీవి భీష్ముడు. పరాక్రమము, పట్టుదల, త్యాగనిరతి, ప్రతిజ్ఞాపాలన, పరమేశ్వరుని యందు అపారమైన భక్తి కలిగిన భీష్ముడు చరితార్ధుడు.

  

July 20, 2013

గిరి ప్రదక్షిణ (ఆషాఢ పౌర్ణమి)

గిరి ప్రదక్షిణ (ఆషాఢ పౌర్ణమి)




ఆషాఢ పౌర్ణమి అంటే గురుపూజ, వ్యాసజయంతి... అని మాత్రమే తెలుసును అందరికీ.... ఆషాఢ పౌర్ణమికి మరో విశేషం కూడా ఉంది. అదే సింహాచల గిరి ప్రదక్షిణ. 

కొన్నికొన్ని ప్రాంతాలలో గిరిప్రదక్షిణలు చేస్తారని మనకి తెలుసు. అరుణాచలంలో అనునిత్యం గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా సింహాచలంలో సంవత్సరానికి ఒక్కరోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేస్తారు. 

అక్షయతృతీయ నాటి రాత్రి సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి చందనము వేస్తారు. ఆ రోజును చందనయాత్ర అంటారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ స్వామియొక్క నిజరూప దర్శనము మనకు లభిస్తుంది. మిగిలిన రోజులలో స్వామి చందనంలో ఉంటారు. ఈ స్వామికి వైశాఖ పౌర్ణమికి 4 మణుగులు, జ్యేష్ట పౌర్ణమికి 4 మణుగులు మరియు ఆషాఢ పౌర్ణమి కి 4 మణుగులు వేస్తారు. ఈ ఆషాఢ పౌర్ణమి కి స్వామికి 12 మణుగుల చందన పూత పూర్తి అయ్యి స్వామి పరిపూర్ణంగా కనిపిస్తారు. పౌర్ణమి దేవతలకి ప్రీతికరమైన రోజు. ఈ పరిపూర్ణ ఆకారాన్ని చూసి తరించటానికి ముక్కోటి దేవతలంతా సింహగిరికి ఆషాఢపౌర్ణమి నాడు విచ్చేస్తారు. కనుక ముందు రోజు రాత్రినుండే ప్రజలు గిరి ప్రదక్షిణ చేసి, పౌర్ణమి రోజు ముక్కోటిదేవతలతో కూడిన సింహాద్రినాథుడిని దర్శించుకుంటారు.

గిరి ప్రదక్షిణ చేసేవారు చతుర్ధశి నాటి సాయంత్రం మొదటగా తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి, నడక ప్రారంభిస్తారు. దారిలో భక్తుల కోసం..... వివిధ సేవాసంస్థల వారు మంచినీరు, మజ్జిగలు మరియు ప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పౌర్ణమి నాటి ఉదయానికి మరల తొలిపావంచా చేరుకొని, మెట్లమార్గం ద్వారా కొండను ఎక్కి స్వామిని దర్శించి... మరల మెట్ల మార్గంలో క్రిందికి దిగుతారు. ఈ విధంగా చేస్తేనే పరిపూర్ణ గిరిప్రదిక్షిణ అవుతుంది.

మన జీవితంలో ఒక్కసారి ఐనా ముక్కోటిదేవతలతో కూడిన సింహాద్రినాథుని దర్శిస్తే మన జన్మకు సార్థకత చేకూరుతుంది.






July 18, 2013

తొలి ఏకాదశి -- ప్రాశస్త్యం....

తొలి ఏకాదశి -- ప్రాశస్త్యం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ... తొలి ఏకాదశి అని అంటారు, దీనినే శయనైకాదశి అని కూడా అంటారు. ఈ రోజునుండి పండుగలు మొదలవుతాయి గనుక దీనిని తొలిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి, భగవంతుణ్ణి భక్తితో పూజిస్తే, గోలోకప్రాప్తి లభిస్తుందట. 
విష్ణుమూర్తి పాలకడలిలో శేషపాన్పు పై, యోగనిద్రలోకి ప్రవేసించే రోజు ఈ రోజు. (యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేదానికి సూచన. దానివలన ప్రజలలో నిద్రాసమయం పెరుగుతుంది.) భగవానుడు దక్షిణవైపు తలపెట్టి, కుడిచేతిమీద పడుకుంటాడు. సూర్యచంద్రులు అతనికి రెండు నేత్రాలు. రెప్పలు మేఘాలు. శయనించుట అనగా సూర్యుని, చంద్రుని కన్నులుగా కలిగిన అతడు---- నిదురించుట అంటే రెప్పలు మూయుట అని అర్థము. అనగా ఆ రోజునుండీ మేఘములచే--సూర్యచంద్రులు కప్పబడతారు. నిజానికి భగవంతుడు నిద్రపోడు. యోగనిద్రలో ఉంటాడు. తిరిగి విష్ణుమూర్తి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. దీనినే క్షీరాబ్ది ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ నాలుగు నెలలు స్వామి అలసట తీర్చుకొనుటకు యోగనిద్రలోకి వెళ్ళి, భక్తుల పరిరక్షణా భారాన్ని, లోక సంరక్షణా భారాన్ని అమ్మవారికి అప్పగిస్తారు. అందుకే అమ్మవారికి ఈ నాలుగు నెలలు పూజలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణమాసంలో -- శ్రావణలక్ష్మీ రూపంలో, ఆశ్వీయుజ మాసంలో -- శక్తిరూపంలో అమ్మ అందరి పూజలను అందుకుంటుంది. "అమ్మా మా విన్నపాలను స్వామికి తెలుపమ్మా" అని అమ్మకి మన మొరలని తెలియచేసుకునే అవకాశం మనకు లభిస్తుంది.


సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో సరైన సూర్యరశ్మి లేక, వర్షాభావం వలన, మానవులు అనేక వ్యాధులబారిన పడతారు. అందుకే మన పెద్దలు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష, నోములు, వ్రతాలూ అని చెప్పి, ఉపవాసములు చెయ్యమని, ఆహరనియమాలను పాటించమని, ఆ ప్రకారం నడుచుకుంటే మనకు పుణ్యం లభిస్తుంది అని తెలియచేసారు.

వ్రతములలోకెల్ల శ్రేష్టమైనది ఏకాదశి వ్రతము. ఇది అన్ని సంప్రదాయముల వారు, అన్ని ఆశ్రమముల వారు తప్పనిసరిగా చేయవలసినది. ఏకాదశి నాడు భగవంతునికి పళ్ళూ -- పాలు నివేదన చేసి తీసుకోవచ్చును. ఉపవాసం అంటే --- "ఉప" అంటే "దగ్గరగా", "వాసం" అంటే "ఉండుట" --- అంటే..... భగవంతుని నామస్మరణ చేస్తూ, అతనికి దగ్గరగా ఉండటం అనేది ఉపవాసం యొక్క అర్థం. ఈ విధంగా ఏకాదశినాడు రోజంతా ఉపవాసం ఉండి, భక్తితో భగవంతుని పూజించి, రాత్రంతా జాగరణ చేసి, ద్వాదశినాడు తెల్లారక భగవంతునికి పూజలు చేసి, వండిన పదార్థాలను స్వామికి నైవేద్యం చేసి, మనం తీసుకోవాలి.

విష్ణువు నుండి వరం పొందిన పాప పురుషుడు అన్నంలో దాగి ఉంటాడు. బ్రహ్మ శ్వేద బిందువు క్రిందపడి, రాక్షసుడుగా అవతరించి--- నాకు నివాసము, ఆహారము ఏది అని అడగగా... ఏకాదశి నాడు ఎవరైతే అన్నాన్ని భుజిస్తారో, ఆ అన్నమే మీకు ఆహారంగా లభిస్తుంది... మీ పాప ఫలం వారు పొందుతారు---అని బ్రహ్మ వారికి వరమిచ్చెను. అందువల్ల ఆ రోజు మనం ఆహారాన్ని భుజిస్తే ఆ రాక్షసులు మన కడుపులో చేరి... సూక్ష్మ క్రిములుగా మారి, మనకి అనారోగ్యాన్ని కలిగిస్తారు.

సైన్స్ పరంగా కూడా 15 రోజులకు ఒకసారి కడుపు ఖాళీగా ఉంచుకుంటే అనారోగ్యం మన దరిచేరదు-- అని పెద్దలఉవాచ. ఉపవాసం ఉండుట వలన, కడుపులోని జీర్ణకోశాలు పరిశుద్ధమై, ఇంద్రియ నిగ్రహం కలిగించి, మనసుని శుద్ధి చేసి, శరీరాన్ని తేజోవంతం చేస్తుంది. ఉపవాసం ఉన్నవారు-- పేలాలు వేయించి, పొడి చేసుకొని, బెల్లం కలుపుకొని దేవునికి నైవేద్యం చేసి భుజిస్తారు. 
అందుకే ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు చేబడతారు. ఈ దీక్ష చేపట్టిన వాళ్ళు పొలిమేర దాటకూడదు అనే నియమం ఉండుట వలన... వారు ఉన్న దగ్గరకే విద్యార్థులను రప్పించుకొని, విద్యాబోధనలు చేస్తారు. వారి ప్రవచనాల ద్వారా జ్ఞానాన్ని అందరికీ పంచుతారు. చాతుర్మాస వ్రతం ఆచరించేవారు, వ్రతం పూర్తి అయ్యేవరకూ నిమ్మకాయలు... అలసందలు... ముల్లంగి.... గుమ్మిడికాయ... చెరుకుగడలు మొదలగునవి వాడకూడదని శాస్త్రం చెప్పింది. మొదటి నెలలో కూరలు మాత్రమే తీసుకోవాలి, రెండవ నెలలో పెరుగూ, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో ఆకుకూరలు అన్నంలో ఆధరువులు తీసుకోవాలి.


సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేయలేని వారు, ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా అన్ని ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది.
కృష్ణో రక్షతు నో జగత్త్రయగురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం ll


July 12, 2013

హాయమ్మ హాయీ ఆపదలు గాయీ

హాయమ్మ హాయీ ఆపదలు గాయీ

ఉళుళుళు హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..ఉళుళుళు

చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాలు త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు

ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిట్టి ముత్యము పుట్టె సీత కడుపున
స్వాతి వానలు కురిసె సంద్రాల మధ్య..ఉళుళుళు

అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడా రార బుట్టల్లుకోరా
బుట్టలో బాబును పట్టుకొని పోరా
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేంఢ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు..
ఉళుళుళు ఆయమ్మబాయమ్మ
అక్కచెల్లెళ్ళు తొలి ఒక్క జన్మాన తోడికోడళ్ళూ




జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో

తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ
నాలుగూ వేదాల గొలుసులమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలుల డోలికలలొన చేర్చి లాలించీ..జో జో

ముల్లోకములనేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
ఈ జన్మలో నాకు బిడ్డలైనారూ..జో జో






కాకాసురుని కైవల్య భక్తి

కాకాసురుని కైవల్య భక్తి

అశోకవనంలో గల సీతాదేవి హనుమంతునికి జ్ఞాపికగా కాకాసురుని కథను తెలిపినది. భగవంతుని శక్తి నుండి తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యం కాదు. భగవంతుని చరణాల వద్ద చేరి, శరణు కోరితే ఎంతటి మహత్తర ఘోర పాపమైన తొలగిపోతుంది అన్న సత్యం ఈ కథలో మనకు తెలుస్తుంది.

చిత్రకూట పర్వతమునకు ఈశాన్యములో గల ఒక ఉప పర్వతంపై సిద్ధాశ్రమము కలదు. అందు సీతారాములు తపసాశ్రమవాసులుగా ఉండగా ఒకరోజు దేవేంద్రుని సంతతియైన ఒక కాకి (వాయసము) సీతాదేవి వక్షమును తన ముక్కుతో పొడిచి, రక్తమాంసాలను భుజించవలెనని ప్రయత్నించినది. సీతాదేవి ఆ కాకిని అదిలించి, తన బాధను దిగమ్రింగుకుని, శ్రీరాముని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. మరల అ కాకి తిరిగి వచ్చి సీతమ్మను బాధ పెట్టగా శ్రీరాముడు గమనించి, కోపించి ఒక దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి కాకిపై ప్రయోగించెను. దానితో కాకి భయంతో ఆ అస్త్రము నుండి తప్పించుకొనుటకు లోకములన్నిటినీ తిరిగినది, ఎవ్వరూ ఆ కాకిని ఆ అస్త్రము నుండి తప్పించుటకు అశక్తులమని తెలిపి, తమ నిస్సహాయతను వేలిబుచ్చగా, చివరకు కాకి తానూ తప్పుచేసినప్పటికి, తనను రక్షించి, క్షమించేది, విశాలహృదయమ శ్రీరామనికే కలదని తలచి, శ్రీరాముని శరణుకోరి అతని పాదములపై పడినది.

సర్వలోకశరణ్యుడైన శ్రీరాముడు ఆ కాకిని చూసి దయాద్రహృదయుడై పశ్చాత్తాపంతో కూడిన ఆ కాకిని రక్షించవలెనని నిశ్చయించి, బ్రహ్మాస్త్రమును ఒకసారి ప్రయోగించినచో దానిని ఉపసంహరించుట సాధ్యముకాదని గ్రహించినవాడై, ఏదో ఒక స్వల్పశిక్షతో ఆఅస్త్రమును శాంతింపచేయవలెనని తలచి, అకాకి కోరిక మీదట కుడికన్నును తొలగించి, ప్రమాదమునుండి రక్షించెను.

ఎంతటి మహత్తర పాపమును చేసినప్పటికీ, పశ్చాత్తాపంతో ఆ దేవదేవుని శరణుకోరితే తప్పక రక్షణపొందవచ్చునని ఈ కథ మనకు తెలియచేస్తుంది.

(అందుకే సామెత వచ్చింది----"చావుతప్పి కన్ను లొట్టపోయింది" అని)














July 11, 2013

రామాయణ జయమంత్రం

రామాయణ జయమంత్రం

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||





సుతీక్షుణుని స్మరణభక్తి

సుతీక్షుణుని స్మరణభక్తి

పూర్వం సుతీక్షుణుడు అనే మహాభక్తుడు, భగవంతుని పట్ల ప్రేమతో నిత్యస్మరణ చేస్తూ, ఆ తన్మయత్వంలో మనస్సులోనే భగవంతుని ప్రతిష్టించుకున్నాడు. కొన్ని సందర్భాలలో తనను తానే మరచి భగవంతుని ధ్యానంలో పరవశిస్తూ, నృత్యం చేస్తూ, పరుగులు తీస్తూ, నవ్వుతూ, తుళ్ళుతూ ఆనంద లోకాలలోకి విహరిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు అతని హృదయంలోనే నివాసమేర్పరచుకొని అతనిని తరిమ్పచేసాడు.

ఇదే విధంగా సనకసనందాది మునులు, ధృవుడు, భీష్ముడు, కుంతీ శబరి, జటాయువు వంటి భక్తులు స్మరణతో తమ జన్మలను పరిమ్పచేసున్నారు. శబరి, జతాయువులకు శ్రీమహావిష్ణు అవతార పురుషుడైన శ్రీరాముడే స్వయంగా ఉత్తర కర్మలను నిర్వర్తించి తన భక్తులపట్ల భగవంతునకు గల అభిమానాన్ని ప్రదర్శించాడు.

నేటి పరిస్థితులలో ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా మనస్సును ఇతర వ్యాపకాలకు దూరంగా ఉంచి, కేవలం భగవంతుని స్మరించటంలోనే తరించే మార్గముందని తెలుసుకొని, తరించే ప్రయత్నం చేద్దామా.


July 8, 2013

పంచ కన్యలు

పంచ కన్యలు

1.అహల్య   2.ద్రౌపతి   3.తార   4.మండోదరి  5.సీత (మండోదరి) 
                                             

మానవ ధర్మం --- మన ధర్మం

మానవ ధర్మం --- మన ధర్మం

అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్తమమైనది. అలంటి జన్మను పొందటం ఆజీవి చేసుకున్న పుణ్యఫలం.

"ప్రాణినాం నరజన్మ దుర్లభం" , "దుర్లభో మానుషోదేహః" , "నరత్వం దుర్లభంలోకే". అనే ఆరోక్తులు మానవజన్మను పొందటం ఎంత అదృష్టమో వివరిస్తున్నాయి. మంచి, చెడులను తెలుసుకొనే విచక్షణాజ్ఞానం , ఆపదల నుండి విముక్తిని పొందే ఆలోచనాశక్తి, సమస్యలను పరిష్కరించుకొనే మేధాశక్తిని కల్గిన మానవుడు ఐహిక ఆనందంతో పాటు పారమార్థిక శ్రేయస్సును కూడా పొందాలి.

"ఆహార నిద్రాభయమైధునంచ సమాన మేతత్ పశుభిర్నరాణం l
ధర్మోహితేషామధకోవిశేషః ధర్మేణహీనా పశుభిస్సమానాః ll"


ఆహారాన్ని స్వీకరించటం, నిద్రించటం, భయాందోళనలు చెందటం , సంతానాన్ని పొందటం, వంటివి, పశువులకు -- మనుష్యులకు సాదృశ్యధర్మాలే. తన ధర్మాన్ని తెల్సుకోవటం, ఆచరించి జన్మను సార్థకం చేసుకోవటమే మనిషి విశిష్టత.

ఒకనాడు ఒకయోగి పుంగవుడు నదీతీరాన వెడుతూ ఉండగా, ఒక తేలు నీళ్ళలో కొట్టుకొనిపోతూ ఉంది. దానిని చూచినా ఆ యోగిపుంగవుడు తన చేతిని చాచి, నీళ్ళనుండి రక్షించే ప్రయత్నం చేసాడు. ఆ తేలు అతన్ని కుట్టింది. వెంటనే బాధతో నీళ్ళలోకి వదిలేశాడు. మళ్ళీ అదే రీతిలో తేలుని రక్షించే యత్నం చేయగా మళ్ళీ అది అతనిని కుట్టింది. మళ్ళీ వదిలేశాడు. ఇలా నాలుగైదుసార్లు చేస్తూ ఉండగా, ఒక బాటసారి ఆ యోగిని చూసి "ఆర్యా ! మీరు జ్ఞానుల వాలే ఉన్నారు. ఆ తేలు మళ్ళీ మళ్ళీ కుడుతూ ఉన్నా మూర్ఖంగా అదే ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు ???" అని అడుగగా, అపుడు ఆ యోగి "నాయనా ! కుట్టటం దాని ధర్మం ---- రక్షించటం మనధర్మం కదా ! దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తోంది. ధర్మాన్ని నేను ఎలా విడిచిపెట్టగలను???" అని సమాధానం ఈయగా , ఆ బాటసారి మానవధర్మంలోని అంతరార్థాన్ని తెల్సుకొని వెళ్ళిపోయాడు.

ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి అన్న అర్థం ఈ క్రింది శ్లోకంలో మనకు తెలుస్తుంది.

ధర్మాధర్థం ప్రభవతే ! ధర్మాత్ ప్రభవతే సుఖం !
ధర్మేణసాధ్యతే సర్వం, ధర్మ సంసారమిదం జగత్ ll


ధర్మాచరణ వలన అర్థ ప్రాప్తి , ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మము యొక్క సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. ఆదర్శపుత్రునిగా గరుక్మంతుడు మాతృసేవలో తన పుత్రధర్మాన్ని ఆచరించి "మాతృదేవోభవ" అన్న మంత్రానికి సార్ధక్యం చేకూర్చాడు. తండ్రికోరిక మేరకు బ్రహ్మచర్యం ద్వారా భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు "పితృదేవోభవ" అన్న మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపాడు. "ఆచార్యదేవోభవ" అన్న మంత్రాన్ని ఆరుణి, ఉపమన్యుడు, ఉరంకుడు అనే ఆదర్శ శిష్యులు. "అతిధిదేవోభవ" అన్న మంత్రాన్ని రంతిదేవుడు, రఘుమహారాజు , మానవులుగా ఆచరిస్తే, కపోతము తన జీవితాన్ని అర్పించి, గృహస్థు ధర్మాన్ని నిరూపించింది.

------------ఓం తత్ సత్------


కీర్తన భక్తి:--

కీర్తన భక్తి:--

భగవంతుని నామ రూప గుణ చరిత తత్వ రహస్యాలను, శ్రద్ధతో, ప్రేమతో కీర్తిస్తూ ఉంటే శరీరం పులకించటం, కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడటం, కంఠం తన్మయత్వంతో గద్గదమవ్వటము, హృదయ ప్రఫుల్లమై విలసిల్లటమే...కీర్తన లక్షణం.

పూర్వం నారదుడు, వాల్మీకి, శ్రీశుకుడు వంటి భక్తాగ్రేసరులు..... ఈ యుగంలో తులసీదాసు, సూరదాసు, తుకారం, మీరభాయ్, నానక్ వంటి ఎందరో భక్తులు కీర్తనభక్తి వలన తరించారు.

నిరంతరం నామకీర్తనలు గావించిన ప్రహ్లాడునుకి, నామకీర్తనతో పాటు, శ్రీరాముని తన హృదయంలో నిలుపుకున్న , హనుమంతునకు సాయుధ్యాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు.

కలియుగంలో శ్రీహరి నామమే సర్వశ్రేయోదాయక సాధనం.

శ్రీరామదాసు, అన్నమయ్య, త్యాగయ్య , క్షేత్రయ్య, జయదేవుడు మొదలైనవారు కలియుగంలో కీర్తనభక్తివల్లననే ముక్తిని పొందారు.


విష్ణుశర్మ వీవేకం (నీతికథ)

విష్ణుశర్మ వీవేకం (నీతికథ)

పూర్వం ఒక రాజ్యాన్ని పరిపాలించే మహారాజు, ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటూ, రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నా, రాజు మాత్రం విచారంగా ఉండేవాడు. అతని నలుగురు కొడుకులకూ విద్యలేకుండా ఉండుటే అతని విచారానికి కారణం. అతనికి వృద్ధాప్యం వస్తే, అయొగ్యులైన పుత్రులకు రాజ్యభారం ఎలా అప్పగించటం అని అతను విచారంతో ఉంటూ ఉండేవాడు. వీరికి ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పించి, వివేకవంతులుగా తీర్చిదిద్దమని ప్రతీ పండితుణ్ణి కోరేవాడు, కానీ ఎవ్వరూ సాహసించలేదు. విష్ణుశర్మ అనే పండితుడు ముందుకువచ్చి, రాకుమారులకు విద్యాబుద్ధులు నేర్పించి, యోగ్యులుగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చాడు.

రాకుమారులు ప్రతిరోజూ పావురాలని ఎగురవేస్తూ ఆడుకుంటూ ఉండేవారు. విష్ణుశర్మ కూడా ప్రతిరోజూ వారితోపాటు పావురాలను ఎగురవేస్తూ,ఆడుతూ -- పాడుతూ, అలా వారితో స్నేహం చేసి, వారికి దగ్గరయ్యాడు.

ఒకరోజు విష్ణుశర్మ వారితో "నేను మీకు ఒక పోటీ పెడతాను, ఆ పోటీలో గెలిచినవారికి మిఠాయిలు పంచిపెడతాను, మీరు సిద్ధమేనా" అని అడిగాడు. వారు ఉత్సాహంగా ఆ పోటీ ఏమిటి అని అడిగారు. తెలుగుభాష అక్షరాలు ఎలా ఉంటాయో ముందుగా వాళ్ళకి తెలియపరచాడు. "ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పావురాల కాళ్ళకు కట్టి ఎగురవేస్తాను, "క" అనే అక్షరం ఎవరైతే తెస్తారో, వారికి నేను ఒక బహుమతీ ఇస్తాను", అని చెప్పాడు. అదివిని రాకుమరులంతా "క" అనే అక్షరాన్ని వెతకటానికి బయలుదేరారు.

కనపడ్డ ప్రతీ పావురానికి కట్టివున్న అట్టలను వెతకటం, ఆ అక్షరాన్ని శ్రద్ధగా పరిశీలించటం చేయసాగారు. ఆ అక్షరం ఏమిటో, ఎలా దాన్ని చదువుతారో తెలుసుకున్నారు. ఇలా ప్రతీరోజూ విష్ణుశర్మ వారికి ఒక్కోరకమైన పోటీ పెట్టి, ముందుగా అక్షరాలూ, ఆతర్వాత పదాలు, వాక్యాలు, వ్యాకరణం.......ఇలా అన్నీ నేర్పించసాగాడు. రాకుమారులలో కూడా ఉత్సాహం, జిజ్ఞాస కలిగి క్రమంగా అందరూ మంచి విద్యార్థులై, సకల శాస్త్రాలూ నేర్చుకున్నారు. విష్ణుశర్మ బోధనలో మంచి రాజినీతిజ్ఞులుగా తయారయ్యారు.

నీతి ఏమిటంటే-----"మంచి గురువు అనేవాడు, విద్యార్థులకు తెలిసిన దాని నుండి ఆరంభించి... తెలియనిదానిని నేర్పించటమే అసలు సిసలైన మంచి విద్యాబోధన"


July 4, 2013

గురుపౌర్ణమి (ఆషాఢ పౌర్ణమి)

గురు పూర్ణిమ, వ్యాస పౌర్ణమి (ఆషాడ పౌర్ణమి)


వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll
మహాభారత గ్రంధకర్త అయిన "వేదవ్యాస మహర్షి" జన్మించినది.......ఆషాడ పౌర్ణమినాడు.ఈ వ్యాసుడు, పరాశర ముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును "వ్యాసపౌర్ణమి" మరియు "గురుపౌర్ణమి" అని కూడా అంటారు. 
మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు. తన నలుగురు శిష్యులకు... ఒక్కొక్క వేదాన్ని బోధించాడు. పైలుడు---- అనే శిష్యునకు ఋగ్వేదాన్ని, వైశంపాయునికి ---- యజుర్వేదాన్ని, జైమినికి --- సామవేదాన్ని, సుమంతునికి --- అధర్వణ వేదాన్ని బోధించి....... వాటిని, వారిచేత ప్రచారం చేయించాడు. భాగవతాన్ని శుకునకు బోధించాడు. ఈ లోకంలో లిపిలేని కాలంనుండి ఎంతో నాగరికతను సంతరించుకున్న ఈ కాలంవరకు వేద విజ్ఞాన పఠన పాఠాలు నిర్దుష్టంగా కొనసాగేలాంటి ప్రక్రియను ఏర్పరచాడు. 

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో, నడుస్తుంది.
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు. 
వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని "వేదపురుషుడు" అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు. 
శ్రీమత్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ,వేదవ్యాసుని 17 వ అవతారంగా చెబుతుంది. 
వ్యాసుడు నల్లగా ఉండేవాడంట... అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు. ఈయన నివాస స్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం... కనుక కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు . 
వేదాలని విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక---వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు గనుక ---పరాసరాత్మజుడు అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక ---బాదరాయణుడు అని అంటారు. 
సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట----ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు. 
మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృఋణము---అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచేప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు. 
మహాభారత రచన:--




మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అద్రుస్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే, నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.



గురుశిష్య సాంప్రదాయం ఏనాటిదో ఐనా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు.  
వ్యాసుడు మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి, లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి) నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి... పూజించాలి. ఆ గురువకు పాదపూజ చేసి. కానుకలు సమర్పించి, అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" 
అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. "గు" శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. "రు" శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, మనకు జ్ఞాన్నాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.
ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం. 

మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.
गुरु जोविंद दोऊ खड़े काके लागौ पॉय l 
बलिहारी गुरु आपने जोविंद दियो बताय ll 
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. 
గురు సందేశము : 
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది. 





అస్మత్ గురుభ్యో నమః _____/\______



July 2, 2013

శ్రీ మారుతీ స్తోత్రం

శ్రీ మారుతీ స్తోత్రం:--

ఓం ---నమో వాయుపుత్రాయ భీమరుపాయ ధీమతే

న -- మస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే

మో -- హశోకవినాశాయ సీతాశోక వినాశినే

భ -- గ్నా శోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గ -- తినిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణదాయచ

వ -- నౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే

త -- త్వజ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే

అం -- జనేయాయ శూరాయ సుగ్రీవసచివాయచే

జ -- న్మమృత్యుభయగ్నాయ సర్వక్లేశ హరాయచ

నే -- నేధిస్టాయ మహాభూత ప్రేత భీత్యాది హారిణే

యా -- తనా నాసనాయాస్తు నమో మర్కట రూపిణే

య -- క్షరాక్షస శార్థూల సర్పవృశ్చిక భీహృతే

మా -- మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధ్రుతే

హా -- రిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే

బ -- లినామగ్ర గణ్యాయ నమో పాప హరాయతే

లా -- భదోసి త్వమేవాసు హనుమాన్ రాక్షసాంతక

య -- శోజయంచ మేదేహి శత్రూన్నాశాయ నాశాయ

స్వా -- శ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిం

హా -- హాని కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్