November 27, 2016

మల్లూరు హేమాచల నృసింహస్వామి క్షేత్రమహాత్మ్యం

మల్లూరు హేమాచల నృసింహస్వామి క్షేత్రవిశేషాలు 


ఆలయానికి చేరుకోవటానికి మొదటి ప్రవేశద్వారం - ఇక్కడనుండి ఆటోల ద్వారా చేరుకోవచ్చును. 
మా తమ్ముడి ఫ్యామిలీతో నేను కూడా ఈ ఆలయాన్ని చూడటానికి, స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళాను. ఈ ప్రాంతమంతా అటవీప్రాంతం అవ్వటం వల్లన రోడ్డుకి ఇరుప్రక్కలా ఎత్తైన చెట్లతో, కొండలు, గుట్టలతో వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. రోడ్డు పొడవునా, దారి అంతా కోతులు ఎక్కువగా కనిపించాయి. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి, స్వామికి నైవేద్యానికి ఇద్దామని వస్తుంటే, చేతిలో ఉన్న కొబ్బరిచిప్పని లాక్కుని వెళ్ళిపోయాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి.        
      
సరే ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే ...... ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా విహంగవీక్షణం చేస్తే అర్ధచంద్రాకారంలో ఉంటుందని అంటుంటారు. శాతవాహనశక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు కలలో సాక్షాత్కరించి గుహాంతర భాగంలో ఉన్నానని చెప్పారంట. మహారాజు కొంతమంది సైనికులతో అక్కడకు వెళ్ళి గుహను తవ్విస్తుండగా స్వామివారికి గునపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం కారుతూఉంటుంది. ఈ ద్రవం సంతానం లేనివారు తీసుకుంటే సంతానం కలుగుతుందని, పెళ్ళికాని వారు తీసుకుంటే పెళ్ళి జరుగుతుందని నమ్ముతుంటారు. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. నరసింహస్వామిని దర్శించుకోవడంవల్ల సమస్త శతృ బాధలు తీరుతాయంటారు.
ఆలయానికి చేరుకోవటానికి రెండవ ప్రవేశద్వారం

పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంలో  తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సాక్షాత్తు దేవతలే ఇక్కడి స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. 

ఆలయానికి చేరుకోవటానికి మెట్లమార్గం 



స్వామి వారికి ఆదిలక్ష్మీ(అక్క), చెంచులక్ష్మీ(చెల్లి)అను ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆలయంలో స్వామివారికి ఇరుప్రక్కల వీరిరువురి ఆలయాలు ఉన్నాయి.  

ఆదిలక్ష్మీ అమ్మవారు 

చెంచులక్ష్మీ అమ్మవారు 

క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వాములున్నారు. 


ఆలయానికి మెట్లమార్గానికి ఎడమచేతి వైపు వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. 



ఆలయానికి ఎడమవైపు ఒక చిన్న కోనేరు ఉంది. మేము చూసిన సమయానికి అందులో నీరు లేదు.  
 

ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామివారి విగ్రహం మానవ శరీర ఆకృతిలో మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరంగా దర్శనమిస్తుంది. స్వామివారి శరీరమంతా రోమాలు మనకు దర్శనమిస్తాయి. 
స్వామివారి మూల విగ్రహం 
మానవాకృతిలో అతి సున్నితంగా ఉండే ఇక్కడి లక్ష్మీనర్సింహ స్వామికి తైలాభిషేకం అతి ప్రీతికరమని అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన లక్ష్మీనర్సింహస్వామికి దక్షిణ భారతదేశంలోనే మరే దేవాలయంలో ఇలా తైలాభిషేకం చేయరు.  

స్వామివారిని దర్శించే ముందు ధారల దగ్గరకి వెళ్ళి, తీర్థం తాగి, తలపై జల్లుకోవాలంట. మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించి, ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చెబుతున్నారు.

ఇక్కడ రెండు  ధారలున్నాయి, వాటిని అక్క ఆదిలక్ష్మీధార, చెల్లి చెంచులక్ష్మీధార అని అంటారు. సర్వరోగ నివారిణి ఈ ధారలు అని చెబుతుంటారు. కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవని నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్రదర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుందిట. హేమాచల క్షేత్రంలో కొండ మామిడి చెట్లు చాలా ఉన్నాయి. ఆకాశమంతా ఎత్తున్న మహా వృక్షాలు ఇక్కడ కనిపించాయి. 
అక్క ఆదిలక్ష్మిధార
చెల్లి చెంచులక్ష్మీధార

ఆదిలక్ష్మీ ధార దగ్గర చిన్న గుట్ట మీద హనుమంతుడు ఉన్నట్టుగా ఒక ఆలయం ఉన్నది. 
రామబంటు ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న శిఖాంజనేయుడి స్వామి విగ్రహం అతివీర భయంకరంగా ఉండే విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందట. రోడ్డుకి అరకిలోమీటరు దూరంలో కాలిబాటలో వెళ్ళాలి అని అన్నారు. కానీ మాకు సమయం లేకపోవటంతో స్వామిని దర్శించలేకపోయాం. 

ఆలయ ప్రాంగణంలో కొన్ని ఆంజనేయ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ఆలయం కూడా ఉంది. 

ఆలయానికి వెళ్ళే త్రోవలోనే గుట్ట దైత్తమ్మ తల్లి (అమ్మవారి) విగ్రహం ఉంది.




   
ఈ ఆలయ నిర్వాహకులు ప్రతీ యేటా వైశాఖ మాసంలో లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నర్సింహస్వామి జయంతి, స్వామి వారి కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాకభలి(నాగబెల్లి), వసంతోత్సవం, మొదలగు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. స్వామి కల్యాణం రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి హాజరై స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారంట. 

హైదరాబాదుకి సుమారుగా 300కి.మీ. వరంగలుకి 135 కి.మీ. దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే వరంగల్ నుండి మంగపేట వరకు బస్సులు ఉన్నాయి. మంగపేట నుండి ప్రైవేటు వాహనాల ద్వారా (ఆటోలు ఉన్నాయి) మల్లూరు లోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. లేదా వరంగల్ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.  మేము మాత్రం కారులోనే బయలుదేరి వెళ్ళాం. హైదరాబాద్ నుండి 6 గంటల సమయం పట్టింది మేము ఈ క్షేత్రాన్ని చేరటానికి. ఉదయం 5 గంటలకి ఇల్లు దాటినవాళ్ళం, రాత్రి 9 అయ్యింది మళ్ళీ ఇల్లు చేరటానికి.  

అంతా బాగానే ఉంది కానీ, ఇక్కడ కొనుక్కుని తినటానికి చిరుతిళ్ళనేవి ఏవీ దొరకవు. దొరుకుతాయేమో మాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకేమి కనిపించలేదు. పులిహోర, లడ్డు, రవ్వలడ్డు ఈ ప్రసాదాలు మాత్రమే అక్కడ అమ్మారు.
ఇవే ఆ ప్రసాదాలు 
ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ నిత్యాన్నదానసత్రం ఉంది. ఎవరొచ్చినా లేదు అనకుండా భోజనాలు పెడుతున్నారు. కానీ మేము ఇంటి నుండి కొన్ని items వండి తీసుకువెళ్ళాం. మేం అవే తిన్నాం. మా డ్రైవరు రాజు మేము తీసుకువెళ్ళిన వాటితో పాటు అక్కడ వారు వడ్డించిన అన్న ప్రసాదం కూడా తిన్నాడు.  
నిత్యాన్నదాన సదనం 

భోజనశాల 
సర్వేజనా సుఖినోభవంతు 

November 13, 2016

కార్తవీర్యార్జున మంత్రం

కార్తవీర్యార్జున మంత్రం 


కార్తవీర్యార్జునో నామ  
రాజా బాహు సహస్రవాన్ 
తస్య స్మరణ మాత్రేణ 
గతం నష్టం చ లభ్యతే 

ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులు, పోయాయి అనుకున్న వస్తువులు,  తిరిగిరాదు అనుకున్న సొమ్ము ...... వంటివి మరల మనం పొందటానికి ఈ శ్లోకాన్ని భక్తితో కనీసం రోజుకి 28 సార్లు జపిస్తే తిరిగి పొందుతామని వేదవాక్కు.  


November 9, 2016

Kanakadhara Stotram ....... కనకధారా స్తోత్రం

Kanakadhara Stotram ....... కనకధారా స్తోత్రం
Audio Courtecy By .... Prapatti.com

కనకధారా స్తోత్రం భావసహితం

కనకధారా స్తోత్రం ........ భావసహితం    
వందేవందారుమందారం ఇందిరానంద కందలం
అమందానంద సందోహం బంధురం సింధురాననం !!


కోరిన కోర్కెలు తీర్చు దేవతావృక్షము వంటి వాడు, తన భార్య శ్రీమహాలక్ష్మీదేవి యొక్క ఆనందమునకు కారణమైన వాడు, జ్ఞానులు - పండితులు అనుభవించు ఆనందమునకు మూలసూత్రధారి అయిన హయగ్రీవునికి నమస్కరిస్తున్నాను.


1 శ్లోకం 
అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం 
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా 
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః !!

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ (చెట్టు) ను ఆడుతుమ్మెద వలె గగుర్పాటుతో ఉన్న విష్ణుదేవుని నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి నాకు శుభములను ఇచ్చుగాక.  


2 శ్లోకం 
ముగ్ధాముహు ర్విదధతీ వదనే మురారేః 
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయా  
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః !!

పెద్ద నల్లకలువపై నుండు ఆడు తుమ్మెద వలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్నఆ లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపదను ప్రసాదించుగాక. 

3 శ్లోకం 
ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం 
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం 
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః !!

మూసికొన్న కన్నులు గలవాడును, ఆనందమునకు కారణభూతుడయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపద నొసంగునుగాక. 


4 శ్లోకం 
భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే యా 
హారావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా 
కల్యాణమావహతు మే కమలాలయాః !!

మణిగల శ్రీహరిని వక్షస్థలమందలి నీలమణి కౌస్తుభము హారములాగ ప్రకాశించునదియు, భగవంతునికే కోర్కెలను ఇచ్చునట్టిదియు  అగు లక్ష్మీదేవి యొక్క కటాక్ష పరంపర నాకు శుభమును చేకూర్చుగాక.  


5 శ్లోకం 
కాలాంబుదాలళి  లలితోరసి కైటభారేః 
ధారా ధరే స్ఫురతి యా తటిదఙ్గ నేవ 
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః 
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః !!

కారుమబ్బులయందు మెరుపుతీగవలె, మేఘశ్యాముడగు విష్ణువు వక్షస్థలమందు ప్రకాశించుచున్న,  లోకమాత ఐనట్టి  లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక. 


6 శ్లోకం 
ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః !!

ఏ దేవి దృష్టి మహిమవలన శుభమును పొందిన విష్ణునందు  మన్మధుడు నిలిచెనో అట్టి క్షీరాబ్ధి కన్యక అగు లక్ష్మీదేవి యొక్క మందమగు దృష్టి  నాయందు ప్రసరించునుగాక.
  
7 శ్లోకం 
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం 
ఆనందహేతు రధికం మురవిధ్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం 
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః !!

సకల దేవేంద్ర పదవి నీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము క్షణకాలం నాపై నిలిచియుండును గాక.  


8 శ్లోకం 
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర
దృష్ట్యా  త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!

హితులగు జ్ఞానులు ఎవరి దయాదృష్టిచే సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారో పద్మములోని భాగము వలె ప్రకాశించు అట్టి పద్మాసన(లక్ష్మీ) దృష్టి నేను కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక.  


9 శ్లోకం 
దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారాం 
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః !!

శ్రీమన్నారాయణుని శ్రీదేవి అనెడి మేఘము పేదవాడననెడి విచారము పొందిన చాతకపక్షినగు నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మమనెడి తాపమును తొలగించి, నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక. 


 
10 శ్లోకం 
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి 
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై 
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!

సృష్టి స్థితి ప్రళయ కార్యములందు గీర్దేవత(సరస్వతి) అనియు, విష్ణుపత్ని అనియు శాకాంభరి అనియు శివకళత్రము అనియు ఏ దేవత పిలువబడుచున్నదో అట్టి విష్ణుపత్ని అగు లక్ష్మీకి నమస్కరిస్తున్నాను.  


11 శ్లోకం 
శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై 
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.


12 శ్లోకం 
నమోస్తు నాళీక నిభాననాయై 
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై 
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై !!

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్రమునందు జన్మించినదియు, చంద్రునికి, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని పత్ని అగు లక్ష్మీదేవికి నమస్కారము.  


13 శ్లోకం 
నమోస్తు హేమాంభుజ పీఠికాయై 
నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై !!

బంగారు పద్మము పీఠముగా గలదియు, భూమండలమునకు నాయిక అయినదియు, దేవతలలో దయయే ముఖ్యముగా గలదియు, విష్ణువునకు ప్రియురాలు  అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

14 శ్లోకం 
నమోస్తు దేవ్యై భృగు నందనాయై 
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై !!

భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణువక్షస్థలవాసినియు, పద్మనివాసినియు విష్ణువుకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

 
15 శ్లోకం 
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై 
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై 
నమోస్తు నందాత్మజ వల్లభాయై !!

తామరపువ్వు వంటి కన్నులు గలదియు, ప్రకాశించునదియు లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

 
16 శ్లోకం 
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని 
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి 
త్వద్వందనాని దురితా హరణోద్యతాని 
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే !!

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, సంపదను కల్గించునవియు, ఇంద్రియములను సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవియు, పాపములను తొలగించునవియు అగు నీకు చేయు వందనములు ఎల్లపుడును నన్నే కృతార్థునిజేయుగాక.   

17 శ్లోకం 
యత్కటాక్ష సముపాసనా విధిః 
సేవకస్య సకలార్ధ సంపదః
సంతనోతి వచనాఞ్గ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!

ఏ నీ కడగంటి చూపును సేవించుట సేవకునికి సకల సంపదలను కూర్చుచున్నదో అట్టి విష్ణుపత్నివగు నిన్ను మనోవాక్కాయములనెడి  త్రికరణములతో సేవించుచున్నాను.  

 
18 శ్లోకం 
సరసిజనిలయే సరోజహస్తే 
ధవళతమాం శుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే 
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం !!

కమలములవంటి కన్నులు గలదానా! చేతియందు పద్మముగలదానా! తెల్లని వస్త్రగంధ పుష్పమాలికలచే ప్రకాశించుదానా! షడ్గుణములు గలదానా!  అందమైనదానా! ముల్లోకములకు ఐశ్వర్యము  కలిగించుదానా! ఓ విష్ణుపత్నీ! నన్ననుగ్రహింపుము.  

19 శ్లోకం 
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం 
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాధ గృహిణీం మమృతాబ్ధి పుత్రీం !!

దిగ్గజములచే బంగారు కుండలనుండి పోయబడిన నిర్మలములుగు ఆకాశ జలములచే తడుపబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, లోకాధిపతికి భార్యయు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

20 శ్లోకం 
కమలే కమలాక్ష వల్లభేత్వం
కరుణాపూర తరఙ్ఞితైరపాఙ్ఞైః
అవలోకయ మామకిఞ్చనానాం 
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః !!

నారాయణునికి ప్రియురాలవగునో లక్ష్మీ! దరిద్రులలో ప్రధముడను, నీ దయకు యథార్థముగా తగిన వాడనగు నన్ను నీ కరుణాకటాక్షములతో చూడుముతల్లీ. 

21 శ్లోకం 
స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం 
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం 
గుణాధికా గురుతర భాగ్యభాగినో 
భవంతి తే భువి బుధ భావితాశయాః !!

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు గుణవంతులుగను మంచి భాగ్యవంతులలో గొప్ప భాగ్యవంతులుగను బుధులచే కొనియాడబడెడి  వారుగను అగుచున్నారు. 

సువర్ణధారా స్తోత్రం 
యచ్ఛంకరాచార్య నిర్మితం 
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం 
స కుబేరసమో భవేత్ !!

శంకరాచార్యులచే రచింపబడిన కనకధారాస్తోత్రమును ఎవరు నిత్యమూ త్రికాలములయందు పఠించునో వారు కుబేరునితో సమానులగుదురు.  



__/\__ ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం కనకధారాస్తోత్రం సంపూర్ణం.__/\__