June 11, 2024

మహిపతి దాసులు

 మహిపతి దాసులు 

"గాలి బందకైయల్లి తూరి కొళ్ళిరో" (గాలి వచ్చినప్పుడే తూర్పార బెట్టుకోండి). ఇది భక్త పురందరదాసుల వారి సందేశం. "దుర్లభ మానుషం జన్మ" అన్నట్లు శ్రేష్ఠమైన మానవజన్మ అంత సులభంగా రాదు. ఇలాంటి మానవజన్మ లభించినప్పుడు దానిని సార్థకం చేసుకోవటం ప్రతీ మానవుని ముఖ్య కర్తవ్యం. గృహస్తుగా ఉండి బీజాపుర నవాబు మన్నన పొందినవారై వుండి కూడా దైవ ధ్యానతత్పరులై నిరంతరం లోకకళ్యాణం కోసం శ్రమించి, అనేకులను ఉద్ధరించి, తమ జన్మను సార్థకం చేసుకున్న ఆదర్శ పురుషుడు మహిపతిదాసులు. ఈయన జీవితం మనకి మార్గదర్శకం.         

ఈ మహిపతిదాసుల గురించి నేను తెలుసుకున్నది, విన్నది మీకు తెలియచేస్తాను 

“మహిపతి దాసులవారు పుణ్యపురుషులు. ఆయన చరిత్ర చెప్పడంవలనా, వినడం వలనా పుణ్యం లభిస్తుంది. మన ప్రవర్తనని సక్రమంగా దిద్దుకోడానికి అవసరమైన నీతిసంపద ఆయన చరిత్రలో మనకి లభిస్తుంది. 

ఆ కాలంలో బాగల్ కోటలో 'కథావలె' వంశం ఎంతో ప్రసిద్ధంగా వుండేది. ఆవంశంలో రంగభట్టరు అన్నవ్యక్తి సత్ప్రవర్తనకీ, మంచితనానికీ పేరెన్నికగన్నవాడు. దైవభక్తి పరాయణుడు. పేదసాదలకి విరివిగా దానధర్మాలు చేసేవాడు. చిన్న వయస్సులోనే ఈయన కాశీయాత్ర చేసివచ్చి, బిజాపురంలో నివసించసాగాడు. ఈయనకు ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు కోనేరి రాయలు.

కోనేరిరాయలికి ఇద్దరు కొడుకులు. మొదటివాడు గురు రాయలు. రెండవకుమారుడు, మహిపతిరాయలు. మహిపతిరాయలు శాలివాహనశకం 1611 లో జన్మించాడు. (క్రీ. శ. 1681) కోనేరి రాయలు తన రెండవ కుమారుడికి ఉపనయనం చేయడానికి సంక ల్పించారు. తమ కులగురువైన కొల్హార వ్రహ్లాద కృష్ణాచార్యుల్ని పిలిపించి, కుమారుడి జాతకం చూపించాడు. జాతకాన్ని పరిశీలించిన ఆచార్యులు, సంతోషంతో ఇలా అన్నారు "రాయలుగారూ, మీ కుమారుడి గ్రహబలం చాలా ఉత్తమంగావుంది. అతను రాజవైభవంతో జీవిస్తాడు. గొప్పయోగిపుంగవుడిగా కీర్తిగడిస్తాడు! అని తెలియచేసారు. కోనేరిరాయలు ఎంతో సంతోషించాడు. విధిపూర్వకంగా కుమారుడి ఉపనయనం జరిపించాడు. ఆ తరువాత మహిపతిరాయల విద్యా భ్యాసం ప్రారంభమైంది.

కోనేరిరాయలు వైదిక విద్యాపారంగతుడు. బిజాపూర్ నవాబు ఆదిల్షా కూడా ఆయన్ని ఎంతగానో గౌరవించేవాడు.

తండ్రిదగ్గరే మహిపతిరాయలు విద్యను అభ్యసించసాగాడు. ఇతర విద్వాంసుల దగ్గరకూడా వేరువేరు శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. అనతికాలంలోనే గొప్పవిద్వాంసుడుగా రూపొంది తండ్రి లాగే కీర్తి సంపాదించసాగేడు. ఆరోజుల్లో ప్రచారంలో వున్న సంస్కృత, కన్నడ, హిందీ, మరాఠీ, ఉర్దూ, పార్శీ భాషలన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాలక్రమేణ పురాణ ప్రవచనంలో కూడా ఆరితేరాడు. ఆరోజుల్లో మహిపతిరాయల పురాణ ప్రవచనమంటే. ప్రజలు చెవికోసుకునేవారు. ఆయన పురాణ ప్రవచనం వినడానికి ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యేవారు.

ఆదిల్ షా కి 'ఖవానాఖాన్' అనేవ్యక్తి బిజాపుర నవాబు మంత్రిగా వుండేవాడు. ఒకరోజు అతను రాజభవనానికి వెళ్తూ, సమీపంలోని నృసింహ దేవాలయం ముందు, మహిపతిరాయల పురాణ ప్రవచనం వినడానికి చేరిన వేలాది ప్రజల్ని చూశాడు. విషయం తెలుసుకుని, అక్కడే నిలబడి పురాణం విన్నాడు. పురాణం ముగిశాక మహీపతిరాయలు అటుగా వచ్చారు. ఖవానాఖాన్ ఆయనకి నమస్కరించి, “రాయలు గారూ, మాఇంట్లో పురాణం చెప్తారా?" అని అడిగాడు. రాయలు సమ్మతించారు. నరసింహ దేవాలయంతోబాటు ఖాన్ ఇంట్లోకూడా పురాణ ప్రవచనం ప్రారంభమైంది. ఖాన్ ఇంట్లో శ్రోతలకి అర్థమయ్యేలా మహిపతిరాయలు, ఉర్దూ, పార్శీ భాషల్లో కూడా విషయాల్ని వివరించేవారు. ఆ కార్యక్రమాలకి వచ్చే అధికారులూ, ముల్లాలూ ఎంతో ఆనందించేవారు..

ఖవానాఖాన్ వ్యక్తిత్వం చూశారా! తను మహమ్మదీయుడైనా భారతీయుల జ్ఞానభాండాగారాలైన పురాణాల్ని శ్రద్ధగా విన్నాడు. ఇది ఉత్తమవ్యక్తుల లక్షణం. అన్యమత గ్రంథాల్లోని ఉత్తమ విషయాలను గ్రహించడంలో తప్పులేదు. "బాలాదపి సుఖం గ్రాహ్యం” — ఉత్తమ విషయాన్ని పిల్లలు చెప్పినా గ్రహించాలన్నదే భారతీయసిద్ధాంతం.

ఆ అధికారులూ, ముల్లాలూ మౌలాలూ అందరూ కలిసి మహీపతిరాయల పురాణ ప్రవచనం ప్రతిరోజూ జరిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత ఖవానాఖాన్ గృహంలో ప్రతి నిత్యమూ పురాణప్రవచనం జరగసాగింది.

దీనిమూలంగా ఖవానాఖాన్ కి మహిపతిరాయలపట్ల గౌరవ భావం పెంపొందింది. కొంతకాలం తరువాత ఆయన్ని తను కరణంగా నియమించాడు. మహిపతిరాయలు ఆ కార్యాన్ని కూడా సమర్థతతో నిర్వహించారు. కొన్ని మాసాల తరువాత ఆయనకి, ఆదిల్ షా నవాబును కలుసుకునే అవకాశం కలిగింది. నవాబు ఆయన దగ్గరున్న లెక్కపత్రాల్లో ఎక్కడో తప్పుదొర్లింది. కరణాలు, ఆ తప్పుని వెతికి, సరిదిద్దలేకపోయారు. నవాబు ఆ విషయాన్ని ఖవానాఖాన్ కి చెప్పాడు. “నాదగ్గరున్న కరణం మహిపతిరాయలు లెక్కలు సరిచూడ్డంలో ఆరితేరినవాడు ప్రభూ!” అని అన్నాడు ఖవానాఖాన్. నవాబు మహిపతిరాయల్ని పిలిపించాడు. ఆయన లెక్కల్లో దొర్లిన పొరపాటుని వెతికి సరిదిద్దాడు. నవాబు సంతోషించి, మహిపతిరాయలకి తనదగ్గరే ఉద్యోగం ఇచ్చాడు. ఆయన కార్యదక్షతని చూసిన నవాబు అచిరకాలంలోనే ఆయనని దివాన్ పదవిలో నియమించి గౌరవించాడు. ఆ విధంగా మహిపతి రాయలకీ రాజవైభవం సంప్రాప్తించింది.


ఆ సమయంలోనే కాలబుర్గి దేశముఖుల కుమార్తె తిరుమలాదేవితో ఆయనకి పెళ్ళిజరిగింది. ఆయన గృహం ధనధాన్యాలతో తులతూగుతూవున్నా, మహిపతిరాయలు ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపారు. దానధర్మాల పట్ల ఆయనకి ఎంతో ఆసక్తి. పేదసాదల్ని ఎల్లప్పుడూ ఆదరించేవారు. తిరుమలాదేవి కూడా భర్తకి తగ్గట్టు ధర్మబుద్ధి కలిగివుండేది.

బిజాపూర్ లో 'షానుంగ' 'షానుంగి' అనే ఇద్దరు అన్నాచెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళుగొప్పమహిమ కలిగిన వాళ్ళు. సూఫీమతసిద్ధాంతంలో అనుభవజ్ఞులైన నుంగ, నుంగి యోగ సిద్ధితో దివ్యశక్తుల్ని సంపాదించుకున్నారు. వాళ్ళు పలికిన మాట నిజమయ్యేది. వాళ్ళ స్వభావం విచిత్రమైంది. వాళ్ళెక్కడుంటారో ఎవరికీ తెలిసేదికాదు. అన్నం తింటే తింటారు; లేకుంటే లేదు.' గుడ్డలు ధరించేవారుకారు. వాళ్ళకి ఏ వస్తువుపట్లా అపేక్షవుండేది కాదు. లౌకికమైన భోగవస్తువులు దైవాన్నిపొందడానికి అడ్డంకులుగా వున్నందువల్ల, వాటిని విషంగా పరిగణించేవారు. హిందు వులూ, ముసల్మానులూ వాళ్ళని భయభ క్తులతో గౌరవించేవారు. 

నుంగి నుంగలు మన హిందువులుకారనీ, సూఫీ పంథాన్ని అనుసరించేవాళ్ళనీ మనం తిరస్కారభావంతో చూడకూడదు. మహాపురుషుల అవతారాలకి జాతి అడ్డురాదు. అన్ని జాతుల్లోనూ జ్ఞానులు అవతరించి వున్నారు. హరిదాసుల్లో శ్రేష్ఠుడైన కనకదాసు కురవజాతివాడు. కృష్ణుణ్ని మెప్పించి, నర్తనం చేయించిన మీరాబాయి రాజస్థాన్ రాజపుత్ర వంశానికి చెందింది. గాయత్రిదష్ట అయిన విశ్వామిత్రుడు క్షత్రియుడు. స్వయంగా భగవంతుడే తన ఒక్కో అవతారంలో ఒక్కో జాతిలో ప్రాదుర్భవించాడు. క్షత్రియకులంలో రాముడై అవతరించాడు. పరశురాముడుగా బ్రాహ్మణ కులంలో జన్మించాడు. కృష్ణుడుగా యాదవుల మధ్య జన్మించాడు. భగవంతుని ఆరాధనకూ, ఆదర్శజీవితం గడపడానికి ఏజాతివారైతేనేమి? 

"పరమాత్మను సర్వత్రా దర్శిస్తూ, పూజిస్తూ జీవించే వ్యక్తినేమి? అలాంటివాడు సర్వులకి గౌరవించ దగినవాడే ! - నుంగ, నుంగీ కూడా ఇలాంటివారే," 

ఈ అన్నాచెల్లెళ్ల మూలంగా మహిపతిరాయల జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. 

ఎలాగంటే! ఆ సమయంలో బిజపూర్ ప్రజల త్రాగునీటి సౌకర్యంకోసం 'బేగం తాలాబ్' అన్న చెరువు పని జరుగుతోంది. దివాన్ గా వున్న మహిపతిరాయలు ఆ చెరువు నిర్మాణ కార్యాన్ని పర్యవేక్షించడానికి వెళ్ళేవారు. ఒకరోజు ఆయన తిరిగి వస్తూండగా నుంగ ఎదురుగా వస్తూ, “అరే బేటా, ఇదర్ ఆ" ( అంటే ఒరే నాయనా, ఇలారా) అన్నాడు. మహిపతిరాయలు అతనికి దగ్గరగా వెళ్ళారు. 'నీచేతిలో ఏమివుంది ? ' అని అతను మహిపతి రాయల్ని అడిగాడు. ఆయన చేతికి రాజముద్రవున్న ఉంగరం వుంది. నుంగ ఆఉంగరాన్ని ఇమ్మని తీసుకుని, పక్కనేవున్న కందకంలోకి విసరివేశాడు: మహిపతిరాయలు గాబరాపడ్డారు. రాజముద్రవున్న ఉంగరం పోయిందంటే మరేమన్నా వుందా ? నవాబుకు తెలిస్తే ఏమిటిగతి? నుంగ రాయల ముఖాన్ని చూస్తూ, నవ్వుతూ నిలబడ్డాడు. ఇంతలో నుంగి అక్కడికి వచ్చింది. జరిగింది తెలుసుకుని ఆమెకూడా నవ్వసాగింది. 'పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం' అన్నట్టయింది రాయల పరిస్థితి.

"కందకం నీళ్ళలోంచీ ఉంగరాన్ని ఎవరైనా తేగలరా? అంటూ ఆయన నుంగనే ప్రశ్నించారు. అతను మాట్లాడకుండా నుంగి వైపు చూశాడు. వెంటనే నుంగి నీళ్ళలోకి దిగి, దోసిలి నిండా రాజముద్ర వున్న ఉంగరాలు తీసుకొచ్చింది. రాయల ముందు  దోసిలి వుంచి, ఆయన ఉంగరమేదో కనుక్కోమంది. ఆయనకి ఆశ్చర్యమూ, ఆందోళనా కలిగాయి. తన ఉంగరం ఏదో ఆయనకి గుర్తు చిక్కలేదు! అన్నీ ఒక్కలాగే వున్నాయి. అప్పుడు నుంగ,  "ఇదే నీ ఉంగరం!" అంటూ ఒక ఉంగరాన్ని తీసి, దాన్ని వాసన చూశాడు. మౌత్కాఘాణ, మౌత్కాఘాణ!" (అంటే "పీనుగ వాసన " అని అర్థం.) అని అరుస్తూ, ఉంగరాన్ని ఆయన ముందు పారేసి, పరుగెత్తి వెళ్ళిపోయాడు.

దివాన్ పదవీ, అధికారమూ - వీటివల్ల మానవుడు సంసార బంధంలో మరింతగా చిక్కుకు పోతాడు. అధికారాన్నీ, హోదానూ విడిచిపెట్టి, పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావడం మానవుని ముఖ్యకర్తవ్యం. ఈ సత్యాన్ని తెలియజేయడానికే ఉంగరాన్ని విసర్జించమని నుంగ రాయలకి సూచించాడు.

ఆరోజునుండి రాయలలో ఒక సంఘర్షణ ప్రారంభమైంది. నిజతత్వాన్ని తెలుసుకునే మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. అందుకే ఆయన అతనికోసం వెదకడం ప్రారంభించారు. ఒకనాటి సాయంత్రం రాయలు ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూవుంటే నుంగ మళ్ళీ కనిపించి, ఆయన్ని పిలిచాడు. రాయలు దగ్గరకెళ్ళి అతనికి నమస్కరించారు. “మీరే నాకు గురువులు. నాకు ఉపదేశం చెయ్యండి,” అని ప్రార్థించారు. నుంగ అంగీకరించకుండా, “నీకు నేను గురువును కాను. సారవాడలోని భాస్కరస్వామివారిని కలుసుకో. ఆయనే నీకు గురువు. ఆయన ఉపదేశాన్ని పొందు. నీకు మేలు జరుగుతుంది, " అన్నాడు.

ఆ కాలంలోని రాజయోగుల్లో సారవాడ భాస్కరస్వాములు ప్రసిద్ధులు. ఆయన శిష్యులు కర్నాటక, మహారాష్ట్రాల్లో వుండేవారు. సారవాడ చిన్నపల్లెటూరైనా, భాస్కరస్వాముల్ని దర్శించడానికి ఎంతోమంది జనం అక్కడికి వెళ్తుండేవారు. ఆ విధంగా ఆగ్రామం ఒక యాత్రాస్థలంగా మారింది.

నుంగ మాటలతో మహిపతిరాయలు ప్రభావితులయ్యారు. అధికారాన్నీ, ఐశ్వర్యాన్నీ త్యజించి, భాస్కరస్వాముల దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. భార్యకు తమ నిశ్చయాన్ని తెలియజేశారు. సాధ్వి అయిన తిరుమలాదేవి సంతోషంతో సమ్మతించింది. మహిపతిరాయలు నవాబుతో చెప్పి, దివాన్ పదవిని వదిలి వేశారు. ఆయన్ని వదులుకోవడం ఇష్టంలేకపోయినా తిరుగులేని ఆయన నిశ్చయాన్ని గ్రహించి నవాబు ఊరుకున్నాడు.


భాస్కరస్వాముల్ని దర్శించి, రాయలు తనని శిష్యుడిగా స్వీకరించి, ఉపదేశం చేయమని ప్రార్థించారు. తిరుమలాదేవి కూడా ఆయనకి నమస్కరించి, తనకి సంతానం కలిగేలా ఆశీర్వదించమని కోరింది. ఆమె కోరికను మన్నించి, స్వాములు ఆశీర్వదించారు. రెండు ఫలాలను ఆమె ఒడిలో వేస్తూ “తిరుమలమ్మా! విచారించకు. దైవాన్నినమ్ము. నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు. వాళ్ళలో ఒకడు క్షత్రియ తేజస్సుతో కూడిన పరాక్రమంతో కీర్తిగడి స్తాడు. రెండోవాడు తనతండ్రిలాగే యోగి అవుతాడు, " అన్నారు.

ఆ తరువాత రాయలు భార్యతో కలిసి సారవాడలోనే వుండి పోయారు. స్వాముల ఉపదేశం ప్రకారం యోగవిద్యని అభ్యసించారు. యోగసిద్ధి పొందిన తరువాత సారవాడ నుండీ బిజాపూర్ చేరుకున్నారు. మరికొంతకాలం తరువాత గుల్బర్గా జిల్లాలోని 'షాపురం' వెళ్ళారు. అక్కడ మందాకినీ సరోవర తీరంలో హనుమంతుడిని ప్రతిష్ఠించి, నిరంతర భగవధ్యానంతో కాలం గడపసాగారు. 'మహిపతి' అంకితభావంతో భగవంతుని మహిమను కీర్తిస్తూ, ప్రజలకి నీతిని ప్రబోధిస్తూ, ఎన్నో కీర్తనల్ని రచించారు. అప్పటి నుండి మహీపతిరాయలు 'మహిపతిదాసులు' అయ్యారు. 

మహిపతిదాసుల ఉపదేశామృతాన్ని చవిచూడడానికి ప్రతి రోజూ వందలకొద్దీ జనం వచ్చేవారు. దాసులవారి మహిమ తెలియని కొందరు నీచులు, ప్రజల ముందు, ఆయన్ని మోసగించి అవమానం పాలు చేయాలని కాచుక్కూర్చున్నారు.

పరమాత్ముడు సృష్టించిన ఈలోకంలో, వెలుగు - చీకటి, సుగంధం, దుర్గంధం, సత్యం-అసత్యం వున్నట్టే సజ్జనులు - దుర్జనులూ అనాది నుండీ వున్నారు. దుర్గంధం వుండటం వల్లనే సుగంధానికి మన్నన లభిస్తుంది. అలాగే దుర్మార్గుల మూలంగా, సన్మార్గుల వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. పరుల్ని కష్టపెట్టి, అవమానాలపాలు చేయడం, దుర్జన స్వభావం. అందుకే పురందర దాసులు దుర్జనుల్ని తుమ్మచెట్టుతో పోల్చారు.  

ఇటువంటి దుర్జనులు కొంతమంది, మహిపతిదాసుల దగ్గరకు భయభక్తులు నటిస్తూ వెళ్ళారు. ఒక పళ్ళెంలో మాంసఖండాలను ఉంచి, పైన గుడ్డకప్పి, దేవుడి నైవేద్యం కోసం అంటూ దాసులు ముందు పెట్టారు. వాళ్ళ కుతంత్రాన్ని గ్రహించిన దాసులు భగవంతుడిని ప్రార్థించారు. మూసిన వస్త్రాన్ని తొలగించమన్నారు. పళ్ళెంలో బాగా మగ్గిన మామిడిపళ్ళ  ముక్కలు కనిపించాయి.  

అది చూసిన ఆ తుంటరివాళ్ళు గాభరాపడిపోయారు. అందరి సమక్షంలో ఆయన పాదాల ముందు ప్రాణాచారం పడిపోయారు. "దాసులవారూ! అపరాధం చేశాము, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడూ ఇలాంటి పాడుపని చేయము. మిమ్మల్ని పరీక్షించాలన్న దుర్బుద్ధి మాకెందుకు పుట్టిందో మాకే తెలీదు. దయతో క్షమించి, మాకు సద్బుద్ధి కలిగేలా అనుగ్రహించండి,” అని ప్రార్థించారు.

ప్రజలంతా ఆశ్చర్యంతో దాసులవారినే చూడసాగేరు. “అంతా దైవేచ్ఛ! ఆయనే మీచేత ఈ ఆట ఆడించాడు. మీ పశ్చాత్తాపమే మీపాపాల్ని ప్రకాశిస్తుంది. భగవంతుణ్ని భజిస్తూ, సుఖంగా జీవించండి." అన్నారు దాసులవారు. దీని మూలంగా ఆయన యోగసిద్ధితో గడించిన శక్తి అందరికీ అవగతమయ్యింది.

ఆయన “ షాపురం”లో మూడేళ్ళపాటు వుండి, బిజాపూర్ సమీపంలోని 'కాఖండకి' అన్న ఊరికివెళ్ళి అక్కడ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన దర్శనం కోసం వచ్చే జనసందోహం తగ్గలేదు. పరాయి ఊళ్ళనుంచీ వచ్చేవాళ్ళకి ఆయన తమ ఇంట్లో భోజనం యేర్పాటు చేసేవారు. కాఖండకి లో ఒక వ్యాపారి, బసప్ప అనేవాడు ఉండేవాడు. ఇంటికి అవసరమైన సరకుల్ని అతని అంగడిలో తెప్పించేవారు దాసులు. నెలకోసారి అతను తనకు రావాల్సిన పై కం తీసుకు వెళ్ళేవాడు. అతను డబ్బుకోసం వచ్చిన ప్రతిసారీ, దాసులు తాముకూచున్న గాదెలోపలికి చేతిని పోనిచ్చి, అతనికి ఇవ్వాల్సిన పైకం లెక్క పెట్టకుండా ఇచ్చేవారు. కష్టాల్లో వున్నవాళ్ళు ఎవరు అడిగినా ఆయన అదేవిధంగా గాదె లోంచీ డబ్బుతీసి ఇచ్చేవారు. ఈ సంగతి ఊరంతా తెలిసి పోయింది. బసప్పకు డబ్బంటే అత్యాశ. దాసుల గాదెలో లెక్కకుమించి ధనం వుందనీ, దాని తస్కరించివేయాలనీ అతనికి దుర్బుద్ధి పుట్టింది.

దాసులవారింట్లో నిరంతరం దైవపూజలు, భజనలు, పురాణ ప్రవచనాలూ జరుగుతూ వుండేవి. అనేక మంది జనం ఆ భజనలో పాల్గొనేవారు. దురాశాపరుడైన బసప్ప భక్తుడిలాగా నటిస్తూ, ఆయన ఇంటికి రాసాగేడు.

"దుర్జనస్య విశిష్టత్వం పరోప ద్రవకారణం వ్యాఘ్రస్య చోపవాసేన పారణం పశుమారణం ”

"పులిచేసే ఉపవాసం జింకలు మొదలైన సాధుజంతువుల సంహారాత్మకమైన పారణతోనే సమాప్తమవుతుంది. ఇలాగే దుర్మార్గుల సత్ప్రవర్తన లోకానికి కీడు కలిగించడానికే గానీ, ప్రజల క్షేమం కోరడానికి కాదు."

బసప్ప భక్తి - పూర్తిగా దాసుల ముల్లెను తస్కరించడమే. అయితే దాసులవారికి అతని పాడుబుద్ధి తెలిసిపోయింది. అతను భజనకి హాజరైన మొట్ట మొదటిరోజే, “యజమాని తమ పరిశోధన కోసం వచ్చారు! అంటూన వ్వేశారు. ఎవ్వరికీ ఆమాట అర్థం కాలేదు. అతనిలో సత్ప్రవర్తన కలుగుతుందన్న నమ్మకంతో దాసులు తమ గృహంలో స్వాతంత్య్రమిచ్చారు.

బసప్ప ఆనందంతో, ఇల్లంతనీ బాగా పరీక్షించడం ప్రారంభించాడు. ఒక్కోసారి దాసులు, “ఏమిటయ్యా, వేతకడం బాగా జరుగుతోందా? ఏమేనా లాభం కనిపించిందా?" అని అడిగేవారు నవ్వుతూ. అతను ఈ మాటతో కొంచెం గాభరాపడినా, తన దురుద్దేశాన్ని వదులుకోలేదు.

గురుజయంతి ఉత్సవాన్ని దాసులు వైభవంగా తమ ఇంట్లో జరిపించారు. ఆ ఉత్సవాలకి ఎంతోమంది గాయకులూ, పండితులూ, విద్వాంసులూ వచ్చారు. ఆ ఉత్సవాల నిర్వహణ బాధ్యతని ఆయన బసప్పకి అప్పగించారు. అతను ఎగిరి గంతేశాడు. ఉత్సవ కార్యాల తొందర నెపంతో ఇంటి మూలమూలా వెతికేశాడు. ఎక్కడా అతనికి ముల్లె దొరకలేదు.


దాసులవారి గృహం పక్కనే మరో చిన్న ఇల్లుండేది. ఇంటిని ఆయన యోగసాధనకీ, జపతపాలకీ ఉపయోగించేవారు. ఆయన తప్పించి ఇంకెవ్వరూ ఆ యింట్లోకి వెళ్ళేవారు కారు. ఆ చిన్న ఇంట్లోనే ముల్లె వుండితీరాలని బసప్ప అనుకున్నాడు. ఎత్తువేశాడు. "దాసులవారూ, తమరు ధ్యానంచేసుకునే ఇంట్లో ఎలుకలూ, పందికొక్కులూ విపరీతంగా చేరాయి. ఆ నేలని తవ్వి శుభ్రం చేస్తే మంచిది" అన్నాడు ఆయనతో. దాసులవారు అలాగే చేయమన్నారు. బసప్ప ఆ ఇల్లంతనీ వెతికి, ముల్లె కనిపించకపోవడంతో ఇల్లంతనీ తవ్వేశాడు. నేలలో కూడా అతనికి డబ్బు దొరకలేదు. అతని దురాశకి తగిన శిక్ష జరిగిందనుకున్నారు దాసులు.

డబ్బుదొరక్కపోవడంతో బసప్పకి కోపమొచ్చింది. తన ప్రయత్నాన్ని విరమించకపోగా, దాసులవారిని కొట్టి అయినాసరే ముల్లె ఎక్కడుందో కనుక్కోవాలనుకున్నాడు. ఆఖరికి. ఒకరోజు అతిథుల్ని సాగనంపి, దాసులవారు ఊరవతల నుండి తిరిగివస్తున్నారు. చీకటిపడింది. అదేసరైన సమయమనుకుని బసప్ప దాసులవారిని ఎదుర్కొని ఆయన చేతిని వొడిసి పట్టుకుని, “ దాసులూ, నీ ఆటలు నాదగ్గరసాగవు. ముల్లె ఎక్కడ దాచావో చెప్పు! లేకపోతే నిన్ను ఊరికే వదలను” అన్నాడు, దాసుల వారు భయపడలేదు. దుష్టుల స్వభావానికి చింతిస్తూ, శ్రీహరిని ధ్యానించారు. ఒక్కసారి, తీక్షణంగా అతన్ని చూశారు. "శాశ్వతమైన సంపదకోసం అమూల్యమైన కాలాన్ని ఎందుకు వ్యర్థం చేస్తావు? జ్ఞానధనం కోసం ప్రయత్నించి వుంటే, నీ జన్మ సార్థకమై వుండేది. ఇక నీ మొహం నాకు చూపించకు, వెళ్ళు" అని అన్నారు.

బసప్పకు దాసులవారి మాటలు గాభరా పుట్టించాయి. ఆయన చూపులు అతన్ని తీవ్రంగా భయపెట్టేయి. భయంతో, అవమానంతో, అక్కడ నిలువలేక ఇంటికి పరుగెట్టుకుపోయాడు. దాసులవారికి ద్రోహం తలపెట్టినందుకు రోగగ్రస్థుడయ్యాడు. 

లోభంవల్ల దుఃఖమేకానీ, సుఖం లభించదు! సాధారణంగా ప్రతీ మనిషి లోభంతో ధనసంపాదనకోసం శ్రమిస్తాడు. అంతేకానీ. దానిమూలంగా జరిగే అనర్థం గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఈ సత్యాన్నే అమరుకుడు అన్న కవి ఇలా చెప్తున్నాడు:

"దురాశకులోనైన పిల్లి పాలగురించి తాపత్రయ పడుతుందే గానీ, దాని మూలంగా తనపై బడే కర్రదెబ్బ గురించి, ఊహించలేదు. లోభి కూడా ఇంతే! వ్యాపారి దాసులు డబ్బును - కాజేయాలని కక్కుర్తి పడ్డాడే తప్ప, ఆయన వ్యక్తిత్వాన్నీ, మహిమనూ పట్టించుకోలేదు. లోభ ప్రభావం అంత బలమైనది ” 

లోకంలో దుర్జనులున్నట్లే సజ్జనులూ వుంటారు. సజ్జనులను ఉద్దరించడం కోసం జ్ఞానులు తమ సర్వస్వాన్నీ, ఆఖరుకు తమ ఆయుష్షును కూడా ధారబోస్తారు.

మురడప్ప అనేవ్యక్తి దాసుల శిష్యుల్లో ఒకడు. అతనికి దాసులవారంటే ఎంతో భక్తి. ఒకసారి అతని భార్యకి విపరీతంగా జ్వరం వచ్చింది. ఎన్ని మందులిప్పించినా తగ్గలేదు. ఇంట్లో ఆమెను చూచుకోడానికి ఇంకెవ్వరూ లేకపోయినా అతను క్రమం తప్పకుండా దాసులవారి ఇంటికి భజనకి వస్తూనే వున్నాడు. అతని భక్తివిశ్వాసాలకి దాసులవారెంతో ఆనందించారు. అతన్ని పిలిచి, తమ అంగవస్త్రాన్ని ఇచ్చారు. “దీన్ని తీసుకెళ్ళి నీభార్యకి కప్పు. జ్వరం తగ్గిపోతుంది,” అన్నారు. మురడప్ప అలాగే చేశాడు. అతని భార్వ జ్వరం పూర్తిగా తగ్గింది. దాసులవారు తమ ఆయుష్షుని   ధారపోసి, మురడప్ప భార్యని బ్రతికించారని జనం ఆయన్ని ఎంతగానో కిర్తించారు.

దాసులవారు కాఖండకి చేరిన కొత్తల్లో తిరుమలాదేవికి ఒక మగశిశువు కలిగాడు. ఆ కుర్రాడికి. 'దేవరాయలు' అని పేరు పెట్టారు. ఆ తరువాత పుట్టిన రెండో కొడుక్కి “కృష్ణరాయలు' అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. దాసులు సకాలంలో వాళ్ళకి ఉపనయనం చేశారు.

ఒకరోజు కొడుకులిద్దరికీ స్నానసంధ్యలు ముగించి, తాము జపంచేసే గృహంలోకి తీసుకెళ్ళి, అక్కడున్న తాళాలూ, తంబూరా, ఖడ్గమూ, లేఖిని లను చూపించి, ఎవరికి ఏదికావాలో తీసుకోమ్మన్నారు. దేవరాయలు ఖడ్గాన్నీ, లేఖినినీ ,- కృష్ణరాయలు తంబురానీ, తాళాల్నీ తీసుకున్నారు. దీన్నిబట్టి దేవరాయలకి యుద్ధవిధ్యల్లోనూ, కృష్ణరాయలకి దాసదీక్షలోనూ ఆసక్తి వుందని తెలిసింది.

దేవరాయలకి యుక్తవయస్సు వచ్చేసరికి తిరుమలాదేవి మరణించింది. వాళ్ళిద్దరూ తల్లిలేని వాళ్ళయ్యారు. అప్పుడు తిరుమలాదేవి తండ్రి, దేవరాయల్ని తనతో తీసుకెళ్ళి బీదర్ నవాబు సైన్యంలో చేర్పించాడు. తన పరాక్రమాన్ని ప్రకటించి, అచిరకాలంలో దేవరాయల వద్ద సైన్యాధికారి అయ్యాడు. అనేక యుద్ధాల్లో జయించాడు. మహారాష్ట్రలో హైందవ సామ్రాజ్యాన్ని  స్థాపించిన శివాజీలాగే దేవరాయలు శ్రుతుల్లో పేర్కొనబడిన యుద్ధతంత్రాల్ని పన్నేవాడని ప్రతీతి. అతని రూపురేఖలుకూడా శివాజిలాగే ఉండేవట. అంచేత ప్రజలు అతన్ని “డోణశివాజి ” అని పిలిచేవారు.  

కృష్ణరాయలు తండ్రిలాగే దైవధ్యానంతోనూ, భజనలతోనూ కాలం గడిపేవాడు. ఆయన కూడా అనేక దేవర నామాల్ని రచించాడు. అతనికి తండ్రే గురువు. హరిదాసుడై అతనూ కీర్తి గణించాడు. ఈ విధంగా దాసులవారి కొడుకులిద్దరూ రెండు రంగాల్లో ప్రసిద్ధులయ్యారు. 

కాలంగడుస్తోంది. మహీపతిదాసులికి తమ అవతారం సమాప్తమయ్యేకాలం సమీపిస్తోందని అవగాహన అయ్యింది. ఇహలోకయాత్ర చాలించే ముందు తమకులగురువులైన ప్రహ్లాద కృష్ణాచార్యుల్ని దర్శించాలన్న కోరికతో ఆయన కొల్హారక వెళ్ళారు. కొల్హార కృష్ణానది గట్టుమీద వుంది. అక్కడ దాసుల వారు ఏడురోజులపాటు తపస్సుచేసి, క్రీ. శ. 1681 వ సంవత్సర కార్తీక అమావాశ్యరోజున తమ ఇహలోక యాత్రను ముగించారు.


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - శ్రీనివాసార్పణమస్తు 🙏