Showing posts with label ముకుందమాల. Show all posts
Showing posts with label ముకుందమాల. Show all posts

October 9, 2014

ముకుందమాల వీడియో

ముకుందమాల శ్లోకాలకి నేను చేసిన వీడియో


ముకుందమాల... 40 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


40 వ శ్లోకం
యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మవరపద్మ శరావభూతాం
తేనాంబుజాక్ష చరణాంబుజ షట్ పదేన
రాజ్ణా కృతా కృతిరియం కులశేఖరేణ 


భావం:-
వేదవిద్యా ప్రతిష్ఠాపకులు, కవిలోక వీరులు అగు "ద్విజన్మ పద్మశరులు" ఎవరికీ మిత్రులై ఉండిరో, ఆ పుండరీకాక్ష పదాంబుజ భ్రుంగమగు కులశేఖర మహారాజు ఈ కృతిని నిర్మించెను. 

కులశేఖరునకు ద్విజన్మవర, పద్మశరులను ఇద్దరు మిత్రులుండిరి. ఆ ద్విజన్మవరుడు వ్యాసుడో, వాల్మీకియో అయి ఉండివలెననియు, పద్మశరుడు శగోపులనెడి ఆళ్వారు(నమ్మాళ్వారు) అనియు పెద్దలు చెప్పుచుందురు. అందు కవిలోకవీరుడనుటచే ఆదికవియగు వాల్మీకియే ద్విజన్మవరుడని, ఆయన శ్రీరామాయణమున వేదోపబృంహణము చేయుటచే శృతిధరుడు అనియు చెప్పవచ్చును. తమిళమున, సంస్కృతమున ప్రసిద్ధులగు కవులలో శగోప, వాల్మీకులు ఆద్యులు కనుక వారినే ఇక్కడ పెర్కొనెనని చెప్పవచ్చును. శగోపునకు "మారన్" అని తమిళ నామము. మారుడనగా మన్మథుడు కనుక దానికి సంస్కృత పర్యాయమగు పద్మశరుడు అని ఇందులో ప్రయోగింపబడినది.  

  
||ఇతి శ్రీముకుందమాలా సంపూర్ణం||

ముకుందమాల... 39 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


39 వ శ్లోకం
క్షీరసాగర తరంగశీకరా-
సారతారకిత చారుమూర్తయే
భోగిభోగ శయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమ: 


భావం:-
క్షీరసాగరమున తరంగముల జల్లులచే అచ్చటచ్చట నక్షత్రములు పొడమినట్లున్న సుందర విగ్రహుడు, శేషభోగశయ్యపై పవళించిన మధుసూదనుడగు మాధవునికి నమస్కారము. 


ముకుందమాల... 38 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


38 వ శ్లోకం
ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం
సమాహితానాం సతతాభయప్రదం
తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం


భావం:-
సతతము హృదయ పుండరీకమధ్యమున సుస్థిరముగ నిలిచి ఉన్నవాడును. తనను ధ్యానించు వారలను సతతము అభయ మొసంగువాడును, ఆద్యంతములు లేనివాడును, శాశ్వతుడును అగు ఆ విష్ణువును ఎవరు ధ్యానింతురో వారు విష్ణు సంబంధమనెడి పరమసిద్ధిని పొందుదురు.  


ముకుందమాల... 37 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


37 వ శ్లోకం

శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే
శ్రీపద్మనాభాచ్యుతకైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే 

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ
గోవింద దామోదర మాధవేతి
వక్తుం సమర్థోపిన వక్తి కశ్చిత్ 
అహో జనానాం వ్యసనాభిముఖ్యం 


భావం:-
శ్రీనాథ! నారాయణ! వాసుదేవ! శ్రీకృష్ణ! భక్తప్రియ! చక్రపాణి! శ్రీపద్మనాభ! అచ్యుత! కైటభారీ! శ్రీరామ! పద్మాక్ష! హరీ! మురారీ! అనంత! వైకుంఠ! ముకుంద! కృష్ణ! గోవింద! దామోదర! మాధవ! అని పలుకగలిగిన మనుజుడు కూడా పలుకుటలేదు. అయ్యో! ఈ వ్యాసాన లంపటత్వమెంతటిది!   


ముకుందమాల... 36 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


36 వ శ్లోకం
నమామి నారాయణ పాదపంకజం

కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం

స్మరామి నారాయణ తత్త్వమవ్యయం  



భావం:-
శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరింతును. నారాయణుని సదా పూజింతును. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును. శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.     



ముకుందమాల... 35 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


35 వ శ్లోకం
తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే
విష్ణో కృపాం పరమకారుణిక: కిల త్వం
సంసారసాగరనిమగ్నమనంత దీనం
ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి


భావం:-
సర్వేశ్వరా! అనాధుడనగు నాయెడల దయచూపుము. అనుగ్రహింపుము. నీవు పరమదయామయుడవు కదా! హరే! అనంత! ఈ సంసార సాగరంలో మునుగు దీనుడను ఉద్ధరింపుము. నీవు పురుషోత్తముడవు కదా! 



ముకుందమాల... 34 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


34 వ శ్లోకం
కృష్ణో రక్షతు నో జగత్త్రయగురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం 


భావం:-
(ఈ శ్లోకమున చమత్కారముగ విభక్తులన్నిటిలోను --- అనగా ప్రథమా విభక్తి మొదలు సప్తమి విభక్తి వరకును, సంబోధన ప్రథమావిభక్తితో సహా -- కృష్ణ శబ్దమును నిర్దేశించి స్తుతించుచున్నారు.)  

కృష్ణుడు జగత్రయ గురువు. మమ్ములను రక్షించుగాక! కృష్ణుని నేను నమస్కరించుచున్నాను. కృష్ణుని చేత రాక్షసులు చంపబడిరి. కృష్ణుని కొరకు నమస్కరించుచున్నాను. కృష్ణుని నుండి ఈ జగత్తు బయటపడినది. కృష్ణునకు నేను దాసుడను. కృష్ణుని యందే ఈ సర్వజగత్తు నిలిచియున్నది. ఓ కృష్ణా! నన్ను రక్షింపుము. 

  

ముకుందమాల... 33 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


33 వ శ్లోకం
దారా వారాకరవరసుతా తే తనూజో విరించి:
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గ: ప్రసాద:
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీతే 
మాతా మిత్రం వలరిపుసుతస్త్వయ్యతోన్యన్న జానే 


భావం:-
కృష్ణా! జలనిధి పుత్రియగు లక్ష్మి నీ భార్య. బ్రహ్మ నీ కుమారుడు. వేదము స్తోత్రపాఠకుడు. దేవతాగణము నీ భ్రుత్యకోటి. మోక్షము నీ అనుగ్రహము. ఈ జగత్తు నీమాయ. దేవకీదేవి నీ తల్లి. ఇంద్రపుత్రుడగు అర్జునుడు నీ మిత్రుడు. అట్టి నీకంటే ఇతర దైవమును ఎవరిని నేను ఎరుగను.  


ముకుందమాల... 32 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


32 వ శ్లోకం
ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ


భావం:-
ఓ మూఢా! దుర్బుద్ధి! ఈ శరీరము క్రమముగా జీర్ణించిపోవునది. సంధులెడలి సడలిపోవునది. ఎప్పుడో ఒకనాడు తప్పక నశించును. దీనిని ఔషధములతో నిలబెట్టుటకు క్లేశపడెదవేల ? వ్యాధిగ్రస్తము కానీక కాపాడు కృష్ణ రసాయనమును త్రాగుము.  

   

ముకుందమాల... 31 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


31 వ శ్లోకం

తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్ 

మధు క్షరంతీవ సతాం ఫలాని
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి  

భావం:-
ఓ జిహ్వా! దోసిలియొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వమగు నారాయణుని ప్రతిపాదించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన నామములను మరల మరల ఉచ్చరింపుము. 


ముకుందమాల... 30 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******

30 వ శ్లోకం
మదన పరిహర స్థితిం మదీయే

మనసి ముకుందపదారవిందధామ్ని

హరనయన కృశానునా కృశోసి

స్మరసి న చక్రపరాక్రమం మురారే: ll 



భావం:-
ఓ మదనా! నా మనసులో ముకుంద చరణారవిందములు పాదుకొనిఉన్నవి. నీవు అచటకు చేరుకొన ప్రయత్నింపకుము. పురారి నేత్రాగ్ని చేతనే కృశించితివి. ఇంకా మురారి చక్ర పరాక్రమము గూర్చి తెలుసుకొని మసలుకొనుము.   



ముకుందమాల... 29 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


29 వ శ్లోకం
నాథే న: పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి


యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం

సేవాయై మృగయామహే నరమహో మూకా వరాకా వయం 



భావం:-
ప్రభూ!మాకు నాథుడు, పురుషోత్తముడు, మూడులోకముల ఏకైకనాథుడు, మనసు మాత్రముచేత సేవింపజాలినవాడు, సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, దేవతామూర్తి అగు నారాయణుడుండగా, మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామములకో అధిపతి అగు వానిని, అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, ఒక మానవమాత్రుని సేవించుటకై తహతహలాడుచున్నాము. అహో! ఏమి మా జాడ్యము! నారాయణుని సేవింపక, నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పస్టముగా వివరించినారు. 

నారాయణుడు సర్వ నరసమూహమునకు ఆశ్రయుడై, సర్వ నరులలో అంతర్యామియై ఉండువాడు. అతడు లేనిదే నిలకడలేనివాడు ఈనరుడు. నారాయణుడు మనకు ప్రభువు. ఆ సంబంధము మనము తొలగించుకొందుమన్నను తొలగునది కాదు. నరునకు నరునితో సంబంధము కల్పితము. అతడు త్రిజగన్నాథుడు. ఇతడు కొలది గ్రామములకు అధినేత. వానిని మనసుతో సేవించిన చాలును. వీనికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేయవలెను. నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును. ఈ నరుడల్పాల్పములను ఈడేర్చును. అతడు పురుషోత్తముడు, వీడు పురుషాధముడు. అతడు దివ్యుడు, ఇతడు మర్త్యుడు. ఇంత బేధమున్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ములమగు మా సంగతి ఏమనుకోవలెనో తెలియదు. 




ముకుందమాల... 28 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


28 వ శ్లోకం
మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే
మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ
త్వద్భృత్యభృత్యపరిచారక భృత్యభృత్య
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ


భావం:-
దైత్యసంహారక! లోకనాథ! ఈ నా కోర్కెను తీర్చుము. నన్ను అనుగ్రహింపుము. నీ భ్రుత్యు భ్రుత్యు పరిచారక భ్రుత్య భ్రుత్యునాకు భ్రుత్యుడనుగా నన్ను తలంచుము. ఆవిధంగా నీ భ్రుత్య పరంపరలో ఒకనిగా నన్ను తలంచుటఏ ప్రభూ! నాజన్మకు ఫలము.  


ముకుందమాల... 27 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


27 వ శ్లోకం
శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కే న ప్రాపు ర్వాంచితం పాపినోపి
హా న: పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్ 
తేన ప్రాప్తం గర్భవాసాదిదు:ఖం 


భావం:-
పాపాత్ములైనను శ్రీమన్నారాయణ అను నామమును ఉచ్చరించి తమ కోర్కెలను తీర్చుకొనిరి కదా! అయ్యో నా వాక్కు ఆ నామమును ముందు ఉచ్చరించినది కాదు. అందులకే నాకీ జన్మము. ఈ గర్భవాసము మున్నగు దుఃఖములు సంభవించినవి.  


ముకుందమాల... 26 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


26 వ శ్లోకం
ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్చేదఫలాని పూర్తవిధయ: సర్వే హంతం భస్మని
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వాంభోరుహసంస్మృతీ: విజయతే దేవస్య నారాయణ:  


భావం:-
శ్రీ నారాయణ పదాంభోరుహ స్మరణమును విడిచి కేవలము వేదములు వల్లెవేయుట అరణ్య రోదనము. వేదోక్త నియమములను పాటించుట కండలు కరుగుటకు చేయు వ్యాయామ సదృశము. యజ్ఞాది కర్మలు బూడిదపాలు. గంగాది పుణ్యతీర్థ స్నానము గజస్నానము వలె ప్రయోజన శూన్యము. కనుక నిత్యము ఆ నారాయణుని స్మరిస్తూ సర్వకర్మలు ఆచరింపుము. 

  

ముకుందమాల... 25 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


25 వ శ్లోకం
వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిజగతాం సంజీవనైకౌషధం
భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం
శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:శ్రీకృష్ణదివ్యౌషధం


భావం:-
ఓ మనసా శ్రేయస్సును కలిగించు శ్రీకృష్ణ దివ్యౌషధమును సేవింపుము. ఆ ఔషధము మోహమును శమింపచేయును. మునుల మనోవృత్తులను ప్రవర్తింప చేయును. రాక్షసేంద్రులలకు బాధలను కలిగించును. మూడులోకములను మరణము నుండి కాపాడును. భక్తులకు అత్యంతము హితము చేకూర్చును. సంసార బంధమును బాపును. 


ముకుందమాల... 24 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


24 వ శ్లోకం
శత్రుచ్చేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్య మంత్రం
సంసారోత్తారమంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణమంత్రం
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జపజప సతతం జన్మసాఫల్యమంత్రం  


భావం:-
ఓ జిహ్వా! శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము. అదియే జన్మకు సాఫల్యము ఇచ్చునది. కామాది శత్రువులను భేదించుటలో ప్రధానసాధన మా మంత్రము. సర్వోపనిషద్వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి. జననమరణములనెడి సంసారము నుండి తరింపచేయగల మంత్రమది. రాశీభూతమైన అవిద్యాంధకారమును నశింపజేయు మంత్రము. ఆ మంత్రమే సర్వైశ్వర్యములను ఇచ్చెడిది. వ్యసనములనెడి సర్పములు కాటువేసినప్పుడు కాపాడగల మంత్రము. కనుక శ్రీకృష్ణ మంత్రమును జపింపుము.   

   

ముకుందమాల... 23 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


23 వ శ్లోకం
భక్తాపాయభుజంగగారుడమణి: త్త్రైలోక్యరక్షామణి:

గోపీలోచనచాతకాంబుదమణి: సౌందర్యముద్రామణి:

య: కాంతామణిరుక్మిణీఘనకుచ ద్వంద్వైకభూషామణి:

శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణి:  



భావం:-
సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి. వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ, మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను దరిచేరకుండ తొలగించును. 




ముకుందమాల... 22 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


22 వ శ్లోకం

హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ

హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం

హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా



భావం:-
ఓ గోపాలా! కరుణాసముద్ర! లక్ష్మీపతి! కంసారి! గజేంద్ర రక్షకా! మాధవ! రామానుజ! జగన్నాథ! పుండరీకాక్షా! గోపీజనవల్లభ! రక్షింపుము. నీవే తప్ప ఇహపరంబు నేను ఎరుంగను.