April 30, 2024
నర్మదా స్తోత్రం
January 5, 2021
వైష్ణవ జనతో song తెలుగులో
మహాత్మా గాంధీ గారికి ఎంతో ఇష్టమైన పాట వైష్ణవ జనతో హిందీలో ఉంది ఆ పాటని ఆచార్య ఫణీంద్రగారు తెలుగులో అనువదించి మనకు అందించారు. నాకు చాలాబాగా నచ్చింది. అందుకే ఆ పాటని అతని అనుమతితో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
వైష్ణవ జనతో ... (తెలుగులో)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
ఎరిగి, సహాయము నెవ్వడు సేయు -
చిత్త మహంకృతి చేరగనీడు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
సకల లోకుల గను సాదరంబుగను -
పరులను నిందల పాల్జేయకుండు -
బుద్ధి వాక్కర్మల శుద్ధిగ నుంచు -
తత్పురుషుని గను తల్లి ధన్యయగు!
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
సమదృష్టి గలుగు - తృష్ణల త్యజియించు -
పర కాంతలను మాత పగిదిగ జూచు -
జిహ్వ యసత్యము చెప్ప దెప్పుడును -
అన్యుల ధనముల నంట డెప్పుడును -
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
కామ మోహ క్రోధ కపట లోభముల
మునుగకుండ మదిని ముక్తిని గోరు -
రామ నామమును నిరతము ధ్యానించు -
తనువున పుణ్య తీర్థముల ధరించు -
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
September 30, 2017
January 8, 2017
April 7, 2016
December 20, 2015
ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి)
ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు
చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది
ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి)
ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి
శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ
భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును
ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి
కార్తీక శుద్ధ ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)
మార్గశిర శుద్ధ ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
మార్గశిర బహుళ ఏకాదశి - 'విమలా' -(సఫలా) - అజ్ఞాన నివృత్తి
పుష్య శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
పుష్య బహుళ ఏకాదశి - 'కళ్యాణీ' (షట్ తిలా) ఈతిబాధా నివారణం
మాఘ శుద్ధ ఏకాదశి - 'కామదా' (జయా) - శాపవిముక్తి
మాఘ బహుళ ఏకాదశి - 'విజయా' - సకలకార్య విజయం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'ఆమలకీ' - ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'సౌమ్య' - పాపవిముక్తి
(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్లవిషయంలో కొన్ని బేధాలున్నాయి.)
24 ఏకాదశులలోనూ - సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి"గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సౌరమానం ధనుర్మాసం కాగా, అందువచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నరాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా --- కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.
ఏకాదశి ప్రాశస్త్యం
మరో వృత్తాంతం ---- మధుకైటభులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్యరూపాలు ధరించి, దివ్యజ్ఞాన్నాన్ని పొంది, "దేవా ! వైకుంఠము వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పూజ చేసి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వారమార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠప్రాప్తి కలిగించు" అని ప్రార్థించిరి. స్వామి "తథాస్తు" అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి "మోక్షోత్సవదినం" అని కూడా అంటారు. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక "ముక్కోటి ఏకాదశి" అని పేరు(ముక్కోటి అనేది 33 కోట్లకు సంకేతమని అంటారు). వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక "వైకుంఠ ఏకాదశి", భగవద్దర్శనం కలిగిస్తుంది కనుక "భగవదవలోకనదినం" అని పిలుస్తుంటారు.
సుకేతుడనే రాజు విశ్వేదేవతలా ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, భగవదనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడు.
ఆనాటి నుండి ఏకాదశినాడు పగలు, రాత్రి ఉపవాసంతో ఉండి, జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృపవల్ల ముక్తి లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది.
పుత్రద ఏకాదశి
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ.... పూర్వం మహారాజు "సుకేతుడు" 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.
తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు "నిహితం గుహాయాం విభ్రాజతే". అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం, ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
వైకుంఠ ఏకాదశి నాడు చేయవలసిన విధివిధానాలు
అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి, శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పెద్దలు చెబుతున్నారు.
ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చేసిన పాపలు తొలగుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి మొదలైన వైష్ణవ ఆలయాలను దర్శించుకోవచ్చు.
వైకుంఠ + ఏకాదశి అర్థ వివరణ
వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ - ఏకాదశి అని రెండు పదాలున్నాయి. 'వైకుంఠ' - అంటే 'విష్ణువును', విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. 'చాక్షుషమన్వంతరం' లో 'వికుంఠ' అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠుడు" అయ్యాడు. వైకుంఠము - శ్వేతదీపమైన విష్ణుదేవుని స్థానం, పునరావృత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరమధామం. జీవులు వైకుంఠుడుని అర్చించి, ఉపాసించి, వైకుంఠానికి చేరుటే ముక్తి. ఇంద్రియాలు ఇంద్రియాధిస్ఠాన నారాయణున్ని సేవించుటే భక్తి కదా ! వైకుంఠము అంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం.
"మనః షష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి" - అంటే గీతావాక్యానుసారం మనస్సు+10 ఇంద్రియములు అనగా పదకొండు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా జీవాత్మ ఆకర్షిస్తుంది. అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాలను+ప్రాణాలను+బుద్ధిని కూడా తనతో తీసుకొని పోతుంది. జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు మొదటి శరీరం నుండి మనస్సుతో ఇంద్రియాలనూ ఆకర్షించి తీసుకువెళుతుంది. మనస్సంటే 'అంతఃకరణం'.
ఈ పదకొండు ఇంద్రియాలు వైకుంఠునికి అర్పింపబడి, వైకుంఠుడిని అర్చించి, సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రములై వాటిద్వారా సుఖానుభూతి పొందే జీవుణ్ణి వైకుంఠములో చేరుస్తాయి. కాగా "ఏకాదశేంద్రియాలను వైకుంఠార్పణం చేసి, వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తిని పొంది, ధన్యులవ్వండి - అని బోధిస్తుంది.
"వైకుంఠ ఏకాదశి" - వికుంఠమంటే ... దెబ్బతిననిది. ఇంద్రియాలు "వికుంఠాలు" అయినప్పుడే వైకుంఠ సమర్చన ప్రశాంతంగా జరుగుతుంది.
ద్వాదశి - 12వ స్థితి. ఇదే ఇంద్రియాతీతదివ్యానంద స్థితి. ఏకాదశినాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం. ఒక వస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొక వస్తువు ఉంచినప్పుడే మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండవదానిపై ప్రభావం చూపిస్తాయి కదా ! అదేవిధంగా ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ వైకుంఠునికి - ఉప = సమీపంలో, వాసః =నివసించటం వలన అత్యంత దగ్గర సాన్నిధ్య ప్రభావం కారణంగా, జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. అంతట జీవుడు శుద్ధుడవుతాడు.
November 9, 2015
November 8, 2015
October 19, 2015
బతుకమ్మ సంబరాలు
August 7, 2015
ఉపాధ్యాయ దినిత్సవం
January 13, 2015
November 11, 2014
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ
ఒకసారి ఢిల్లీలో స్కూలు పిల్లలు ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. దానికి ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు. పిల్లలు దానిని దూరం నుంచి చూసాక కళ్ళు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి. అదీ ఆట. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించటానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ ఆట ఆడినందుకు అక్కడున్న పిల్లవాడు రెండు అణాలు ఫీజుగా అడిగితె నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేసి, తన సహాయకులను అడిగి డబ్బు ఇప్పించుకొని ఆట ఆడినందుకు ఫీజు చెల్లించారట.
నెహ్రూ ప్రముఖ ప్రజా నాయకుడు. ప్రజలే దైవం, ప్రజాసేవే పరమాత్ముని సేవ, ప్రజలకు ఉపయోగపడే నాగార్జునసాగర్ వంటి ఆనకట్టలు, కర్మాగారాలు మొదలైనవి ఆయనకు పవిత్ర దేవాలయాలు. ప్రజలు కూడా నెహ్రూని తమ సొంత అన్నయ్యలా గౌరవించారు, ప్రేమించారు. అయన వెళ్ళిన చోటల్లా పిల్లలూ, పెద్దలూ తండోపతండాలుగా గుమిగూడేవారు. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా ప్రజల శ్రేయస్సునే మనస్సులో ఉంచుకోనేవారు. మనదేశంలో పెద్దపెద్ద పరిశ్రమలు త్వరితంగా వృద్ధి కావాలని, విజ్ఞానశాస్త్రం మూడు పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని బీదా బిక్కీ అనే భేదం లేని ఒక కొత్త సమాజం వెలుగులోకి రావాలనీ ఆయన ఆశించారు. అందుకు ప్రయత్నించారు కూడా. అన్ని దేశాల వారితోనూ, అన్ని మతాలవారితోనూ స్నేహంగా ఉండాలని బోధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నెహ్రూ గొప్ప మానవతావాది. మానవ శ్రేయస్సే ఆయన లక్ష్యం.
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నెహ్రూ చాలాసార్లు జైలుకి వెళ్ళారు. జైలులో కాలాన్ని వృథా చెయ్యకుండా నాలుగు కాలాలపాటు నిలిచే గొప్ప పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు. కాలాన్ని వృథా చెయ్యడమంటే ఆయనకు తగని అసహ్యం. లిఫ్టులో వెళుతూ కూడా ఆయన పుస్తకం చదివేవారంట. పుస్తకాలు చదవటం అంటే ఆయనకు అంత ఇష్టం, ఆసక్తి. "నేను నా జీవితంలో తగ్గించుకోలేకపోయిన పెద్ద ఖర్చు పుస్తకాలెన్నో కొంటూ ఉండడమే". అని ఒకసారి నెహ్రూ పేర్కొన్నారు.
నెహ్రూ కాంగ్రెసు పార్టీ అధ్యక్షునిగా చాలాసార్లు ఎన్నుకోబడ్డారు. ఆయన ఎంత గొప్ప రాజనీతి శాస్త్రవేత్తయో, అంతగొప్ప సాహితీవేత్త కూడా. ఆయన వ్రాసిన గ్రంథాలలో "గ్లింప్సన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ" (ప్రపంచ చరిత్ర) "డిస్కవరీ ఆఫ్ ఇండియా". "ఆటో బయాగ్రఫీ" (స్వీయచరిత్ర) మొదలైనవి ముఖ్యమైనవి. వీటిని కనుక చదివితే అనేక విషయాలలో ఆయనకుగల గొప్ప పాండిత్యం మనకు తెలిసివస్తుంది. మనదేశంలోని వివిధ భాషలలోనూ అభివృద్ధి పరిచేందుకు 1954 లో 'సాహిత్య అకాడమీ' అనే ఒక సంస్థ స్థాపించబడింది. ఆ సంస్థకు తోలి అధ్యక్షునిగా నెహ్రూ ఎన్నుకోబడ్డారు. అప్పటినుంచీ మరణించే వరకూ ఆయనే అకాడమీకి అధ్యక్షునిగా ఉన్నారు. ఒకసారి ఆయన ఈ విధంగా అన్నారు, 'అకాడమీ అధ్యక్షుడినయిన నా కార్యకలాపాలలో భారత ప్రధానమంత్రి (అప్పట్లో ఆయనే ప్రధానమంత్రి) జోక్యం కల్పించుకోవటం నాకంత ఇష్టంగా లేదు.' సాహిత్యమంటే ఆయనకుగల అపారమైన ఆదర్శభావాన్ని పై వాక్యం స్పష్టం చేస్తుంది. ఒక్క సాహిత్యమంటేనే కాదు, విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.
మనదేశంలో అవతరించిన మహనీయుల్లో మహామనీషీ, 17 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశానికి ప్రధమంత్రిగా వ్యవహరించిన ప్రముఖులు. శాంతిదూత, ప్రముఖ రచయిత, నవభారత నిర్మాత, మానవతావాది, ప్రపంచ మహా పురుషుడు, రాజనీతి శాస్త్రజ్ఞుడు అయిన నెహ్రూ 1964 లో మే 27 న కాలధర్మం చెందారు.
చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవటానికి ఆ సంవత్సరం నుంచీ ఆయన పుట్టినరోజైన నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
































.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)












