Showing posts with label మన సంస్కృతీ సంప్రదాయాలు. Show all posts
Showing posts with label మన సంస్కృతీ సంప్రదాయాలు. Show all posts

October 29, 2022

పురిటి శుద్ధి ఎలా చెయ్యాలి

పురిటి శుద్ధి ఎలా చెయ్యాలి 

పురుడు 10 రోజుల లోపు తల్లి-బిడ్డకి స్నానం చేయించకూడదు. 

పురుడు 10 రోజులు అయ్యాక,  11 వ రోజు ఉదయాన్నే చుట్టుపక్కల ఉండే 10 ఇళ్ళ నుండి 10 బిందెల నీళ్ళు పసుపు కలిపి తీసుకు వస్తారు. పురిటాలుకి స్నానం అయ్యాక ఆ 10 బిందెల పసుపు నీళ్ళు పోస్తే శుధ్ధి అవుతుందని పెద్దలు చెబుతున్నారు. కానీ ఈరోజుల్లో 10 ఇళ్ళవాళ్ళు రాలేరు కాబట్టి 10 చెంబుల నీళ్ళు పోసి శుద్ధి చేస్తున్నారు.  

చంటి బిడ్డకి స్నానం చేయించాక ఒక జల్లెడలో (బియ్యం జల్లెడ) బిడ్డని పడుకోబెట్టి బొడ్డుపైన బంగారం ఉంచి నీళ్ళు పొయ్యాలి. అప్పుడే ఆ బిడ్డకి శుద్ధి అయినట్టు లెక్క అన్నమాట. పురిటాలికి, పురిటి బిడ్డకి ఒకేసారి సూర్యోదయానికి మునుపే ఏకకాలంలో స్నానం చేయించాలి. 

బాలింత స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తరవాత చాకలి తెచ్చిన (తన) చీరని కట్టించి ఒక గంట సేపు ఉంచాలి. బిడ్డకి కూడా చాకలి తెచ్చిన బట్టనే వేస్తారు (కడతారు). 11 వ రోజు శుద్ధి అయ్యిన తరవాతనే పిల్లలకి బట్టలు వేస్తారు. 10 రోజుల లోపు పిల్లలకి కొత్త, పాత బట్టలు అస్సలు వెయ్యకూడదు. కేవలం పాత గుడ్డముక్కలు కప్పి ఉంచుతారు అంతే. 

సూర్యోదయం అయ్యిన తరవాత బ్రాహ్మణుడు (పంతులు, పురోహితుడు) వచ్చి శుధ్ధి పుణ్యాహవచనం చేస్తారు. 11వ రోజు పురిటాలు ఇంట్లో తిరగవచ్చును. సూర్యాస్తమయం సమయం నుండి మళ్ళీ 21వ రోజు వరకు తల్లి-పిల్ల పురుడు పట్టాలి. అంటే ఎవరిని తాకకుండా దూరంగా ఉండాలి.

11వ రోజు తల్లి పిల్ల కోసం కాటుక అంగారు(నల్ల బొట్టు) వేస్తారు. ముందుగా కత్తికి వెల్లుల్లి రసం రాస్తారు. ఆముదం  దీపం వెలిగించి కత్తిని ఉంచుతారు కత్తికి నల్లగా మసి పడుతుంది. ఆ మసికి నెయ్యి కానీ, వెన్న కానీ కలిపి తల్లి-పిల్లలకి కంటికి కాటుక పెడతారు. ఆ విధంగా పిల్లలకి కాటుక 1సంవత్సరం పాటు పెడితే పిల్లలకి ఎంత పెద్ద వయసు వచ్చిన కంటి సమస్యలు రావని పెద్దల ఉవాచ. 

అంగారు - అంటే చంటి పిల్లలకి పెట్టే నల్ల బొట్టు. సగ్గుబియ్యాన్ని నల్లగా వేయించి అంటే బాగా మాడ్చి అందులో నీళ్ళు పోసి గింజ మెత్తగా ఉడికి చిక్కగా అయ్యే వరకు పొయ్యి పైనే ఉంచాలి. చల్లారిన తరవాత మెత్తగా గింజ కనిపించకుండా నూరుకోవాలి. ఆలా అయ్యిన మిశ్రమాన్ని ఒక ఖాళీ కొబ్బరిచిప్పలో ఉంచుకోవాలి. ఆ అంగారు రోజురోజుకీ ఎండిపోయి గట్టిబడుతుంది. చంటిబిడ్డకి బొట్టు పెట్టేటప్పుడు తడి చేయి చేసుకొని మిశ్రమాన్ని కలిపి బొట్టుగా పెట్టాలి.                    

బారసాల, ఉయ్యాలలో వెయ్యటం, బావిలో చేద

బారసాల చేసేటప్పుడు  సంప్రదాయం 
ఒక్కో కులం, మతం ఆచారం ఒక్కో ప్రాంతంలో వారి సంప్రదాయాలు వేరు వేరుగా ఉంటాయి. కొంతమంది 11వరోజు, 21, 29, 3వ నెల, 5వ నెల ఈవిధంగా వారి వారి వీలునిబట్టి బారసాల చేసుకుంటారు.

చంటిపిల్లని ఉయ్యాలలో వేసేటప్పుడు '

పెళ్లినాటి మధుపర్కం ఉంటే దానినే ఉయ్యాల లాగ కట్టుకోవాలి. లేకపోతె చంటిపిల్ల యొక్క అమ్మమ్మ పట్టుచీరని ఉయ్యాలగా కట్టాలి. రుబ్బురాయి పొత్రాన్ని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఇద్దరు పెద్ద ముత్తైదువులు తూర్పు పడమరలలో నుంచుని పొత్రాన్ని ఉయ్యాల పైనుండి ఇచ్చి, కింద నుండి అందుకోవాలి. అలా మూడుసార్లు చేసి పొత్రాన్ని ఉయ్యాలలో పాడుకోబెట్టాలి. దీని అంతరార్థం ఏమిటంటే ఉయ్యాలలో పడుకునే పిల్లలు అంత గట్టిగా బలంగా తయ్యారవ్వాలని అర్థం అని పెద్దలు చెబుతున్నారు. తరవాత పొత్రాన్ని తీసి పిల్లని పాడుకోబెట్టి హారతి ఇచ్చి ముత్తైదువులు పాటలు పాడుతారు.

ఈ వేడుక తరవాతనే బావిలో చేద వేస్తారు. ఈరెండు వేడుకలు ఒకేరోజు చేసుకోవచ్చును.                

బావి(నుయ్యి)లో చేద వేసి కప్పని మొక్కించటం 
బావి దగ్గరికి బాలింతను తీసుకువెళ్ళాలి. బాలింతకు నడికట్టు కట్టి, చెవులమీద నుండి తలకి గుడ్డ కట్టాలి.
పెరట్లో మొక్కల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని మూడు ముద్దలుగా చేసుకొని మూడు తమలపాకులలో ఉంచుతారు. ఆ మట్టిముద్దలు కప్పలు అన్నమాట. ఆ కప్పల పైన వరిపిండితో ముగ్గులు వేసి, తాంబూలంలో వెల్లుల్లిరెబ్బ, బెల్లం ముక్కని పెట్టి  నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. తరవాత బావి(నూతి)లో వేసే చేదలో 3కప్పలని అంటే 3మట్టిముద్దలని ఉంచి 3 సార్లు బావి నీటిలో కలపాలి. కప్పాకప్ప నీలాగే నా పిల్లలు గెంతాలి, చలాకీగా ఉండాలి అని చెప్పాలి. బావిలో నుండి తీసిన చేద నీటిలో పిల్లల బట్టలు తడిపి ఆరబెట్టిస్తారు. ఆరోజు నుండి పసిబిడ్డ బట్టలు తల్లి ఉతుక్కోవచ్చును.
కప్పలకి పెట్టిన తాంబూలాలని(అంటే బెల్లం ముక్క వెల్లుల్లి రెబ్బని) పిల్లలు లేని స్త్రీలకి తాంబూలంగా ఇచ్చి వారిచేత తినిపించాలి, ఆ విధంగా తింటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్మకం మన పెద్దవారికి. ఈ తంతు అంతా బావిదగ్గరనే చెయ్యాలి.
ఈరోజుల్లో పట్నాలలో నివసించేవారికి బావి అంటేనే తెలియదు. అందుకని ఒక బకెట్టు నీటిలో కప్పలని కలిపి ఆ నీటిని మొక్కలకి పోస్తున్నారు. ఈవిధంగా చేయటం వెనుక అంతరార్థం ఏమిటంటే గంగమ్మతల్లీ నీటిలో పడినా నా బిడ్డకి ఏవిధమైన ఆపదా కలిగించకుండా చల్లగా చూడుతల్లి అని గంగమ్మని వేసుకోవటం అని పెద్దలు చెబుతున్నారు.

ఈతంతు అంతా జరిగిన తరవాత బాలింత ఒక చెంబుతో నీరు ఇంట్లోకి తీసుకొని రావాలి. ఇంట్లోకి వచ్చేముందు బాలింత మరియు తాంబూలం తీసుకున్న స్త్రీలు వారు భర్తల పేర్లు చెప్పి గడపలో అడుగుపెట్టాలి. ఇది ఒక వేడుక మాత్రమే.     

అచ్చట్లు .......ముచ్చట్లు

అచ్చట్లు .......ముచ్చట్లు

అచ్చట్లు ................                                        ....... ముచ్చట్లు 
మనుమరాలిగా పుట్టినందుకు                          మరమరాలు(మూరీలు)
ముద్దుగా ఉన్నావని                                        ముద్దకోవా 
చిరునవ్వులు                                                  చిప్స్ 
అల్లరి చేస్తుంటే                                                 చిల్లర 
గోలచేస్తుంటే                                                   గోరుమిట్లు 
దూకుడికి                                                      దువ్వెన్నలు 
కేకలకు                                                         కేకులు 
కేరింతలకి                                                      ఈలలు 
చలాకీకి                                                         చాక్లేట్లు
బిజీగా ఉంటే                                                  బిస్కెట్లు 
పళ్ళువస్తే                                                      పటికబెల్లం 
అడుగులకు                                                   అరిసెలు 
పేచీలు పెడితే                                                 పెన్నులు 
బొంగరంలా తిరుగుతుంటే                                బొంగరాలు 
బుడిబుడినాడకలకి                                        బూరెలు 
ఆడుకుంటుంటే                                              అటుకులు 
సైగలు చేస్తుంటే                                             సైకిలు 
కూర్చోవటం వస్తే                                           కుర్చీలు 
మాట్లాడటం వస్తే                                          మణుగుబూరెలు 
కబుర్లు చెబుతుంటే                                      కజ్జికాయలు 
గడపదాటితే                                               గారెలు 
కోరపళ్ళు వస్తే                                            కొబ్బరుండలు 
పాకుతున్నప్పుడు                                    పాలకోవాలు 
మారాంచేస్తుంటే                                        మామిడిపళ్ళు 

12 నెలలకు 12 రకముల వేడుకలు

12 నెలలకు 12 రకముల వేడుకలు 

3వ నెలలో  - ముద్ద కుడుములు (లడ్డూలు) పంచుతారు 
నవ్వులకు - నువ్వుండలు పంచుతారు
ఊ కొడితే - ఉగ్గు గిన్నెలు పంచుతారు
బోర్లాపడితే - బొబ్బట్లు పంచుతారు
కేరింతలు కొడితే - కేకులు పంచుతారు
అల్లరికి - చిల్లర పంచుతారు
బిడ్డ చలాకీగా ఉన్నందుకు - చాకలేట్లు పంచుతారు
కోరలు (పళ్ళు) వస్తే - కొబ్బరిబోండాలు పంచుతారు
గడపలు దాటితే - గారెలు పంచుతారు
దూకుడుకు - దువ్వెన్నలు పంచుతారు
అడుగులకు - అరిసెలు పంచుతారు
పలుకులకు - చిలుకలు(పంచదారవి) పంచుతారు
మాటలకు - మణుగుబూరెలు

అన్నప్రాసనం

అన్నప్రాసనం  

ఆడ పిల్లలకి బేసి నెలలోను (అంటే 5 7 9 11నెలలలో) -మగ పిల్లలకి సరి నెలలోను (6 8 10 12 నెలలలో) అన్నప్రాశనం చేయవచ్చని పెద్దలు చెబుతున్నారు. పిల్లలని తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి. పాలతో వండిన పరమాన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ పాత్ర వారి స్తోమతని బట్టి వాడుకోవచ్చును. (వెండి, రాగి, కంచు, ఇత్తడి ఏదైనా). పరమాన్నాన్ని ఒక బంగారపు ఉంగరంతో ఆ బిడ్డకి మూడుసార్లు తినిపించాలి. తరవాత చేతితో తినిపించాలి. ఈవిధంగా తల్లి కూడా తినిపించాక మిగిలిన కుటుంబ సభ్యులు కూడా తినిపించాలి. 

ఈ సందర్భంగా వేడుక కోసం మరొక కార్యక్రమం కూడా చేస్తారు. కొంచెం దూరంలో పాయసం, పుస్తకాలు, కలము, కత్తి, పసుపు కుంకుమ, పూలు, పళ్ళు మొదలైన వస్తువులు ఉంచి, పిల్లలు పాకడానికి వీలుగా వదిలిపెడతారు, పిల్లలు పాకుకుంటూ వెళ్ళి ముందుగా ఏది ముట్టుకుంటారో వారికి జీవితంలో ఆ వస్తువంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారని అర్థం అని పెద్దలు చెబుతున్నారు. ఆ విధంగా మూడుసార్లు వస్తువులని ముట్టిస్తారు. పిన్న వయస్సులోనే వారి ఇష్టాయిష్టాలు మనకు తెలుస్తాయని పెద్దల ఉవాచ. ఇది సంప్రదాయం ఏమీకాదు. కేవలం ఒక వేడుక మాత్రమే.                            

మన హిందూ సంస్కృతీ సంప్రదాయాలు

మన హిందూ సంస్కృతీ సంప్రదాయాలు 

ఏకార్యక్రమం చేసే ముందు ఐనా మనం కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

ఏశుభకార్యక్రమైనా చేసే ముందు దంపతులు పీటలు మీద కూర్చొని కార్యక్రమం చేయటం ఆనవాయితీ కదా ! 
ఆ దంపతులు పీటలు మీద కూర్చోవటానికి ముందు వారి చేతికి తాంబూలం ఇచ్చి మనం కూర్చుండబెట్టాలి. ఆ తాంబూలం(ఆకు,వక్క,పండ్లు)లో 2 పండ్లు(ఏ విధమైన పండ్లయినా సరే) ఉంచాలి.  
హారతి ఇచ్చే పళ్ళెంలో దీపారాధన చేయటానికి కుంది,(వెండి, ఇత్తడి ,రాగి ఏదైనా వాడవచ్చు. స్టీలు కుంది వాడకూడదు) వత్తులు, నూనె, తాంబూలం, అక్షింతలు, అగ్గిపెట్టె, పసుపు- కుంకుమ ఉంచాలి.
ఏ సందర్భంలోనైనా దంపతులకి బట్టలు పెట్టవలసి వస్తే ఆ బట్టలలో నలుపు రంగు లేకుండా చూసుకోవాలి. 
శుభకార్యాలప్పుడు, పండుగ రోజుల్లో స్త్రీలకి (ఆడవాళ్ళు పిల్లలైనా, పెద్దలైనా ముత్తైదువులకి) ముఖానికి కుంకుమ బొట్టు పెట్టి, కంఠానికి గంధం పూసాకనే కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. (కాళ్ళకి పసుపు రాసిన తరవాత ముఖానికి బొట్టు పెట్టకూడదు.... క్రింది నుండి పైకి రాకూడదు. పైనుండి క్రిందికి రావాలి.)
ఏ సందర్భంలోనైనా హారతి ఇచ్చే ముందు దేవునికి హారతి అద్దిన తరవాతనే పెద్దలకైనా, పిల్లలకైనా అద్దాలి. 
ఎవ్వరైనా తమ జీవితంలో ఒక్కరికైనా కన్యాదానం చేస్తే చాలా మంచిది. (ఆడపిల్లలు లేనివారు తమ కులంలోనైనా, వేరే కులంలో అమ్మాయికైనా సరే కన్యాదానం చేయవచ్చును.)
ఎవరికైనా ఏ సందర్భంలోనైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ఆకుకి, పండుకి కూడా తొడిమలు మనవైపు ఉంచుకొని, కొసలు పుచ్చుకునే వారివైపు ఉండేటట్టు చూసుకోవాలి. 
ఇంట్లో చూలింత(గర్భం ధరించిన స్త్రీ) ఉన్నప్పుడు మంచి గుమ్మిడికాయ ఆ ఇంట్లో పగలగొట్టకూడదు.


పెళ్లికూతురు/ పెళ్ళికొడుకుని చేయుట ..... రాటవేయుట

పెళ్లికూతురు/ పెళ్ళికొడుకుని చేయుట ..... రాటవేయుట 
పెళ్లికూతురు/ పెళ్ళికొడుకుని చేయటం అంటే ముహూర్తం సమయానికి ముత్తైదువులు అమ్మకడుపు చల్లగా, అత్తకడుపు చల్లగా, నీకడుపు చల్లగా, నాకడుపు చల్లగా అంటూ మాడుకి చమురు పెట్టి, హారతి ఇచ్చి ఆశీర్వదిస్తారు.

అదే సమయానికి ఇంటిబయట రాటవెయ్యాలి. నవధాన్యాలు, చిల్లర నాణాలు, పంచలోహాలు పాలలో కలిపి రాట వేసే గుంతలో(గొయ్యలో)వెయ్యాలి. తరవాత పాలకొమ్మ, నేరేడుకొమ్మ, మామిడికొమ్మ ఈ మూడుకొమ్మలు కలిపి, పసుపుకొమ్ము ధారంతో కట్టి,  వాటికి పసుపు బొట్లు పెట్టి, గుంతలో ఉంచి మట్టితో కప్పి పైన ముగ్గువేసి ప్రమిదలో జ్యోతి(దీపం) వెలిగించి హారతి ఇవ్వాలి.తరవాత మిగిలిన 3 రాటలు వేసి పెళ్ళిపందిరి వేసుకోవాలి. 
                
తరవాత పెళ్లికూతురు/ పెళ్ళికొడుకుకి అభ్యంగన స్నానం చేయించి కొత్తబట్టలు కట్టించి, కల్యాణ తిలకం పెట్టి, బుగ్గన చుక్క పెడతారు. కూర్చోబెట్టి కాళ్ళకి పారాణి పెడతారు. పీటపైన కూర్చోబెట్టి ఎదురుగా రోలులో రోకట్లో పసుపుకొమ్ములు వేసి దంచుతారు. దంచిన పసుపుపొడిని పళ్లెంలో వేసి పెళ్లికూతురు/ పెళ్ళికొడుకు పైన చెరుగుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితం పచ్చగా ఉండాలని అంతరార్థం. తరవాత ముత్తైదువలకి తాంబూలాలు ఇచ్చి, బంధువులకి భోజనాలు పెట్టుకుంటారు.     

పెళ్ళికి గోధుమరాయి / పసుపు కొట్టుట (విఘ్నేశ్వరుని బియ్యం మూటకట్టటం)

పెళ్ళికి గోధుమరాయి / పసుపు కొట్టుట (విఘ్నేశ్వరుని బియ్యం మూటకట్టటం)
కావలసిన సామాను 
పసుపు 
కుంకుమ 
బియ్యం 
తమలపాకులు 
వక్కలు 
అరటిపళ్ళు 
పసుపుకొమ్ములు 
మామిడాకులు 
చిల్లరనాణెలు 
తిరగలి (విసుర్రాయి) 
శనగలు...కందులు....పెసలు 
ఒక తెల్లని వస్త్రం 1/4 మీటరు 

ముందుగా తిరగాలి శుభ్రంగా కడిగి పసుపురాసి బొట్లుపెట్టి, తెల్లదారంతో 11 వరసలు తీసి ఒక పసుపుకొమ్ము, మామిడాకు కలిపి ముడి కట్టాలి. ఆ దారాన్ని తిరగలికి, మరొక దానిని తిరగలి కర్రకి కట్టాలి. ముహూర్తం సమయానికి పెళ్ళికొడుకుని/ పెళ్ళికూతురిని తూర్పు దిక్కుగా కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగ తిరగలి ఉంచి శనగలు, పెసలు, కందులని ఒక పళ్ళెంలో కలిపి తిరగలిలో వేసి ముత్తైదువులు అందరూ మూడు పిడికిళ్ళు వేసి విసరాలి. పేరంటానికి వచ్చిన ముత్తైదువలకి తాంబూలాలు ఇచ్చి పంపించాలి. కలిగి ఉంటే బంధువులకి భోజనాలు పెట్టుకోవాలి. పీటపై నుండి లేచే ముందు పెళ్లికూతురు/ పెళ్ళికొడుకుకి హారతి ఇవ్వాలి. 

పూర్వకాలంలో తిరగలిలో వేసి మెత్తగా తిప్పిన పప్పుల్ని పెళ్ళికి ఉపయోగించే కిరాణా సామానులలో కలిపేవారు. లేదా పెళ్ళికి ఉపయోగించే నాలుగుపిండిలో వేసి మర పట్టించేవారు.     

విఘ్నేశ్వరుని బియ్యం మూటకట్టటం
తెల్లని వస్త్రంలో ఒక పావు బియ్యం, పిడికెడు శనగపప్పు, చిన్న బెల్లం ముక్క వేసి, పసుపు వినాయకుడిని చేసి తమలపాకులో ఉంచి, ఒక తాంబూలాన్ని ఉంచి  విఘ్నేశ్వరుని తలచుకొని మూట కట్టి, దేవుని మూలన ఉంచాలి. పెళ్ళి అయ్యాక శనగపప్పు బియ్యాన్ని పరమాన్నంగా వండి దేవునికి నైవేద్యం పెట్టి అందరూ తినాలి.           

January 25, 2020

బొమ్మల కొలువు

బొమ్మల కొలువు
                                                 
బొమ్మలకొలువు అంటే అందరికీ ఇష్టమే కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పండగల అప్పుడు బొమ్మలకొలువులు పెట్టడం ఆనవాయితీ. ఎక్కువగా సంక్రాతి, దసరా అప్పుడు ఇవి చూస్తూ ఉంటాం. 

కొన్ని ప్రాంతాలలో దసరా పండుగ ముందు మూల నక్షత్రం రోజున సరస్వతీ పూజలు చేస్తారు కదా ఆరోజు నుండి దసరా వరకు బొమ్మల కొలువుని ఉంచుతారు. మరికొంతమంది దసరా నవరాత్రులు అంటే 9 రోజులు ఉంచుతారు.  

మరికొన్ని ప్రాంతాలలో భోగి, సంక్రాతి, కనుమ ఈ మూడు రోజులలో బొమ్మలకొలువుని ఉంచుతారు.

మా చిన్నప్పుడు మేము బొమ్మలకొలువుని పెట్టేవాళ్ళం. అప్పట్లో ఇప్పుడు ఉన్నన్ని సౌకర్యాలు అందుబాటులో లేక ఫోటోలు తీసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ఈ భాగ్యనగరంలో లక్ష్మీ పద్మజగారు బొమ్మలకొలువుని చూడగానే గతస్మృతులు గుర్తుకు వచ్చాయి. ఈవిధంగా బొమ్మలని సర్దుకొని పేరంటాలని పిలవటం, అది పిల్లలు చేసే పనులు. కానీ పద్మజగారికి ఒక పాప ఉంది. ఆ పాపకంటే ఆమెకే బొమ్మలని సర్దటం అంటే చాలా ఆసక్తి ఎక్కువ అని చెప్పుకోవాలి. ఆమెకున్నంత ఓపిక, సహనం ఇంకెవ్వరికీ లేదనే చెప్పొచ్చును. ఒక సంవత్సరం వారి ఇంటికి వెళ్ళి బొమ్మలకొలువు చూసివచ్చినవాళ్ళు మళ్ళీ సంక్రాతి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడక మానరు. ఆమె అంత అందంగా, ఆకర్షణీయంగా అమరుస్తారు బొమ్మల్ని. 

ఈ క్రింద ఉన్న Article లో ఆమె బొమ్మలకొలువు గురించి ఎన్ని విషయాలు చెప్పారో మీరే చదవండి ....                           


సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారత దేశం
మన ఆచార సంప్రదాయాలను విడిచి
పాశ్చాత్త్యా నాగరికతవైపు పరుగులు తీస్తున్నది యువతరం
కానీ ఇంకా ఎక్కడో ఒక చోట మన సంస్కృతికి
సంప్రదాయాలకు పెద్ద పీట వేసే కుటుంబాలు
ఇంకా ఈ రోజుల్లో వున్నాయండోయ్
అలాంటి కుటుంబాల్లో మాది కూడా ఒకటండీ
ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకోగలను సుమా
ఎందుకంటే కొన్ని సంప్రదాయాలను మేము తు ,, చ ,,
తప్పకుండా పాటిస్తున్నాము కాబట్టి 
తెలుగు వారికి ముఖ్యమైన పండుగలు ,, ఉగాది ,,, ,,,శ్రీ రామ నవమి ,,,,
వరలక్ష్మి వ్రతం ,,,శ్రీ కృష్ణాష్టమి ,,,, వినాయక చవితి ,,,, దసరా ,, దీపావళి ,,,, సంక్రాంతి ,,, మొదలుగునవి. 


తెలుగు వారికి ఇన్ని పండగలు వున్నా ,, వీటిలో కొన్నిటిని చాలా పద్దతిగా ,, ఘనంగా ,, సరదాగా ,, ఎంతో ఇష్టంగా చేసుకుంటాము ,,
అలాగే పిల్లలు పెద్దలు ఉత్సాహంగా చేసుకునే పండగలు ,, దీపావళి మరియు సంక్రాంతి. 
ఈ రెండిటిలో కూడా సంక్రాంతి అందరికీ ,, అన్ని వయసుల వారికి ఎంతో సరదా అయినా పండగ. 

సంక్రాంతి సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు ,,కోడి పందాల పోటీలు జరుగుతాయి ,, ఇవి పెద్దలకి ఇష్టం.
అలాగే గాలిపటాలు ఎగరేయడం ,, ఇది పిల్లలకి ఇష్టం.
కొత్త బియ్యంతో పొంగళ్ళు ,, అరిసెలు చేయడం ఆడవారికి ఇష్టం
ఇలాగా అన్ని వయసుల వారికి ఎదో ఒక ఆనందాన్ని ఇచ్చే పండగ సంక్రాంతి ...
సంక్రాంతి నెలలో సంకురుమయ్య అనే దేవదూత భూమి మీద పర్యటిస్తారు అని
ప్రతీతి. 


ఈ సంకురుమయ్య ప్రతి సంవత్సరం ఒక్కొక్క వాహనం పై వస్తాడు అని భావిస్తారు ,, పంచాంగకర్తలు ఈ సంకురుమయ్య ఆగమన ఆధారంగా కొన్ని సంవత్సర ఫలితాలను గణిస్తారు. 

ఉదాహరణకి : ఎద్దు వాహనం పై వస్తే ఈ ఏడాది పంటలు బాగా పండుతాయి అని
----------------- నర వాహనం పై వస్తే నరులకి అనగా మానవులకి కొద్దీ పాటి అరాచకాలు సంభవిస్తాయని ఇలా ఫలితాలు గణిస్తారు ,,, అలాగే అగ్ని మీద వస్తే అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి అని ,,, ఇలా ఇలా ఎన్నో. 

సంక్రాంతి 3 రోజుల పండగ
మొదటి రోజు ,,,,,, భోగి
రెండవ రోజు ,,,సంక్రాంతి
మూడవ రోజు ,,, కనుమ


భోగి రోజు తెల్ల వారు ఝామున ఇంట్లోని చెత్త చెదారంతో మంట వేస్తారు
జనవరిలో వాతావరణం కొంచెం చల్లగానే ఉంటుంది కదండీ
ఈ భోగి మంట చుట్టూ నుంచుని అందరూ చలి కాచుకుంటారు
దీనివల్ల ఇరుగు పొరుగు వారితో పరిచయాలు ఏర్పడతాయి
పొరుగు వారితో తమ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది



పంటలు కోసిన తర్వాత పొలంలో చెత్త ,,,
సీతాకాలంలో ఆకులు రాలిన చెత్త ఇవన్నీ శుభ్రం
చేయడానికి కూడా భోగి మంట ఉపయోగ పడుతుంది ,,
హిందూ మతం లో వున్న ప్రతి పండగకి
ఒక కథ ,, ఒక మూఢ నమ్మకం ఉంటాయి
అలాగే మరికొంత లోతుగా ఆలోచిస్తే
ఒక శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంటుంది


ఇక్కడ భోగి మంట వలన పరిసరాలు శుభ్ర పడతాయి ,,,,మరియు
ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడతాయి


భోగి రోజు ,, పొలం లో ఉపయోగించే అన్నీ పరికరాలను పూజిస్తారు
నాగళ్లు ,,, అరకలు,,, గాడి ,, మాను ,,,ఎద్దుల బళ్ళు ,,,అలాగే ఎద్దులని కూడా ,,,
ఇవన్నీ కూడా సక్రమంగా పని చేయడం వల్లనే పంటలు బాగా పండుతాయి కదా
అందుకే దైవసమానంగా భావించి పూజిస్తారు. 

పల్లెటూర్లలో గంగిరెద్దుల వాళ్లు,, హరిదాసులు భిక్షాటనకు వస్తారు ,, హరి దాసు హరినామ సంకీర్తన చేస్తూ బిక్షాటన చేస్తాడు
భోగి రోజు కొత్త కుండల్లో పాలు పొంగించి పొంగళ్ళు వండి దేవుడికి నైవేద్యం పెడతారు. 

ఇక రెండవ రోజు ని సంక్రాంతి అంటారు 
సంక్రాంతి రోజు పిండి వంటలు వండి లక్ష్మి నారాయణులకి పూజ చేస్తారు,,
బంధు మిత్రులతో కలిసి భోజనం చేస్తారు


ఇక మూడవ రోజు కనుమ
కనుమ రోజు మినుము తినాలి అంటారు పెద్దలు
మినుము అనగా మినపప్పు
కనుమ రోజు మినపప్పు తో చేసిన వండిన పదార్ధం తినాలని పెద్దలు అంటారు
దీనికి కూడా ఒక శాస్త్రీయ ప్రయోజనం వుంది
మినుము ,, ఇనుము తో సమానం అని మన శాస్త్రవేత్తలు అన్నారు
సంవత్సరమంతా శ్రమపడి రైతు పొలం దున్ని,,, నారు పోసి,,,, నీరు పోసి,, మంచి పంట పండిస్తారు ,, సంక్రాంతి నాటికీ పంట కోతకి వచ్చాక ,, పంట కోసి , అలసి పోయి ఉంటాడు ,, కనుమ అయిన మర్నాటి నుండీ మళ్ళీ పొలం పనులకి వెళ్లాలంటే శక్తి కావాలి ,, కాబట్టి మినుము తినండి ,, ఇనుము లా వుండండి అని పెద్దలు సెలవిచ్చారు. 


పూర్వ కాలం లో ఆడపిల్లలని ఇంటి నుండీ బయటకి పంపించేవారు కారు ,,, ఆడపిల్లని జ్ఞానవంతురాలిని చేయడానికి ఈ బొమ్మల కొలువు ఒక మార్గం
ఎలా అంటే బొమ్మల కొలువులో ప్రధానంగా దేవుడి బొమ్మలు ,, మానవుల బొమ్మలు ,, జంతువుల బొమ్మలు ,,, వుంటాయి ,, పూర్వ కాలంలో తిరునాళ్ల లో ,, జాతరలలో బొమ్మలు అమ్మే వారు ,, అలాగే తీర్ధ యాత్రలకు వెళ్లిన పెద్ద వాళ్ళు తమ ఇళ్లల్లోని చిన్న పిల్లల కోసం బొమ్మలు కొని తెచ్చి ఇచ్చేవారు. 


ఇలా కొని తెచ్చిన బొమ్మలు పిలల్లకి చూపించి వాటి గురించి వివరాలు,, చరిత్ర పెద్ద వాళ్ళు చెప్పే వారు అందులో చిన్న,, చిన్న పాటలు,,,, పద్యాలు కూడా నేర్పే వారు
ఉదాహరణకి ::: రాముడు ,, సీత ,, లక్ష్మణుడు ,, హనుమంతుడు ,, బొమ్మలు చూపెట్టి రామాయణం గురించి చెప్పేవారు ,,,ముందుగా ఏక శ్లోకి రామాయణం నేర్పించేవారు ,, ఒక్క శ్లోకంలో రామాయణ సారం పిల్లలకి అవగాన అయ్యేది ,,,
మా బామ్మ గారు కూడా నాకు ఇలాగే నేర్పారు సుమా,, ఆ శ్లోకం నాకు ఇంకా గుర్తు వుంది ,,,,
ఆదౌ రామ తపోవనాది గమనం
హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం
జఠాయు మరణం
సుగ్రీవ సంభాషణం
వాలి నిగ్రహణం
సముద్ర తరుణం
లంకాపురీ దహనం
పాస్చాద్రావణా కుంభ కర్ణ హననం
ఏతత్ ఇతి రామాయణం

అలాగే ఏనుగు ,, అంబారీ , గురించి చెప్తూ
ఏనుగమ్మ ఏనుగు
ఎంతో చక్కని ఏనుగు
మా ఊరొచ్చింది ఏనుగు
ఏనుగు మీద దేవుడు
ఎంతో చక్కని రాముడు


అని చిన్న చిన్న పాటలు నేర్పించే వారు
కృష్ణుడి బొమ్మ చూపించి
ఏక శ్లోకి భాగవతం చెప్పేవారు
ఆదౌ దేవకీ దేవి గర్భ జననం
గోపి గృహే వర్ధనం
మాయా పూతన జీవితాపహరణం
గోవర్ధనోధ్ధారణం
కంస ఛేదన కౌరవాది హననం
కుంతీ సుతా పాలనం
ఏతద్భాగవతం పురాణ కధితం
శ్రీ కృష్ణ లీలామృతం

దశావతారాలు ,,, ఈ బొమ్మల చూపెట్టి ఆయా అవతారాల పేర్లు చెప్పేవారు పెద్దలు
ఇలా చెప్పడం వలన అతి పిన్న వయసులోనే పిలల్లకి
పురాణాలు ఇతిహాసాలు గురించి అవగాహన కలుగుతుంది
ఇలా బొమ్మల వలన అనేక విధాలా జ్ఞానం వస్తుంది
ఇది ఇంట్లో వచ్చే పరిజ్ఞానం
మరి సమాజం గురించి ఎలా తెలుస్తుంది ??
అందుకే పెద్దలు దానికి ఒక ఉపాయం కనిపెట్టారు
అదే బొమ్మల కొలువు 


మన భారతీయులకి పూర్వం శాస్త్రీయంగా చెప్తే నమ్మే వారు కాదు

ఆచరించేవారు కాదు,,,, అందుకే ప్రతి పని కి ఒక మూఢ నమ్మకం జత చేసి చెప్పేవారు
అలాగే బొమ్మలు అనేవి మన ఇంటికి లక్ష్మీ దేవికి ప్రతి రూపాలు ,,
ఈ బొమ్మలని ఒక పద్దతిలో ,, వరుస క్రమంగా పెట్టి వాటికీ పూజ చేసి పిండి వంటలు నైవేద్యం పెట్టాలి అని ఆచారం పెట్టారు ,,
అలాగే ఇంట్లోని ఆడ పిల్లలకి మన ఇరుగు పొరుగు ఇళ్లల్లోని పిల్లలు ఎవరు ?
పెద్దలు ఎవరు ? తెలియా చేయడానికి బొమ్మల కొలువు పేరంటం అనే ఆచారం పెట్టారు ,, అనగా ,,,, మన ఇంటిలోని బొమ్మలు ఒక వరుస క్రమం లో పెట్టి వాటికి పూజ చేసి ఇరుగు పొరుగు ఇళ్లల్లోని ఆడవారిని ,, పిల్లలను పిలిచి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చే అలవాటు పెట్టారు
ఈ ఆచారం వలన మన ఇంట్లో పిల్లలకి తమ చుట్టూ ప్రక్కల ఇళ్లల్లోని పిలల్లతో పరిచయాలు స్నేహాలు పెంపొందేవి
అలాగే బొమ్మలలో ఎద్దుల బండి ,, గుర్రం బండి ,,, సైకిల్ ,, రిక్షా ,, ఆటో ,,, కార్,, విమానం ,,, రాకెట్ ,, మొదలైనవి ,,
ఇందులో ఏవి సరుకు రవాణాకు ఉపయోగ పడతాయి
ఏవి ప్రజల రవాణాకు ఉపయోగ పడతాయి అనేది కూడా పిల్లలకి తెలుస్తుంది
మరియు మనం సాంకేతికంగా ఎలా అభివృద్ధి చెందామో కూడా అర్ధం అవుతుంది
రవాణా మార్గాలు కూడా తెలుస్తాయి
రోడ్ రవాణా ,,రైలు రవాణా ,,,, రిక్షా ,, ఆటో ,, కార్ ,, బస్ ,, లారీ ,,,
వాయు రవాణా ,, విమానం
జల రవాణా ,, తెప్పలు,,, నావలు ,,స్టీమర్లు ,, నౌకలు మొ : నవి
ఇలా బొమ్మల కొలువు వలన పురాణ పరంగా ఉపయోగపడినా
పడక పోయినా ,, శాస్త్రీయ పరంగా ,, జ్ఞాన పరంగా చాలా ఉపయోగ పడుతుంది
ఈ బొమ్మల కొలువు అనే ఆచారం ఒక్కొక్క ప్రాంతం లో ఒక్కో పండగకి జరుపుతారు

ఉదాహరణకి : గుంటూరు జిల్లా లో సంక్రాంతికి ఇళ్లల్లో బొమ్మల కొలువు పెడతారు
-------------------- తెలంగాణ ప్రాంతం లో దీపావళికి బొమ్మల కొలువు పెడతారు
ఇక తమిళనాడు లో దసరా కి పెడతారు
మిత్రులారా మన ఆచారాలను సంప్రదాయాలను మూఢ నమ్మకాలు గా పరిగణించకండి ,, వాటి కి మూలాధారమైన శాస్త్రీయ కారణాన్ని గమనించి పిల్లలకి బోధించండి ,,
మంచి ఉదాహారణలతో వివరిస్తే చిన్న పిల్లలు త్వరగా గ్రహిస్తారు
శాస్త్రీయ పరంగా నేర్పిస్తే పిల్లలు వాటిని ఆచరించడానికి ఉత్సుకత చూపిస్తారు.   

(By ..... లక్ష్మీ పద్మజ.దుగ్గరాజు)