Showing posts with label సాంప్రదాయపు పాటలు. Show all posts
Showing posts with label సాంప్రదాయపు పాటలు. Show all posts

April 17, 2024

అలనాటి సంప్రదాయపు పాట

శ్రీరాముడిని పెళ్ళికొడుకును చేసేటప్పుడు పాడే పాట 


సీతాదేవిని పెళ్ళికుమార్తెను చేసేటప్పుడు పాడే పాట 


శ్రీ సీతారామ కళ్యాణము చూతము రారండి 


శ్రీరామ పట్టాభిషేకం పాట 


ఆశీర్వచనం 


January 25, 2020

బొమ్మలకొలువు సంప్రదాయపు పాట

బొమ్మలకొలువు సంప్రదాయపు పాట 

రండమ్మా రారండమ్మా బొమ్మలకొలువు పేరంటానికి 
పసుపుకుంకుమల ఫలాలు నొంది పాపాల దీవింప రారమ్మ 
మా పాపాల దీవింప రారమ్మ .....  రండమ్మా రారండమ్మా 

వెన్నతినే చిన్ని కృష్ణుడు వేణువునూదే లీలాకృష్ణుడు
మత్స్య కల్కాది అవతారాలు అర్థనారీశ్వర రూపాలు  
llరండమ్మా రారండమ్మాll  

లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు 
భువిలో సంక్రాతి వేడుక చూడ  దివినించి భువికేగి యున్నారు 
ll రండమ్మా రారండమ్మాll  

పురివిప్పిన నెమళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు 
ఠీవిగ నిలిచిన సింహాలు భీతిని గొలిపే పులులు 
సజీవతకు సాక్ష్యాలు చెబితేనే అవి బొమ్మలు 
llరండమ్మా రారండమ్మాll 

January 19, 2020

ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణయ్యా

ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణయ్యా....ఎప్పుడో నా చిన్నప్పటి పాట

ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణయ్యా నీ ఆటల పాటలు స్మరించుటే నా కానందమురా నామాదికానందమురా ll నీ నవ్వు అమృతము కురిపించురా కృష్ణా నీ చూపు నా మేను మరపించురా కృష్ణా కృష్ణా ఓ కృష్ణా నీపేరే మధురమురా ll మా ఇండ్లలోన ప్రవేసించరా కృష్ణా మా కళ్లలోన ప్రకాసించరా కృష్ణా కృష్ణా ఓ కృష్ణా మా పల్లెను వీడకురా కృష్ణా ll నీ చెలిమి మా పూర్వపుణ్యంబురా కృష్ణా నీ కలిమి సౌభాగ్యమిళితమ్మురా కృష్ణా కృష్ణా ఓ కృష్ణా మా నోములపంటవురా కృష్ణా ll



December 10, 2016

సుబ్భి గొబ్బెమ్మ సుబ్బడినివ్వవే

సుబ్బి గొబ్బెమ్మ  సుబ్బడినివ్వవే


సుబ్బి గొబ్బెమ్మ సుబ్బడి నీయ్యవే
అరటి పండు వంటి అమ్మ నీయ్యవే
నారింజ కాయంటి నాన్న నీయ్యవే
బంతిపువ్వంటి బావనీయ్యవే
తామరపువ్వంటి తమ్ముడినీయ్యవే
చేమంతి పువ్వంటి చెల్లెలినీయ్యవే
 అరటి పువ్వంటి అన్నయ్యనీయ్యవే
మల్లె పువ్వంటి మామనీయ్యవే
మొగలి పువ్వంటి మొగుడినీయ్యవే


January 15, 2016

సంక్రాంతి వచ్చింది, సందళ్ళు తెచ్చింది గొబ్బియల్లో

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో

సంక్రాంతి వచ్చింది, సందళ్ళు తెచ్చింది
గొబ్బియల్లో గొబ్బియల్లో  ll గొబ్బిll

చెలియలంతా గూడి గొబ్బియల్లో
చేరువైతిరమ్మ గొబ్బియల్లో ll గొబ్బిll

ముగ్గుల్లు పెట్టిరి ముచ్చట్లు చేసిరి
గొబ్బియల్లో గొబ్బియల్లో  ll గొబ్బిll

రంగవల్లులు దిద్ది  గొబ్బియల్లో
రత్నకాంతులు నింపిరి గొబ్బియల్లో ll గొబ్బిll

భోగిమంటల వెలుగు, పొంగళ్ళ తీపి
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

పసుపు కుంకుమ పెట్టి గొబ్బియల్లో
పగడపూలు పెట్టి గొబ్బియల్లో ll గొబ్బిll

గన్నేరు పూవులు గౌరీదేవికి పెట్టి
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

పందిట్లో ఆడిరి గొబ్బియల్లో
పడుచులంతా కలసి గొబ్బియల్లో ll గొబ్బిll

గుడిలోని గంటలు ఓంకార నాదాలు
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

హరిదాసు పాటలు గొబ్బియల్లో
గంగెద్దు ఆటలు గొబ్బియల్లో ll గొబ్బిll

పచ్చని పైరులు పాడిపంటలు నిండు
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

ఊరువాడలెల్ల గొబ్బియల్లో
పరవసించేనమ్మ  గొబ్బియల్లో ll గొబ్బిll

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll





October 19, 2015

"బతుకమ్మ"

"బతుకమ్మ"
-----------------
రచన: డా. ఆచార్య ఫణీంద్ర
------------------------------------
బ్రతుకునిడు ప్రకృతిని ’బతుకమ్మ తల్లి’గా
ఎంచెడు తెలగాణ యింతులెల్ల
భక్తి గొలిచి, ఆడి, పాడి మురియుచుంద్రు!
ప్రకృతి పూజ సలుపు పండుగిదియ!

గునుగు, తంగేడు వంటి పూలను వరించి,
ఏర్చి, కూర్చి, తెలంగాణ యింతి పేర్చి,
అమిత సుందరమ్ముగ ’బతుకమ్మ’ దీర్చి,
ప్రకృతికిటుల ’సీమంతము’ వరలజేయు!

అంగనలు గూడి యాడుట
సింగారించుకొని పట్టు చీరలు, రవికల్,
బంగారు నగల తోడన్ –
సాంఘిక సహజీవన ఘన సంస్కృతి గాదో!

భారత సంప్రదాయ ఋజువర్తన రీతులు, నీతి, ధర్మముల్,
పేరిమి గొన్నయట్టి ఘన వీర కథా కమనీయ భావముల్
కూరిచినట్టి దివ్య రస ఘోషితమౌ ’బతుకమ్మ పాట’లన్
నేరిచి యాడి పాడెదరు నెచ్చెలులై తెలగాణ జవ్వనుల్!

చెరువులం దౌషధగుణ మలరు సుమాల
చేర్చి, ప్రక్షాళనము సేయు శ్రేష్ఠమైన
శాస్త్ర దృక్పథమ్ము గలుగు సంస్కృతిదియ!
జయమిదె తెలగాణ సంస్కృతికిని!


బతుకమ్మ కోల్

బతుకమ్మ కోల్

బతుకమ్మ కోల్
బతుకమ్మ బతుకమ్మ కోల్
బంగారు గౌరమ్మ కోల్
తంగేడు పూలలో కోల్
తల్లి గౌరమ్మ కోల్

మా ఊరు సందునా కోల్
మామిళ్ల కిందా కోల్
బాలలంతా కూడి కోల్
బతుకమ్మ ఆడంగా కోల్

ఆడవారి అక్కమ్మ కోల్
ఆటకు బయలెల్లే కోల్
చుక్క చంద్రుడు కోల్
చూడ బయలెల్లే కోల్.


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్రామవాస ఉయ్యాలో

బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగా ఉయ్యాలో
ముందు నిన్ను దలుతు ఉయ్యాలో
ముత్యాల పోసవ్వ ఉయ్యాలో

హరిని దలిచినాను ఉయ్యాలో
సిరిని దలిచినాను ఉయ్యాలో
పూడూరు ఎల్లమ్మ ఉయ్యాలో
నీకు దండవమ్మ ఉయ్యాలో

బోడగుట్ట సామి ఉయ్యాలో
నీకు మొక్కితినయ్య ఉయ్యాలో
మొక్కినా వారికి ఉయ్యాలో
తోడు నీడ గుండు ఉయ్యాలో

గౌరమ్మ నీ పాట ఉయ్యాలో
ఘనకీర్తి దెచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ నీ పాట ఉయ్యాలో
బ్రహ్మదేవుడు మెచ్చె ఉయ్యాలో

తీరొక్క పూలతో ఉయ్యాలో
నిన్ను వేర్తువమ్మ ఉయ్యాలో
పస్పు కుంకుమతోని ఉయ్యాలో
గౌరమ్మను జేసి ఉయ్యాలో

బతుకమ్మలో వెట్టి ఉయ్యాలో
ఆడి పాడుకుంట ఉయ్యాలో
అష్టమీ రోజున ఉయ్యాలో
ఊరి సెర్ల నిన్ను ఉయ్యాలో
భక్తితోడ విడిచి ఉయ్యాలో

బాధ పడుదుమమ్మ ఉయ్యాలో
ఇచ్చుకో వాయినమూ ఉయ్యాలో
పుచ్చుకో వాయినమూ ఉయ్యాలో
ఆడిబిడ్డలకైతే ఉయ్యాలో
ఆనందమాయెనే ఉయ్యాలో
తెలంగాణలోన ఉయ్యాలో
కొండంత పండుగే ఉయ్యాలో.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగా రు బతుకమ్మ ఉయ్యాలో…
ఆనాటి కాలయన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో…
ఆ రాజు భార్యయు ఉయ్యాలో.. అతి సతావతియండ్రు ఉయ్యాలో…

నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో…
వారు సూరులైరి ఉయ్యాలో… వైరులచెహతమైరి ఉయ్యాలో…

తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో...
దన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయాదులను బాసె ఉయ్యాలో...

వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించె ఉయ్యాలో...
కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… గనత పొందిరిక ఉయ్యాలో...

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడిగెనే ఉయ్యాలో...
వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో..

పుట్టమని వేడగ ఉయ్యాలో... పూబోణి మది మెచ్చి ఉయ్యాలో...
సత్యవతి గర్భమున ఉయ్యాలో...జన్మించె శ్రీలక్ష్మి ఉయ్యాలో...

అంతలో మునులును ఉయ్యాలో... అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..
కపిల గాలిలా ఉయ్యాలో... కష్యపాంగా ఋషులు ఉయ్యాలో..

అత్రి వశిష్టులు ఉయ్యాలో... ఆగండ్రి నను చూచి ఉయ్యాలో..
బతుకనీయ తల్లి ఉయ్యాలో... బతుకమ్మ ననిరంత ఉయ్యాలో..

పిలుపుగా అతివలు ఉయ్యాలో... ప్రేముగా తల్లిదండ్రులు ఉయ్యాలో..
బతుకమ్మ యను పేరు ఉయ్యాలో... ప్రజలంతా అందురు ఉయ్యాలో...

తానూ ధన్యుడంటూ ఉయ్యాలో... తన బిడ్డతో రాజు ఉయ్యాలో...
నిజపట్నము కేగి ఉయ్యాలో... నేల పాలించగా ఉయ్యాలో...

శ్రీమహా విష్ణుండు ఉయ్యాలో... చక్రాంగుడను పేరు ఉయ్యాలో…
రాజు వేషంలోన ఉయ్యాలో... రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో…

ఈ ఇంట మనిమందు ఉయ్యాలో... ఎతగా బతుకమ్మను ఉయ్యాలో…
పెండ్లాడి కొడుకును ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో…

ఆరు వేల మంది ఉయ్యాలో... అతి సుందరాంగులు ఉయ్యాలో…
దర్మాంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో…

సరిలేని గరిమతో ఉయ్యాలో... సంతోమొందిరి ఉయ్యాలో..
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో... శశాస్వతముగా వెలిసే ఉయ్యాలో..

.
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో... శశాస్వతముగా వెలిసే ఉయ్యాలో...
ఏ పాట పాడినను ఉయ్యాలో… ఏ పాట విన్నను ఉయ్యాలో…

సౌభాగ్యముల నిచ్చు ఉయ్యాలో… శ్రీగౌరీదేవి ఉయ్యాలో…
సిరి సంపదల నిచ్చు ఉయ్యాలో... శ్రీ లక్ష్మి దేవి ఉయ్యాలో...

ఘనమైన కీర్తిని ఉయ్యాలో... శ్రీవాణి కొసగును ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…


March 28, 2014

కలవారికోడలు కలికి కామాక్షి

కలవారికోడలు కలికి కామాక్షి

(కొత్తగా పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిన చెల్లెల్ని పుట్టింటికి తీసుకురావటానికి, ఆమె పెద్దఅన్నయ్య చెల్లెలి యొక్క ఇంటికి వెళ్ళగా, చెల్లెల్ని పుట్టింటికి తీసుకువచ్చేటప్పుడు పాటించే సంప్రదాయము గురించి ఈ పాట మనకు తెలియజేస్తుంది.)

కలవారి కోడలు -- కలికి కామాక్షి
కడుగుతున్నది పప్పు -- కడవలోపోసి

అప్పుడే వచ్చెను --ఆమె పెద్దన్న
కాళ్ళకూ నీళ్ళిచ్చి -- కన్నీరు నింపే

ఏడవకు ఓ చెల్లి --ఏడవకు నా తల్లి
తుడుచుకో కన్నీరు -- ముడుచుకో కురులు

పుట్టింటికే నిన్ను --- తీసుకెళతాను
నీ అత్తమామలను -- అడిగిరావమ్మ

పట్టె మంచము మీద --- పడుకున్న ఓ మామ
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- నీ అత్తనడుగు

పెద్దపీట మీద కూర్చున్న --- ఓ అత్తా
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- మీబావనడుగు

భారతం చదేవేటి --- ఓ బావగారు
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- మీ అక్కనడుగు

వంటలు చేసేటి --- ఓ అక్కగారు
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- నీ భర్తనడుగు

రచ్చలో కూర్చున్న --- రాజేంద్ర భోగి
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

కట్టుకో బట్టలు --- పెట్టుకో నగలు
పుట్టినింటికి వేగ --- పోయి రావచ్చు.


తులసితల్లికి నమస్కరిస్తూ పాట

తులసితల్లికి నమస్కరిస్తూ పాట

శ్రీ తులసితల్లీ జయమంగళం
శుభముల నొసగి మా కభయ మోసంగుమమ్మా

శ్రీహరికే నీవు ప్రియమాలికవైనావు
భక్తులెల్లరిని పరిపాలించు ఓ జననీ

ఇహపరాలకు నీవు ఏలికవైనావు  
కల్పతల్లివి మమ్ము కరుణించు పావనీ

శ్రీతులసీ మహాలక్ష్మీ నెలవైన లోగిళ్ళు
సిరిసంపదలతో తులతూగు వెయ్యేళ్ళు


February 2, 2014

పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా!

పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా!

రచన -- గురజాడ అప్పారావుగారు 

మేలిమి బంగరు మెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లులగన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథనూ.

ఆటల పాటల పేటికలారా
కమ్మనిమాటల కొమ్మల్లారా
అమ్మలగన్న అమ్మల్లారా
విన్నారమ్మా మీరీ కథనూ.

కొండలనడుమన కోనొకటుంది
కోనకి నడుమా కొలనొకటుంది
కొలనిగట్టున కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పూవులు కొసేది.

ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరుదుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.

పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములన్
అంగములందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్. 

కాసుకులోనై తల్లితండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
ఒక ముదుసలి మొగుడుకి ముడివేసిరి.

ఆమని రాగా దుర్గాకొలనులో
కలకల నవ్వెను తామరులు
ఆమని రాగా దుర్గవనములో
కిలకిల పలికెను కీరములు.

ముద్దు నగవులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాతయని కేలించ,
ఆటలపాటల కలియక పూర్ణమ్మ
దుర్గనుచేరి దు:ఖ్ఖించే.

కొన్నాళ్ళకు పతి కొనిపోవొచ్చెను
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను
చీరలు సొమ్ములు చాలగదెచ్చెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు.

పసుపు రాసిరి బంగారు మేనికి
జలకములాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కైచేస్రీ..  

పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ్మ
తల్లిదండ్రి దీవించ్రి
దీవెన వింటూ పక్కున నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.

చిన్నలనందర కౌగిట చేర్చుకు
కంటనుబెట్టెను కన్నీరు
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.

"అన్నల్లారా! తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండి
బంగరు దుర్గను భక్తితొ
కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ.

ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ
భక్తిని తెచ్చీ శక్తికి ఇవ్వం
డమ్మలకమ్మా దుర్గమ్మ.  

నలుగురు కూర్చుని నవ్వేవేళల
నాపేరొకపరి తలవండి
మీమీ కన్నబిడ్డలనొకతెకు
ప్రేమను నాపేరివ్వండి."

బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు
కన్నులుతుడుచుకు కలకల నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.

వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టెన్
కాసుకులోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడే!

ఎప్పటియట్టుల సాయంత్రమ్మున
ఏరిన పూవ్వులు సరికూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
ఒంటిగబోయెను పూర్ణమ్మ.

ఆవులు పెయ్యలు మందలుజేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
పూర్ణమ్మ ఇంటికిరాదాయె.

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ్మ ఇంటికి రాదాయె. 

కన్నులకాంతులు కలవలచేరెను
మేలిమిజేరెను మేని పసల్
హంసలజేరెను నడకల బెడగులు
దుర్గనుజేరెను పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.


January 7, 2014

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా 

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా 
పచ్చిపాల మీద మీగడలేవి? 
వేడిపాల మీద వెన్నల్లు యేవి? 
నూనెముంతల మీద నురగల్లుయేవి ?

అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త 
పచ్చిపాలమీద మీగడుంటుందా? 
వేడిపాల మీద వెన్నలుంటాయా? 
నూనె ముంతల మీద నురగలుంటాయా?

ఇరుగు పొరుగులార ! ఓ చెలియలార !
అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా? 
పెత్తనం లాగేస్తే పేచీలుపోను 
ఆరళ్ళ అత్తయిన సవతి పోరయిన 
తల్లిల్లు దూరమైన భరియించలేము.

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ! 
కొడుకు ఊళ్ళోలేడు మల్లెలెక్కడివి?
గంపంత మబ్బేసి గాలి విసిరింది 
కొల్లలుగ మల్లెలు కొప్పులో రాలె.


భోగిపండ్ల పాట

భోగిపండ్ల పాట 

భోగిపండ్లను పోయరే - ఓ రమణులారా !
మన చిరంజీవులకు - మేలుకలుగగా  ll భోగి ll

విఘ్నేశ్వరుడు వచ్చి - విఘ్నాలు తొలగింప
షణ్ముఖనాధుడు వచ్చి - శాస్త్రాలు వల్లింప
సాయిబాబా వచ్చి - ప్రేమార లాలింప  ll భోగి ll

బ్రహ్మదేవుడు వచ్చి - వేదాలు వల్లింప
విష్ణుదేవుడు వచ్చి వేదాలు వల్లింప
పరమేశ్వరుడు వచ్చి - ఆశీర్వదించంగా  ll భోగి ll

రామచంద్రుడు వచ్చి - రక్షణ చేయంగ
శ్రీకృష్ణుడే వచ్చి - శుభములు పలుకంగ
శ్రీవేంకటేశ్వరుడు - ఆశీస్సులందింప  ll భోగి ll

ఆంజనేయుడు వచ్చి - అభయాలనివ్వంగ
కులదేవతలు వచ్చి - కళాకాంతులివ్వంగ
తులసిదాసుడు వచ్చి - మంగళములు పాడంగ  ll భోగి ll


గొబ్బెమ్మ పాట

గొబ్బెమ్మ పాట 

గొబ్బియల్లో  గొబ్బియల్లో  గొబ్బియల్లో
మన సీతాదేవి వాకిటవేసిన గొబ్బియల్లో  ll గొబ్బిll

మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద మల్లెపూలు గొబ్బియల్లో  ll గొబ్బిll

నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద మొగలీపూలు గొబ్బియల్లో  ll గొబ్బిll

ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద సంపెంగలు గొబ్బియల్లో  ll గొబ్బిll

రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద మందారాలు గొబ్బియల్లో  ll గొబ్బిll

భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో  ll గొబ్బిll

లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియల్లో  ll గొబ్బిll





October 29, 2013

వీరగంధము తెచ్చినారము-వీరుడెవ్వడొ తెల్పుడీ

వీరగంధము తెచ్చినారము-వీరుడెవ్వడొ తెల్పుడీ

వీరగంధము తెచ్చినారము-వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము- మెడను వైతుము - పూలదండలు భక్తితో ||వీర||

తెలుగు బావుట కన్ను చెదరగ - కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తి దెబ్బలు - గండికోటను గాంచిచినప్పుడు ||వీర||

తెలుగు వారల వేడి వెత్తురు - తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున్న సహ్యాజ - కత్తి నెత్తురు కడిగినప్పుడు ||వీర||

ఇట్టి సందియ మెన్నడేనియు - బుట్టలేదు రవంతయున్
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు - లేకపోయిరి సుంతయున్ ||వీర||

నడుము కట్టిన తెలుగు బాలుడు - వెనుక తిరుగండెన్నడున్
బాస యిచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడున్||వీర||

ఇదిగో యున్నది వీర గంధము - మైనలందుము మైనలందుము
శాంతి పర్వము చదువవచ్చును - శాంతి సమరంబైన పిమ్మట ||వీర||

తెలుగు నాటను వీర మాతను - జేసి మాత్రము తిరిగి రమ్మిక
పలు తుపాకులు పలు ఫిరంగులు - దారికడ్డము రాక తప్పవు
వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వడో తెల్పుడీ  ||వీర||




July 12, 2013

హాయమ్మ హాయీ ఆపదలు గాయీ

హాయమ్మ హాయీ ఆపదలు గాయీ

ఉళుళుళు హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..ఉళుళుళు

చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాలు త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు

ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిట్టి ముత్యము పుట్టె సీత కడుపున
స్వాతి వానలు కురిసె సంద్రాల మధ్య..ఉళుళుళు

అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడా రార బుట్టల్లుకోరా
బుట్టలో బాబును పట్టుకొని పోరా
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేంఢ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు..
ఉళుళుళు ఆయమ్మబాయమ్మ
అక్కచెల్లెళ్ళు తొలి ఒక్క జన్మాన తోడికోడళ్ళూ




జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో

తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ
నాలుగూ వేదాల గొలుసులమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలుల డోలికలలొన చేర్చి లాలించీ..జో జో

ముల్లోకములనేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
ఈ జన్మలో నాకు బిడ్డలైనారూ..జో జో






April 22, 2013

శ్రీ కృష్ణ జోలపాట

శ్రీ కృష్ణ జోలపాట

ఊయలూగుమా కృష్ణ ఊయలూగుమా 
హాయిగా వినిపింతు జోల ఊయలూగుమా ll ఊయలూ ll 

లాలిగోపాలకృష్ణ లాలిగోవిందకృష్ణ 
లాలిమాపాలిదైవమా ఊయలూగుమా 
రేపల్లియే ఊయలైఊగగా 
గోపెమ్మ యెద జోలలై పాడగా ll ఊయలూ ll 

ఆనందమా నందుని ఇంట వెలిసే

జగమందు కనువిందగు లీలవెలిసే
నిన్నుగన్న తల్లి దేవకియే ధన్యము
ఎన్నిముద్దులు దీర్చే యశోదదే పుణ్యము
ఆనాటి అనుభూతి యదనిండని
ఈనాటి ఈసేవ నీకందని ll ఊయలూ ll