Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

June 11, 2024

మహిపతి దాసులు

 మహిపతి దాసులు 

"గాలి బందకైయల్లి తూరి కొళ్ళిరో" (గాలి వచ్చినప్పుడే తూర్పార బెట్టుకోండి). ఇది భక్త పురందరదాసుల వారి సందేశం. "దుర్లభ మానుషం జన్మ" అన్నట్లు శ్రేష్ఠమైన మానవజన్మ అంత సులభంగా రాదు. ఇలాంటి మానవజన్మ లభించినప్పుడు దానిని సార్థకం చేసుకోవటం ప్రతీ మానవుని ముఖ్య కర్తవ్యం. గృహస్తుగా ఉండి బీజాపుర నవాబు మన్నన పొందినవారై వుండి కూడా దైవ ధ్యానతత్పరులై నిరంతరం లోకకళ్యాణం కోసం శ్రమించి, అనేకులను ఉద్ధరించి, తమ జన్మను సార్థకం చేసుకున్న ఆదర్శ పురుషుడు మహిపతిదాసులు. ఈయన జీవితం మనకి మార్గదర్శకం.         

ఈ మహిపతిదాసుల గురించి నేను తెలుసుకున్నది, విన్నది మీకు తెలియచేస్తాను 

“మహిపతి దాసులవారు పుణ్యపురుషులు. ఆయన చరిత్ర చెప్పడంవలనా, వినడం వలనా పుణ్యం లభిస్తుంది. మన ప్రవర్తనని సక్రమంగా దిద్దుకోడానికి అవసరమైన నీతిసంపద ఆయన చరిత్రలో మనకి లభిస్తుంది. 

ఆ కాలంలో బాగల్ కోటలో 'కథావలె' వంశం ఎంతో ప్రసిద్ధంగా వుండేది. ఆవంశంలో రంగభట్టరు అన్నవ్యక్తి సత్ప్రవర్తనకీ, మంచితనానికీ పేరెన్నికగన్నవాడు. దైవభక్తి పరాయణుడు. పేదసాదలకి విరివిగా దానధర్మాలు చేసేవాడు. చిన్న వయస్సులోనే ఈయన కాశీయాత్ర చేసివచ్చి, బిజాపురంలో నివసించసాగాడు. ఈయనకు ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు కోనేరి రాయలు.

కోనేరిరాయలికి ఇద్దరు కొడుకులు. మొదటివాడు గురు రాయలు. రెండవకుమారుడు, మహిపతిరాయలు. మహిపతిరాయలు శాలివాహనశకం 1611 లో జన్మించాడు. (క్రీ. శ. 1681) కోనేరి రాయలు తన రెండవ కుమారుడికి ఉపనయనం చేయడానికి సంక ల్పించారు. తమ కులగురువైన కొల్హార వ్రహ్లాద కృష్ణాచార్యుల్ని పిలిపించి, కుమారుడి జాతకం చూపించాడు. జాతకాన్ని పరిశీలించిన ఆచార్యులు, సంతోషంతో ఇలా అన్నారు "రాయలుగారూ, మీ కుమారుడి గ్రహబలం చాలా ఉత్తమంగావుంది. అతను రాజవైభవంతో జీవిస్తాడు. గొప్పయోగిపుంగవుడిగా కీర్తిగడిస్తాడు! అని తెలియచేసారు. కోనేరిరాయలు ఎంతో సంతోషించాడు. విధిపూర్వకంగా కుమారుడి ఉపనయనం జరిపించాడు. ఆ తరువాత మహిపతిరాయల విద్యా భ్యాసం ప్రారంభమైంది.

కోనేరిరాయలు వైదిక విద్యాపారంగతుడు. బిజాపూర్ నవాబు ఆదిల్షా కూడా ఆయన్ని ఎంతగానో గౌరవించేవాడు.

తండ్రిదగ్గరే మహిపతిరాయలు విద్యను అభ్యసించసాగాడు. ఇతర విద్వాంసుల దగ్గరకూడా వేరువేరు శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. అనతికాలంలోనే గొప్పవిద్వాంసుడుగా రూపొంది తండ్రి లాగే కీర్తి సంపాదించసాగేడు. ఆరోజుల్లో ప్రచారంలో వున్న సంస్కృత, కన్నడ, హిందీ, మరాఠీ, ఉర్దూ, పార్శీ భాషలన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాలక్రమేణ పురాణ ప్రవచనంలో కూడా ఆరితేరాడు. ఆరోజుల్లో మహిపతిరాయల పురాణ ప్రవచనమంటే. ప్రజలు చెవికోసుకునేవారు. ఆయన పురాణ ప్రవచనం వినడానికి ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యేవారు.

ఆదిల్ షా కి 'ఖవానాఖాన్' అనేవ్యక్తి బిజాపుర నవాబు మంత్రిగా వుండేవాడు. ఒకరోజు అతను రాజభవనానికి వెళ్తూ, సమీపంలోని నృసింహ దేవాలయం ముందు, మహిపతిరాయల పురాణ ప్రవచనం వినడానికి చేరిన వేలాది ప్రజల్ని చూశాడు. విషయం తెలుసుకుని, అక్కడే నిలబడి పురాణం విన్నాడు. పురాణం ముగిశాక మహీపతిరాయలు అటుగా వచ్చారు. ఖవానాఖాన్ ఆయనకి నమస్కరించి, “రాయలు గారూ, మాఇంట్లో పురాణం చెప్తారా?" అని అడిగాడు. రాయలు సమ్మతించారు. నరసింహ దేవాలయంతోబాటు ఖాన్ ఇంట్లోకూడా పురాణ ప్రవచనం ప్రారంభమైంది. ఖాన్ ఇంట్లో శ్రోతలకి అర్థమయ్యేలా మహిపతిరాయలు, ఉర్దూ, పార్శీ భాషల్లో కూడా విషయాల్ని వివరించేవారు. ఆ కార్యక్రమాలకి వచ్చే అధికారులూ, ముల్లాలూ ఎంతో ఆనందించేవారు..

ఖవానాఖాన్ వ్యక్తిత్వం చూశారా! తను మహమ్మదీయుడైనా భారతీయుల జ్ఞానభాండాగారాలైన పురాణాల్ని శ్రద్ధగా విన్నాడు. ఇది ఉత్తమవ్యక్తుల లక్షణం. అన్యమత గ్రంథాల్లోని ఉత్తమ విషయాలను గ్రహించడంలో తప్పులేదు. "బాలాదపి సుఖం గ్రాహ్యం” — ఉత్తమ విషయాన్ని పిల్లలు చెప్పినా గ్రహించాలన్నదే భారతీయసిద్ధాంతం.

ఆ అధికారులూ, ముల్లాలూ మౌలాలూ అందరూ కలిసి మహీపతిరాయల పురాణ ప్రవచనం ప్రతిరోజూ జరిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత ఖవానాఖాన్ గృహంలో ప్రతి నిత్యమూ పురాణప్రవచనం జరగసాగింది.

దీనిమూలంగా ఖవానాఖాన్ కి మహిపతిరాయలపట్ల గౌరవ భావం పెంపొందింది. కొంతకాలం తరువాత ఆయన్ని తను కరణంగా నియమించాడు. మహిపతిరాయలు ఆ కార్యాన్ని కూడా సమర్థతతో నిర్వహించారు. కొన్ని మాసాల తరువాత ఆయనకి, ఆదిల్ షా నవాబును కలుసుకునే అవకాశం కలిగింది. నవాబు ఆయన దగ్గరున్న లెక్కపత్రాల్లో ఎక్కడో తప్పుదొర్లింది. కరణాలు, ఆ తప్పుని వెతికి, సరిదిద్దలేకపోయారు. నవాబు ఆ విషయాన్ని ఖవానాఖాన్ కి చెప్పాడు. “నాదగ్గరున్న కరణం మహిపతిరాయలు లెక్కలు సరిచూడ్డంలో ఆరితేరినవాడు ప్రభూ!” అని అన్నాడు ఖవానాఖాన్. నవాబు మహిపతిరాయల్ని పిలిపించాడు. ఆయన లెక్కల్లో దొర్లిన పొరపాటుని వెతికి సరిదిద్దాడు. నవాబు సంతోషించి, మహిపతిరాయలకి తనదగ్గరే ఉద్యోగం ఇచ్చాడు. ఆయన కార్యదక్షతని చూసిన నవాబు అచిరకాలంలోనే ఆయనని దివాన్ పదవిలో నియమించి గౌరవించాడు. ఆ విధంగా మహిపతి రాయలకీ రాజవైభవం సంప్రాప్తించింది.


ఆ సమయంలోనే కాలబుర్గి దేశముఖుల కుమార్తె తిరుమలాదేవితో ఆయనకి పెళ్ళిజరిగింది. ఆయన గృహం ధనధాన్యాలతో తులతూగుతూవున్నా, మహిపతిరాయలు ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపారు. దానధర్మాల పట్ల ఆయనకి ఎంతో ఆసక్తి. పేదసాదల్ని ఎల్లప్పుడూ ఆదరించేవారు. తిరుమలాదేవి కూడా భర్తకి తగ్గట్టు ధర్మబుద్ధి కలిగివుండేది.

బిజాపూర్ లో 'షానుంగ' 'షానుంగి' అనే ఇద్దరు అన్నాచెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళుగొప్పమహిమ కలిగిన వాళ్ళు. సూఫీమతసిద్ధాంతంలో అనుభవజ్ఞులైన నుంగ, నుంగి యోగ సిద్ధితో దివ్యశక్తుల్ని సంపాదించుకున్నారు. వాళ్ళు పలికిన మాట నిజమయ్యేది. వాళ్ళ స్వభావం విచిత్రమైంది. వాళ్ళెక్కడుంటారో ఎవరికీ తెలిసేదికాదు. అన్నం తింటే తింటారు; లేకుంటే లేదు.' గుడ్డలు ధరించేవారుకారు. వాళ్ళకి ఏ వస్తువుపట్లా అపేక్షవుండేది కాదు. లౌకికమైన భోగవస్తువులు దైవాన్నిపొందడానికి అడ్డంకులుగా వున్నందువల్ల, వాటిని విషంగా పరిగణించేవారు. హిందు వులూ, ముసల్మానులూ వాళ్ళని భయభ క్తులతో గౌరవించేవారు. 

నుంగి నుంగలు మన హిందువులుకారనీ, సూఫీ పంథాన్ని అనుసరించేవాళ్ళనీ మనం తిరస్కారభావంతో చూడకూడదు. మహాపురుషుల అవతారాలకి జాతి అడ్డురాదు. అన్ని జాతుల్లోనూ జ్ఞానులు అవతరించి వున్నారు. హరిదాసుల్లో శ్రేష్ఠుడైన కనకదాసు కురవజాతివాడు. కృష్ణుణ్ని మెప్పించి, నర్తనం చేయించిన మీరాబాయి రాజస్థాన్ రాజపుత్ర వంశానికి చెందింది. గాయత్రిదష్ట అయిన విశ్వామిత్రుడు క్షత్రియుడు. స్వయంగా భగవంతుడే తన ఒక్కో అవతారంలో ఒక్కో జాతిలో ప్రాదుర్భవించాడు. క్షత్రియకులంలో రాముడై అవతరించాడు. పరశురాముడుగా బ్రాహ్మణ కులంలో జన్మించాడు. కృష్ణుడుగా యాదవుల మధ్య జన్మించాడు. భగవంతుని ఆరాధనకూ, ఆదర్శజీవితం గడపడానికి ఏజాతివారైతేనేమి? 

"పరమాత్మను సర్వత్రా దర్శిస్తూ, పూజిస్తూ జీవించే వ్యక్తినేమి? అలాంటివాడు సర్వులకి గౌరవించ దగినవాడే ! - నుంగ, నుంగీ కూడా ఇలాంటివారే," 

ఈ అన్నాచెల్లెళ్ల మూలంగా మహిపతిరాయల జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. 

ఎలాగంటే! ఆ సమయంలో బిజపూర్ ప్రజల త్రాగునీటి సౌకర్యంకోసం 'బేగం తాలాబ్' అన్న చెరువు పని జరుగుతోంది. దివాన్ గా వున్న మహిపతిరాయలు ఆ చెరువు నిర్మాణ కార్యాన్ని పర్యవేక్షించడానికి వెళ్ళేవారు. ఒకరోజు ఆయన తిరిగి వస్తూండగా నుంగ ఎదురుగా వస్తూ, “అరే బేటా, ఇదర్ ఆ" ( అంటే ఒరే నాయనా, ఇలారా) అన్నాడు. మహిపతిరాయలు అతనికి దగ్గరగా వెళ్ళారు. 'నీచేతిలో ఏమివుంది ? ' అని అతను మహిపతి రాయల్ని అడిగాడు. ఆయన చేతికి రాజముద్రవున్న ఉంగరం వుంది. నుంగ ఆఉంగరాన్ని ఇమ్మని తీసుకుని, పక్కనేవున్న కందకంలోకి విసరివేశాడు: మహిపతిరాయలు గాబరాపడ్డారు. రాజముద్రవున్న ఉంగరం పోయిందంటే మరేమన్నా వుందా ? నవాబుకు తెలిస్తే ఏమిటిగతి? నుంగ రాయల ముఖాన్ని చూస్తూ, నవ్వుతూ నిలబడ్డాడు. ఇంతలో నుంగి అక్కడికి వచ్చింది. జరిగింది తెలుసుకుని ఆమెకూడా నవ్వసాగింది. 'పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం' అన్నట్టయింది రాయల పరిస్థితి.

"కందకం నీళ్ళలోంచీ ఉంగరాన్ని ఎవరైనా తేగలరా? అంటూ ఆయన నుంగనే ప్రశ్నించారు. అతను మాట్లాడకుండా నుంగి వైపు చూశాడు. వెంటనే నుంగి నీళ్ళలోకి దిగి, దోసిలి నిండా రాజముద్ర వున్న ఉంగరాలు తీసుకొచ్చింది. రాయల ముందు  దోసిలి వుంచి, ఆయన ఉంగరమేదో కనుక్కోమంది. ఆయనకి ఆశ్చర్యమూ, ఆందోళనా కలిగాయి. తన ఉంగరం ఏదో ఆయనకి గుర్తు చిక్కలేదు! అన్నీ ఒక్కలాగే వున్నాయి. అప్పుడు నుంగ,  "ఇదే నీ ఉంగరం!" అంటూ ఒక ఉంగరాన్ని తీసి, దాన్ని వాసన చూశాడు. మౌత్కాఘాణ, మౌత్కాఘాణ!" (అంటే "పీనుగ వాసన " అని అర్థం.) అని అరుస్తూ, ఉంగరాన్ని ఆయన ముందు పారేసి, పరుగెత్తి వెళ్ళిపోయాడు.

దివాన్ పదవీ, అధికారమూ - వీటివల్ల మానవుడు సంసార బంధంలో మరింతగా చిక్కుకు పోతాడు. అధికారాన్నీ, హోదానూ విడిచిపెట్టి, పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావడం మానవుని ముఖ్యకర్తవ్యం. ఈ సత్యాన్ని తెలియజేయడానికే ఉంగరాన్ని విసర్జించమని నుంగ రాయలకి సూచించాడు.

ఆరోజునుండి రాయలలో ఒక సంఘర్షణ ప్రారంభమైంది. నిజతత్వాన్ని తెలుసుకునే మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. అందుకే ఆయన అతనికోసం వెదకడం ప్రారంభించారు. ఒకనాటి సాయంత్రం రాయలు ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూవుంటే నుంగ మళ్ళీ కనిపించి, ఆయన్ని పిలిచాడు. రాయలు దగ్గరకెళ్ళి అతనికి నమస్కరించారు. “మీరే నాకు గురువులు. నాకు ఉపదేశం చెయ్యండి,” అని ప్రార్థించారు. నుంగ అంగీకరించకుండా, “నీకు నేను గురువును కాను. సారవాడలోని భాస్కరస్వామివారిని కలుసుకో. ఆయనే నీకు గురువు. ఆయన ఉపదేశాన్ని పొందు. నీకు మేలు జరుగుతుంది, " అన్నాడు.

ఆ కాలంలోని రాజయోగుల్లో సారవాడ భాస్కరస్వాములు ప్రసిద్ధులు. ఆయన శిష్యులు కర్నాటక, మహారాష్ట్రాల్లో వుండేవారు. సారవాడ చిన్నపల్లెటూరైనా, భాస్కరస్వాముల్ని దర్శించడానికి ఎంతోమంది జనం అక్కడికి వెళ్తుండేవారు. ఆ విధంగా ఆగ్రామం ఒక యాత్రాస్థలంగా మారింది.

నుంగ మాటలతో మహిపతిరాయలు ప్రభావితులయ్యారు. అధికారాన్నీ, ఐశ్వర్యాన్నీ త్యజించి, భాస్కరస్వాముల దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. భార్యకు తమ నిశ్చయాన్ని తెలియజేశారు. సాధ్వి అయిన తిరుమలాదేవి సంతోషంతో సమ్మతించింది. మహిపతిరాయలు నవాబుతో చెప్పి, దివాన్ పదవిని వదిలి వేశారు. ఆయన్ని వదులుకోవడం ఇష్టంలేకపోయినా తిరుగులేని ఆయన నిశ్చయాన్ని గ్రహించి నవాబు ఊరుకున్నాడు.


భాస్కరస్వాముల్ని దర్శించి, రాయలు తనని శిష్యుడిగా స్వీకరించి, ఉపదేశం చేయమని ప్రార్థించారు. తిరుమలాదేవి కూడా ఆయనకి నమస్కరించి, తనకి సంతానం కలిగేలా ఆశీర్వదించమని కోరింది. ఆమె కోరికను మన్నించి, స్వాములు ఆశీర్వదించారు. రెండు ఫలాలను ఆమె ఒడిలో వేస్తూ “తిరుమలమ్మా! విచారించకు. దైవాన్నినమ్ము. నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు. వాళ్ళలో ఒకడు క్షత్రియ తేజస్సుతో కూడిన పరాక్రమంతో కీర్తిగడి స్తాడు. రెండోవాడు తనతండ్రిలాగే యోగి అవుతాడు, " అన్నారు.

ఆ తరువాత రాయలు భార్యతో కలిసి సారవాడలోనే వుండి పోయారు. స్వాముల ఉపదేశం ప్రకారం యోగవిద్యని అభ్యసించారు. యోగసిద్ధి పొందిన తరువాత సారవాడ నుండీ బిజాపూర్ చేరుకున్నారు. మరికొంతకాలం తరువాత గుల్బర్గా జిల్లాలోని 'షాపురం' వెళ్ళారు. అక్కడ మందాకినీ సరోవర తీరంలో హనుమంతుడిని ప్రతిష్ఠించి, నిరంతర భగవధ్యానంతో కాలం గడపసాగారు. 'మహిపతి' అంకితభావంతో భగవంతుని మహిమను కీర్తిస్తూ, ప్రజలకి నీతిని ప్రబోధిస్తూ, ఎన్నో కీర్తనల్ని రచించారు. అప్పటి నుండి మహీపతిరాయలు 'మహిపతిదాసులు' అయ్యారు. 

మహిపతిదాసుల ఉపదేశామృతాన్ని చవిచూడడానికి ప్రతి రోజూ వందలకొద్దీ జనం వచ్చేవారు. దాసులవారి మహిమ తెలియని కొందరు నీచులు, ప్రజల ముందు, ఆయన్ని మోసగించి అవమానం పాలు చేయాలని కాచుక్కూర్చున్నారు.

పరమాత్ముడు సృష్టించిన ఈలోకంలో, వెలుగు - చీకటి, సుగంధం, దుర్గంధం, సత్యం-అసత్యం వున్నట్టే సజ్జనులు - దుర్జనులూ అనాది నుండీ వున్నారు. దుర్గంధం వుండటం వల్లనే సుగంధానికి మన్నన లభిస్తుంది. అలాగే దుర్మార్గుల మూలంగా, సన్మార్గుల వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. పరుల్ని కష్టపెట్టి, అవమానాలపాలు చేయడం, దుర్జన స్వభావం. అందుకే పురందర దాసులు దుర్జనుల్ని తుమ్మచెట్టుతో పోల్చారు.  

ఇటువంటి దుర్జనులు కొంతమంది, మహిపతిదాసుల దగ్గరకు భయభక్తులు నటిస్తూ వెళ్ళారు. ఒక పళ్ళెంలో మాంసఖండాలను ఉంచి, పైన గుడ్డకప్పి, దేవుడి నైవేద్యం కోసం అంటూ దాసులు ముందు పెట్టారు. వాళ్ళ కుతంత్రాన్ని గ్రహించిన దాసులు భగవంతుడిని ప్రార్థించారు. మూసిన వస్త్రాన్ని తొలగించమన్నారు. పళ్ళెంలో బాగా మగ్గిన మామిడిపళ్ళ  ముక్కలు కనిపించాయి.  

అది చూసిన ఆ తుంటరివాళ్ళు గాభరాపడిపోయారు. అందరి సమక్షంలో ఆయన పాదాల ముందు ప్రాణాచారం పడిపోయారు. "దాసులవారూ! అపరాధం చేశాము, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడూ ఇలాంటి పాడుపని చేయము. మిమ్మల్ని పరీక్షించాలన్న దుర్బుద్ధి మాకెందుకు పుట్టిందో మాకే తెలీదు. దయతో క్షమించి, మాకు సద్బుద్ధి కలిగేలా అనుగ్రహించండి,” అని ప్రార్థించారు.

ప్రజలంతా ఆశ్చర్యంతో దాసులవారినే చూడసాగేరు. “అంతా దైవేచ్ఛ! ఆయనే మీచేత ఈ ఆట ఆడించాడు. మీ పశ్చాత్తాపమే మీపాపాల్ని ప్రకాశిస్తుంది. భగవంతుణ్ని భజిస్తూ, సుఖంగా జీవించండి." అన్నారు దాసులవారు. దీని మూలంగా ఆయన యోగసిద్ధితో గడించిన శక్తి అందరికీ అవగతమయ్యింది.

ఆయన “ షాపురం”లో మూడేళ్ళపాటు వుండి, బిజాపూర్ సమీపంలోని 'కాఖండకి' అన్న ఊరికివెళ్ళి అక్కడ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన దర్శనం కోసం వచ్చే జనసందోహం తగ్గలేదు. పరాయి ఊళ్ళనుంచీ వచ్చేవాళ్ళకి ఆయన తమ ఇంట్లో భోజనం యేర్పాటు చేసేవారు. కాఖండకి లో ఒక వ్యాపారి, బసప్ప అనేవాడు ఉండేవాడు. ఇంటికి అవసరమైన సరకుల్ని అతని అంగడిలో తెప్పించేవారు దాసులు. నెలకోసారి అతను తనకు రావాల్సిన పై కం తీసుకు వెళ్ళేవాడు. అతను డబ్బుకోసం వచ్చిన ప్రతిసారీ, దాసులు తాముకూచున్న గాదెలోపలికి చేతిని పోనిచ్చి, అతనికి ఇవ్వాల్సిన పైకం లెక్క పెట్టకుండా ఇచ్చేవారు. కష్టాల్లో వున్నవాళ్ళు ఎవరు అడిగినా ఆయన అదేవిధంగా గాదె లోంచీ డబ్బుతీసి ఇచ్చేవారు. ఈ సంగతి ఊరంతా తెలిసి పోయింది. బసప్పకు డబ్బంటే అత్యాశ. దాసుల గాదెలో లెక్కకుమించి ధనం వుందనీ, దాని తస్కరించివేయాలనీ అతనికి దుర్బుద్ధి పుట్టింది.

దాసులవారింట్లో నిరంతరం దైవపూజలు, భజనలు, పురాణ ప్రవచనాలూ జరుగుతూ వుండేవి. అనేక మంది జనం ఆ భజనలో పాల్గొనేవారు. దురాశాపరుడైన బసప్ప భక్తుడిలాగా నటిస్తూ, ఆయన ఇంటికి రాసాగేడు.

"దుర్జనస్య విశిష్టత్వం పరోప ద్రవకారణం వ్యాఘ్రస్య చోపవాసేన పారణం పశుమారణం ”

"పులిచేసే ఉపవాసం జింకలు మొదలైన సాధుజంతువుల సంహారాత్మకమైన పారణతోనే సమాప్తమవుతుంది. ఇలాగే దుర్మార్గుల సత్ప్రవర్తన లోకానికి కీడు కలిగించడానికే గానీ, ప్రజల క్షేమం కోరడానికి కాదు."

బసప్ప భక్తి - పూర్తిగా దాసుల ముల్లెను తస్కరించడమే. అయితే దాసులవారికి అతని పాడుబుద్ధి తెలిసిపోయింది. అతను భజనకి హాజరైన మొట్ట మొదటిరోజే, “యజమాని తమ పరిశోధన కోసం వచ్చారు! అంటూన వ్వేశారు. ఎవ్వరికీ ఆమాట అర్థం కాలేదు. అతనిలో సత్ప్రవర్తన కలుగుతుందన్న నమ్మకంతో దాసులు తమ గృహంలో స్వాతంత్య్రమిచ్చారు.

బసప్ప ఆనందంతో, ఇల్లంతనీ బాగా పరీక్షించడం ప్రారంభించాడు. ఒక్కోసారి దాసులు, “ఏమిటయ్యా, వేతకడం బాగా జరుగుతోందా? ఏమేనా లాభం కనిపించిందా?" అని అడిగేవారు నవ్వుతూ. అతను ఈ మాటతో కొంచెం గాభరాపడినా, తన దురుద్దేశాన్ని వదులుకోలేదు.

గురుజయంతి ఉత్సవాన్ని దాసులు వైభవంగా తమ ఇంట్లో జరిపించారు. ఆ ఉత్సవాలకి ఎంతోమంది గాయకులూ, పండితులూ, విద్వాంసులూ వచ్చారు. ఆ ఉత్సవాల నిర్వహణ బాధ్యతని ఆయన బసప్పకి అప్పగించారు. అతను ఎగిరి గంతేశాడు. ఉత్సవ కార్యాల తొందర నెపంతో ఇంటి మూలమూలా వెతికేశాడు. ఎక్కడా అతనికి ముల్లె దొరకలేదు.


దాసులవారి గృహం పక్కనే మరో చిన్న ఇల్లుండేది. ఇంటిని ఆయన యోగసాధనకీ, జపతపాలకీ ఉపయోగించేవారు. ఆయన తప్పించి ఇంకెవ్వరూ ఆ యింట్లోకి వెళ్ళేవారు కారు. ఆ చిన్న ఇంట్లోనే ముల్లె వుండితీరాలని బసప్ప అనుకున్నాడు. ఎత్తువేశాడు. "దాసులవారూ, తమరు ధ్యానంచేసుకునే ఇంట్లో ఎలుకలూ, పందికొక్కులూ విపరీతంగా చేరాయి. ఆ నేలని తవ్వి శుభ్రం చేస్తే మంచిది" అన్నాడు ఆయనతో. దాసులవారు అలాగే చేయమన్నారు. బసప్ప ఆ ఇల్లంతనీ వెతికి, ముల్లె కనిపించకపోవడంతో ఇల్లంతనీ తవ్వేశాడు. నేలలో కూడా అతనికి డబ్బు దొరకలేదు. అతని దురాశకి తగిన శిక్ష జరిగిందనుకున్నారు దాసులు.

డబ్బుదొరక్కపోవడంతో బసప్పకి కోపమొచ్చింది. తన ప్రయత్నాన్ని విరమించకపోగా, దాసులవారిని కొట్టి అయినాసరే ముల్లె ఎక్కడుందో కనుక్కోవాలనుకున్నాడు. ఆఖరికి. ఒకరోజు అతిథుల్ని సాగనంపి, దాసులవారు ఊరవతల నుండి తిరిగివస్తున్నారు. చీకటిపడింది. అదేసరైన సమయమనుకుని బసప్ప దాసులవారిని ఎదుర్కొని ఆయన చేతిని వొడిసి పట్టుకుని, “ దాసులూ, నీ ఆటలు నాదగ్గరసాగవు. ముల్లె ఎక్కడ దాచావో చెప్పు! లేకపోతే నిన్ను ఊరికే వదలను” అన్నాడు, దాసుల వారు భయపడలేదు. దుష్టుల స్వభావానికి చింతిస్తూ, శ్రీహరిని ధ్యానించారు. ఒక్కసారి, తీక్షణంగా అతన్ని చూశారు. "శాశ్వతమైన సంపదకోసం అమూల్యమైన కాలాన్ని ఎందుకు వ్యర్థం చేస్తావు? జ్ఞానధనం కోసం ప్రయత్నించి వుంటే, నీ జన్మ సార్థకమై వుండేది. ఇక నీ మొహం నాకు చూపించకు, వెళ్ళు" అని అన్నారు.

బసప్పకు దాసులవారి మాటలు గాభరా పుట్టించాయి. ఆయన చూపులు అతన్ని తీవ్రంగా భయపెట్టేయి. భయంతో, అవమానంతో, అక్కడ నిలువలేక ఇంటికి పరుగెట్టుకుపోయాడు. దాసులవారికి ద్రోహం తలపెట్టినందుకు రోగగ్రస్థుడయ్యాడు. 

లోభంవల్ల దుఃఖమేకానీ, సుఖం లభించదు! సాధారణంగా ప్రతీ మనిషి లోభంతో ధనసంపాదనకోసం శ్రమిస్తాడు. అంతేకానీ. దానిమూలంగా జరిగే అనర్థం గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఈ సత్యాన్నే అమరుకుడు అన్న కవి ఇలా చెప్తున్నాడు:

"దురాశకులోనైన పిల్లి పాలగురించి తాపత్రయ పడుతుందే గానీ, దాని మూలంగా తనపై బడే కర్రదెబ్బ గురించి, ఊహించలేదు. లోభి కూడా ఇంతే! వ్యాపారి దాసులు డబ్బును - కాజేయాలని కక్కుర్తి పడ్డాడే తప్ప, ఆయన వ్యక్తిత్వాన్నీ, మహిమనూ పట్టించుకోలేదు. లోభ ప్రభావం అంత బలమైనది ” 

లోకంలో దుర్జనులున్నట్లే సజ్జనులూ వుంటారు. సజ్జనులను ఉద్దరించడం కోసం జ్ఞానులు తమ సర్వస్వాన్నీ, ఆఖరుకు తమ ఆయుష్షును కూడా ధారబోస్తారు.

మురడప్ప అనేవ్యక్తి దాసుల శిష్యుల్లో ఒకడు. అతనికి దాసులవారంటే ఎంతో భక్తి. ఒకసారి అతని భార్యకి విపరీతంగా జ్వరం వచ్చింది. ఎన్ని మందులిప్పించినా తగ్గలేదు. ఇంట్లో ఆమెను చూచుకోడానికి ఇంకెవ్వరూ లేకపోయినా అతను క్రమం తప్పకుండా దాసులవారి ఇంటికి భజనకి వస్తూనే వున్నాడు. అతని భక్తివిశ్వాసాలకి దాసులవారెంతో ఆనందించారు. అతన్ని పిలిచి, తమ అంగవస్త్రాన్ని ఇచ్చారు. “దీన్ని తీసుకెళ్ళి నీభార్యకి కప్పు. జ్వరం తగ్గిపోతుంది,” అన్నారు. మురడప్ప అలాగే చేశాడు. అతని భార్వ జ్వరం పూర్తిగా తగ్గింది. దాసులవారు తమ ఆయుష్షుని   ధారపోసి, మురడప్ప భార్యని బ్రతికించారని జనం ఆయన్ని ఎంతగానో కిర్తించారు.

దాసులవారు కాఖండకి చేరిన కొత్తల్లో తిరుమలాదేవికి ఒక మగశిశువు కలిగాడు. ఆ కుర్రాడికి. 'దేవరాయలు' అని పేరు పెట్టారు. ఆ తరువాత పుట్టిన రెండో కొడుక్కి “కృష్ణరాయలు' అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. దాసులు సకాలంలో వాళ్ళకి ఉపనయనం చేశారు.

ఒకరోజు కొడుకులిద్దరికీ స్నానసంధ్యలు ముగించి, తాము జపంచేసే గృహంలోకి తీసుకెళ్ళి, అక్కడున్న తాళాలూ, తంబూరా, ఖడ్గమూ, లేఖిని లను చూపించి, ఎవరికి ఏదికావాలో తీసుకోమ్మన్నారు. దేవరాయలు ఖడ్గాన్నీ, లేఖినినీ ,- కృష్ణరాయలు తంబురానీ, తాళాల్నీ తీసుకున్నారు. దీన్నిబట్టి దేవరాయలకి యుద్ధవిధ్యల్లోనూ, కృష్ణరాయలకి దాసదీక్షలోనూ ఆసక్తి వుందని తెలిసింది.

దేవరాయలకి యుక్తవయస్సు వచ్చేసరికి తిరుమలాదేవి మరణించింది. వాళ్ళిద్దరూ తల్లిలేని వాళ్ళయ్యారు. అప్పుడు తిరుమలాదేవి తండ్రి, దేవరాయల్ని తనతో తీసుకెళ్ళి బీదర్ నవాబు సైన్యంలో చేర్పించాడు. తన పరాక్రమాన్ని ప్రకటించి, అచిరకాలంలో దేవరాయల వద్ద సైన్యాధికారి అయ్యాడు. అనేక యుద్ధాల్లో జయించాడు. మహారాష్ట్రలో హైందవ సామ్రాజ్యాన్ని  స్థాపించిన శివాజీలాగే దేవరాయలు శ్రుతుల్లో పేర్కొనబడిన యుద్ధతంత్రాల్ని పన్నేవాడని ప్రతీతి. అతని రూపురేఖలుకూడా శివాజిలాగే ఉండేవట. అంచేత ప్రజలు అతన్ని “డోణశివాజి ” అని పిలిచేవారు.  

కృష్ణరాయలు తండ్రిలాగే దైవధ్యానంతోనూ, భజనలతోనూ కాలం గడిపేవాడు. ఆయన కూడా అనేక దేవర నామాల్ని రచించాడు. అతనికి తండ్రే గురువు. హరిదాసుడై అతనూ కీర్తి గణించాడు. ఈ విధంగా దాసులవారి కొడుకులిద్దరూ రెండు రంగాల్లో ప్రసిద్ధులయ్యారు. 

కాలంగడుస్తోంది. మహీపతిదాసులికి తమ అవతారం సమాప్తమయ్యేకాలం సమీపిస్తోందని అవగాహన అయ్యింది. ఇహలోకయాత్ర చాలించే ముందు తమకులగురువులైన ప్రహ్లాద కృష్ణాచార్యుల్ని దర్శించాలన్న కోరికతో ఆయన కొల్హారక వెళ్ళారు. కొల్హార కృష్ణానది గట్టుమీద వుంది. అక్కడ దాసుల వారు ఏడురోజులపాటు తపస్సుచేసి, క్రీ. శ. 1681 వ సంవత్సర కార్తీక అమావాశ్యరోజున తమ ఇహలోక యాత్రను ముగించారు.


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - శ్రీనివాసార్పణమస్తు 🙏

July 1, 2015

ఏకలవుని పుట్టువూర్వోత్తరాలు

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర......ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం

మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?

ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.

సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.

యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.

పృధుకీర్తి: పృథాచైవ

శ్రుతదేవా శ్రుత శ్రవఁ

రాజాధిదేవీ చకదా

పంచైతై వీరమాతరః

(అధ్యాయం శ్లో ౧౯-౩౨)

వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.

౧. పృదకీర్తి

భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి

కొడుకుః దంతవక్త్రుడు

౨. శ్రుతదేవ

భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు

కొడుకుఛ ఏకలవ్యుడు

౩. శ్రుతశ్రవ

భర్తః చేదిరాజు దనుఘోషుడు

కొడుకుః శిశుపాలుడు

౪. పృధ(కుంతి)

భర్తః పాండురాజు

కొడుకులుః పాండవులు

౫. రాజాధిదేవి

భర్తః అనంతపతి

కొడుకులుః విందాను విందులు

కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.

దేవశ్రవాః ప్రజాతస్తు

నైషాదిర్యః చ్రతిశ్రుతిః

ఏకలవ్యో మహారాజ

నిషాదైః వధివర్థితః

(౬-౪ శ్లో ౩౩)

ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.

సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.

ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.

అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.

మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.

హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.

(గమనిక:-  ఇది భాష భారతి అనే facebook పేజీలో  చేసిన పోస్ట్ నాకు బాగా నచ్చి ఇక్కడ పొందుపరుస్తున్నా)  

June 24, 2015

శ్రీ దత్తశరణం

శ్రీ దత్తశరణం

భగవద్గీతలో శ్రీకృష్ణుడు మార్గశిర మాసాన్ని తనకు ప్రియమైన నెలగా చెప్పాడు. మార్గశిర శుక్ల చతుర్దశినాడు యోగీశ్వరుడైన దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అంశతో ఆవిష్కారమయ్యాడు. శ్రీహరి దశావతారాలు దాల్చి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఆ అవతారాలన్నీ లక్ష్యం సిద్ధించగానే పరిసమాప్తి అయ్యాయి. భక్తులని ఎల్లప్పుడూ రక్షించుకోవటం కోసం, వారి యోగక్షేమాలని చూసుకోవటం కోసం విష్ణుమూర్తి దత్తత్రేయుడిగా అవతరించినట్లు చెబుతారు. అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు జన్మించాడు. అత్రి మహర్షి మహా తపోబలం ఉన్నవాడు. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే త్రివిధ తాపాలని తన తపోమహిమతో తొలగించుకున్న మహనీయుడు. ఆ మహర్షి భార్య అనసూయ. మహా పతివ్రత. త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి, వారిని పొత్తిళ్ళలోకి తీసుకొని, ఆ ముగ్గురికి ఆకలి తీర్చిన ఉత్తమ ఇల్లాలు. ఆ దంపతులకి కొడుకుగా విష్ణువు తనను తానే దత్తం చేసుకున్నాడు. అందుకే మహావిష్ణువు దత్తుడైనాడు. అత్రికి కొడుకు కనుక ఆత్రేయుడైనాడు. ఆ స్వామినే దత్తాత్రేయుడిగా మనం భక్తితో అరాధించుకుంటున్నాం.

దత్తుడు త్రిముఖాలతో, చతుర్ముఖాలు ఉన్న ఆవుని వాహనంగా చేసుకొని, మునికుమారునిగా కనిపిస్తాడు. ఆ స్వామి వైరాగ్యమూర్తిగా ప్రకాశిస్తాడు. ఆయుధాలు లేకుండా, ప్రసన్నంగా, చిరునవ్వు నవ్వుతూ, భక్తుల కోర్కెలు తీర్చే వరదుడిగా, కనిపిస్తాడు. ఔదుంబర వృక్షం కింద ఎప్పుడూ కూర్చొని, గురుపరంపరకే ఆద్యునిగా కనిపిస్తూ ఉంటాడు. ఔదంబర వృక్షం అంటే మేడిచెట్టు. మేడిపండు పైకి మిసమిసలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఆ పండు లోపల పురుగులతో నిండి ఉంటుంది, ఈ ప్రపంచం కూడా పైకి ఎంతో అందంగా ఉంటుంది. అయితే లోపల ఎన్నో సమస్యలు, లోపాలు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటాయి. వాటిని తొలగించుకోవటానికి, అవరోధాలన్నీ అదిఘమించడానికి దత్తాత్రేయుడిని భక్తిశ్రద్ధలతో శరణు వేడటమే తరుణోపాయం అని చెబుతారు.

దత్తాత్రేయుడు స్మృతిగానీ, కేవలం స్మరణగానీ చేసినట్లయితే తన కరుణను భక్తులపై కురిపిస్తాడని ప్రతీతి. మహా యోగీశ్వరుడైన శ్రీ గురుదత్తుడు శ్రీవిద్యకు జగదాచార్యుడు. యోగమార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తిమార్గ పరిరక్షణ అనే మూడు అంశాలు దత్తాత్రేయ అవతార ప్రధాన ధ్యేయాలు. దక్షిణ భారతదేశంలో దత్త సంప్రదాయానికి ఏంతో ప్రాధాన్యం ఉంది. దుష్ట చైత్యులని సంహరించి, శిష్టులని అనుగ్రహించి, యోగామార్గాన్ని బోధిస్తూ భక్తులను రక్షించటమే దత్తాత్రేయ అవతార ప్రయోజనం.

దత్తాత్రేయుడు మహా అవధూత ముక్తిదాయకుడు, జ్ఞానప్రదాత, ప్రకృతిలోని భౌతిక , లక్షణాలను దైవాసుర గుణాలతో స్వామి అద్భుతంగా సమన్వయపరుస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రభోదించాడు. ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడుత, చేప, ఏనుగు సాలెపురుగు వంటి 24 చరాచరాల నుండి దత్తుడు వివేకజ్ఞానాన్ని గ్రహించాడు. వాటినే గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకొని, లోకానికి తెలియచేసాడు. ఈ జగత్తులోని ప్రతిజీవి జన్మకు సార్థకత ఉంది. ఆ జీవుల నుండి ఎన్నో విషయాలని నేర్చుకొని జీవితాలకి అన్వయించుకోవాలని దత్త సందేశం. మానవ మనుగడకు అత్యవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సృష్టి రహస్యాలని అందరి నుండి వివేకంతో గ్రహించాలి. అందుకే తన ఆత్మే తనకు గురువైనదని దత్తాత్రేయుడు దివ్య ప్రబోధన చేసాడు. ఉత్తమ జన్మ పొందిన మనిషి సాటి జీవరాశుల నుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అభ్యాసం చేసి వాటిని జీవనానికి సమన్వయం చేసినప్పుడే మనిషి మనీషి అవుతాడని శ్రీగురుదత్తుడి భవ్యసందేశం.

డాక్టర్ కావూరి రాజేష్ పటేల్


___/\___ శ్రీ గురుదత్త చరణములే మనకు శరణ్యం ___/\___

June 2, 2015

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా ఎవరు రచించారో .... ఎందుకు రచించారో మీకు తెలుసా ???

సుప్రసిద్ధ హిందీ ప్రాచీన రామభక్త కవి, శ్రీరామ భక్తుల్లో అగ్రగణ్యుడు 'రామచరితమానస్' అనే పేరుతొ రామాయణాన్ని రచించిన కవి గోస్వామి తులసీదాసు.


ఇతను ఒకసారి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ పండరీపురం చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం నివసించాడు. నిత్యకృత్యాలలో భాగంగా ఒకరోజున 'చంద్రభాగా నది' లో స్నానం చేసి విఠల నాథుడిని ధ్యానిస్తూ నదీ ఒడ్డున  కూర్చున్నాడు. ఆసమయంలో ఒక గుడ్డివాడు ఇంట్లో తగాదపడి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికి వచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసుని ఆ గుడ్డివాడు తన్నుకొని పడిపోయాడు. తులసీదాసు వెంటనే ఆ గుడ్డివాడిని పైకి లేపి, ఒక్కసారి గాఢముగా ఆలింగనం చేసుకొని 'క్షమించు నాయనా ! నీ కృపాదృష్టితో ఒక్కసారి నన్ను చూడు' అని అన్నాడు. అంతే అంధుడికి చూపు వచ్చేసింది. అతడు ఆనంద పరవశుడై తులసీదాసు పాదాలపైనపడి 'స్వామీ ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. నాకు పునర్జన్మను ప్రసాదించారు ...... ఈ పునర్జన్మని ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను అని అన్నాడు.  తులసీదాసు ఇలా అన్నాడు ' చూడు నాయనా ! ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుడిని. ఆ పండురంగ విఠలుని మహిమ. ఆ ప్రభువు అనుగ్రహ ప్రాప్తి నీకు కలిగింది. నీకు కలిగింది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవ చింతనతో ధన్యం చేసుకో.

తులసీదాసు జీవితచరిత్రలో ఇటువంటివి ఎన్నో సంఘటనలు సంభవించాయి. అవన్నీ భగవంతుడు అతని ద్వారా వ్యక్తం చేయించినవే.ఈవిషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. అక్బరు తులసీదసుని తన కొలువుకి రావలసిందిగా ఆహ్వానించాడు. "నీకు చాలా మహిమలు ఉన్నట్టుగా మాకు తెలిసింది. మాకు కొన్నిటిని చూపించి, మెప్పించి, పారితోషికాన్ని స్వీకరించు." అని కబురు పంపించాడు. "అక్బరు చక్రవర్తీ! నన్ను క్షమించండి, నేను రామునికి మాత్రమే దాసుడను, నాలో ఏ మహిమలు లేవు. నేను నిమిత్తమాత్రుణ్ణి ఏమైనా ఎప్పుడైనా జరిగితే అవి శ్రీరామచంద్రమూర్తి యొక్క లీలలే అని గుర్తించండి" అని బదులు ఇచ్చాడు. ఆ జవాబుకి అక్బరుకి చాలా కోపం వచ్చింది. "ఏమిటి ? నా మాటనే ధిక్కరిస్తావా ? అందుకు నీకు మరణదండన తప్పదన్న సంగతి నీకు తెలుసా ?" అని గద్దించాడు. తులసీదాసు నెమ్మదిగా బదులిచ్చాడు. 'మరణమే శరణ్యమని నా శ్రీరాముని సంకల్పమైతే ఆ సమయం ఎవ్వరు ఆపినా ఆగదు కదా! కానివ్వండి.' అని అన్నాడు.

అక్బరు చక్రవర్తికి కోపం బాగా పెరిగిపోయింది. అతని ఆజ్ఞను ధిక్కరించినందుకు భటులను పిలిచి తులసీదాసుని కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసీదాసు తన రెండు చేతులూ జోడించి రామనామ స్మరణం చేసుకోసాగాడు. భటుల చేతుల్లో పైకి లేచిన కొరడాలు అలాగే ఉండిపోయాయి. ఇంతలో అక్కడికి లెక్కలేనన్ని కోతులు వచ్చి, అక్బరుతో సహా భటులను అందరినీ ... భయంకర చూపులతో, అరుపులతో బెదిరించాయి. అందరూ కూడా నిలువునా వణికిపోయారు. చుట్టూ చేరిన కోతులు వారందరి ఒక్క అడుగు కూడా కదలనీయలేదు. అక్బరు చక్రవర్తి ఆశ్చర్యపోయి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటును తెలుసుకున్నాడు. వెంటనే తులసీదాసు పాదాలపైన పడి, కన్నీరు, మున్నీరుగా ఏడ్చాడు. తులసీదాసుకి అంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగింది అని అడిగితే .... అక్బరు జరిగిన సంఘటనంతా వివరించాడు. మీ అందరికీ కనిపించిన కోతులు తనకి అసలు కనిపించనేలేదని... భక్తిప్రపత్తులతో హనుమంతుని ప్రార్థించాడు. ' స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీళ్ళందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకు ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించలేదు. నేను చేసిన తప్పేమిటి? ఏమైనా ఉంటే నన్ను క్షమించు' అంటూ దుఃఖిస్తూ హనుమానుని అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం హనుమ దర్శనం పొంది పరమానందభరితుడైనాడు.

అదే హనుమాన్ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది. మారుతి కటాక్ష వరమహిమచేత తులసీ విరచిత "హనుమాన్ చాలీసా" మోక్ష తులసీదళమై రామనామ జపసాధకులను పునీతం చేస్తోంది.

శ్రీరామ జయరామ జయజయరామ 
                                       జై జై జై హనుమాన్                                            


చిమ్మపూడి శ్రీరామమూర్తి 

November 19, 2014

నీతికథ

విశాఖపట్నం ఆకాశవాణి రేడియోలో 17-12-1990 లో సూక్తిముక్తావళి కార్యక్రమంలో ఈ కథ విన్నాను. నాకు బాగా నచ్చి, నా డైరీలో రాసుకున్నాను. ఈమధ్యనే ఆడైరీలో ఈ కథని చూసాను, వెంటనే రాసి నా బ్లాగులో భద్రపరచాను.          


August 6, 2014

శ్రీ కృష్ణభక్తుడు – జయదేవుడు

శ్రీ కృష్ణభక్తుడు జయదేవుడు

జయదేవుడు జన్మతః ఓడ్రుడై, వంగదేశంలో జీవించి, వాగ్గేయకారుడై, అక్కడ రాజపోషణ పొంది, ప్రసిద్ధుడై ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన భారతదేశానికంతకు ఆది ప్రబంధకర్తగా ఆరాధ్యుడయ్యాడు. వాగ్దేవతా చరిత చిత్రిత చిత్త పద్మా పద్మావతీచరణ చారణ చక్రవర్తి అని చెప్పుకున్నారు. ఇతని భార్యపేరు పద్మావతి. వారిరువురి దాంపత్యం అన్యోన్యమైంది.  ఆదర్శమైంది. అంతకుపూర్వం ఏకవి సాహసించని నవ్యరీతిని ఇతడుభార్యపేరును తన పేరుతో చేర్చి పద్మావతీ చరణ చారణ చక్రవర్తి అనీ, జయతి పద్మావతీ సుఖసమాజే భణతి జయదేవ కవిరాజరాజే అనీ, పలుచోట్ల పల్కి, తనకు ఆమె పట్ల గల అనురాగాన్ని వ్యక్తం చేసాడు. ఆమె అనురాగ ప్రోత్సాహాలే తన కవితకు ప్రేరకాలంటారు. ఆయన కీర్తనలు పాడుతుంటే ఆమె చరణాలు నర్తించేవట.

ఒకనాడు జయదేవుడు తన గీతగోవిందంకావ్యంలో వదసి యది కించిదపి అనే అష్టపది రచిస్తున్నాడట. స్పర్శగరళ ఖండనం మామ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని శ్రీకృష్ణుడు మన్మథ విషయంలో ఉద్రేకించిన తన శిరస్సుపైన రాధ పదపల్లవమనే చిగురాకును ఔషధంగా చేర్చమని రాధను ప్రాధేయపడతాడు. ఇలా రాసిన తరవాత భగవంతుడంతటివాని తలపై స్త్రీ పాదాలను చేర్చుట ఏమిటని అనిపించి, ఆ పంక్తులను కొట్టివేసి, అభ్యంగన స్నానానికి వెళ్ళాడట. ఆ తరవాత శ్రీకృష్ణుడు ఒంటికి నూనె రాసుకున్న జయదేవుని రూపంలో వచ్చి, కొట్టివేసిన ఆ పంక్తులనే తిరిగి వ్రాసి వెళ్ళాడట. స్నానాంతరం జయదేవుడు ఆ పంక్తుల విషయం భార్యను ప్రశ్నిస్తే మీరే వచ్చి వ్రాసి వెళ్ళారు కదా ? అని పత్రంపై తైలపు చుక్కలను కూడా చూపిందట. శ్రీకృష్ణుడే ఆమెకు ప్రత్యక్షమై ఆ భావం ఉచితమేనని తెలియచేసినందుకు ఆయన పొంగిపోయాడు. భార్యను అభినందించి జయతి పద్మావతీ రమణ జయదేవ కవిభారతీ భణితమతిశాతం అని పూరించాడట. దీనిని సంగీత సాహిత్యజ్ఞులుదర్శనాష్టపది అని అంటారు. దీనికే సంజీవనీ అష్టపది అని కూడా పేరు.

జయదేవుని గీతగోవిందం వంటిదే రాజయిన లక్ష్మణసేనుడు కూడా రచించాడు. కానీ ఆనతి ప్రజలు జయదేవుని అష్టపదులనే ఆదరించేవారట. దానికి ఆ రాజు అసూయచెంది, పండిత సమక్షంలో జయదేవుని పిలిపించాడట. ఆ రెండు రచనలలో ఏది గొప్పదే తెలుసుకోవటానికి రెంటిని జగన్నాథ ఆలయంలో ఉంచి, మర్నాడు తలుపులు తెరిచారట. జయదేవుని కావ్యం ఆ స్వామి శిరస్సుపైన, ఆ రాజు గ్రంథం క్రిందన పడవేసి ఉన్నాయట. రాజు గర్వం తగ్గి, కవికి సాష్టంగపడి, అతణ్ణి మెచ్చుకొని, గౌరవించాడట. ఆ రాజు పట్టమహిషి, పద్మావతి పాతివ్రత్యాన్ని అందరూ మెచ్చుకుంటుంటే ఈర్ష్య చెందిందట. ఒకనాడు రాజు జయదేవునితో వేటకై గ్రామాంతరం వెళితే, అతడు (జయదేవుడు) పులివాతపడి మరణించాడని పద్మావతికి కబురు చేసింది. ఆ దుర్వార్త విన్న పద్మావతి తరువులా కూలిపోయిందట. ఆమె మరణవార్త విన్న జయదేవుడు వదసి యది కించిదపి అనే దర్శనాష్టపదిని గానం చేయగానే పద్మావతి కళ్ళు విప్పి లేచిందట. అందుకే దానికి సంజీవనీ అష్టపదిగా ప్రతీతి.

సాహిత్యరీత్యా గీతగోవిందం అలంకారికులకు ప్రామాణికమైనది. 24 అష్టపదులతో 80కి మించిన శ్లోకాలతో 12 సర్గల గేయ ప్రబంధమది. ఏ పంక్తి చూసినా రసస్ఫూర్తితో, కొమలపదాలతో హృదయాన్ని పరవశింపచేస్తుంది.

యది హరిస్మరణే మనో
యది విలాసకలాసు కుతూహలం
మధుర కోమల కాంత పదావళీం
శ్రుణు తదా జయదేవ సరస్వతీంll  

అని తన శబ్ద మాధుర్యం గూర్చి తానే చెప్పుకోగల్గిన ఆత్మవిశ్వాసం, శిల్పచాతుర్యం గల మహాకవి జయదేవుడు. ప్రళయ పయోధిజల్ అనే దశావతార అష్టపది కావ్యానికి మకుటాయమైంది.  రాధాగోవిందుల ప్రణయ, విరహ, విశ్లేష, కలహ, ఖండన, సానునయ, సమాగమ, సంధానముల ద్వారా జీవ బ్రహ్మైక్య సంధానవేదాంతం వ్యంజితమౌతుంది. ఆంధ్రలో లీలాశుకుడు, అన్నమాచార్యులు, నారాయణతీర్థులు, రామదాసు మొదలగువారి కవితల్లో వ్యాపించిన భక్తికవితావాహినికి జన్మస్థానమైన గంగోత్రి జయదేవుని గీతగోవిందమే. భక్త మీరాబాయి భర్త మహారాణా కుంభకర్ణుడు గీతగోవిందానికి రసమంజరి అనే వ్యాఖ్యను, తిరుమలరాయని ఆస్థానంలోని చెరుకూరి లక్ష్మీధరుడు శృతిరంజని వ్యాఖ్యను రచించారు.


జయదేవుని అష్టపదులను సంగీత విద్వాంసులు అనేక బాణీలతో వారివారి సంప్రదాయానుసారం గానం చేస్తుంటారు. జయదేవుని గీతగోవింద రచనా పద్ధతిని ఎందరో అనుకరించినవారున్నారు. శ్రీ చంద్రశేఖర సరస్వతీస్వామి శివాష్టపది, - రామకవి రామాష్టపది. వేంకటమఖి త్యాగరాజాష్టపది రచించారు. 18వ శతాబ్దంలో కళువె వీరరాజు అనే వాగ్గేయకారుడు పార్వతీపరమేశ్వరులను నాయికా నాయకులుగా చేసి సంగీత గంగాధరము రచించారు. ఈవిధంగా జయదేవుని గీతగోవిందం ఎందరికో శిరోధార్యమై, మార్గాదర్శకమై భక్తిసుధలను పంచింది.       

                                                                                        

August 5, 2014

"తత్వమసి" ...... శ్రీరామకృష్ణ పరమహంస కథలు

"తత్వమసి" ...... శ్రీరామకృష్ణ పరమహంస కథలు

" 'నేను బద్ధజీవుణ్ణి! నాకు ఎన్నటికీ భక్తీ, జ్ఞానము కలుగవు.' అని కొంతమంది అంటూ ఉంటారు. కాని గురువు అనుగ్రం పొందటానికి ఆ భయం లేదు"...... అని శ్రీరామకృష్ణులు ఈ క్రింది కథను ఈ విధంగా చెప్పారు. 

ఒకసారి ఒక ఆడపులి ఒక మేకలమంద మీద పడింది. అదే సమయానికి దూరం నుండి ఒక బోయవాడు బాణం వేసి దానిని చంపిసాడు. ఆ పులి నిండుచూలాలు. బాణం దెబ్బకు అది చనిపోతూ, ఒక పిల్లను కని కన్నుమూసింది. ఈ పులికూన మేకల మందలో కలసి పెరుగుతూ వచ్చింది. ఆ మేకలే దానికి పాలిచ్చి పెంచాయి. క్రమక్రమంగా రోజులు గడిచేకొద్దీ ఆ పులిపిల్ల మేకలతో కలసి తిరగటం వాటిలాగానే గడ్డి మేయటం, అవి అరుస్తున్నట్టే 'మే, మే' అని అరవటం మొదలు పెట్టింది. క్రమంగా అది పెరిగి ఒక పెద్దపులిలాగా తయారైంది. అయినా కూడా అది గడ్డితినటం, మేకలాగా అరవటం చేస్తూనే ఉంది. ఏదైనా కౄరమృగం వచ్చి తరిమితే ఈ 'మేక-పులి' కూడా మేకలాగా మేకలగుంపుతో కలసి పారిపోతూ ఉండేది. 

ఇలా ఉండగా ఒకసారి మరొక భయంకరమైన పులి ఆ మేకలమందపై పడింది. ఆ మందలో గడ్డి తింటూ మేకలతో పరుగెత్తిపోతున్న ఈ 'మేక-పులి'ని చూసి ఆశ్చర్యపడింది. ఇతర మేకలను వదిలి ఆ పులి ఈ గడ్డితినే 'మేక-పులి'ని వెంటాడి పట్టుకుంది. అది భయంతో వణుకుతూ మేకలాగా అరుస్తూ, తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఈ భయంకరమైన పులి దానిని నీటి దగ్గరకు ఈడ్చుకుపోయి, 'నువ్వు నాలాగా పెద్దపులివై ఉండి కూడా మేకలతో తిరుగుతూ గడ్డి తింటున్నావెందుకు? నీళ్ళలో నీ ముఖం చూసుకో! నాకున్నట్లుగానే గుండ్రమైన ముఖం నీకు కూడా ఉంది.' అని దాని నోటిలో ఒక మాంసం ముక్కను కుక్కింది. గడ్డి తినటానికి అలవాటు పడిన ఆ 'మేక-పులి' మొదట మాంసం తినటానికి ఇష్టపడలేదు. కానీ మాంసం నాలుకకు తగిలేసరికి, రుచిమరిగి తినటం ప్రారంభించింది. చివరకు ఆ భయంకరమైన పులి దానితో, 'ఎంత సిగ్గుచేటు ! ఈ మేకలతో కలసి తిరుగుతూ గడ్డి తింటున్నావు, చూడు నాకు - నీకు తేడా ఏమైనా ఉన్నదా ? ఏమీ లేదు, నాతో కలసి అడవిలోకి రా!' అని అన్నది. ఈ మాటలు విని ఆ 'మేక-పులి' తన ప్రవర్తనకు సిగ్గుపడి, తన నిజస్వరూపాన్ని తెలుసుకొని, ఆ పులితోపాటు అడవిలోకి వెళ్ళిపోయింది.'

ఈ కథను గురుదేవులు 'శ్రీరామకృష్ణ కథామృత' రచయితా అయిన మహేంద్రనాథగుప్తాకు చెప్పి, 'గురువు అనుగ్రహం పొందిన వానికి భయం లేదు. అసలు నీవెవరివో, నీ నిజతత్వమేమిటో, గురువు నీకు తెలియచేస్తాడు. కథలో గడ్డి తినటం అంటే - 'కామినీ - కాంచన' సుఖాలలో మునిగితేలటం. .... 'మే - మే' అని అరుస్తూ పారిపోవటమంటే ..... సామాన్య మానవునిలాగా సంసారంలో మెలగటం. కొత్త పులిని అనుసరించటం పోవటం అంటే --- మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పిన గురువును శరణుపొంది, ఆయనయే మన ఆప్త బంధువని గుర్తించటం. నీటిలో తన ముఖం యొక్క ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకోవటం అంటే ----'తన ఆత్మతత్వాన్ని అనుభూతి పొందటం' అని వివరించారు.' "తత్వమసి" (అదే నీవు! అంటే నీవు ఈ అశాశ్వతమైన శరీరానివి కావు. ఆ పరమాత్మవే) అనే మహావాక్య వివరణే ఈ కథలోని అంతరార్థం" ..... అని వివరించారు.                      


April 22, 2014

కీర్తన భక్తి

కీర్తన భక్తి

భగవంతుని నామ రూప గుణ చరిత తత్వ రహస్యాలను, శ్రద్ధతో, ప్రేమతో కీర్తిస్తూ ఉంటే శరీరం పులకించటం, కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడటం, కంఠం తన్మయత్వంతో గద్గదమవ్వటము, హృదయ ప్రఫుల్లమై విలసిల్లటమే...కీర్తన లక్షణం.

పూర్వం నారదుడు, వాల్మీకి, శ్రీశుకుడు వంటి భక్తాగ్రేసరులు..... ఈ యుగంలో తులసీదాసు, సూరదాసు, తుకారం, మీరభాయ్, నానక్ వంటి ఎందరో భక్తులు కీర్తనభక్తి వలన తరించారు.

నిరంతరం నామకీర్తనలు గావించిన ప్రహ్లాడునుకి, నామకీర్తనతో పాటు, శ్రీరాముని తన హృదయంలో నిలుపుకున్న , హనుమంతునకు సాయుధ్యాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు.

కలియుగంలో శ్రీహరి నామమే సర్వశ్రేయోదాయక సాధనం.

శ్రీరామదాసు, అన్నమయ్య, త్యాగయ్య , క్షేత్రయ్య, జయదేవుడు మొదలైనవారు కలియుగంలో కీర్తనభక్తివల్లననే ముక్తిని పొందారు.


భగవన్నామ సంకీర్తన మహత్యము

భగవన్నామ సంకీర్తన మహత్యము

వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని వారి పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టిన పేరుగా పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి యొక్క సమస్త పాపాలను నసింపచేస్తుందట. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితమిస్తుందంటే.........ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు.... స్వయంగా పరమాత్మనే ఇక్కడకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడంట.

నాహం నాసామి వైకుంఠె యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll

నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా  నేను వైకుంఠములో ఉంటాననుకుంటున్నారు... కానీ నేను వైకుంఠములో లేను, ఉండను.... కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతుంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను...అని చెప్పారంట. అందుకేనేమో నారద మహర్షుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడంట.

హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ  గతిరన్యధా ll

ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదంట.

ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభించండి. ఒకవేళ మనం రేపే ప్రయాణమవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక.... మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది.


March 28, 2014

శిశుపాలుడు చేసిన 100 తప్పులు

శిశుపాలుడు చేసిన 100 తప్పులు  ఏమిటి ? ఏ విధంగా వధించబడ్డాడు ???

శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు. చేది దేశపు రాజు. దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడిమీద ప్రేమాభిమానాలనేవి లేవు. పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు. 

 శిశుపాలుని ఆగడాలు చూసీచూసీ విసిగిపోసిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయాడు. అప్పుడు శిశుపాలుని తల్లి, కృష్ణుని మేనత్త అడ్డుపడి, "ఆగు కృష్ణా.. నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు..'' అంది. 

కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని, ''అత్తా, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను.. నీమీది గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను. ఆపైన మాత్రం సహించేది లేదు.. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు'' అన్నాడు. అలా జరిగాక అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు లేదు. తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు. 

ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యజ్ఞశాల ఆకులు, పూవులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది. ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు, కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది. పూవులు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలూ, గాయనీగాయకుల మధుర గానామృతంతో సందడిగా,కోలాహలంగా ఉంది. 

యాగం ముగిసింది కనుక తృప్తిగా దానధర్మాలు చేయాలనుకున్నారు. అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధిష్ఠిరునికి చెప్పాడు. ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణునికి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, అగ్రతాంబూలం సమర్పించాడు. అందుకు దేవతలు హర్షించారు. విరుల జల్లు కురిపించారు.

అయితే శ్రీకృష్ణునికి ధర్మజుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంతమాత్రం రుచించలేదు. అసూయాద్వేషాలు మానసును దహింపచేయగా ''ఎందరో పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, వృద్దులు, త్యాగశీలురు, ధైర్యపరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు, మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా? కృష్ణుడు ఒక యాదవుడు, పశువుల కాపరి అని మర్చిపోయారా? ఇంతకంటే తెలివితక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అగ్ర తాంబూలం ఇవ్వడానికి ఇంత అయోగ్యుడిని ఎంచుకుంటారా? ఇది తక్కినవారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్ధం చేసుకునేపాటి విచక్షణ కూడా లేదా?'' అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు.

ధర్మరాజు శిశుపాలునికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్ధం చేసుకునే స్థితిలో లేడు.

''భీష్మాచార్యుడు ముసలితనంతో మతి కోల్పోయాడు. ఆయనకు విచక్షణ నశించింది.. సరే, నీకు ఏమయింది? ఆయన ఔచిత్యం లేని పనికిమాలిన సలహా ఇస్తే.. దాన్ని నువ్వు అనాలోచితంగా పాటిస్తావా? కొంచెమైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించవా? ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు.. తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను.. కానీ, నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది.. సరే, భీష్మాచార్యుడికి, నీకూ కూడా బుద్ధి మందగించింది.. ఏదో, తెలివితక్కువగా కృష్ణునికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.. కనీసం అనుడుకునేవాడికైనా బుద్ధి ఉండాలా? ఇందరు మహామహులు ఉండగా నేను అగ్ర తాంబూలం అందుకోవడం ఏమిటి? అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించాలా? తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా?!'' అంటూ అందరి సమక్షంలో కురువృద్ధుడైన భీష్మ పితామహుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు - ముగ్గుర్నీ నోటికొచ్చినట్లు తూలనాడాడు.

ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇది నూట ఒకటో తప్పు. ఇక కృష్ణుడు దయచూపలేదు. ముందే చెప్పినట్లుగాశిశుపాలుని శిక్షించేందుకు సమాయత్తమయ్యాడు. సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు.....


తెనాలిరామలింగ కథ

తెనాలిరామలింగ కథ

నల్లకుక్కను కర్రిఆవుగా చేయుట---

తెనలిరామలింగ కవి అంటే తెలియనివారు ఎవరూ ఉండరు కదా ? అతని కథలు మనకు హాస్యాన్ని తెప్పిస్తాయి, ఆలోచింపచేస్తాయి కూడా. అటువంటి కథలలో ఒకటి మనం ఈ రోజు చెప్పుకుందాము.    

శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానములో చాలాకాలం నుండి విశ్వాసపాత్రుడు, పనిలో నైపుణ్యం కలవాడు అయిన ఒక మంగలివాడు ఉండేవాడు. ఆ మంగలివాడు ఎప్పుడూ దైవభక్తి కలిగి సదాచారపరాయణుడై కాలం గడుపుతూ ఉండేవాడు. అతని విశ్వాసము చూసి రాయలువారికి ముచ్చటవేసి "ఒరేయ్ అబ్బీ ! నీకేమి కావాలో కోరుకో" అని అన్నారు. అప్పుడామంగలి "మహాప్రభో ! నేను చిన్నప్పటినుండి నిష్టాగరిష్టుడనై భక్తిశ్రద్ధలతో ఎన్నో పూజలూ, నోములు చేశాను. నన్ను ఎలాగైనా బ్రాహ్మణునిగా మార్చండి" అని రాయలవారిని బ్రతిమాలాడు. రాయలువారు సరేయని రాజపురోహితులను పిలచి ఇతనిని బ్రాహ్మణునిగా మార్చండి అని ఆజ్ఞాపించెను.

రాజపురోహితులు తెల్లబోయి, అడ్డుచేబితే రాజు ఎక్కడ దండనవిధిస్తాడో అని భయపడి, ఆ మంగలిని ప్రతీరోజు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, హొమాదిజపములు చేయిస్తూ, మంత్రోచ్ఛారణ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సంగతి ఒకరోజు తెనలిరమలింగనికి తెలిసింది. ఒక రోజు అతడు కూడా ఒక నల్లకుక్కను వెంటబెట్టుకుని నదిఒడ్డుకి వెళ్ళి, కుక్కను నీటిలో ముంచుతూ, కొన్ని బీజాక్షరాలను చదువుతూ ఉన్నాడు.

మంగలిని బ్రాహ్మణునిగా ఎంతవరకు మార్చారో తెలుసుకుందాము అని రాయలవారు ఒకరోజు నదిఒడ్డుకి వచ్చారు.  నది ఒడ్డున---- ఒకపక్క రాజపురోహితులు మంగలిని, మరోపక్క రామలింగడు కుక్కని నీటిలో ముంచుతూ మంత్రాలూ చదవటం చూసారు. ఆ రెండు దృశ్యాలు చూసి, రామకృష్ణుని అవస్థ చూసి రాయలు వారు పకపక నవ్వి రామలింగడిని ఇలా ప్రశ్నించారు, " ఓయీ రామకృష్ణా ! నేకేమైన పిచ్చిపట్టినదా, కుక్క-- కుక్కే గానీ--- కర్రిఆవు ఎలా అవుతుందీ" అని. అంతట  రామకృష్ణుడు రాయలవారిని " పిచ్చి నాకు కాదు మీకే, లేకపోతే మంగలి బ్రాహ్మణుడు ఐతే, కుక్క గోవుగా ఎందుకు మారకూడదు ?"... అని ఎదురుప్రశ్న వేసెను.

ఆమాటకు రాయలవారికి జ్ఞానోదయం అయ్యి, తనతప్పు తెలుసుకొని, తనకి బుద్ధి తెప్పించటానికే రామలింగడు ఇలా చేసాడని తలచి బ్రాహ్మణులు చేసే పనిని ఆపివేయించెను.



టిట్టిభ పక్షులు

టిట్టిభ పక్షులు

(టిట్టిభ పక్షుల యొక్క పట్టుదలను తప్పుగా అంచనా వేసిన సముద్రుడు వాటితో, వైరానికి దిగి, పరాభవం పాలయ్యినట్టు, శత్రువు యొక్క తెలివితేటలని సరిగ్గా తెలుసుకోనివాడు ఓడిపోతాడు.)   

ఒకానొక కాలములో సముద్రం దగ్గర రెండు టిట్టిభ పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ రెండు పక్షులు ఎంతో సంతోషంగా ఉండేవి. ఆడపక్షి గుడ్లుపెట్టే సమయము వచ్చింది. ఆ పక్షి దంపతులు ఎక్కువ గుడ్లు పెట్టాలన్న విషయం మీద వాదులాడుకోసాగాయి. మగపక్షి ఆ సముద్రపు ఒడ్డునే ఇసకలో గుడ్లు పెట్టమని చెప్పింది. కానీ ఆడ పక్షి సముద్రపు అలలలో గుడ్లు కొట్టుకు పోతాయేమోనని భయపడసాగింది. కానీ మగపక్షి.....ఆడపక్షి  మాట వినలేదు......సముద్రుని వల్లే కాదు ఎవరివల్లా ఏ భయము ఉండదని నొక్కి చెప్పింది. ఆ మాటలని విని సముద్రుడు నవ్వుకున్నాడు. 

ఆడపక్షి సముద్రతీరాన్నే గూడుకట్టి గుడ్లు పెట్టింది. ఆ పక్షులు ఆహారము కోసం వెళ్ళినప్పుడు సముద్రుడు తన అలలతో ఆ గూటిని గుడ్లను నీటిలోకి లాక్కునిపోయాడు. 

గూడు గుడ్లతో సహా మాయమయ్యినందుకు పక్షులు చాలా బాధపడ్డాయి. సముద్రుని మీద కోపించి నీటిని తొడివేసి ఆ సముద్రున్ని ఎండగట్టాలని నిశ్చయించుకొన్నారు. తమ ముక్కులతో నీటిని తోడి, దూరంగా పోయసాగాయి. అంతులేని మహాసాగరాన్ని తమ చిన్న-- చిన్న ముక్కులతో ఎందకట్టటం సాధ్యమయ్యే పనేనా?అయినా ఆ పక్షులు అలా పట్టువదలకుండా అసాధ్యమయినా ఆ పనిని చేస్తూనే ఉన్నాయి 

వాటి పట్టుదలను చూసి. పక్షులరాజైన గరుక్మంతుడు జాలిపడ్డాడు. సముద్రుని మీదకు యుద్దానికి వచ్చాడు . సముద్రుడు భయపడి వాటి గుడ్లను తిరిగి ఇచ్చాయి. ఆ పక్షులు సుఖంగా జీవించాయి. 

నీతి:---పట్టువదలకుండా పనిచేసేవాడికి అన్ని సానుకూలమవుతాయి.


ఏకలవ్యుడు

ఏకలవ్యుడు

మన పురాణాలలో చెప్పుకోదగిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అందులో ఏకలవ్యుడు ఒక మహానుభావుడు. ఈ రోజు ఏకాలవ్యుడుని గురించి తెలుసుకుందాము.

హిరణ్యధనువనే ఒక బోయరాజు ఉండేవాడు. అతనికి ఏకలవ్యుడనే ఒక కుమారుడున్నాడు. ఏకలవ్యుడు చాలా చురుకుదనం, పట్టుదల కలవాడు. అతడు విలువిద్య నేర్చుకోవాలని అనుకున్నాడు. ఆ కాలంలో ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు ధనుర్విద్య నేర్పించేవాడు. అందుచేత ఏకలవ్యుడు ద్రోనచార్యులవారి దగ్గరకు వెళ్ళి, తనకు విలువిద్య నేర్పమని ప్రార్ధించాడు. కానీ ద్రోణాచార్యుడు అతన్ని తన శిష్యునిగా అంగీకరించలేదు.

ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వద్ద సెలవు తీసుకుని తానున్న అడవికి వెళ్ళిపోయాడు. గురువు దొరకలేదని అతడు నీరుగారిపోలేదు. అతడి పట్టుదల మరింత పెరిగింది. అడవిలోనే ఒక గుడిసె నిర్మించుకుని, ఏకలవ్యుడు స్వయంగా మట్టితో ద్రోనాచారుల విగ్రహాన్ని చేసుకుని, అతనినే గురువుగా స్వీకరించాడు. ప్రతీరోజూ భక్తితో ఆ విగ్రహాన్ని ప్రదక్షిణ నమస్కారములు చేసి, బాణాలు వేయడాన్ని నేర్చుకొనసాగాడు. తనంతట తానుగా, ఒంటరిగా, గంటల తరబడి సాధన చేయసాగాడు. రోజంతా ధనుర్విద్య గురించే ఆలోచించేవాడు, కలలుకనేవాడు. విలువిద్యను గురించిన ఆలోచనలతో అతని మనస్సంతా నిండిపోయింది. దానితో అతని మనస్సే అతనికి గురువై, ధనుర్విద్యలోని మెలకువలను, గొప్పగొప్ప రహస్యాలని తెలియచేసింది. క్రమంగా తన గొప్ప సంకల్పశక్తి వల్ల, గురువుమీద ఉన్న అఖండమైన భక్తి వల్ల, విలువిద్యలో ఏకలవ్యుడు గొప్ప ప్రావీణ్యతను సంపాదించాడు. దాని ఫలితంగా అతడు ధనుర్విద్యలో అందరినీ, చివరకు తన గురువును కూడా మించిపోయాడు.

ఏదైనా సరే నేర్చుకోవాలనే బలమైన కోరిక(ఆకాంక్ష)ఉన్నవానికి అతని మనస్సే గురువై అన్నీ నేర్పిస్తుందని మనకు ఏకలవ్యుని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

 
           

గురుశిష్య సంబంధం

గురుశిష్య సంబంధం

మంచిగురువు మనకు దొరకుట చాలా కష్టం, అది సాధ్యమయ్యే పని కాదు. గురువు మనల్ని,  అతని శిష్యునిగా  స్వీకరించాలి తప్ప , ఇతనే మన గురువు అని మనం నిర్ణయించాము అంటే, అతనికన్నా మనమే గొప్ప అన్నమాట, అదే జరిగినట్లయితే, అతను మన గురువు ఎలా అవుతారు ? మన అజ్ఞానం తప్ప.

మనకు తెలియకుండానే మనల్ని స్వీకరించి, మనకు కనపడకుండానే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ, అవసరమైన సమయంలో, తన వద్దకు చేరదీస్తాడు గురువు.

మననుంచి ఏమి ఆశించరు, మనమీద ఆధారపడరు, తన నమ్మకాలను, విశ్వాసాలను మనపై నిలబెట్టేవారే అసలైన గురువు. మన శ్రేయస్సు కోరి, మనల్ని తనంత గొప్పగా తీర్చి దిద్దేవారే నిజమైన గురువు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము.

ఒక అయస్కాంతం తన సాన్నిధ్యం చేత, మరో ఇనుప ముక్కను, అయస్కాంతంగా చేస్తుంది. అయస్కాంతం---ఇనుప ముక్కలోని, ఏ భాగాన్ని తొలగించదు. తనలోని ఏ భాగాన్ని, ఇనుప ముక్కలోకి చొప్పించుట లేదు. ఇనుపముక్కలోని నిఘూడంగా దాగిఉన్న అయస్కాంత ధర్మాన్ని, తన శక్తితో మేల్కొల్పుతున్నది. గురువు కూడా అలాగే తన శక్తి మనకు ధారపోసి, తన అంత శక్తిమంతుని వలె తీర్చిదిద్దుతున్నారు.

దైవం కొరకు అన్వేషణ మొదలుపెట్టిన శిష్యుని మనసులో, గురువు వాక్కు, మజ్జిగ చుక్కై తోడవుతుంది. ఆపైన క్రమంగా పాలు పెరుగైనట్లు, శిష్యుని మనసు నిశ్చలత్వాన్ని పొందుతుంది. ఆ పైన సత్కర్మాచరణ అనే చిలకటం ద్వారా, అనుభూతి అనే వెన్నగా పైకి తేలుతున్నది. ఇలా వెన్నలా రూపొందిన శిష్యుడు, వెన్న మజ్జిగలో తేలుతూ, మజ్జిగకు మంచి రుచి ఇచ్చినట్లు, తన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఉంటూ, ఆ ప్రపంచానికే దివ్యనుభూతిని ప్రసారం చేసే, కేంద్రంగా రూపొందుతాడు. అంటే తయారైన ఈ మజ్జిగ ఎన్ని పాలకుండలకైనా తోడుగా పనికి వస్తుంది. వెన్న ఎంత కలిపినా మజ్జిగలో కలవనట్లు, ఎలాంటి పరిస్తితులు ఎదురైనా, పూర్వపు స్థితి లోకి వెళ్ళుట జరగదు.

గురుశిష్య సంబంధాలు,ఆధ్యాత్మిక రంగంలో విలక్షణమైనవి. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు........ అని చిత్తశుద్ధితో నమ్మినవాడే అసలైన శిష్యుడు అని పిలవబడతాడు.


October 26, 2013

భగవన్నామ సంకీర్తన మహత్యము:--


భగవన్నామ సంకీర్తన మహత్యము:--

వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని వారి పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టిన పేరుగా పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి యొక్క సమస్త పాపాలను నసింపచేస్తుందట. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితమిస్తుందంటే.........ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు.... స్వయంగా పరమాత్మనే ఇక్కడకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడంట.

నాహం నాసామి వైకుంఠె యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll

నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా నేను వైకుంఠములో ఉంటాననుకుంటున్నారు... కానీ నేను వైకుంఠములో లేను, ఉండను.... కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతుంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను...అని చెప్పారంట. అందుకేనేమో నారద మహర్షుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడంట.

హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా ll

ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదంట.

ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభించండి. ఒకవేళ మనం రేపే ప్రయాణమవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక.... మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది.