శ్రీ
కృష్ణభక్తుడు – జయదేవుడు
జయదేవుడు జన్మతః ఓడ్రుడై, వంగదేశంలో జీవించి, వాగ్గేయకారుడై, అక్కడ రాజపోషణ
పొంది, ప్రసిద్ధుడై ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన భారతదేశానికంతకు ఆది ప్రబంధకర్తగా
ఆరాధ్యుడయ్యాడు. ‘వాగ్దేవతా చరిత చిత్రిత చిత్త పద్మా – పద్మావతీచరణ చారణ చక్రవర్తి’ అని చెప్పుకున్నారు. ఇతని భార్యపేరు పద్మావతి.
వారిరువురి దాంపత్యం అన్యోన్యమైంది.
ఆదర్శమైంది. అంతకుపూర్వం ఏకవి సాహసించని నవ్యరీతిని ఇతడుభార్యపేరును తన
పేరుతో చేర్చి ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అనీ, జయతి పద్మావతీ సుఖసమాజే – భణతి జయదేవ కవిరాజరాజే’ – అనీ, పలుచోట్ల పల్కి, తనకు ఆమె పట్ల గల
అనురాగాన్ని వ్యక్తం చేసాడు. ఆమె అనురాగ ప్రోత్సాహాలే తన కవితకు ప్రేరకాలంటారు.
ఆయన కీర్తనలు పాడుతుంటే ఆమె చరణాలు నర్తించేవట.
ఒకనాడు జయదేవుడు తన ‘గీతగోవిందం’ కావ్యంలో ‘వదసి యది కించిదపి’ అనే అష్టపది రచిస్తున్నాడట. ‘స్పర్శగరళ ఖండనం మామ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం’ అని శ్రీకృష్ణుడు మన్మథ
విషయంలో ఉద్రేకించిన తన శిరస్సుపైన రాధ పదపల్లవమనే చిగురాకును ఔషధంగా చేర్చమని
రాధను ప్రాధేయపడతాడు. ఇలా రాసిన తరవాత భగవంతుడంతటివాని తలపై స్త్రీ పాదాలను
చేర్చుట ఏమిటని అనిపించి, ఆ పంక్తులను కొట్టివేసి, అభ్యంగన స్నానానికి వెళ్ళాడట. ఆ
తరవాత శ్రీకృష్ణుడు ఒంటికి నూనె రాసుకున్న జయదేవుని రూపంలో వచ్చి, కొట్టివేసిన ఆ
పంక్తులనే తిరిగి వ్రాసి వెళ్ళాడట. స్నానాంతరం జయదేవుడు ఆ పంక్తుల విషయం భార్యను
ప్రశ్నిస్తే ‘మీరే వచ్చి వ్రాసి వెళ్ళారు కదా ?’ అని పత్రంపై తైలపు చుక్కలను కూడా చూపిందట. శ్రీకృష్ణుడే
ఆమెకు ప్రత్యక్షమై ఆ భావం ఉచితమేనని తెలియచేసినందుకు ఆయన పొంగిపోయాడు. భార్యను
అభినందించి ‘జయతి పద్మావతీ రమణ జయదేవ కవిభారతీ భణితమతిశాతం’ అని పూరించాడట. దీనిని
సంగీత సాహిత్యజ్ఞులు’దర్శనాష్టపది’ అని అంటారు. దీనికే ‘సంజీవనీ అష్టపది’ అని కూడా పేరు.
జయదేవుని గీతగోవిందం వంటిదే రాజయిన లక్ష్మణసేనుడు కూడా రచించాడు. కానీ ఆనతి
ప్రజలు జయదేవుని అష్టపదులనే ఆదరించేవారట. దానికి ఆ రాజు అసూయచెంది, పండిత సమక్షంలో
జయదేవుని పిలిపించాడట. ఆ రెండు రచనలలో ఏది గొప్పదే తెలుసుకోవటానికి రెంటిని
జగన్నాథ ఆలయంలో ఉంచి, మర్నాడు తలుపులు తెరిచారట. జయదేవుని కావ్యం ఆ స్వామి
శిరస్సుపైన, ఆ రాజు గ్రంథం క్రిందన పడవేసి ఉన్నాయట. రాజు గర్వం తగ్గి, కవికి
సాష్టంగపడి, అతణ్ణి మెచ్చుకొని, గౌరవించాడట. ఆ రాజు పట్టమహిషి, పద్మావతి
పాతివ్రత్యాన్ని అందరూ మెచ్చుకుంటుంటే ఈర్ష్య చెందిందట. ఒకనాడు రాజు జయదేవునితో
వేటకై గ్రామాంతరం వెళితే, అతడు (జయదేవుడు) పులివాతపడి మరణించాడని పద్మావతికి కబురు
చేసింది. ఆ దుర్వార్త విన్న పద్మావతి తరువులా కూలిపోయిందట. ఆమె మరణవార్త విన్న
జయదేవుడు ‘వదసి యది కించిదపి’ అనే దర్శనాష్టపదిని గానం చేయగానే పద్మావతి కళ్ళు విప్పి లేచిందట. అందుకే
దానికి ‘సంజీవనీ అష్టపది’గా ప్రతీతి.
సాహిత్యరీత్యా ‘గీతగోవిందం’ అలంకారికులకు ప్రామాణికమైనది. 24 అష్టపదులతో 80కి మించిన శ్లోకాలతో 12 సర్గల
గేయ ప్రబంధమది. ఏ పంక్తి చూసినా రసస్ఫూర్తితో, కొమలపదాలతో హృదయాన్ని
పరవశింపచేస్తుంది.
“యది
హరిస్మరణే మనో
యది విలాసకలాసు కుతూహలం
మధుర కోమల కాంత పదావళీం
శ్రుణు తదా జయదేవ సరస్వతీంll”
అని తన శబ్ద మాధుర్యం గూర్చి తానే చెప్పుకోగల్గిన ఆత్మవిశ్వాసం, శిల్పచాతుర్యం
గల మహాకవి జయదేవుడు. ‘ప్రళయ పయోధిజల్’ అనే దశావతార అష్టపది కావ్యానికి మకుటాయమైంది. రాధాగోవిందుల ప్రణయ, విరహ, విశ్లేష, కలహ, ఖండన,
సానునయ, సమాగమ, సంధానముల ద్వారా జీవ బ్రహ్మైక్య సంధానవేదాంతం వ్యంజితమౌతుంది.
ఆంధ్రలో లీలాశుకుడు, అన్నమాచార్యులు, నారాయణతీర్థులు, రామదాసు మొదలగువారి కవితల్లో
వ్యాపించిన భక్తికవితావాహినికి జన్మస్థానమైన గంగోత్రి జయదేవుని గీతగోవిందమే. భక్త
మీరాబాయి భర్త మహారాణా కుంభకర్ణుడు గీతగోవిందానికి ‘రసమంజరి’ అనే వ్యాఖ్యను,
తిరుమలరాయని ఆస్థానంలోని చెరుకూరి లక్ష్మీధరుడు ‘శృతిరంజని’ వ్యాఖ్యను రచించారు.
జయదేవుని అష్టపదులను సంగీత విద్వాంసులు అనేక బాణీలతో వారివారి సంప్రదాయానుసారం
గానం చేస్తుంటారు. జయదేవుని గీతగోవింద రచనా పద్ధతిని ఎందరో అనుకరించినవారున్నారు.
శ్రీ చంద్రశేఖర సరస్వతీస్వామి ‘శివాష్టపది’, - రామకవి ‘రామాష్టపది’. – వేంకటమఖి ‘త్యాగరాజాష్టపది’ రచించారు. 18వ శతాబ్దంలో
కళువె వీరరాజు అనే వాగ్గేయకారుడు పార్వతీపరమేశ్వరులను నాయికా నాయకులుగా చేసి ‘సంగీత గంగాధరము’ రచించారు. ఈవిధంగా
జయదేవుని గీతగోవిందం ఎందరికో శిరోధార్యమై, మార్గాదర్శకమై భక్తిసుధలను
పంచింది.
No comments:
Post a Comment