Showing posts with label తిరుప్పావై పాశురాలు (భావసహితము). Show all posts
Showing posts with label తిరుప్పావై పాశురాలు (భావసహితము). Show all posts

January 11, 2014

గోదా కళ్యాణం

గోదా కళ్యాణం


మాస విశిష్టత 
సౌరమానము ప్రకారము సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన మాసము కావున ఈ మాసమునకు 'ధనుర్మాసము' అని పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రంలో ఉంటే, ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారు. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం రావటం వలన ఈ మాసమును మార్గశిర మాసము అంటారు. మార్గము అనగా -- దారి. శీర్షము అనగా --- ముఖ్యమైనది. అనగా భగవంతుని చేరు మార్గములలో ముఖ్యమైన దానిని తెలుపబడిన మాసము కావున, మార్గశీర్ష మాసము అని అనబడును. మనకెలాగైతే దినమునందు బ్రాహ్మీ ముహూర్తము సత్వగుణ ప్రభావము కలదని భావింపబడునో, అదే విధముగా మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వలె చాలా సత్వగుణ ప్రభావము కలదని దేవతలు భావింతురు. అలాంటి పవిత్రమైన మాసంలో గోదాదేవి వ్రతమును ఆచరించింది కావున ఈ వ్రతానికి గొప్ప విశిష్టత లభించింది.       

గోదా జననం
యజ్ఞవాటికికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా --- విష్ణుచిత్తుల వారు తులసివనంలో మొక్కలకి గొప్పులు తవ్వుతుండగా అతనికి ఒక బాలిక లభించినది. వారికి సంతానము లేకపోవుటచే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకొనుచు .... 'కోదై' (పూలదండ) అనే పేరుతొ పిలుచుకుంటూ ఉండేవారు. ఆ పేరే క్రమేపి 'గోదా' అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది. ఆమె బాల్యము నుండి జన్మసిద్ధమగు పరిమళముగల తులసివలె - జ్ఞాన, భక్తి, వైరాగ్యములు కలిగి భగవత్గుణముల యందే ఆశక్తి కలిగి యుండెడిది. తన తండ్రి ద్వారా భగవత్ కథలను విని, ఆ భగవంతునినే తన ప్రియునిగా భావించి, వివాహమాడదలచినది. పూర్వము ద్వాపరయుగమున వ్రజభూమిలో, గోపికలు కాత్యాయిని వ్రతము చేసి, కృష్ణుని పొందినట్లుగా తెలుసుకొని, తాను కూడా శ్రీవిల్లిపుత్తూరునే వ్రజభూమిగా భావించి, తన తోటి చెలికత్తెలనే గోపికలుగా భావించి, తాను కూడా వారిలో ఒక గోపికగా ఉండి, ఆ వటపత్రసాయి ఆలయమునే నందగోప భవనముగా భావించి, ఆ ఆలయములో నున్న వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా తలచి 'మార్గశీర్ష వ్రతాన్ని' ఆచరించినది. ఆ వ్రతమును తరువాతి తరముల వారికి అందించవలెనని, ఒక్కో పాటలో --- మనం ఏంతెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలి,  అనే విషయాలని,  ముప్పై రోజులు ముప్పై పాశురాలుగా (పాటల రూపంలో) భగవంతుని కీర్తించి అందరికీ  'తిరుప్పావై' ప్రబంధముగా అందించింది.


గోదా కల్యాణం
చిన్నప్పటి నుండి గోదాదేవి శ్రీరంగనాథుని యందే మనస్సు లగ్నం చేసి ఆరాధించుచుండెను. ప్రతీరోజు భగవంతునికి అర్పింపవలసిన పుష్పమాలికను తాను ధరించి, అద్దంలో చూసుకొని, మళ్ళీ ఆ మాలను అదే స్థలంలో పెట్టెడిది. ఆ విషయం తెలియక విష్ణుచిత్తులవారు ఆ మాలను భగవంతునికి సమర్పించెడివారు. ఒకరోజు ఈ దృశ్యమును విష్ణుచిత్తులవారు గమనించి, ఆరోజు భగవంతునికి మాలికను సమర్పించకుండిరి. అదేరోజు రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తులవారికి కలలో ప్రత్యక్షమై, "గోదా ధరించి విడిచిన మాలనే నాకు సమర్పించు, అవియే నాకు అత్యంత ప్రీతికరం" (ఆరోజు నుండి విష్ణుచిత్తులు అదే విధంగా చేయుచుండిరి.)  "నేనే - నీకుమార్తెను వివాహమాడెదను. వివాహమహోత్సవానికి నా అజ్ఞ మేరకు తగిన సామగ్రులను తీసుకొని, పాండ్య మహారాజు ఘన స్వాగతంతో మిమ్ములను దంతపుపల్లకిలో ఆహ్వానించెదరు" అని చెప్పి అంతర్థానమయ్యెను. విష్ణుచిత్తులు మేల్కొని, ఆనందోత్సాహముతో తన జన్మ సార్థకమయ్యిందని, పొంగిపోతూ తెల్లవారిన తరవాత గోదాదేవిని తీసుకొని, శ్రీరంగమునకు వెళ్ళెను. శ్రీరంగమున అందరూ చూస్తుండగా పల్లకీ దిగి, గోదాదేవి గర్భగుడిలో ప్రవేశించి, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి, స్వామి దివ్య తిరువడి గళ్ళలో (పాదపద్మములలో) అంతర్ధానమయ్యెను.  


మాలను ధరించి విడుచుట వలన గోదాదేవికి "ఆముక్తమాల్యద" అనియు, "శూడిక్కొడుత్త నాన్చియార్" అనే దివ్య నామములు కలిగెను. ఆమెనే "ఆండాళ్" అని కూడా అందురు. (ఆండాళ్  అనగా -- రక్షించుటకు వచ్చినది).


విగ్రహ రూపంలో ఉన్న స్వామిని వివాహమాడి, గోదమ్మతల్లి  భోగములను అనుభవించినది కావున, ఈ రోజుని 'భోగి' అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వ భోగ భాగ్యాలు లభించునని మన పెద్దలు చెప్పారు. భోగభాగ్యాలు కలిగించే పండుగ కనుక భోగి పండుగ అని కూడా అంటారు.

"శ్రీ ఆండాళ్ దివ్య తిరువడి గళే శరణం"
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 
_______/\_______

December 13, 2013

శ్రీగోదా అష్టోత్తర శతనామావళి

శ్రీగోదా అష్టోత్తర శతనామావళి 

 ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం గోదాయై నమః
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
ఓం సత్యై నమః
ఓం గోపీవేషధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భూసుతాయై నమః
ఓం భోగశాలిన్యై నమః
ఓం తులసీకాననోద్భుతాయై నమః
ఓం శ్రీయై నమః                                                                     (10)

ఓం ధన్విపురవాసిన్యై నమః
ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
ఓం అమూక్త మాల్యదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం రంగనాథ ప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం యతిరాజసహోదర్యై నమః                                             (20)

ఓం కృష్ణానురక్తాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం సులభశ్రియై నమః
ఓం సలక్షణాయై నమః
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం దయాంచిత దృగంచలాయై నమః
ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
ఓం రమ్యాయై నమః
ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః                                         (30)

ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
ఓం నారాయణసమాశ్రితాయై మనః
ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
ఓం బ్రహ్మణ్యాయై మనః
ఓం లోకజనన్యై మనః
ఓం లీలామానుషరూపిణ్యై మనః
ఓం బ్రహ్మజ్ఞాయై మనః                                                    (40)

ఓం అనుగ్రహాయై నమః
ఓం మాయాయై నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
ఓం మహాపతివ్రతాయై నమః
ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
ఓం ప్రపన్నార్తిహరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదసౌధవిహారిణ్యై నమః
ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః                                           (50)

ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
ఓం రంగమంగళ దీపికాయై నమః
ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
ఓం తారకాకారనఖరాయై నమః
ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
ఓం శోభనపార్షికాయై నమః
ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
ఓం పరమాయై నమః                                             (60)

ఓం అణుకాయై నమః
ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
ఓం విశాలజఘనాయై నమః
ఓం పీనసుశ్రోణ్యై నమః
ఓం మణిమేఖలాయై నమః
ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
ఓం భాస్వద్వళిత్రికాయై నమః                              (70)

ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
ఓం నవమల్లీరోమరాజ్యై నమః
ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
ఓం కల్పమాలానిభభుజాయై నమః
ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం సుచుబుకాయై నమః
ఓం బింబోష్ఠ్యై నమః                                        (80)

ఓం కుందదంతయుజే నమః
ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
ఓం ముక్తాశుచిస్మితాయై నమః
ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
ఓం సుగంధ వదనాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం అర్థచంద్రలలాటికాయై నమః                  (90)

ఓం పూర్ణచంద్రాననాయై నమః
ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
ఓం సౌందర్యసీమాయై నమః
ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః        (100)

ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
ఓం శ్రీరంగనిలయాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం దివ్యదేశ సుశోభితాయై నమః                       (108)

ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం శ్రీమహాలక్శ్మై నమః
ఓం శ్రీభూదేవ్యై నమః
ఓం శ్రీనీళాదేవ్యై నమః
ఓం శ్రీగోదాదేవ్యై నమః
ఓం శ్రీఅనంతాయ నమః
ఓం శ్రీగరుడాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
ఓం శ్రీపరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః

ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః



December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ముప్పయవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ముప్పయవ పాశురము
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై 
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి 
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై 
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న 
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే 
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్ 
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్ 
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్ !
శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం....


భావం:-
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మదింపచేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చినవారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకుల కొరకును, భవద్దాస్యమును తమకొరకు పొందిరి. ఆప్రకారమున అంతనూ లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తమరపూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీభట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి, పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బహు శిరస్సులు కలవాడును, శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు ఆ శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. 

అవతారిక:-
గోదాదేవి -- గోపికలు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రతసమాప్తి చేసి, వ్రత ఫలమును తాను కూడా పొందినది. శ్రీకృష్ణసమాగమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీరంగనాథుని భర్తగా పొందినది. శ్రీరంగము నుండి శ్రీరంగనాథుడు వ్రతసమాప్తి సమయమునకు తమ అంతరంగభక్తులను ఆండాళ్ తల్లి ఉన్న శ్రీవిల్లిపుత్తూరునకు పంపి ఆమెను శ్రీరంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను. అంత శ్రీభట్టనాథులు వారి శిష్యులుగా వల్లభరాయలతో సహా శ్రీరంగమునకు ఆండాళ్ తల్లిని తీసుకొని వెళ్ళెను. అచ్చట స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షమున శ్రీగోదాదేవిని తమతో చేర్చుకొనెను. అందుచేతనే గోదా - శ్రీరంగనాథ కళ్యాణ దినమునకు 'భోగి' అను వ్యవహారము కలిగెను. భోగము అనగా పరమాత్మానుభవమే. దానిని పొందిన దినము అగుటచే భోగి అనుట ఈ పండుగకు సార్థకము. 

ఈ వ్రతము అందరు ఆచరింపదగినది. ఈ వ్రతమును ఆచరింపలేకపోయినను, నిత్యము ఈ ముప్పది పాశురములు తప్పక అభ్యాసము చేయు వారికి కూడా తాను వ్రతము చేసి పొందిన ఫలము లభింపవలెనని గోదాదేవి ఈ పాశురమున ఆశించుచున్నది. 

గోదాదేవి తాను గోపికగానే వ్రతము చేసినది. ఫలము భగవత్ప్రాప్తి. అట్టి భగవానుడే అమ్మవారిని పొందుటకై చేసిన యత్నము పాలసముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. అందుచే మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటే, స్వామియే మనను పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమృతమథన వృత్తాంతము ఇందు కీర్తించుచున్నారు. ఈ ముప్పది పాశురములు పఠించినవారిని ఆనాడు పాలసముద్రమును మథింప చేసి లక్ష్మిని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నించి పొందును. ఈవిధంగా ఈ పాశురమున  ఫలశృతి చెప్పబడినది.      


                 

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైతొమ్మిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైతొమ్మిదవ పాశురము
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్ 
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్ 
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ 
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు 
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా ! 
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో 
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్ 
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్ !



భావం:- 
బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్నచోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరుపూవులు వలె సుందరములు రామణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరవాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి 'పఱ' ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ .... ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలు ఏవియూ లేకుండునట్లు చేయుము. 

అవతారిక:-
మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము. పెద్దల సంతృప్తికే తాము స్నానవ్రతము ఆచరించుదుము అనియూ, ఆ వ్రతమునకు 'పఱ' అను వాద్యము కావాలెననియు బయలుదేరి శ్రీకృష్ణుని చేరి ఆ 'పఱ' ను ఇచ్చి తమకు ఆ వ్రతమును పూర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను, పరమాన్న భోజనములు చేయింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించిరి. ఈ గోపికలు 'పఱ' అనుచున్నది మామూలు పఱ కాదు. వీరు ఏదో కోరుతున్నారు .... వారే చెప్పుదురు - అని తాను మాటాడక ఊరకుండెను. అంత గోపికలు 'అయ్యో ! మన ఆర్తీ .... తొందర ఇతనికి తెలియుటలేదే అతడే ఉపాయము అని నమ్మినను , అతడే కాపాడునని ఊరక ఉండలేమే ' అని భగవద్విషయ రుచి తొందర పెట్టగా, తమ కోరికను శ్రీకృష్ణునికి తెలిపి నిత్యకైంకర్యమును - ఫలమును నీవే సమకూర్చవలెనని ఈ పాశురమున గోపికలు చెప్పుచున్నారు.       

   

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఎనిమిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఎనిమిదవ పాశురము
కఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్, 
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై 
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్ 
కుఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు 
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు 
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై 
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే 
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్. !



భావం:- 
పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లొపములున్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా ! ఓ స్వామీ ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద తెలియని పిల్లలము. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరుపెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక ఉండకము. మాకు ఆపేక్షితమగు 'పఱ' ను ఒసంగుము. అని గోపికలు అందరు స్వామికి శరణాగతిని చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు. 

అవతారిక:-
భగవానునే ఉపాయముగా ఆశ్రయించువారు సర్వోపాయములను పరిత్యజించవలెను. అది వారి - వారి స్థితిని బట్టి భిన్న - భిన్నముగా ఉండును. కర్మ జ్ఞాన భాక్ష్యాద్యు ఉపాయములను ఇదివరకు సాధనములు అనుకొని ఆచరించినవారు వదలితిని అని నివేదించవలెను. వానిని ఆచరించుటకు అశక్తులు ఐనవారు .... స్వామీ ! నేను అట్టి సాధనములను ఆచరింప అసమర్ధుడను అనవలెను. ఆచరింపవలెనని తెలిసియూ తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగినవి కాదు కదా ! అని అనవలెను. బొత్తిగా వాని విషయమునే తెలియని వారు నేను వేరొక ఉపాయముందని తెలియలేము స్వామీ ! అనవలెను. గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనముండునని తెలియనివారు మాకేమియూ విడువదగినది లేదు స్వామి అని ఈ పాశురమున విన్నవించుచున్నారు.  


    

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఏడవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఏడవ పాశురము
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై 
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్ 
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ 
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్, 
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు 
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార 
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ !



భావం:-
తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తరువాత మంచి వస్త్రములు దరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా - హాయిగా భుజించవలెను. 

అవతారిక:-
గోపికలు తాము ఆచరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాశురమున విన్నవించిరి. అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే ఐనను, వారు కోరిన గుణములుగల ద్రవ్యములు దుర్లభములు. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను కోరుటకాదు, నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకొనెను. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు.          


          

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఆరవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఆరవ పాశురము
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్ 
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్ 
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన 
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే 
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే 
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే 
కోలవిళక్కే, కొడియే, విదానమే 
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్. !



భావం:-
ఆశ్రిత వ్యామోహము కలవాడా ! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా !అఘటితఘటనా సామర్ధ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీవద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను. 

ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనెడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద 'పఱ' అను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాశురమున ప్రార్థించిరి. 

అవతారిక:-
భగవానుడే ఉపాయము, భగవానుడే ఫలము అని అని విశ్వసించి యుండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతరములగు వానిని కాంక్షింపరాదు. మరొక వ్రతములను ఆచరింపరాదు. మార్గశీర్ష స్నాన వ్రతము, వ్రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము. గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము. ఉపాయములలోకెల్ల శ్రేష్ఠమగు భగవానుని అనుభవమున అవగాహించుటయే మార్గశీర్షస్నానము. ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాశురములో కోరుచున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగమున తమ భగవదనుభూతికి కావలసిన సామగ్రిని కోరుచున్నారు.        


తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఐదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఐదవ పాశురము
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, 
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద 
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్ 
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై 
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్ 
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి 
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్. !



 భావం:-
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా ! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి, వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపినా ఆశ్రిత వ్యామోహము కలవాడా ! నిన్నే కోరి వచ్చినారము. 'పఱ' అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. 

అవతారిక:-
గోపికలు ఈ పాశురములో శ్రీకృష్ణుని జన్మరహస్యమును కీర్తించుచు దానివలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు. కృష్ణుడు అవతరించిన తీరును, పెరిగిన తీరును తలచుకొని ఆ వాత్సల్యమునకు ముగ్ధులై ఆళ్వార్లు మూర్ఛనొందిరి. అట్లే గోపికలు వెనుకటి లీలలన్నిటికంటే చివరగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశలగుచున్నారు. 

గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమకాని కేవల వ్యామోహము కాదు. భగవత్తత్వముగా ఎరింగి ఆ పరతత్వము మనకై సులభముగా దిగివచ్చి, నాలుగు అడుగులు నడచి వచ్చిన మనలను చూచి శ్రమ అయినదని జాలి పడుచున్నాడే ? మనకై అతడు పడిన శ్రమలో మనము ఆతనిని పొందుటకై పడెడి శ్రమ ఎన్నవ వంతు ? అని అతని జన్మ ప్రకారము అనుసంధించుచున్నారు. 


                   

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైనాల్గవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైనాల్గవ పాశురము
అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి 
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి 
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి 
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి 
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి 
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి 
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్ 
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్. !



భావం:-
ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. 

రావణుడు సీతమ్మను అపహరించుకొనిపోగా ఆ రావణుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణదిశన ఉన్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. 

శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. 

వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిపెలరాయి విసిరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసురునపుడు ముందు - వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్యపాదములకు మంగళం. 

ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనను కోపముచే రాళ్ళవాన కురియగా గోపాలురకు, గోవులకు బాధకలుగుచుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. 

శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. 

ఈ ప్రకారముగా నీ వీరే చరిత్రములనే కీర్తించి పరయనెడి వ్రతసాధనము నందగ మేము ఈనాడు వచ్చినారము అనుగ్రహింపుము. 

అవతారిక:-
ఈనాడు గోపికలు 'శయనాగారము నుండి ఇటు నడచివచ్చి సింహాసనమును అధిరోహింపుము.' అనుటతోడనే ఆశ్రిత సులభుడగు శ్రీకృష్ణుడు వారిమాట మీరలేక తన మంచము నుండి దివ్య సింహాసనము వరకు నడచి వచ్చెను. నీలాదేవియు ద్వారభూమి వరకు మంగళాశాసనము చేయుచు అనుసరించినది. గోపికలు నడచి వచ్చుచున్న స్వామిని చూచినారు. స్వామి నీలాదేవితో కూడా వచ్చి, దివ్య సింహాసనమును అధిరోహించిరి. ఒక పాదమును పాదపీఠంపై నుంచి రెండవ పాదమును తొడపైనిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే, శ్రీకృష్ణుని దివ్యపాదముల ఎర్రదనము గోపికల కంటపడినది. తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే పాదములు కందినవని గోపికల హృదయము కలతచెందింది. వెలుపలికి వచ్చి సింహాసనమున కూర్చొని మేము వచ్చిన కార్యమును పరిశీలించుమని అర్థించిన గోపికలు 'పఱ' అను వాద్యమును కోరుత మరచి మంగళము పాడుటకు ఉపక్రమించిరి. 

ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణపరమాత్మా వలన తమ కార్యము నెరవేర్ప జూచినవారై, ఆ ప్రభువు నడచివచ్చి ఆశనముపై కూర్చుండగానే ఆ పాదముల ఎర్రదనము చూచి తాము చేసిన అపచారమునకు ఖిన్నులై మంగళము పాదనారంభించిరి.