December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఎనిమిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఎనిమిదవ పాశురము
కఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్, 
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై 
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్ 
కుఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు 
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు 
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై 
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే 
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్. !



భావం:- 
పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లొపములున్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా ! ఓ స్వామీ ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద తెలియని పిల్లలము. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరుపెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక ఉండకము. మాకు ఆపేక్షితమగు 'పఱ' ను ఒసంగుము. అని గోపికలు అందరు స్వామికి శరణాగతిని చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు. 

అవతారిక:-
భగవానునే ఉపాయముగా ఆశ్రయించువారు సర్వోపాయములను పరిత్యజించవలెను. అది వారి - వారి స్థితిని బట్టి భిన్న - భిన్నముగా ఉండును. కర్మ జ్ఞాన భాక్ష్యాద్యు ఉపాయములను ఇదివరకు సాధనములు అనుకొని ఆచరించినవారు వదలితిని అని నివేదించవలెను. వానిని ఆచరించుటకు అశక్తులు ఐనవారు .... స్వామీ ! నేను అట్టి సాధనములను ఆచరింప అసమర్ధుడను అనవలెను. ఆచరింపవలెనని తెలిసియూ తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగినవి కాదు కదా ! అని అనవలెను. బొత్తిగా వాని విషయమునే తెలియని వారు నేను వేరొక ఉపాయముందని తెలియలేము స్వామీ ! అనవలెను. గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనముండునని తెలియనివారు మాకేమియూ విడువదగినది లేదు స్వామి అని ఈ పాశురమున విన్నవించుచున్నారు.  


    

No comments:

Post a Comment