December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పన్నెండవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పన్నెండవ పాశురము
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంజ్గి 
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర, 
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్ 
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి 
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర 
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్ 
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్ !
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్ !

భావం:-- 
లేగదూడలుగల గేదెలు పాలుపితుకువారు లేక లేగదూడలను తలచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతిపెట్టునట్లుతోచి పాలు .... పొడుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి. మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతియైన రావణుని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి ఈ గాఢనిద్ర !ఊరివారికి అందరికి నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము ---- అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చెల్లిలిని మేల్కొలిపినారు. 

అవతారిక:-
భగవత్సేవాలక్ష్మి సంపన్నతగల ఒక గోపాలుని చెల్లెలిని ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఇతనికి సమృద్ధిగా గేదెలమంద కలదు. కాని పాలుపితకడు, పాలుకారి నెల అంతా బురదమయము అగుచుండును. అట్టివాని చెల్లెలు ఈమె. 
ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వవృత్తులను నియమించి ఉండును. ఇది కూడా ఒక విధమైన నిద్రవంటిది. ఇంతవరకు నాలుగు పాశురములలొ నలుగురు గోపికలను నిద్రించుట తగదని చెప్పి మేల్కొలుపుటలో ఈ స్థితప్రజ్ఞావస్థలోని దశాలనే వివరించారు.    


           

No comments:

Post a Comment