తిరుప్పావై పాశురాలు
నాల్గవ పాశురము
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్ !
భావం:--
గంభీర స్వభావుడా ! వర్ష నిర్వహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రమును సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకుపోయి, ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి, గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్యవిగ్రహమువలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రమువలె మెరసి ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి శార్జ్గ్నమును ధనుస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషంతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.
అవతారిక:--
గోపికలు తను వ్రతముచే లోకమంతటను పాడిపంట సమృద్ధిగా ఉండవలెనని కోరిరి. తన వ్రతమునకు స్నానము ప్రధానము కనుక ఆ స్నానము చేయుటకు అనుగుణమగు జలము సమృద్ధిగా ఉండవలెనని భావించిరి. వీరు కృష్ణభగవానుడే 'ఉపాయము - ఫలము' అని నిశ్చయించుకొని ఇతరమయిన వానిని వేనిని ఆశ్రయింపనివారు, ఇట్లు అనన్య భక్తితో పరమాత్మనాశ్రయించిన వారివద్ద భగవానునివద్ద వినయవిధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై యుందురు.
No comments:
Post a Comment