December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పద్దెనిమిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పద్దెనిమిదవ పాశురము
ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్ 
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ ! 
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్ 
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి 
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్ 
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ 
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప 
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్. !



భావం:-
ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగువంటి బలముకలవాడును, యుద్ధములో శతృవులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లుచున్న కేశపాశముగల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము. కోళ్ళు అంతట చేరి అరచుచున్నవి. మాధవీలత పాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. కావున తెల్లవారినది, చూడుము. బంతి చేతిలో పట్టుకొనినదానా ! మా బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి, నీవు సంతోషముతో లేచి నడచివచ్చి, ఎర్రతామర పూవును బోలిన నీచేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము. 

అవతారిక:-
గోపికలు కృష్ణుని పొంది అనుభవింపవలెను అనెడి ఆవేశంతో కృష్ణపరమాత్మ అగుపడగానే తము అనుభవింపవచ్చునని ఆశపడి మేలుకొలిపిరి. కృష్ణుడు మేల్కోలేదు, ప్రక్కనే ఉన్న బలరాముని మేల్కొలిపిరి, ఐనను కృష్ణుడు మేల్కోలేకపోవుటచే .... నీలాదేవిని ఆశ్రయించవలెనని ఆమెను ఈ పాశురమున మేలుకొలుపుచున్నారు. 

అమ్మవారికి 'పురుషకారము' అని వ్యవహారము. ఆమె మధ్యవర్తిని. జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు సర్వేశ్వరుని మార్చునది కావున ఆమెను 'పురుషకారము' అందురు. జీవులు తమ పాపములకు తామే నిష్కృతి ఒనర్చుకొని పరమాత్మను చేరలేరు. ఆమెను ఆశ్రయింపని వారు పరమాత్మను పొందలేరని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొలుపుచున్నారు. 

భగవానుని అమ్మవారిద్వారా ఆశ్రయించుట మహాకౌశలము. అట్టి కౌశలము కలవారగుటచేతనే భగవద్రామానుజులు శ్రీమన్నారాయణుని శరణము పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గద్యమున శరణము నొందిరి. 


  
                
             

No comments:

Post a Comment