December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పందొమ్మిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పందొమ్మిదవ పాశురము
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ 
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి 
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్ 
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్ 
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై 
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్ 
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్ 
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్. !



భావం:-
గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు - వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు .... తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవి యొక్క, స్తనములపై తన శరీరమును ఆనుకొని పరుండి, విశాలమైన కన్నులుగల ఓ నీలాదేవీ ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ? ఇంతమాత్రపు ఎడబాటుకూడా ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు తగదు. 

అవతారిక:-
గోపికలు క్రిందటి పాశురములో నీలాదేవిని మేలుకొలిపి, ఈ పాశురమున శ్రీకృష్ణుని, నీలాదేవిని కూడా మేలుకొనవలసిందిగా  అర్థించుచున్నారు. పరమాత్మని ఆశ్రయించునపుడు అమ్మవారిని ఆశ్రయించి చేరవలెను. ఆశ్రయించిన తరవాత లక్ష్మి - నారాయుణులను ఇద్దరినీ సమానంగా సేవించవలెను. అందుకే గోపికలు ముందు నీలాదేవిని ఒక్కరినే మేలుకొలిపి, ఈ పాశురమున లక్ష్మినారాయణులను మేలుకొలుపుచున్నారు. 

తనని గోపికలు అర్థించిరికదా అని ...... నీలాదేవి తలుపులు తెరవబోయింది. ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికముగా ప్రేమ చూపించును. కనుక తనే వచ్చి తలుపు తెరవవలెనని నీలాదేవిని వెనుకకు లాగి, మంచముపై పడవైచి, ఆమెపై తాను అదిమిపట్టి పరుండి యుండి, ఆమె స్పర్శ సుఖముచే ఒడలు మరచి తలుపు తెరవక ఊరకుండెను. స్వామిని మేలుకొలిపి, తలుపులు తెరవవలసిందిగా నీలాదేవిని అర్థిస్తున్నారు. అంత ఆ ఆర్తనాదము విని తలుపు తెరచుటకు స్వామి వెళ్ళుచుండగా  --- తలుపులు తెరచుటకు వీలులేదని నీలాదేవి తన కళ్ళతో ప్రతిబంధించినది.  అది చూచి గోపికలు "అమ్మా ! ఇది న్యాయము కాదు" అని నీలాదేవిని అర్థించిరి.                 


        

No comments:

Post a Comment