Showing posts with label విష్ణుసహస్రనామాలు. Show all posts
Showing posts with label విష్ణుసహస్రనామాలు. Show all posts

December 17, 2014

విష్ణుసహస్రనామాలు 02

విష్ణుసహస్రనామాలు 02

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞో‌உక్షర ఏవ చ || 2 ||

10 పూతాత్మా (The Pure Self)
;భూతములు ఆవిర్భవించి వృద్ధి చెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడై "పూతాత్మా" అని పిలవబడుతున్నాడు. "పూత" అనగా పవిత్రమైన, ఆత్మా అనగా స్వరూపము కలవాడు, పవిత్రాతుడు. నిర్గుణుడైన భగవానుడు పవిత్రాత్ముడై పూతాత్మా అని స్తుతించబడుతున్నాడు. పూతాత్ముడైన ఆదిదేవుణ్ణి స్తుతించినవాడు కూడా పవిత్రుడే అవుతున్నాడు. పవిత్రాత్ముడే పరమగమ్యమైన పరమాత్మ అని రాబోవు నామము ద్వారా తెలుసుకుంటాము.         

11 పరమాత్మా (The Supreme Self)
నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన కార్యకారణముల కంటే విలక్షణమైనవాడు "పరమాత్మా" అని స్తుతించబడుతున్నాడు. తాను అందరకు ఆత్మ అయ్యి, తనకు మరొక ఆత్మ లేనివాడు. ముక్త పురుషులు తమ స్వానుభవము ద్వారా తెలుసుకున్నది కూడా ఈ పరమాత్మ తత్వమే. అందుకే తాను ముక్తపురుషులకు పరమగతియై ఉన్నాడు. ఈ విషయం తదుపరి నామంలో వివరించబడింది.        

12 ముక్తానాం పరమాగతిః (The Supreme Goal of the Liberated)
ముక్తపురుషులకు పరమగమ్యమై ఉన్నాడు. గతి అనగా గమ్యము. గతి అను పదమునకు ముందు పరమా అను విశేణము చేర్చుటచేత ఉత్తమగమ్యము అని తెలుస్తున్నది. ఏది గ్రహించిన తరవాత మరొకటి గ్రహించటం అవసరంలేదో, ఏ స్థానం చేరితే జ్ఞానికి పునర్జన్మ లభించదో అదే పరమగతి అని తెలుస్తుంది. నదికి సాగరం పరమగతి అయినట్టు, మానవులకు భగవానుడు పరమగమ్యమై ఉన్నాడు. సాగరంలో కలిసిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి, అనంత సాగరంలో కలిసిన రీతిగా, భగవానుని చేరిన జీవి భగవత్ వైభవంలో కలిసిపోవుట జరుగుతోంది. అది కరిగిపోయే సమస్థితే కానీ, తిరిగివచ్చే దుస్థితి ఎంత మాత్రం కాదు. "దేనిని చేరిన తరవాత జీవులు తిరిగి రాలేరో అటువంటి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియచేసాడు. ముక్తులకు పరమగతి భగవానుడై ఉన్నాడని గ్రహించం కదా ! మరి అటువంటి పరమగతి శాశ్వతమా ? అశాస్వతమా ? అనే అనుమానం మనకు రావచ్చు. దానికి సమాధానం తదుపరి నామంలో తెలుసుకుందాం.            

13 అవ్యయః (The Unchanging)
వినాశము కానివాడు, వికారం లేనివాడు అయినందున "అవ్యయః" అని భగవానుడు కీర్తించబడ్డాడు.యితడు జరామరణములు లేక అవ్యయుడై ఉన్నాడని అందురు. కనిపించేది ఏదైనా పరిణామము చెందును. పరిణామము చెందే వస్తువు నశిస్తుంది. భగవంతుడు అలా పరిణామం చెందే వస్తు సముదాయంలో చేరడు. అందుకే తాను వస్తురహిత చైతన్యమై "అవ్యయః" అని స్తుతించబడ్డాడు. అవ్యయుడైన ఆ పరమాత్మను చేరినవారు మళ్ళీ ఈ జగత్తులోనికి రారు. మరి అవ్యక్తమైన అవ్యయ స్వరూపుడగు పరమాత్మను మనం ధ్యానించి, సాధించేది ఏముంది ? అవ్యక్తమైన పరమాత్మను దర్శించి, అనుభవించుట ఎలా ? అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే నామంలో తెలుసుకుందాం.                 

14 పురుషః (The person)
దేహమందు ఉండే చైతన్యమే పురుషుడై ఉన్నాడు. నవద్వారములు కలిగిన పురమునందు ఉన్నవాడు పురుషుడు. అని భగవానుడు భగవద్గీతలో తెలియచేసాడు. కనుక పురము ఉన్నవాడే పురుషుడు అవుతాడు కానీ, పురము తాను కాదు. "ఈ దేహము ఏర్పడక ముందే నేను ఉన్నాను అనేదే పురుషునకు పురుషత్వము" అని వేదము తెలియచేస్తోంది. శ్రేష్టమైన ఫలములను ఇచ్చువాడు పురుషుడు. ప్రళయకాలమున సకల భువనములను అంతమొందించువాడు పురుషుడు. "ఈ విశ్వమును పూరించి ఉండుటచే" పురుషుడు అయినాడు. పురుషుడే నారాయణుడు. కనుకనే చైతన్య స్వరూపుడైన పురుషుడే విశ్వమంతటికి అధారమై ఉన్నాడు. జీవుని దేహెంద్రియ మనోబుద్ధులలో జరుగు సమస్తమును తానే తెలుసుకుంటున్నాడు. తెలుసుకునే వాడే కానీ తగులుకొనేవాడు కాదు. ఊరకుండేవాడే కానీ ఊగులాడేవాడు కాదు. ఈ విషయాన్నే వచ్చే నామంలో తెలుసుకుంటాము.                  

15 సాక్షీ (The Witness) 
 సా + అక్షి = చక్కగా దర్శించువాడు. సమస్తమును చక్కగా దర్శించువాడు సాక్షి. ఇంద్రియ మనో బుద్ధులు అవసరములేకుండానే సమస్తమును దర్శించగలవాడు "సాక్షి" అనబడతాడు. సాక్షి అయినవాడు కేవలం చుసేవాడే కానీ కర్తకాడు. చైతన్య స్వరూపమై దేహములోనే ఉంటూ, దేహెంద్రియ మనోబుద్ధులలో జరిగే సమస్త వ్యాపారాలని తానే చూస్తూ, దేనికీ అంటకకుండా ఉండుటచే అంతర్యామి సాక్షి అని పిలవబడుతున్నాడు. ప్రాణుల క్షేత్రములలో సాక్షిమాత్రుడు అని తెలియచేయగానే అతడు జ్ఞానపూరితుడై సాక్షి అని పిలవబడ్డాడా ? లేక గ్రహించనేరని సాక్షియా ? అనే సందేహం రాకుండా తాను జ్ఞానవంతుడై, సమస్తమును తెలుసుకొని సాక్షియై ఉన్నాడని వచ్చే నామం మనకు తెలియచేస్తోంది.          

16 క్షేత్రజ్ఞః (The Knower of the Field)
"క్షేత్ర" అనగా శరీరం. "జ్ఞః" అనగా తెలుసుకొనువాడు. "క్షేత్రజ్ఞః" అంటే శరీరంలో జరుగు క్రియలన్నిటినీ గ్రహించువాడు. శరీరములను వీనికి బీజములైన శుభాశుభ కర్మలను తెలుసుకొనుటచే ఆ యోగాత్ముడు క్షేత్రజ్ఞుడు  అని పిలవబడుచున్నాడు. క్షేత్రములు నశించును. మరి క్షేత్రజ్ఞుడు నశించునా ? నశించడు. క్షేత్రజ్ఞుడు అవినాశి. ఆ విషయం రాబోయే నామం తెలియచేస్తోంది.             

17 అక్షరః (The Imperishable) 
క్షరం కానివాడు లేక నాశరహితుడు. 'నక్షరతి" నశించడు కావున "అక్షరః" అని పిలువబడుతున్నాడు. "మాయ క్షరం అని, బ్రహ్మము అక్షరం అని వేదం తెలియచేస్తోంది. ఈ రెండవ శ్లోకంలో 17 వ నామం చివర "ఏవచ" అని ఉంది. "ఏవ" కారమునుబట్టి అక్షర క్షేత్రజ్ఞులకు పారమార్థికమగు(absolute) భేదం లేదు అని సూచన. "చ" కారమును బట్టి వ్యావహారిక(relative) భేదం కూడా లేదని తెలియవస్తోంది. అక్షర పురుషుడైన భగవానుడితో తాదాత్మ్యము చెందాలి. ఆ విషయాన్నే తరవాత వచ్చే నామంలో తెలియవస్తుంది. 

                  

December 16, 2014

విష్ణుసహస్రనామాలు 01

విష్ణుసహస్రనామాలు 01

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||

1 విశ్వం (The Universe) 
విష్ణుసహస్రనామ స్తోత్రంలో ప్రారంభమున భగవంతుని "విశ్వం" అని నామకరణం చేయటం జరిగింది. అజ్ఞానాంధకారమును పారద్రోలుటలో ఈ మొదటి నామము జ్ఞానభాస్కర తేజమై విరాజిల్లుతుంది. జగత్సృష్టికి భగవానుడు కారణమై ఉన్నందున తానే సృష్టికర్త  అయ్యెను.    
"విశ్వం" అనగా ఓంకారమని శ్రీ శంకరులు తన భాష్యములో తెలియచేసారు. "ఓమితి బ్రహ్మ, ఓమితీ దగం పర్వం" ఓం అనునదియే బ్రహ్మం. సర్వ వేదములలోని ఓంకారము నేనై ఉన్నానని భగవానుడు బావద్గీతలో విజ్ఞానయోగంలో తెలియచేసాడు. ఎవ్వరైతే ఈ విశ్వమంతయూ బ్రహ్మముకన్నా అన్యము కాదని గ్రహించి, ప్రణవ స్వరూపమని గుర్తించి,దానికి అనుగుణమైన జ్ఞానము కలవాడై జీవించునో అట్టివాడు విశ్వవైభవమును విశ్వనాధుని వైభవముగా దర్శించి జీవించును. రాగద్వేషము అంతరించును. అద్వైతానుభూతి కరతలామలకమగును.

ఆది కారణమైన చైతన్యమే "విశ్వం" అని పిలవబడుతుంది. ఆ కారణ చైతన్యం ఎవరు ? అనే దానికి సమాధానం రెండవ నామం అయిన "విష్ణుః" అనే నామంలో తెలియచేయటం జరిగింది.

2 విష్ణుః (The All -Pervading)
మొదటి నామంలో భగవానుని "విశ్వం" అని తెలియచేసి ఈ రెండవ నామంలో "విష్ణుః" అని తెలియచేయుట భావగర్భితంగా ఉంది. కనిపించి, వినిపించు విశ్వమంతయూ బాహ్య-అంతరములలో నారాయణుడు వ్యాపించి ఉన్నాడని నారాయణోపనిషత్తు తెలియచేస్తోంది. కాబట్టి కనిపించే జగత్తు అంతా నారాయణ స్వరూపము ఐనందున తాను "విశ్వం" అని పిలవబడి "వ్యాసనశీలత్వాత్" అను ధర్మం వాళ్ళ విష్ణువు అయ్యెను. 

"విష్ణుః" అనే నామము పలుకగానే సర్వమును విష్ణు స్వరూపముగా దర్శించగలిగి  ఉండాలి. అంటే మనలో దాగిఉన్న అజ్ఞానము దగ్ధం అవ్వాలి. మనలోని అహంకారాన్ని సమిధిగా మార్చి విష్ణు స్వరూపము అనే యజ్ఞంలో ఆహుతి చెయ్యాలి. అందుచేతనే విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడు అని మూడవ నామంలో తెలియచేయబడుతోంది. 

3 వషట్కారః (He on whose Account Vashatkara is offered)
వషట్కారుడు అని విష్ణుమూర్తిని కీర్తించుట వలన తాను వేదస్వరూపుడని తెలియబడుతున్నాడు. యజ్ఞ నిర్వహణలో మంత్రాలు చదివేటప్పుడు ప్రతీ మంత్రము చివర "వషట్" అను పదముతో ముగుస్తుంది. విష్ణుమూర్తిని ఉద్దేశించి అతని ప్రీత్యర్థము గౌరవించబడు యజ్ఞంలో "వషట్" అనేది పలుకుటచే తాను యజ్ఞస్వరూపుడైన "వషట్కారః"అని పిలవబడుచున్నాడు. విష్ణుమూర్తి వేదస్వరూపుడగుట వలన సర్వమూ తన వశమై ఉన్నది. సర్వం విష్ణుమూర్తియే. మనలను మనం భగవానునికి సమర్పించుకొనుటే ఆత్మయజ్ఞము. యజ్నమే విష్ణువు అని తెలిసింది కదా ! యజ్ఞము (సరైన)కాలములో మొదలై, కాలములో ముగుస్తుంది. యజ్ఞము అనేది కాలపరిధిలో ఉన్నది. అలా అయితే భగవానుడు విష్ణువు కూడా కాలపరిధిలో ఉన్నాడా ? లేడు. మరైతే అతనెలా ఉన్నాడు ? ఈ విషయాన్ని నాల్గవ నామంలో మనం తెలుసుకుందాం.

4 భూతభవ్యభవత్ప్రభుః (The Lord of Present Past and Future)
భూత భవిష్య వర్తమానముల యందు విస్వమంతటికీ అధినేతగా భగవానుడు ఉన్నాడు. కాలము మనస్సు నుండి ఆవిర్భవించింది. కాలమంతా భగవానుని యందే నడుస్తున్నది. భగవానుడు తాను కాలస్వరూపుడై, కాలాతీతుడై ఉన్నాడు. భూత భవిష్య వర్తమానములు తనలో అంశ మాత్రమై ఉన్నాయి. మూడు కాలాలలో జరిగే సంఘటనలను తాను చూస్తూనే(గమనిస్తూనే) ఉంటాడు. అతని ఆజ్ఞకు లోబడియే సర్వం నడుస్తుంది. కనుక భగవానునికి అన్యమైనది ఏదియూ త్రికాలముల యందు లేకపోవుటచే తాను "భూతభవ్యభవత్ప్రభుః" అని పిలవబడుతున్నది.   

భూత భవిష్య వర్తమానముల యందలి సకలమునకు తానూ ప్రభువని తెలియచేయబడింది. ప్రభువు అనగా అధినేత, మరి భగవానుడు ప్రభువు అయితే తాను పాలించే సృష్టి తనదా ?లేక తాను పాలించుటకు మరొకరు సృష్టించినదా ? దీనికి వివరణ వచ్చే నామంలో వివరించబడింది.

5 భూతకృద్ (The Evolver of Being)

త్రికాలవేది అయిన విష్ణుమూర్తియే భూతములను సృష్టించి "భూతకృద్" అయ్యెను. తానే రజోగుణముతో కూడి బ్రహ్మయై సృష్టి చేసి "భూతకృద్" అయ్యెను. తానే తమోగుణముతో కూడి రుద్రుడై "కృతంతి" సంహారము చేసి "భూతకృద్" అయ్యెను. రజోతమోగుణ సమన్వితుడై తాను సృష్టి సంహారములు సాగించగా తనలోని సత్వగుణము ఏమయ్యింది ? ఇందుకు వివరణ రాబోయే నామంలో మనం తెలుసుకుందాం.

.6 భూతభృత్(The Sustainer of Beings)
రజో తమోగుణ సమన్వితుడైన సృష్టి సంహారములు చేసిన భగవానుడు సత్వగుణముతో కూడి భూతస్రష్టయై "భూతభృత్" అయ్యెను. తనలోని సత్వగుణమే స్థితి కారణం అయ్యెను. "భూతభృత్" అనగా జీవులందరినీ పోషించువాడు అని భావం. ఎలా పోషించగలడు అనే విషయాన్ని తరువాత నామంలో తెలుసుకుందాం.

7 భావః (The Absolute Existence)
సమస్త చరాచర భూత ప్రపంచమంతయూ తానే వ్యాపించి ఉండుటచే భగవానుడు "భావః" అని తెలియబడుతున్నాడు. తాను తయారుచేసిన సృష్టి తనకంటే అన్యముకాకపోవుట వలన తానూ సర్వవ్యాపి అయ్యాడు. "భవతీతి భావః" అగుట వలన "భావః" అని కీర్తించబడుతున్నాడు. విశ్వమంతయూ తానై ఉండుటచే "భావః" అయినాడు. మరి విశ్వమునకు నశించు స్వభావం ఉన్నది కదా ? విశ్వమే నారాయణుడు అయినచో నారాయణుడు మాత్రము నశించడా ? దీనికి సమాధానం తరవాత నామంలో తెలుస్తుంది.

8 భూతాత్మా (The Self of Beings)
సర్వ జీవకోటి యందు అంతర్యామిగా ఉండువాడు "భూతాత్మా" అని పిలువబడుతాడు. సర్వభూతాంతరాత్మకుడైన తాను సమస్త శరీర మనుగడకు కరయై, సాక్షియై ఉండు చైతన్యము అగుటచే "భూతాత్మా" అని పిలవబడినాడు. భగవానుడు సాక్షి చైతన్యమై "భూతాత్మా" అని పిలవబడినట్లయితే సృష్టి స్థితుల యందు ఉత్సాహమును చూపు శక్తి ఏది ? అది కూడా భగవానుడే ... ఆ విషయం వచ్చే నామంలో మనకు తెలుస్తుంది.

9 భూతభావనః (The Generator అఫ్ Beings)
జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడై "భూతభావనః" అని పిలువబడ్డాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించుటచేత, భగవానుడు "భూతభావనః" అని కీర్తించబడినాడు. అందుచేతనే భగవానుని "జగత్పిత" అంటారు.

"భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే" అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని విభూతియోగంలో కీర్తించాడు.