విష్ణుసహస్రనామాలు 02
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞోஉక్షర ఏవ చ || 2 ||
10 పూతాత్మా (The Pure Self)
;భూతములు ఆవిర్భవించి వృద్ధి చెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడై "పూతాత్మా" అని పిలవబడుతున్నాడు. "పూత" అనగా పవిత్రమైన, ఆత్మా అనగా స్వరూపము కలవాడు, పవిత్రాతుడు. నిర్గుణుడైన భగవానుడు పవిత్రాత్ముడై పూతాత్మా అని స్తుతించబడుతున్నాడు. పూతాత్ముడైన ఆదిదేవుణ్ణి స్తుతించినవాడు కూడా పవిత్రుడే అవుతున్నాడు. పవిత్రాత్ముడే పరమగమ్యమైన పరమాత్మ అని రాబోవు నామము ద్వారా తెలుసుకుంటాము.
11 పరమాత్మా (The Supreme Self)
నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన కార్యకారణముల కంటే విలక్షణమైనవాడు "పరమాత్మా" అని స్తుతించబడుతున్నాడు. తాను అందరకు ఆత్మ అయ్యి, తనకు మరొక ఆత్మ లేనివాడు. ముక్త పురుషులు తమ స్వానుభవము ద్వారా తెలుసుకున్నది కూడా ఈ పరమాత్మ తత్వమే. అందుకే తాను ముక్తపురుషులకు పరమగతియై ఉన్నాడు. ఈ విషయం తదుపరి నామంలో వివరించబడింది.
12 ముక్తానాం పరమాగతిః (The Supreme Goal of the Liberated)
ముక్తపురుషులకు పరమగమ్యమై ఉన్నాడు. గతి అనగా గమ్యము. గతి అను పదమునకు ముందు పరమా అను విశేణము చేర్చుటచేత ఉత్తమగమ్యము అని తెలుస్తున్నది. ఏది గ్రహించిన తరవాత మరొకటి గ్రహించటం అవసరంలేదో, ఏ స్థానం చేరితే జ్ఞానికి పునర్జన్మ లభించదో అదే పరమగతి అని తెలుస్తుంది. నదికి సాగరం పరమగతి అయినట్టు, మానవులకు భగవానుడు పరమగమ్యమై ఉన్నాడు. సాగరంలో కలిసిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి, అనంత సాగరంలో కలిసిన రీతిగా, భగవానుని చేరిన జీవి భగవత్ వైభవంలో కలిసిపోవుట జరుగుతోంది. అది కరిగిపోయే సమస్థితే కానీ, తిరిగివచ్చే దుస్థితి ఎంత మాత్రం కాదు. "దేనిని చేరిన తరవాత జీవులు తిరిగి రాలేరో అటువంటి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియచేసాడు. ముక్తులకు పరమగతి భగవానుడై ఉన్నాడని గ్రహించం కదా ! మరి అటువంటి పరమగతి శాశ్వతమా ? అశాస్వతమా ? అనే అనుమానం మనకు రావచ్చు. దానికి సమాధానం తదుపరి నామంలో తెలుసుకుందాం.
13 అవ్యయః (The Unchanging)
వినాశము కానివాడు, వికారం లేనివాడు అయినందున "అవ్యయః" అని భగవానుడు కీర్తించబడ్డాడు.యితడు జరామరణములు లేక అవ్యయుడై ఉన్నాడని అందురు. కనిపించేది ఏదైనా పరిణామము చెందును. పరిణామము చెందే వస్తువు నశిస్తుంది. భగవంతుడు అలా పరిణామం చెందే వస్తు సముదాయంలో చేరడు. అందుకే తాను వస్తురహిత చైతన్యమై "అవ్యయః" అని స్తుతించబడ్డాడు. అవ్యయుడైన ఆ పరమాత్మను చేరినవారు మళ్ళీ ఈ జగత్తులోనికి రారు. మరి అవ్యక్తమైన అవ్యయ స్వరూపుడగు పరమాత్మను మనం ధ్యానించి, సాధించేది ఏముంది ? అవ్యక్తమైన పరమాత్మను దర్శించి, అనుభవించుట ఎలా ? అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే నామంలో తెలుసుకుందాం.
14 పురుషః (The person)
దేహమందు ఉండే చైతన్యమే పురుషుడై ఉన్నాడు. నవద్వారములు కలిగిన పురమునందు ఉన్నవాడు పురుషుడు. అని భగవానుడు భగవద్గీతలో తెలియచేసాడు. కనుక పురము ఉన్నవాడే పురుషుడు అవుతాడు కానీ, పురము తాను కాదు. "ఈ దేహము ఏర్పడక ముందే నేను ఉన్నాను అనేదే పురుషునకు పురుషత్వము" అని వేదము తెలియచేస్తోంది. శ్రేష్టమైన ఫలములను ఇచ్చువాడు పురుషుడు. ప్రళయకాలమున సకల భువనములను అంతమొందించువాడు పురుషుడు. "ఈ విశ్వమును పూరించి ఉండుటచే" పురుషుడు అయినాడు. పురుషుడే నారాయణుడు. కనుకనే చైతన్య స్వరూపుడైన పురుషుడే విశ్వమంతటికి అధారమై ఉన్నాడు. జీవుని దేహెంద్రియ మనోబుద్ధులలో జరుగు సమస్తమును తానే తెలుసుకుంటున్నాడు. తెలుసుకునే వాడే కానీ తగులుకొనేవాడు కాదు. ఊరకుండేవాడే కానీ ఊగులాడేవాడు కాదు. ఈ విషయాన్నే వచ్చే నామంలో తెలుసుకుంటాము.
15 సాక్షీ (The Witness)
సా + అక్షి = చక్కగా దర్శించువాడు. సమస్తమును చక్కగా దర్శించువాడు సాక్షి. ఇంద్రియ మనో బుద్ధులు అవసరములేకుండానే సమస్తమును దర్శించగలవాడు "సాక్షి" అనబడతాడు. సాక్షి అయినవాడు కేవలం చుసేవాడే కానీ కర్తకాడు. చైతన్య స్వరూపమై దేహములోనే ఉంటూ, దేహెంద్రియ మనోబుద్ధులలో జరిగే సమస్త వ్యాపారాలని తానే చూస్తూ, దేనికీ అంటకకుండా ఉండుటచే అంతర్యామి సాక్షి అని పిలవబడుతున్నాడు. ప్రాణుల క్షేత్రములలో సాక్షిమాత్రుడు అని తెలియచేయగానే అతడు జ్ఞానపూరితుడై సాక్షి అని పిలవబడ్డాడా ? లేక గ్రహించనేరని సాక్షియా ? అనే సందేహం రాకుండా తాను జ్ఞానవంతుడై, సమస్తమును తెలుసుకొని సాక్షియై ఉన్నాడని వచ్చే నామం మనకు తెలియచేస్తోంది.
16 క్షేత్రజ్ఞః (The Knower of the Field)
"క్షేత్ర" అనగా శరీరం. "జ్ఞః" అనగా తెలుసుకొనువాడు. "క్షేత్రజ్ఞః" అంటే శరీరంలో జరుగు క్రియలన్నిటినీ గ్రహించువాడు. శరీరములను వీనికి బీజములైన శుభాశుభ కర్మలను తెలుసుకొనుటచే ఆ యోగాత్ముడు క్షేత్రజ్ఞుడు అని పిలవబడుచున్నాడు. క్షేత్రములు నశించును. మరి క్షేత్రజ్ఞుడు నశించునా ? నశించడు. క్షేత్రజ్ఞుడు అవినాశి. ఆ విషయం రాబోయే నామం తెలియచేస్తోంది.
17 అక్షరః (The Imperishable)
క్షరం కానివాడు లేక నాశరహితుడు. 'నక్షరతి" నశించడు కావున "అక్షరః" అని పిలువబడుతున్నాడు. "మాయ క్షరం అని, బ్రహ్మము అక్షరం అని వేదం తెలియచేస్తోంది. ఈ రెండవ శ్లోకంలో 17 వ నామం చివర "ఏవచ" అని ఉంది. "ఏవ" కారమునుబట్టి అక్షర క్షేత్రజ్ఞులకు పారమార్థికమగు(absolute) భేదం లేదు అని సూచన. "చ" కారమును బట్టి వ్యావహారిక(relative) భేదం కూడా లేదని తెలియవస్తోంది. అక్షర పురుషుడైన భగవానుడితో తాదాత్మ్యము చెందాలి. ఆ విషయాన్నే తరవాత వచ్చే నామంలో తెలియవస్తుంది.
No comments:
Post a Comment