December 15, 2014

విశాఖపట్నంలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు చరిత్ర

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి పురాతన - అధునాతన ప్రాభవాలు 

లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం l
లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాన్ లక్ష్మీర్విశిష్యతే ll

అన్నట్టుగా లక్ష్మీదేవి కృపవలనే మన రూపం జనాకర్షణీయము అవుతోంది. లక్ష్మీదేవి కృపవల్లనే ఒక కులము ఉన్నతస్థాయిలో విరాజిల్లుతుంది. ఆదిలక్ష్మీదేవి కృపవల్లనే విద్యావంతులు చదువుసంధ్యలు కొనసాగిస్తున్నారు. ఈ సృష్టిలో సమస్తం ఆ శ్రీమహాలక్ష్మీ కరుణాకటాక్షములచేతనే విరాజిల్లుతున్నది. అందువల్లనే ప్రాణికోటి సమస్తం ఆ శ్రీమహాలక్ష్మీదేవిని వేయి విధములుగా ఆరాధించుచున్నది. 

జగన్మాత అయిన ఆ తల్లికూడా భక్తుల వాంఛితములను నెరవేర్చటానికి, వారిని ఉద్ధరించటానికి అలివేలమంగగానూ, శ్రీరంగనాయికగానూ, వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో వెలసి విరాజిల్లుతోంది. అటువంటి శ్రీమహలక్ష్మీదేవి పీఠాలలో అత్యంత మహిమాన్వితమైనది విశాఖపట్నంలో బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహలక్ష్మీదేవి పీఠం. భక్తకోటి హృదయాలయములే తప్ప తనకంటూ భౌతికంగా గుడి లేని తల్లి ఈమె. అత్యద్భుతమైన శ్రోతలకు, చదువరులకు విశేష ఆశ్చర్యములను, భక్తి శ్రద్ధలను కలిగించును. 


పురాణగాథ
ఆశ్రిత అఖిలదాయిని అయిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిసింది ఎవరికీ ఇదమిద్దంగా తెలియదు, చెప్పలేరు. ఇక్కడి జనులు నానుడి ఏమిటంటే -- ఈతల్లి పురాణకాలం నుండి ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటారు. వింధ్యను దాటి  దక్షిణాదికి అగస్త్యుడు వచ్చినప్పుడు, శివాజ్ఞకు బద్ధుడై వ్యాసుడు కాశీ నుండి దక్షారామమునకు వచ్చినప్పుడు ఈ ప్రాంతమందు వారు ఈ తల్లిని ఆరాధించినట్లు చెప్పుకుంటుంటారు. ఈ ప్రాంతం యొక్క పేరు గాని, అప్పటి రాజుల రాజశాసనాలలోగానీ ఆరోజుల్లో ఎక్కడా ప్రస్థావించినట్లు దాఖలాలు ఎవరికీ లభించలేదు. 

చారిత్రిక గాథ
కర్ణాటక నుండి కళింగపట్నం వరకు విజయయాత్ర చేసిన శ్రీకృష్ణదేవరాయులు అతను ఇరువైపులా ప్రయాణం చేసినప్పుడు ఈ కనకమహాలక్ష్మీ అమ్మవారిని తప్పకుండా దర్శించి వెళ్ళేవారని చెప్పబడుతోంది, కానీ అందుకు ఆధారాలు ఏమీ చూపించుటకు లేవు. ఈ  తల్లికి ఆలయ నిర్మాణం ఎందుకు చేయకూడదు అన్న విషయానికి కూడా ఋజువులు, సాక్ష్యాలు ఏమీ లభించలేదు. 

(నేటి)వర్తమాన చరిత్ర 
విశాఖపట్నం లోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. 

శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో ఉండే రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది.  పూర్వం రాజుల కోటబురుజులు ఉన్న ప్రాంతమే ఈనాడు బురుజుపేటగా పిలవబడుతోంది అని చరిత్రకారులు భావిస్తున్నారు. 

బ్రిటీషువారి హయాంలో 1912 లో ఈప్రాంతంలో వీధులను వెడల్పు చేయటం కోసం ఈ విగ్రహాన్ని కొంత దూరంగా జరిపారు. ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించి, ఎవరూ ఊహించనంతగా ప్రాణనష్టం జరిగింది. ప్రజాభిప్రాయంపై నాటి ప్రభుత్వంవారు విగ్రహాన్ని యథాస్థితిలో ఉంచగానే వ్యాధి ఉపశమించి, ఆ ప్రాంతవాసులందరూ సత్వరమే ఆరోగ్యాన్ని పొందరంట. అందుకీ ఈతల్లి జనానికి దూరంగా ఉండుటకు ఇష్టపడని ప్రజాదేవతగా ప్రసిద్ధిచెందింది. 

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు భక్తులపాలిట కల్పవల్లిగా, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, నగరవాసులకు ఆరోగ్యాన్నియినుమడింపజేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు. 

ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. 

ఈతల్లికి అత్యంత ప్రీతికరమైన తిథి - దశమి. అత్యంత ఇష్తమైన రోజు లక్ష్మీవారము(గురువారము). అమిత ప్రీతిమంతమైన నెల మార్గశిరమాసం. అందుకే ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం(గురువారం) ఈ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు. వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండే కాకుండా, పక్క రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకు సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా నమ్ముతారు. ఈ నెలరోజులూ కూడా ప్రతీరోజూ తెల్లవారుఝామున అభిషేకంతో మొదలై--- కుంకుమారాధనలు నడిరాత్రి వరకూ అమ్మవారికి వివిధ సేవలు జరుగుతూనే ఉంటాయి. ఆఖరి గురువారము సాయంత్రం వేయి బిందెలతో అమ్మవారికి సహస్ర పట్టాభిషేకం(ఘట్టాభిషేకం) కూడా జరిపిస్తారు.          
                                     
జగన్మాతా భక్తుల పాలిట కల్పవల్లీ నమోన్నమః 

5 comments:

  1. శ్వేత గారు శ్రీ కనక లక్ష్మి అమ్మవారి గురించి చాల బాగా వ్రాసారు .ప్రతక్యంగా అమ్మవారిని మన చేతులుతో అభిషేకం చేయడం కొన్ని ఆలయాలలో మాత్రమే జరుగుతుంది అందులో ఇది ఒక్కటి ఆ ఆలయాన్ని2012 లో సందర్శించాను చాల మంచి అనుభూతినిచ్చినది
    by
    http://basettybhaskar.blogspot.in/
    hindu bhati blog

    ReplyDelete
    Replies
    1. నచ్చి మెచ్చినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు ____//l\\___

      Delete
  2. శ్వేత గారు..ముందుగా మీకు నమస్కారం. శ్రీకనకమహాలక్ష్మి ఆలయ విశేషాలను, ఆలయ చరిత్రను, అమ్మవారి మహిమలను చాలా చక్కగా వివరించారు. దానికి ధన్యవాదాలు. కానీ నాదో సందేహం, అమ్మవారి మూల మూర్తికి ఎడమ చేయి ఎందుకు లేదు.. మీకు ఏమైనా తెలిస్తే తెలుపగలరు.

    ReplyDelete
  3. శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ విశేషాలను, అమ్మవారి మహిమలను చాలా చక్కగా వివరించారు. దానికి ధన్యవాదాలు. లక్ష్మి గారు.

    ReplyDelete