తిరుప్పావై పాశురాలు
కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్. !
భావం:--
లేగదూడలు కలవియు, దూడలవలె ఉన్నవియు అగు ఆవుల మందలను ఎన్నింటినో పాలుపితుక కలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకులు వంశమున మొలచిన ఓ బంగారుతీగా !పుట్టలోని పాముపడగ వలె ఉన్న వితంబ ప్రదేశము కలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశంతో ఒప్పుచున్నదానా ! రమ్ము, చుట్టములను, చెలికత్తెలును మొదలుగ అందరును వచ్చి నీముంగిట చేరిరి. నీలిమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండిరి. ఐనా గాని నీవు ఉలుకక - పలుకక ఉన్నవేమి ? ఓ సంపన్నురాలా ! నీనిద్రకు అర్థమేమో తెలుపుము.
అవతారిక:-
ఈ పాశురమున లేపబడు గోపిక కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరు అంతటికి ఆదరణీయుడైనట్లు, ఈమె కూడా ఊరులోని అందరి మన్నలను అందిన ఆమె. పతిసంయోగ యోగ్యమగు ఆమె. ఆ కృష్ణుని పొందుటకు నేను వ్రతము చేయుట ఏమిటి ? అతడే నన్ను పొందుటకు వ్రతము ఆచరించవలెను అని నిర్భయంగా ఉన్నది ఆమె.
సౌందర్యము శరీర నిష్టము, అందుచే ఆమె శరీరమునే చూచి మేల్కొలుపుచున్న గోపికలు మురియుచున్నారు. ఇట్లనుటచే భగవత్భక్తులను ఆశ్రయించునపుడు వారి ఆత్మగుణ పూర్తిచే కల్గు అంతర సౌందర్యమేకాక బాహ్యసౌందర్యం కూడ అనుభవింపబడవలెను. ఆచార్యుల దివ్యమంగళ విగ్రహమును చూచుటచే కూడ ప్రీతి కలుగవలెను. ఆ మూర్తిని వదలలేని మమకారము ఏర్పడును. అట్టి ప్రీతి ఈ గోపికలకు కలిగినది అనుటచే లోపల నిద్రిస్తున్న గోపిక భగవదనుభవమున పరిపూర్ణురాలై తన దివ్యమంగళ విగ్రహదర్శనము చేతనే వీరిని ఆనందింపచేయుజాలినదై ఉన్నదని తెలియుచున్నది.
No comments:
Post a Comment