తిరుప్పావై పాశురాలు
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ !
భావం:-
తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తరువాత మంచి వస్త్రములు దరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా - హాయిగా భుజించవలెను.
అవతారిక:-
గోపికలు తాము ఆచరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాశురమున విన్నవించిరి. అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే ఐనను, వారు కోరిన గుణములుగల ద్రవ్యములు దుర్లభములు. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను కోరుటకాదు, నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకొనెను. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు.
No comments:
Post a Comment