January 11, 2014

గోదా కళ్యాణం

గోదా కళ్యాణం


మాస విశిష్టత 
సౌరమానము ప్రకారము సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన మాసము కావున ఈ మాసమునకు 'ధనుర్మాసము' అని పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రంలో ఉంటే, ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారు. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం రావటం వలన ఈ మాసమును మార్గశిర మాసము అంటారు. మార్గము అనగా -- దారి. శీర్షము అనగా --- ముఖ్యమైనది. అనగా భగవంతుని చేరు మార్గములలో ముఖ్యమైన దానిని తెలుపబడిన మాసము కావున, మార్గశీర్ష మాసము అని అనబడును. మనకెలాగైతే దినమునందు బ్రాహ్మీ ముహూర్తము సత్వగుణ ప్రభావము కలదని భావింపబడునో, అదే విధముగా మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వలె చాలా సత్వగుణ ప్రభావము కలదని దేవతలు భావింతురు. అలాంటి పవిత్రమైన మాసంలో గోదాదేవి వ్రతమును ఆచరించింది కావున ఈ వ్రతానికి గొప్ప విశిష్టత లభించింది.       

గోదా జననం
యజ్ఞవాటికికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా --- విష్ణుచిత్తుల వారు తులసివనంలో మొక్కలకి గొప్పులు తవ్వుతుండగా అతనికి ఒక బాలిక లభించినది. వారికి సంతానము లేకపోవుటచే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకొనుచు .... 'కోదై' (పూలదండ) అనే పేరుతొ పిలుచుకుంటూ ఉండేవారు. ఆ పేరే క్రమేపి 'గోదా' అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది. ఆమె బాల్యము నుండి జన్మసిద్ధమగు పరిమళముగల తులసివలె - జ్ఞాన, భక్తి, వైరాగ్యములు కలిగి భగవత్గుణముల యందే ఆశక్తి కలిగి యుండెడిది. తన తండ్రి ద్వారా భగవత్ కథలను విని, ఆ భగవంతునినే తన ప్రియునిగా భావించి, వివాహమాడదలచినది. పూర్వము ద్వాపరయుగమున వ్రజభూమిలో, గోపికలు కాత్యాయిని వ్రతము చేసి, కృష్ణుని పొందినట్లుగా తెలుసుకొని, తాను కూడా శ్రీవిల్లిపుత్తూరునే వ్రజభూమిగా భావించి, తన తోటి చెలికత్తెలనే గోపికలుగా భావించి, తాను కూడా వారిలో ఒక గోపికగా ఉండి, ఆ వటపత్రసాయి ఆలయమునే నందగోప భవనముగా భావించి, ఆ ఆలయములో నున్న వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా తలచి 'మార్గశీర్ష వ్రతాన్ని' ఆచరించినది. ఆ వ్రతమును తరువాతి తరముల వారికి అందించవలెనని, ఒక్కో పాటలో --- మనం ఏంతెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలి,  అనే విషయాలని,  ముప్పై రోజులు ముప్పై పాశురాలుగా (పాటల రూపంలో) భగవంతుని కీర్తించి అందరికీ  'తిరుప్పావై' ప్రబంధముగా అందించింది.


గోదా కల్యాణం
చిన్నప్పటి నుండి గోదాదేవి శ్రీరంగనాథుని యందే మనస్సు లగ్నం చేసి ఆరాధించుచుండెను. ప్రతీరోజు భగవంతునికి అర్పింపవలసిన పుష్పమాలికను తాను ధరించి, అద్దంలో చూసుకొని, మళ్ళీ ఆ మాలను అదే స్థలంలో పెట్టెడిది. ఆ విషయం తెలియక విష్ణుచిత్తులవారు ఆ మాలను భగవంతునికి సమర్పించెడివారు. ఒకరోజు ఈ దృశ్యమును విష్ణుచిత్తులవారు గమనించి, ఆరోజు భగవంతునికి మాలికను సమర్పించకుండిరి. అదేరోజు రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తులవారికి కలలో ప్రత్యక్షమై, "గోదా ధరించి విడిచిన మాలనే నాకు సమర్పించు, అవియే నాకు అత్యంత ప్రీతికరం" (ఆరోజు నుండి విష్ణుచిత్తులు అదే విధంగా చేయుచుండిరి.)  "నేనే - నీకుమార్తెను వివాహమాడెదను. వివాహమహోత్సవానికి నా అజ్ఞ మేరకు తగిన సామగ్రులను తీసుకొని, పాండ్య మహారాజు ఘన స్వాగతంతో మిమ్ములను దంతపుపల్లకిలో ఆహ్వానించెదరు" అని చెప్పి అంతర్థానమయ్యెను. విష్ణుచిత్తులు మేల్కొని, ఆనందోత్సాహముతో తన జన్మ సార్థకమయ్యిందని, పొంగిపోతూ తెల్లవారిన తరవాత గోదాదేవిని తీసుకొని, శ్రీరంగమునకు వెళ్ళెను. శ్రీరంగమున అందరూ చూస్తుండగా పల్లకీ దిగి, గోదాదేవి గర్భగుడిలో ప్రవేశించి, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి, స్వామి దివ్య తిరువడి గళ్ళలో (పాదపద్మములలో) అంతర్ధానమయ్యెను.  


మాలను ధరించి విడుచుట వలన గోదాదేవికి "ఆముక్తమాల్యద" అనియు, "శూడిక్కొడుత్త నాన్చియార్" అనే దివ్య నామములు కలిగెను. ఆమెనే "ఆండాళ్" అని కూడా అందురు. (ఆండాళ్  అనగా -- రక్షించుటకు వచ్చినది).


విగ్రహ రూపంలో ఉన్న స్వామిని వివాహమాడి, గోదమ్మతల్లి  భోగములను అనుభవించినది కావున, ఈ రోజుని 'భోగి' అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వ భోగ భాగ్యాలు లభించునని మన పెద్దలు చెప్పారు. భోగభాగ్యాలు కలిగించే పండుగ కనుక భోగి పండుగ అని కూడా అంటారు.

"శ్రీ ఆండాళ్ దివ్య తిరువడి గళే శరణం"
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 
_______/\_______

No comments:

Post a Comment