January 13, 2014

భోగి పండుగ

భోగి పండుగ 

భోగి పండుగ - విశేషాలు 
సంవత్సరంలో పెద్ద పండుగ అంటే - నెలరోజులపాటు సాగే పండుగ ఈ సంక్రాంతి పండుగ. సాధారణంగా మార్గశీర్షమాసంలో వచ్చే ఈ పండుగని అందుకే 'పెద్దపండుగ' అని కూడా అంటారు. ఈ సందర్భంగా ఈ పండుగలో వచ్చే సంక్రాంతి ముగ్గులూ - గొబ్బమ్మలూ - గొబ్బి పాటలూ - గంగిరెద్దులూ - హరిదాసు కీర్తనలు ..... ఒకటేమిటి ! ఇలా అన్నిటిలోనూ విశేషాలు ఉన్నాయి.

సంక్రాంతికి ముందు రోజున పెద్దపెద్ద మంటలని వేస్తారు. ఈరోజు దాటి రాబోయే తెల్లవారుజామున సూర్యుడు సంపూర్ణంగా ఉత్తరాయణానికి రాబోతున్నాడని తెలపటానికే పెద్ద అగ్నిరాశిని చలిమంట రూపంలో వేసి చూపిస్తారు.

లౌకికంగా ఈ చలిమంట వేయడం వల్ల  వ్యర్థపదార్థాలన్నీ దీనిలోనికి వెళ్ళిపోతాయి. ఈ మంటలకి ఆకర్షించబడి మంచుకి చేరిన ఎన్నో క్రిములూ - కీటకాలు కూడా మంటలోపడి మరణించి మనకి రోగాల్ని కలిగించనీయవు. ఇక ఇక్కడనుంచి క్రమక్రమంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతూపోతుందని చెప్పడం కూడా భోగిమంట వేయటంలోని రహస్యమే. పితృదేవతలు ఊర్థ్వలోకాలకి చేరుకోవటానికి మార్గం చూపించే దివ్యకాంతే  ఈ భోగిమంటలు అని కూడా అంటారు.


భోగిపళ్ళు పేరంటం - విశిష్టత

చిన్నపిల్లల నెత్తిమీద భోగిపళ్ళని పోయటం అనే ఆచారం ఒకటుంది. సంస్కృతంలో రేగిపండుని 'అర్కఫలం' అంటారు. 'అర్క' అంటే 'సూర్యుడు' అని అర్థం. .... అర్థమే కాదు ఆకారంలో కూడా రేగిపండు సూర్యుడిని పోలి ఉంటుంది. ఆ రేగుపళ్ళని తలమీద పోస్తుంటే, అవి ఆ పిల్లల శరీరం మీదుగా జారి నేలన పడతాయి. అలా భోగిపళ్ళు పోయటం వలన పిల్లలకు ఉన్న చీడపీడలు అన్నీ తొలగిపోతాయి. ముత్తైదువుల దీవెనలతో పిల్లలకు ఆయురారోగ్యాలు కలుగుతాయి అని పెద్దలు చెబుతారు. 




భోగిపండ్ల పాట 

భోగిపండ్లను పోయరే - ఓ రమణులారా !
మన చిరంజీవులకు - మేలుకలుగగా  ll భోగి ll

విఘ్నేశ్వరుడు వచ్చి - విఘ్నాలు తొలగింప
షణ్ముఖనాధుడు వచ్చి - శాస్త్రాలు వల్లింప
సాయిబాబా వచ్చి - ప్రేమార లాలింప  ll భోగి ll

బ్రహ్మదేవుడు వచ్చి - వేదాలు వల్లింప
విష్ణుదేవుడు వచ్చి వేదాలు వల్లింప
పరమేశ్వరుడు వచ్చి - ఆశీర్వదించంగా  ll భోగి ll

రామచంద్రుడు వచ్చి - రక్షణ చేయంగ
శ్రీకృష్ణుడే వచ్చి - శుభములు పలుకంగ
శ్రీవేంకటేశ్వరుడు - ఆశీస్సులందింప  ll భోగి ll

ఆంజనేయుడు వచ్చి - అభయాలనివ్వంగ
కులదేవతలు వచ్చి - కళాకాంతులివ్వంగ
తులసిదాసుడు వచ్చి - మంగళములు పాడంగ  ll భోగి ll



ముగ్గులు - విశేషాలు 
ముగ్గు పెట్టేటప్పుడు గీతని ఎంత సన్నగా గీస్తూ, ఎంత తక్కువ కాలంలో ఎంత రమణీయంగా ఏ బాలిక పెట్టిందో గమనించి, ఆ ముగ్గుని వాడిన విధానాన్నిబట్టి ఆ బాలిక పొదుపరితనము - ముగ్గు అందాన్నిబట్టి అ బాలికకి ఉన్న అలంకరణ ప్రియత్వము - తొందరగాను, తప్పులులేకుండాను వేయడాన్ని అట్టి ఆ బాలికకున్న చురుకుదనమూ, ఏకాగ్రత మనకి అర్థం అవుతాయి. ఈనెలరోజులూ వరిపిండితో ముగ్గులు వేస్తారు.


గొబ్బమ్మలు - విశిష్టత 
ఆవుపేడతో ముద్దల్ని చేసి, మధ్యలో వాటిమీద బంతి - చేమంతి పూరేకులని గుచ్చి వాటికి పసుపు - కుంకుమలని అద్ది గొబ్బెమ్మలని చేస్తారు. ఇంతేకాదు, వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, చివరికి నైవేద్యాలు కూడా పెడతారు.

గొబ్బెమ్మల పూజ 
గోదాదేవి గోపికలతో కలిసి ఆ కృష్ణుడిని భక్తితో సేవించింది. గొబ్బెమ్మలు గోపికలు అన్నమాట. ఆ గోపికలే గోపి బొమ్మలు. అవే కాలక్రమంలో గొబ్బెమ్మలుగా పిలవబడుతున్నాయి. సంస్కృతంలో,  'గోపి' పదానికి తద్భవం 'గొబ్బి' అనేది. గొబ్బి + బొమ్మ = గొబ్బెమ్మ. గోపికలందరిచేత ఆరాధించబడే 'గోదాదేవి' అన్నమాట. గొబ్బెమ్మలుగా పైకి కనిపించే వీళ్ళంతా కృష్ణ భక్తురాండ్రులు అన్నమాట. కాబట్టి వీటి చుట్టూ చప్పట్లు కొడుతూ - పాటలు పాడుతూ, తిరుగుతూ ఉండే బాలికలంతా తమని తాము గోపికలుగా భావించుకొని,కృష్ణుని సేవించి, తరించిన గోపికలుగా ఊహించుకొని, కృష్ణుని వంటి భర్తే తమకి లభించాలని కోరుకుంటూ గొబ్బెమ్మలని ఆరాధిస్తారు. వాళ్ళంతా ఆ గోదాదేవిని మార్గదర్శకురాలిగా భావించి, భాగవతారాధన పరాయణతని పొందాలని భావము. ప్రదక్షిణలు, నైవేద్యాలు ఉండటానికి కారణం ఆ గొబ్బెమ్మల్లో కృష్ణభక్తురాండ్రని దర్శించాలని అర్థం. గొబ్బెమ్మలన్నీ గోదాదేవి - గోపిలకు అయ్యి, పరమాత్మలో ఏవిధంగా ఐక్యమయ్యారో, అదే విధంగా గొబ్బిళ్ళు అన్నీ పిడకల రూపంలో భోగిమంటలో కలసి పరమాత్మని చేరుకుంటాయి. ఈనెల రోజులూ ముగ్గుల మధ్యలో రోజుకొక గొబ్బెమ్మ పెట్టి, మరుసటిరోజు ఆ గొబ్బెమ్మని పిడకగా వేసి, అలా వచ్చిన పిడకలని మాలగా కట్టి భోగిమంటలో వేస్తారు. గోదాదేవి ప్రతీరోజు ఒక్కొక్క పాశురం  పాడి, చివరికి పరమాత్మలో ఐక్యమైనట్టు, గొబ్బెమ్మలనే పిడకలు అన్నీ, భోగిమంట అనే పరమాత్మలో ఐక్యమవుతాయి.

గొబ్బెమ్మ పాట 

గొబ్బియల్లో  గొబ్బియల్లో  గొబ్బియల్లో
మన సీతాదేవి వాకిటవేసిన గొబ్బియల్లో  ll గొబ్బిll

మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద మల్లెపూలు గొబ్బియల్లో  ll గొబ్బిll

నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద మొగలీపూలు గొబ్బియల్లో  ll గొబ్బిll

ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద సంపెంగలు గొబ్బియల్లో  ll గొబ్బిll

రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద మందారాలు గొబ్బియల్లో  ll గొబ్బిll

భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో  ll గొబ్బిll

లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియల్లో  ll గొబ్బిll


ఆవు పిడకలని భస్మంచేసేటప్పుడు వచ్చే పొగతో శ్వాస సంబంధిత వ్యాధులేమైనా ఉంటే తొలగిపోతాయి. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే భోగిమంట చల్లారిన తరవాత పిడకల భస్మాన్ని విభూధిగా ధరిస్తారు.           
 
పదండి మనమూ భోగిమంటలని వేసుకొని ఆనందిద్దాము
భోగి శుభాకాంక్షలు                                 

No comments:

Post a Comment