January 14, 2014

సంక్రాంతి పండుగ అంటేనే పోషకాల పండుగ

సంక్రాంతి పండుగ అంటేనే పోషకాల పండుగ



సంక్రాంతికి పొంగలి, అరిసెలు, కమ్మటి మినపసున్ని ఉండలు, తప్పనిసరిగా చేసుకుంటాము. రేగుపళ్ళు, తేగలు, చెరకుగడలు, ఇవన్నీ పండుగ సమయంలోనే వస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

బెల్లం - చెరకు 
సంక్రాంతికి చేసే పొంగలిలో కొత్త బియ్యము, కొత్త బెల్లము వాడుతారు. బెల్లంతో అరిసెలు కూడా చేస్తారు. బెల్లంతో చేసిన వంటలు తక్షణ శక్తిని ఇస్తాయి. అరిసెలు జీవక్రియలని వేగవంతం చేసి, వేడిని పుట్టిస్తాయి. పిల్లలు - పెద్దలు అంతా ఎంతో ఇష్టంగా తినే చెరకుకి ఈ పండుగలో ప్రాధాన్యం ఇవ్వటానికి కూడా ఇదే కారణం. చెరకు నుంచి సహజ సిద్ధంగా లభించే చక్కెరలు, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు అందుతాయి.


సున్నుండలు 
మినపపప్పుతో చేసే సున్నుండలలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. నెయ్యి - బెల్లంతో కలిపి చేసిన వీటిలో మంచిపోషకార విలువలు ఉంటాయి. మినప్పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. కొవ్వు శాతం తక్కువ. ఎముకల పటుత్వానికి ఉపయోగపడుతుంది. వీటిని తినటం వలన శరీరానికి ప్రోటీన్లు బాగా అందుతాయి. పీచు పదార్ధం ఉండటం వలన త్వరగా అరుగుతుంది. మినప్పప్పులో ఉండే మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరగటానికి ఉపయోగపడుతుంది.


నువ్వులు 
నువ్వులని అరిసెలలో వాడటమే కాదు, పిండివంటల్లో నువ్వుల ఉండలని ప్రత్యేకంగా చేస్తారు. వీటితో శరీరానికి మేలుచేసే కొవ్వులూ, మోనో అన్ శాచురేటెడ్ ఫ్లాటీ ఆమ్లాలు ఉంటాయి. మన శరీరం తయారుచేసుకోలేని, తప్పనిసరిగా అవసరమయ్యే పోషకాలని ఇవి అందిస్తాయి. స్త్రీల శరీర అవసరాలకి తగినంత కాల్షియంను నువ్వులు అందిస్తాయి. వీటి నుంచి లభించే విటమిన్ 'ఇ' రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులగింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలూ ఉన్నాయి. వాటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండెకు మేలు చేస్తాయి. వీటిలో సమృద్ధిగా లభించే విటమిన్ 'బీ' ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచుతుంది.   

                          
రేగుపళ్ళు
తీయగా, పుల్లగా ఉండే రేగుపళ్ళను తింటే మనకి 'c' విటమిన్ లభిస్తుంది. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచి, వివిధరకాల ఇన్ఫెక్షన్లకు మనకు దూరంగా చేస్తాయి.


తేగలు
వీటిల్లో ఆరోగ్యవంతమైన కార్బోహైడ్రేట్లతోపాటూ పీచు అధికంగా ఉంటుంది. ఇవి నిదానంగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చూస్తాయి. రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తాయి.


ఆయురారోగ్యాల  సంక్రాంతి అందరం ఆనందంగా చేసుకుందాం 
సంక్రాంతి శుభాకాంక్షలు

   

No comments:

Post a Comment