August 5, 2014

"తత్వమసి" ...... శ్రీరామకృష్ణ పరమహంస కథలు

"తత్వమసి" ...... శ్రీరామకృష్ణ పరమహంస కథలు

" 'నేను బద్ధజీవుణ్ణి! నాకు ఎన్నటికీ భక్తీ, జ్ఞానము కలుగవు.' అని కొంతమంది అంటూ ఉంటారు. కాని గురువు అనుగ్రం పొందటానికి ఆ భయం లేదు"...... అని శ్రీరామకృష్ణులు ఈ క్రింది కథను ఈ విధంగా చెప్పారు. 

ఒకసారి ఒక ఆడపులి ఒక మేకలమంద మీద పడింది. అదే సమయానికి దూరం నుండి ఒక బోయవాడు బాణం వేసి దానిని చంపిసాడు. ఆ పులి నిండుచూలాలు. బాణం దెబ్బకు అది చనిపోతూ, ఒక పిల్లను కని కన్నుమూసింది. ఈ పులికూన మేకల మందలో కలసి పెరుగుతూ వచ్చింది. ఆ మేకలే దానికి పాలిచ్చి పెంచాయి. క్రమక్రమంగా రోజులు గడిచేకొద్దీ ఆ పులిపిల్ల మేకలతో కలసి తిరగటం వాటిలాగానే గడ్డి మేయటం, అవి అరుస్తున్నట్టే 'మే, మే' అని అరవటం మొదలు పెట్టింది. క్రమంగా అది పెరిగి ఒక పెద్దపులిలాగా తయారైంది. అయినా కూడా అది గడ్డితినటం, మేకలాగా అరవటం చేస్తూనే ఉంది. ఏదైనా కౄరమృగం వచ్చి తరిమితే ఈ 'మేక-పులి' కూడా మేకలాగా మేకలగుంపుతో కలసి పారిపోతూ ఉండేది. 

ఇలా ఉండగా ఒకసారి మరొక భయంకరమైన పులి ఆ మేకలమందపై పడింది. ఆ మందలో గడ్డి తింటూ మేకలతో పరుగెత్తిపోతున్న ఈ 'మేక-పులి'ని చూసి ఆశ్చర్యపడింది. ఇతర మేకలను వదిలి ఆ పులి ఈ గడ్డితినే 'మేక-పులి'ని వెంటాడి పట్టుకుంది. అది భయంతో వణుకుతూ మేకలాగా అరుస్తూ, తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఈ భయంకరమైన పులి దానిని నీటి దగ్గరకు ఈడ్చుకుపోయి, 'నువ్వు నాలాగా పెద్దపులివై ఉండి కూడా మేకలతో తిరుగుతూ గడ్డి తింటున్నావెందుకు? నీళ్ళలో నీ ముఖం చూసుకో! నాకున్నట్లుగానే గుండ్రమైన ముఖం నీకు కూడా ఉంది.' అని దాని నోటిలో ఒక మాంసం ముక్కను కుక్కింది. గడ్డి తినటానికి అలవాటు పడిన ఆ 'మేక-పులి' మొదట మాంసం తినటానికి ఇష్టపడలేదు. కానీ మాంసం నాలుకకు తగిలేసరికి, రుచిమరిగి తినటం ప్రారంభించింది. చివరకు ఆ భయంకరమైన పులి దానితో, 'ఎంత సిగ్గుచేటు ! ఈ మేకలతో కలసి తిరుగుతూ గడ్డి తింటున్నావు, చూడు నాకు - నీకు తేడా ఏమైనా ఉన్నదా ? ఏమీ లేదు, నాతో కలసి అడవిలోకి రా!' అని అన్నది. ఈ మాటలు విని ఆ 'మేక-పులి' తన ప్రవర్తనకు సిగ్గుపడి, తన నిజస్వరూపాన్ని తెలుసుకొని, ఆ పులితోపాటు అడవిలోకి వెళ్ళిపోయింది.'

ఈ కథను గురుదేవులు 'శ్రీరామకృష్ణ కథామృత' రచయితా అయిన మహేంద్రనాథగుప్తాకు చెప్పి, 'గురువు అనుగ్రహం పొందిన వానికి భయం లేదు. అసలు నీవెవరివో, నీ నిజతత్వమేమిటో, గురువు నీకు తెలియచేస్తాడు. కథలో గడ్డి తినటం అంటే - 'కామినీ - కాంచన' సుఖాలలో మునిగితేలటం. .... 'మే - మే' అని అరుస్తూ పారిపోవటమంటే ..... సామాన్య మానవునిలాగా సంసారంలో మెలగటం. కొత్త పులిని అనుసరించటం పోవటం అంటే --- మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పిన గురువును శరణుపొంది, ఆయనయే మన ఆప్త బంధువని గుర్తించటం. నీటిలో తన ముఖం యొక్క ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకోవటం అంటే ----'తన ఆత్మతత్వాన్ని అనుభూతి పొందటం' అని వివరించారు.' "తత్వమసి" (అదే నీవు! అంటే నీవు ఈ అశాశ్వతమైన శరీరానివి కావు. ఆ పరమాత్మవే) అనే మహావాక్య వివరణే ఈ కథలోని అంతరార్థం" ..... అని వివరించారు.                      


No comments:

Post a Comment