శ్రీ దత్తశరణం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు మార్గశిర మాసాన్ని తనకు ప్రియమైన నెలగా చెప్పాడు. మార్గశిర శుక్ల చతుర్దశినాడు యోగీశ్వరుడైన దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అంశతో ఆవిష్కారమయ్యాడు. శ్రీహరి దశావతారాలు దాల్చి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఆ అవతారాలన్నీ లక్ష్యం సిద్ధించగానే పరిసమాప్తి అయ్యాయి. భక్తులని ఎల్లప్పుడూ రక్షించుకోవటం కోసం, వారి యోగక్షేమాలని చూసుకోవటం కోసం విష్ణుమూర్తి దత్తత్రేయుడిగా అవతరించినట్లు చెబుతారు. అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు జన్మించాడు. అత్రి మహర్షి మహా తపోబలం ఉన్నవాడు. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే త్రివిధ తాపాలని తన తపోమహిమతో తొలగించుకున్న మహనీయుడు. ఆ మహర్షి భార్య అనసూయ. మహా పతివ్రత. త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి, వారిని పొత్తిళ్ళలోకి తీసుకొని, ఆ ముగ్గురికి ఆకలి తీర్చిన ఉత్తమ ఇల్లాలు. ఆ దంపతులకి కొడుకుగా విష్ణువు తనను తానే దత్తం చేసుకున్నాడు. అందుకే మహావిష్ణువు దత్తుడైనాడు. అత్రికి కొడుకు కనుక ఆత్రేయుడైనాడు. ఆ స్వామినే దత్తాత్రేయుడిగా మనం భక్తితో అరాధించుకుంటున్నాం.
దత్తుడు త్రిముఖాలతో, చతుర్ముఖాలు ఉన్న ఆవుని వాహనంగా చేసుకొని, మునికుమారునిగా కనిపిస్తాడు. ఆ స్వామి వైరాగ్యమూర్తిగా ప్రకాశిస్తాడు. ఆయుధాలు లేకుండా, ప్రసన్నంగా, చిరునవ్వు నవ్వుతూ, భక్తుల కోర్కెలు తీర్చే వరదుడిగా, కనిపిస్తాడు. ఔదుంబర వృక్షం కింద ఎప్పుడూ కూర్చొని, గురుపరంపరకే ఆద్యునిగా కనిపిస్తూ ఉంటాడు. ఔదంబర వృక్షం అంటే మేడిచెట్టు. మేడిపండు పైకి మిసమిసలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఆ పండు లోపల పురుగులతో నిండి ఉంటుంది, ఈ ప్రపంచం కూడా పైకి ఎంతో అందంగా ఉంటుంది. అయితే లోపల ఎన్నో సమస్యలు, లోపాలు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటాయి. వాటిని తొలగించుకోవటానికి, అవరోధాలన్నీ అదిఘమించడానికి దత్తాత్రేయుడిని భక్తిశ్రద్ధలతో శరణు వేడటమే తరుణోపాయం అని చెబుతారు.
దత్తాత్రేయుడు స్మృతిగానీ, కేవలం స్మరణగానీ చేసినట్లయితే తన కరుణను భక్తులపై కురిపిస్తాడని ప్రతీతి. మహా యోగీశ్వరుడైన శ్రీ గురుదత్తుడు శ్రీవిద్యకు జగదాచార్యుడు. యోగమార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తిమార్గ పరిరక్షణ అనే మూడు అంశాలు దత్తాత్రేయ అవతార ప్రధాన ధ్యేయాలు. దక్షిణ భారతదేశంలో దత్త సంప్రదాయానికి ఏంతో ప్రాధాన్యం ఉంది. దుష్ట చైత్యులని సంహరించి, శిష్టులని అనుగ్రహించి, యోగామార్గాన్ని బోధిస్తూ భక్తులను రక్షించటమే దత్తాత్రేయ అవతార ప్రయోజనం.
దత్తాత్రేయుడు మహా అవధూత ముక్తిదాయకుడు, జ్ఞానప్రదాత, ప్రకృతిలోని భౌతిక , లక్షణాలను దైవాసుర గుణాలతో స్వామి అద్భుతంగా సమన్వయపరుస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రభోదించాడు. ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడుత, చేప, ఏనుగు సాలెపురుగు వంటి 24 చరాచరాల నుండి దత్తుడు వివేకజ్ఞానాన్ని గ్రహించాడు. వాటినే గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకొని, లోకానికి తెలియచేసాడు. ఈ జగత్తులోని ప్రతిజీవి జన్మకు సార్థకత ఉంది. ఆ జీవుల నుండి ఎన్నో విషయాలని నేర్చుకొని జీవితాలకి అన్వయించుకోవాలని దత్త సందేశం. మానవ మనుగడకు అత్యవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సృష్టి రహస్యాలని అందరి నుండి వివేకంతో గ్రహించాలి. అందుకే తన ఆత్మే తనకు గురువైనదని దత్తాత్రేయుడు దివ్య ప్రబోధన చేసాడు. ఉత్తమ జన్మ పొందిన మనిషి సాటి జీవరాశుల నుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అభ్యాసం చేసి వాటిని జీవనానికి సమన్వయం చేసినప్పుడే మనిషి మనీషి అవుతాడని శ్రీగురుదత్తుడి భవ్యసందేశం.
డాక్టర్ కావూరి రాజేష్ పటేల్
___/\___ శ్రీ గురుదత్త చరణములే మనకు శరణ్యం ___/\___
No comments:
Post a Comment