June 2, 2015

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా ఎవరు రచించారో .... ఎందుకు రచించారో మీకు తెలుసా ???

సుప్రసిద్ధ హిందీ ప్రాచీన రామభక్త కవి, శ్రీరామ భక్తుల్లో అగ్రగణ్యుడు 'రామచరితమానస్' అనే పేరుతొ రామాయణాన్ని రచించిన కవి గోస్వామి తులసీదాసు.


ఇతను ఒకసారి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ పండరీపురం చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం నివసించాడు. నిత్యకృత్యాలలో భాగంగా ఒకరోజున 'చంద్రభాగా నది' లో స్నానం చేసి విఠల నాథుడిని ధ్యానిస్తూ నదీ ఒడ్డున  కూర్చున్నాడు. ఆసమయంలో ఒక గుడ్డివాడు ఇంట్లో తగాదపడి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికి వచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసుని ఆ గుడ్డివాడు తన్నుకొని పడిపోయాడు. తులసీదాసు వెంటనే ఆ గుడ్డివాడిని పైకి లేపి, ఒక్కసారి గాఢముగా ఆలింగనం చేసుకొని 'క్షమించు నాయనా ! నీ కృపాదృష్టితో ఒక్కసారి నన్ను చూడు' అని అన్నాడు. అంతే అంధుడికి చూపు వచ్చేసింది. అతడు ఆనంద పరవశుడై తులసీదాసు పాదాలపైనపడి 'స్వామీ ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. నాకు పునర్జన్మను ప్రసాదించారు ...... ఈ పునర్జన్మని ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను అని అన్నాడు.  తులసీదాసు ఇలా అన్నాడు ' చూడు నాయనా ! ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుడిని. ఆ పండురంగ విఠలుని మహిమ. ఆ ప్రభువు అనుగ్రహ ప్రాప్తి నీకు కలిగింది. నీకు కలిగింది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవ చింతనతో ధన్యం చేసుకో.

తులసీదాసు జీవితచరిత్రలో ఇటువంటివి ఎన్నో సంఘటనలు సంభవించాయి. అవన్నీ భగవంతుడు అతని ద్వారా వ్యక్తం చేయించినవే.ఈవిషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. అక్బరు తులసీదసుని తన కొలువుకి రావలసిందిగా ఆహ్వానించాడు. "నీకు చాలా మహిమలు ఉన్నట్టుగా మాకు తెలిసింది. మాకు కొన్నిటిని చూపించి, మెప్పించి, పారితోషికాన్ని స్వీకరించు." అని కబురు పంపించాడు. "అక్బరు చక్రవర్తీ! నన్ను క్షమించండి, నేను రామునికి మాత్రమే దాసుడను, నాలో ఏ మహిమలు లేవు. నేను నిమిత్తమాత్రుణ్ణి ఏమైనా ఎప్పుడైనా జరిగితే అవి శ్రీరామచంద్రమూర్తి యొక్క లీలలే అని గుర్తించండి" అని బదులు ఇచ్చాడు. ఆ జవాబుకి అక్బరుకి చాలా కోపం వచ్చింది. "ఏమిటి ? నా మాటనే ధిక్కరిస్తావా ? అందుకు నీకు మరణదండన తప్పదన్న సంగతి నీకు తెలుసా ?" అని గద్దించాడు. తులసీదాసు నెమ్మదిగా బదులిచ్చాడు. 'మరణమే శరణ్యమని నా శ్రీరాముని సంకల్పమైతే ఆ సమయం ఎవ్వరు ఆపినా ఆగదు కదా! కానివ్వండి.' అని అన్నాడు.

అక్బరు చక్రవర్తికి కోపం బాగా పెరిగిపోయింది. అతని ఆజ్ఞను ధిక్కరించినందుకు భటులను పిలిచి తులసీదాసుని కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసీదాసు తన రెండు చేతులూ జోడించి రామనామ స్మరణం చేసుకోసాగాడు. భటుల చేతుల్లో పైకి లేచిన కొరడాలు అలాగే ఉండిపోయాయి. ఇంతలో అక్కడికి లెక్కలేనన్ని కోతులు వచ్చి, అక్బరుతో సహా భటులను అందరినీ ... భయంకర చూపులతో, అరుపులతో బెదిరించాయి. అందరూ కూడా నిలువునా వణికిపోయారు. చుట్టూ చేరిన కోతులు వారందరి ఒక్క అడుగు కూడా కదలనీయలేదు. అక్బరు చక్రవర్తి ఆశ్చర్యపోయి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటును తెలుసుకున్నాడు. వెంటనే తులసీదాసు పాదాలపైన పడి, కన్నీరు, మున్నీరుగా ఏడ్చాడు. తులసీదాసుకి అంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగింది అని అడిగితే .... అక్బరు జరిగిన సంఘటనంతా వివరించాడు. మీ అందరికీ కనిపించిన కోతులు తనకి అసలు కనిపించనేలేదని... భక్తిప్రపత్తులతో హనుమంతుని ప్రార్థించాడు. ' స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీళ్ళందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకు ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించలేదు. నేను చేసిన తప్పేమిటి? ఏమైనా ఉంటే నన్ను క్షమించు' అంటూ దుఃఖిస్తూ హనుమానుని అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం హనుమ దర్శనం పొంది పరమానందభరితుడైనాడు.

అదే హనుమాన్ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది. మారుతి కటాక్ష వరమహిమచేత తులసీ విరచిత "హనుమాన్ చాలీసా" మోక్ష తులసీదళమై రామనామ జపసాధకులను పునీతం చేస్తోంది.

శ్రీరామ జయరామ జయజయరామ 
                                       జై జై జై హనుమాన్                                            


చిమ్మపూడి శ్రీరామమూర్తి 

No comments:

Post a Comment