పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా!
రచన -- గురజాడ అప్పారావుగారు
మేలిమి బంగరు మెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లులగన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథనూ.
ఆటల పాటల పేటికలారా
కమ్మనిమాటల కొమ్మల్లారా
అమ్మలగన్న అమ్మల్లారా
విన్నారమ్మా మీరీ కథనూ.
కొండలనడుమన కోనొకటుంది
కోనకి నడుమా కొలనొకటుంది
కొలనిగట్టున కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పూవులు కొసేది.
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరుదుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములన్
అంగములందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.
కాసుకులోనై తల్లితండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
ఒక ముదుసలి మొగుడుకి ముడివేసిరి.
ఆమని రాగా దుర్గాకొలనులో
కలకల నవ్వెను తామరులు
ఆమని రాగా దుర్గవనములో
కిలకిల పలికెను కీరములు.
ముద్దు నగవులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాతయని కేలించ,
ఆటలపాటల కలియక పూర్ణమ్మ
దుర్గనుచేరి దు:ఖ్ఖించే.
కొన్నాళ్ళకు పతి కొనిపోవొచ్చెను
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను
చీరలు సొమ్ములు చాలగదెచ్చెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు.
పసుపు రాసిరి బంగారు మేనికి
జలకములాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కైచేస్రీ..
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ్మ
తల్లిదండ్రి దీవించ్రి
దీవెన వింటూ పక్కున నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
చిన్నలనందర కౌగిట చేర్చుకు
కంటనుబెట్టెను కన్నీరు
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
"అన్నల్లారా! తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండి
బంగరు దుర్గను భక్తితొ
కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ.
ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ
భక్తిని తెచ్చీ శక్తికి ఇవ్వం
డమ్మలకమ్మా దుర్గమ్మ.
నలుగురు కూర్చుని నవ్వేవేళల
నాపేరొకపరి తలవండి
మీమీ కన్నబిడ్డలనొకతెకు
ప్రేమను నాపేరివ్వండి."
బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు
కన్నులుతుడుచుకు కలకల నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టెన్
కాసుకులోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడే!
ఎప్పటియట్టుల సాయంత్రమ్మున
ఏరిన పూవ్వులు సరికూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
ఒంటిగబోయెను పూర్ణమ్మ.
ఆవులు పెయ్యలు మందలుజేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
పూర్ణమ్మ ఇంటికిరాదాయె.
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ్మ ఇంటికి రాదాయె.
కన్నులకాంతులు కలవలచేరెను
మేలిమిజేరెను మేని పసల్
హంసలజేరెను నడకల బెడగులు
దుర్గనుజేరెను పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
No comments:
Post a Comment