February 26, 2014

మహాశివరాత్రి

మహాశివరాత్రి

ప్రతీనెలా అమావాస్య ముందు వచ్చే చతుర్ధశిని శివునికి ఇష్టమైన శివరాత్రిగా చెబుతూంటారు.  ఇలా ప్రతీనెలా వచ్చే శివరాత్రిని 'మాసశివరాత్రి' అంటారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని "మహాశివరాత్రి" అంటారు. శివరాత్రి అంటే శివునిరాత్రి. శివమైన(శుభప్రదమైన) రాత్రి. అర్థరాత్రి వరకు చతుర్థశి తిథి ఉన్న రోజునే 'శివరాత్రి' గా అంటుంటారు. ఉపవాసము - అభిషేకాలు, పూజలు - జాగరణము ...... ఈ 3 శివరాత్రి రోజున ముఖ్యంగా మనం చేయవలసిన పనులు.

పురాణకథనం:--
పూర్వము బ్రహ్మ, విష్ణువులకు ఇద్దరికీ ---- తమలో ఎవరు ఎక్కువ అనే విషయంలో వాదోపవాదాలు జరిగి, క్రమేణా వాదన పెరిగింది. ఈ స్థితిలో ఒక అపూర్వమైన శివలింగం ఆద్యంతాలు తెలియని విధంగా సాక్షాత్కరించి పెరుగుతూ ఉంది. బ్రహ్మ, విష్ణువులు దానిని చూసి, ఆశ్చర్యపడ్డారు. "మీఇద్దరిలో - దీని మొదలు, చివర ఎవరు తెలుసుకుంటారో వారు, రెండవవాని కంటే గొప్పవారు" అని వారిరువురికి ఒక అశరీరవాణి యొక్క మాటలు వినిపించాయి. వెంటనే హంస వాహనాన్ని ఎక్కి బ్రహ్మదేముడు ..... ఆ లింగం చివరి భాగం (పైభాగాన్ని) వెదుకుతూ పైకి, క్రిందిభాగం (అంటే లింగము ఆది భాగం) వెదుకుతూ విష్ణువు క్రిందికి (క్రిందభాగంకి) పయనమయ్యారు.

ఎంతసేపు ప్రయాణం చేసినా వారిద్దరికీ వారి - వారి గమ్యాలు కనిపించలేదు. పైకి వెళుతున్న బ్రహ్మకి లింగభాగంపైనుండి క్రిందికి పడుతున్న ఒక మొగలిపువ్వు కనిపిస్తే, "నీవు ఎక్కడి నుండి క్రిందికి వస్తున్నావు?" అని అడుగగా " లింగం పైనుండి క్రిందకు చాలాకాలం నుండి వస్తున్నాను" అని చెప్పగా బ్రహ్మ మొగలిపూవుతో "నేను ఈ లింగపైభాగం చూసినట్లుగా సాక్ష్యం చెప్పు" అని బలవంతం చేయగా, సృష్టికర్త అయిన బ్రహ్మకు ఎదురుచెప్పలేక, భయపడి మొగలిపూవు ఒప్పుకుంది. లింగాగ్రమునకు క్షీరాభిషేకం చేసి క్రిందకి వస్తున్న కామధేనువు కనిపించగా, ఆ ధేనువుని కూడా తాను లింగాగ్రమును చూసినట్టు సాక్ష్యం చెప్పమని బలవంతంగా అంగీకరింపచేసెను. ఆ ఇద్దరి సాక్షులతో బ్రహ్మ - పైనుండి క్రిందకు వచ్చెను. లింగ ఆదిభాగం వెదుకుతూ వెళ్ళిన విష్ణువుకు మొదలు వెదకలేక, తాను వేదుకుటలో అశక్తుడిని అని తలచి, పైకి వచ్చేసి, "నేను లింగము యొక్క ఆది(క్రిందిభాగం) గుర్తించలేకపోయెను" అని, అప్పటికే అక్కడకు వచ్చిన బ్రహ్మకు చెప్పగా, "నేను నీకంటే అధికుడిని" అని గర్వంగా చెబుతూ, తాను తీసుకువచ్చిన ఇద్దరి సాక్షులను చూపెను. అంతట విష్ణువు "నీ ఆధిక్యమును నేను అంగీకరిస్తున్నాను". అని పలుకగా, భయంకర ధ్వనులతో మహాశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి, అసత్యము చెప్పిన బ్రహ్మ అయిదు శిరస్సులలో, ఒక శిరస్సును ఖండించెను. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యెను. బ్రహ్మ సిగ్గుచెంది, తన తప్పిదమును అంగీకరించెను.శివుని శాపం వలన అతనికి లోకములలో ఎక్కడా పూజ లేకుండా పోయింది. తప్పుడు సాక్ష్యం చెప్పినందువల్ల, మొగలిపూవుకు పూజార్హత లేకుండా పోయింది, ప్రతీరోజూ ఉదయమునే నిద్రలేచి గోముఖమును చూస్తే పాపములు కలిగేటట్లుగా కామధేనువుకు శాపము ఇచ్చెను. అందుకే గోముఖము కంటే పృష్టభాగమును దర్శిస్తే మంచిది. సత్యము పలికిన విష్ణువును, నీవు నాతొ సమానమగ పూజించబడుతావు, అని చెప్పి, అతనికి ఎక్కువ వరములను ఇచ్చెను. సత్యమునకు ప్రశంస, అసత్యమునకు శిక్ష జరిగిన ఈ రాత్రి అంటే మహాశివునికి పరమప్రీతికరము. ప్రతీ మాసశివరాత్రి శివునికి ప్రీతికరమే. అందున మాఘమాస శివరాత్రి మహాశివరాత్రి అగుట చేత, శివునికి మరింత ప్రీతికరమయ్యెను. 

క్షీరసాగరమథనములో పుట్టిన హాలాహలమను గరళమును శివుడు కంఠమున నిలుపుకొన్న రాత్రినే 'మహాశివరాత్రి' అని అందురు. ఈ మహాశివరాత్రి రోజున ఉపదేశము పొందినవారు, శివపంచాక్షరిని యథాశక్తి జపిస్తే, అమోఘమైన ఫలితాలను పొందవచ్చును. 

                  "ఓం నమఃశ్శివాయ"    

                                                                           

No comments:

Post a Comment