అరసవల్లి శ్రీ సూర్యభగవానుని క్షేత్రమహాత్మ్యం
లోకములను ప్రకాశింపజేయు సూర్యునియందైన తేజస్సు నాదేయని "జ్యోతిషాం రవి రంశుమాన్" నేనే సూర్యభగవానుడను అని చెప్పినాడు. అందువల్ల సూర్యుడే ఈ క్షేత్రంలో యాత్రికులకు, భక్తులకు దర్శనమిస్తున్నాడు. వారి పాపాలను పోగొట్టి, పుణ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. పంచాయతన పూజలో సూర్యభగవానునికే ప్రథమ స్థానం.
ప్రత్యక్షదైవమగు శ్రీసూర్యభగవానుని దేవాలయము దక్షిణ భారతదేశంలో ఒక్కటి మాత్రమే ఉన్నది. అంధులు, అంటువ్యాధిగ్రస్తులు, కుష్ఠురోగులు, క్షయవ్యాధి కలవారు, బొల్లిమచ్చలు కలవారు మొదలగు వ్యాధిగ్రస్తులు ఇక్కడకు వచ్చి, 'త్వమేవ శరణం మమ' అని సూర్యభగవానుని స్తుతించి, పూజలు, అభిషేకములు, సూర్యనమస్కారములు జరిపించుకొని, తమకోర్కెలు ఫలించగా హర్షభరితులై, సంపూర్ణ ఆరోగ్యవంతులై, సూర్యనుగ్రహం పొందినందులకు సంతోషించి, వారి ఇండ్లకు ఆనందంతో తిరిగి వెళుతుంటారు. కనుక ఈ క్షేత్రమును 'హర్షవల్లి' గ మారినది. కాలక్రమేణా 'అరసవల్లి' గ మారినది.
సూర్యుని వేయి కిరణాలలో ముఖ్యమైన ఏడుకిరణాలే గ్రహాలు. అందువల్ల గ్రహపతి అయిన సూర్యుని అనుగ్రహం వలన భక్తులకు సర్వగ్రహశాంతి కలుగుతుంది. భాస్కరుడు త్రిమూర్తి స్వరూపుడు - వేదస్వరూపుడు కనుక, త్రయీమూర్తి - సర్వదేవాత్మకుడు మరియు కర్మసాక్షి అయిన ఇతను ఈ క్షేత్రంలో సాకారుడై భక్తులను అనుగ్రహించుచున్నాడు. ప్రత్యక్షదైవమై తన కిరణాలతో లోకములను రక్షించుచున్నాడు.
పురాణకథనం:--
శ్రీమహావిష్ణువు యొక్క అవతారమగు బలరాముడు ద్వాపరయుగంలో జీవులను ఉద్ధరించుటకు తన నాగలితో నాగావళీ నదిని తెసుకొనివచ్చి ఆ నదీ తీరమున దేవాలయమును ప్రతిష్టించెను. అప్పుడే శ్రీకాకుళమున శ్రీఉమారుద్రకోటేశ్వరస్వామి ప్రతిష్టింపబడెను. ఆవింతను చూచుటకు స్వర్గమును వదిలి దేవతలంతా భూలోకమునకు వచ్చి, ఆస్వామిని దర్శించి, అర్చించి, ఆనందించి వెళ్ళిరి.
అనంతరం ఇంద్రుడు రాత్రి సమయంలో దేవదేవుని దర్శించుటకు దేవాలయమునకు వచ్చెను. ద్వారపాలకులైన నంది - మహాకాళులు అతనిని చూసి, ఉమారుద్రుల కేళీ సమయంలో మహేంద్రుడు వచ్చినందుకు అడ్డగించిరి. తనకు కలిగిన ఉత్సాహభంగమును సహింపలేక సురసార్వభౌముడు సాహసింపచూసెను. అంతట ఉగ్రుడైన నందీశ్వరుడు హూంకరించి, ఒక్కతన్ను తన్నగా, దేవేంద్రుడు తూరుపు దిక్కునకు పోయి పడెను. అంతట శక్తిలేని ఇంద్రుడు సూర్యుని స్మరించెను. వెంటనే ఆటను స్వస్థశరీరుడై ..... సహస్రరశ్మిని సర్వవిధముల స్తుతించి, ప్రసన్నునిగావించెను. ఈవిధంగా సూర్యునివలన సుఖము పొందిన దేవేంద్రుడు, సర్వజీవులు సూర్యభగవానుని సేవించి, తనవలె దుఃఖము నుండి సౌఖ్యము పొందాలని సంకల్పించి, సూర్యుని చూసి, నమస్కరించి, "ఓ ఛాయాపతి ! అందరికి నీవే గతివి. నిన్ను స్మరించగానే నాకు బాధలు తొలగి, సుఖమునొందాను. నిన్ను ఎల్లప్పుడూ దర్శించుచు, సకల జనులు వారి బాధలు తొలగి, సుఖసౌఖ్యములతో ఉండుటకు నీవు ఇక్కడే ఉషాపద్మినీ దేవేరులతో నిత్యమూ కొలువుండుస్వామీ !" అని కోరెను. అతని నిస్వార్థమగు కోరికకు సంతోషించి, సూర్యుడు "తథాస్తు" అని పలికి అదృస్యమయ్యెను.
అంత సంతసించిన దేవేంద్రుడు తన వజ్రాయుధముతో అక్కడే త్రవ్వగా, ఇప్పటికీ అతని పేరుమీదుగా 'ఇంద్రపుష్కరిణి' గ అక్కడ తటాకము పిలువబడుచున్నది. యాత్రికులు ఆ పుష్కరిణిలో స్నానం చేసి దేవదేవుని దర్శించుకుంటారు. అంతట విశ్వకర్మ తన అపూర్వమగు అద్భుతమగు, శిల్పకళా చాతుర్యముతో ఆదిత్యునికి దేవాలయం నిర్మించెను. అందు పింగళమాఠరులు ద్వారపాలకులుగా, అసూరుడు ఏకచక్రరథసారథిగా ప్రత్యక్షమయ్యిరి. వెనువెంటనే ముక్కోటిదేవతల జయజయధ్వానాలు పలికిరి. సనకసనందాదులు చత్రచామరులతో దేవుని సేవించవచ్చిరి. నారదాది బృందగానము స్తోత్రపేయమయ్యెను. ఈవిధంగా అరసవల్లిలో ప్రత్యక్షనారాయణుడు అయిన సూర్యభగవానుడు మనకు దర్శనమిచ్చుచున్నాడు.
చారిత్రిక కథనం;--
ఏడవ శతాబ్దిలో మనదేశమున గంగారాజులలో దేవేంద్రవర్మ పరిపాలిస్తూఉండేవాడు. ఆటను ఈ అరసవల్లి దేవాలయంపై ఎక్కువ ఆదరమును జూపెను. నిత్య భోగ, ధూప, దీపములు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు మొదలగు వణికి భూరి విరాళములు ఇచ్చెను.
16 వ శతాబ్దంలో మతావేశపరులు అగు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతములు ధ్వంసంచేసిరి. తరువాత క్రీ.శ. 1788 లో శ్రీ యెలమంచిలి పుల్లజీ పంతులుగారు ఆలయ పునరుద్ధరణ గావించిరి. శ్రీకాకుళం జిల్లా అలుదు గ్రామవాస్తవ్యులు శ్రీవరుదు బాబ్జీ దంపతులచే 1999 లో ఆలయ పునఃనిర్మాణం జరిగింది. అదే సమయంలో 250 మంది ఋత్వికులచే మహాకుంభాభిషేకంతో పాటుగా మహాసౌరయాగము కూడా జరిపించబడినది. ఇదే విధంగా ఎందఱో పుణ్యాత్ములు ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడి ధన్యులయ్యిరి.
మహారాజులు సూర్యానుగ్రహము వలన విజయములు పొందిరి అని మనకు పురాణాలలో ఉన్నవి. శ్రీరాముడు రావణుని వధించుటకై ఆదిత్యహృదయమును ఉపదేశించి, దానిని మూడుసార్లు చదివి, యుద్ధమునకు వెళితే, రావణుని జయిస్తావు అని అగస్త్య మహర్షి చెప్పగా ..... శ్రీరాముడు అదే విధంగా చేసి విజయమును పొందెను.
శ్రీమద్భాగవతంలో సత్రాజిత్తు సూర్యునుని ఆరాధించి వారి అనుగ్రహముతో శ్యమంతకమణిని పొందెనని సూర్య మహిమ వర్ణింపబడినది. సాంబపురాణంలో ...... దుర్వాసుని శాపము వలన ప్రాప్తించిన కుష్టురోగమును సాంబుడు సూర్యోపాసన పోగొట్టుకొనెను అని తెలియచేస్తుంది.
మహాభారతంలో ధర్మరాజు అరణ్యవాసము సమయంలో దారిద్ర్యం అనుభవిస్తూ ఉండి, ఆదిత్యుని ఉపాసించి వాణి అనుగ్రహం వాళ్ళ అక్షయపాత్రను పొంది .... అతిధి సత్కారము చేసి, సూర్యుని కృపకు పాత్రుడయ్యెను.
అంధుడగు అమర మహాకవి తన అంధత్వమును సూర్యస్తుతి అగు మయూర శతకమును విరచించి, పోగొట్టుకొనెను.
ఆదిదేవుడు అగు ఇతని అనుగ్రహమునకై ధర్మశాస్త్రము ఆదివారమున ఏకభుక్తమును విధించెను. ఆదివర నియమములు పాటించు భక్తులు శోకదారిద్ర్యములు, అధివ్యాధులు లేక, సుఖజీవితము గడుపుదురు అని, మరణానంతరము సూర్యలోకమును పొందుదురు అని, అందురు.
రథసప్తమి రోజున ...... అక్టోబర్ 1,2,3,4 తేదీల్లోనూ, స్వామివారి మూలవిగ్రహంపై ఆదిత్యుని తొలికిరణాలు ప్రసరించే దృశ్యాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు అరసవల్లి ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారి పాదాల మీదుగా మొదలై, శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే ఆ మనోహరమైన దృశ్యం అద్భుతం, అపురూపమని భక్తులు అంటూ ఉంటారు.
పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రమును దర్శించి, ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుని అనుగ్రహం పొందండి.
ఆయురారోగ్య ఐస్వర్యాభివృద్ధిరస్తూ
No comments:
Post a Comment