October 19, 2015

"బతుకమ్మ"

"బతుకమ్మ"
-----------------
రచన: డా. ఆచార్య ఫణీంద్ర
------------------------------------
బ్రతుకునిడు ప్రకృతిని ’బతుకమ్మ తల్లి’గా
ఎంచెడు తెలగాణ యింతులెల్ల
భక్తి గొలిచి, ఆడి, పాడి మురియుచుంద్రు!
ప్రకృతి పూజ సలుపు పండుగిదియ!

గునుగు, తంగేడు వంటి పూలను వరించి,
ఏర్చి, కూర్చి, తెలంగాణ యింతి పేర్చి,
అమిత సుందరమ్ముగ ’బతుకమ్మ’ దీర్చి,
ప్రకృతికిటుల ’సీమంతము’ వరలజేయు!

అంగనలు గూడి యాడుట
సింగారించుకొని పట్టు చీరలు, రవికల్,
బంగారు నగల తోడన్ –
సాంఘిక సహజీవన ఘన సంస్కృతి గాదో!

భారత సంప్రదాయ ఋజువర్తన రీతులు, నీతి, ధర్మముల్,
పేరిమి గొన్నయట్టి ఘన వీర కథా కమనీయ భావముల్
కూరిచినట్టి దివ్య రస ఘోషితమౌ ’బతుకమ్మ పాట’లన్
నేరిచి యాడి పాడెదరు నెచ్చెలులై తెలగాణ జవ్వనుల్!

చెరువులం దౌషధగుణ మలరు సుమాల
చేర్చి, ప్రక్షాళనము సేయు శ్రేష్ఠమైన
శాస్త్ర దృక్పథమ్ము గలుగు సంస్కృతిదియ!
జయమిదె తెలగాణ సంస్కృతికిని!


No comments:

Post a Comment