November 11, 2014

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ



బాలల దినోత్సవం (నవంబర్ 14) అనగానే చాచాజీనే మనకు గుర్తుకు వస్తాడు. అతనికి పిల్లలు అంటే మహా ఇష్టం. ఐతే అతని ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అతని జీవిత విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం.




నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఒక కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను 'నెహర్' అంటారు. అలా వారికి నెహ్రూ అనే పేరు ఇంటిపేరుగా మారింది. నిజానికి వారి ఇంటిపేరు 'కౌల్'. 

నెహ్రూ తల్లిదండ్రులు మోతీలాల్ , స్వరూపారాణి. నెహ్రూ అలహాబాద్ లో స్కూలుకి వెళ్ళి చదివింది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడిక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటు చేశారు మోతీలాల్. ఒక విదేశీ టీచర్ నెహ్రూకు సైన్సు, ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. చాచాకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవే. కొడుకు కోసం మోతీలాల్ ఇంట్లోనే ఒక సైన్సు ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. 15వ సంవత్సరంలో నెహ్రూ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ ఎనిమిది సంవత్సరములు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్ తో వివాహము జరిగింది. 

నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె. ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్ర్యం కోసం నెహ్రూ పోరాటం చేసినప్పుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సి వచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేమి చెప్పాలి అనుకునేవారో వాటినన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాలని చదివి భద్రపరచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేది. ఆ ఉత్తరాలని "Letters from a father to his daughter" అనే పేరుతో పుస్తకంగా ముద్రించారు. 

నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ ఎప్పుడూ ఉంటుంది. అది పెట్టుకోవటం ఆయనకు ఎలా అలవాటైందంటే .... ఒకరోజు ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అది చూసి ఆనందంతో నవ్విన ఆ చిన్నారి అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగానే కనిపించాయంట. తనకు అంత ఇష్టమైన పిల్లల గుర్తుగా ఆ తరువాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు అయ్యిందని చెబుతారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లలను తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు.


నెహ్రూ పుట్టినరోజు చాలా వైభవంగా జరిగేది. అయన చిన్నతనంలో ఐతే ఆ రోజున కొత్తబట్టలు వేసుకునేవారు. ఎందఱో రకరకాల బహుమతులు తెచ్చి ఇచ్చేవారు. త్రాసులో ఒకవైపున నెహ్రూని కూర్చోబెట్టి, మరోవైపు అయన బరువుకి సరిపడే గోధుమలు మొదలైన ధాన్యాలు ఉంచేవారు. అనంతరం ఆ ధాన్యాన్ని పేదసాదలకు పంచిపెట్టేవాళ్ళు. ఆ రోజంతా వాళ్ళ ఇల్లు పండుగ రోజుగా ఉండేది. గొప్ప విందు జరిగేది. 'ఈ పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కరోజు కాకుండా రోజూ ఉంటే ఎంత బాగుండును' అని అనుకొనేవాడంట బాల నెహ్రూ. 

జవహర్ అనే మాటకు రత్నం అని అర్థం. నెహ్రూ నిజంగానే రత్నం వంటివాడు. 'భారతరత్న' అనే బిరుదు ఆయనకు లభించింది. మన భారత ప్రభుత్వంవారు ఇచ్చే బిరుదులలోకెల్లా ఇది చాలా గొప్పది.


ఒకసారి జపానుకు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే అయన వారికీ ఒక ఏనుగును పంపించి, 'భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా' అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారంట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచిది. 

పిల్లలంతా బడికి వెళ్ళాలనేది చాచా కోరిక. ఒకసారి బాలల సినిమా చూసిన చాచాకు అందులో నటించిన ఏడేళ్ళ పాపని మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి 'థ్యాంక్స్' చెప్పడం కూడా రాలేదు. దానితో చాచాకు సందేహం వచ్చి పాపను బడికి పంపడం లేదా ? అని వాళ్ళ అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.

ఒకసారి ఢిల్లీలో స్కూలు పిల్లలు ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. దానికి ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు. పిల్లలు దానిని దూరం నుంచి చూసాక కళ్ళు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి. అదీ ఆట. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించటానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ ఆట ఆడినందుకు అక్కడున్న పిల్లవాడు రెండు అణాలు ఫీజుగా అడిగితె నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేసి, తన సహాయకులను అడిగి డబ్బు ఇప్పించుకొని ఆట ఆడినందుకు ఫీజు చెల్లించారట.

నెహ్రూ ప్రముఖ ప్రజా నాయకుడు. ప్రజలే దైవం, ప్రజాసేవే పరమాత్ముని సేవ, ప్రజలకు ఉపయోగపడే నాగార్జునసాగర్ వంటి ఆనకట్టలు, కర్మాగారాలు మొదలైనవి ఆయనకు పవిత్ర దేవాలయాలు. ప్రజలు కూడా నెహ్రూని తమ సొంత అన్నయ్యలా గౌరవించారు, ప్రేమించారు. అయన వెళ్ళిన చోటల్లా పిల్లలూ, పెద్దలూ తండోపతండాలుగా గుమిగూడేవారు. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా ప్రజల శ్రేయస్సునే మనస్సులో ఉంచుకోనేవారు. మనదేశంలో పెద్దపెద్ద పరిశ్రమలు త్వరితంగా వృద్ధి కావాలని, విజ్ఞానశాస్త్రం మూడు పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని బీదా బిక్కీ అనే భేదం లేని ఒక కొత్త సమాజం వెలుగులోకి రావాలనీ ఆయన ఆశించారు. అందుకు ప్రయత్నించారు కూడా. అన్ని దేశాల వారితోనూ, అన్ని మతాలవారితోనూ స్నేహంగా ఉండాలని  బోధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నెహ్రూ గొప్ప మానవతావాది. మానవ శ్రేయస్సే ఆయన లక్ష్యం.


స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నెహ్రూ చాలాసార్లు జైలుకి వెళ్ళారు. జైలులో కాలాన్ని వృథా చెయ్యకుండా నాలుగు కాలాలపాటు నిలిచే గొప్ప పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు. కాలాన్ని వృథా చెయ్యడమంటే ఆయనకు తగని అసహ్యం. లిఫ్టులో వెళుతూ కూడా ఆయన పుస్తకం చదివేవారంట. పుస్తకాలు చదవటం అంటే ఆయనకు అంత ఇష్టం, ఆసక్తి. "నేను నా జీవితంలో తగ్గించుకోలేకపోయిన పెద్ద ఖర్చు పుస్తకాలెన్నో కొంటూ ఉండడమే". అని ఒకసారి నెహ్రూ పేర్కొన్నారు.


నెహ్రూ కాంగ్రెసు పార్టీ అధ్యక్షునిగా చాలాసార్లు ఎన్నుకోబడ్డారు. ఆయన ఎంత గొప్ప రాజనీతి శాస్త్రవేత్తయో, అంతగొప్ప సాహితీవేత్త కూడా. ఆయన వ్రాసిన గ్రంథాలలో "గ్లింప్సన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ" (ప్రపంచ చరిత్ర) "డిస్కవరీ ఆఫ్ ఇండియా". "ఆటో బయాగ్రఫీ" (స్వీయచరిత్ర) మొదలైనవి ముఖ్యమైనవి. వీటిని కనుక చదివితే అనేక విషయాలలో ఆయనకుగల గొప్ప పాండిత్యం మనకు తెలిసివస్తుంది. మనదేశంలోని వివిధ భాషలలోనూ అభివృద్ధి పరిచేందుకు 1954 లో 'సాహిత్య అకాడమీ' అనే ఒక సంస్థ స్థాపించబడింది. ఆ సంస్థకు తోలి అధ్యక్షునిగా నెహ్రూ ఎన్నుకోబడ్డారు. అప్పటినుంచీ మరణించే వరకూ ఆయనే అకాడమీకి అధ్యక్షునిగా ఉన్నారు. ఒకసారి ఆయన ఈ విధంగా అన్నారు, 'అకాడమీ అధ్యక్షుడినయిన నా కార్యకలాపాలలో భారత ప్రధానమంత్రి (అప్పట్లో ఆయనే ప్రధానమంత్రి) జోక్యం కల్పించుకోవటం నాకంత ఇష్టంగా లేదు.' సాహిత్యమంటే ఆయనకుగల అపారమైన ఆదర్శభావాన్ని పై వాక్యం స్పష్టం చేస్తుంది. ఒక్క సాహిత్యమంటేనే కాదు, విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.


మనదేశంలో అవతరించిన మహనీయుల్లో మహామనీషీ, 17 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశానికి ప్రధమంత్రిగా వ్యవహరించిన ప్రముఖులు. శాంతిదూత, ప్రముఖ రచయిత, నవభారత నిర్మాత, మానవతావాది, ప్రపంచ మహా పురుషుడు, రాజనీతి శాస్త్రజ్ఞుడు అయిన నెహ్రూ 1964 లో మే 27 న కాలధర్మం చెందారు.


చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవటానికి ఆ సంవత్సరం నుంచీ ఆయన పుట్టినరోజైన నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.    


చరిత్ర అంటే మానవుని ముందడుగు, మన మేధస్సు వికాసానికి పడే తపన, తెలిసిన తెలియని విషయాల వరకూ అన్వేషణ. ---- నెహ్రూ. 

                          

2 comments: