November 19, 2014

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు


సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా?

చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం.

బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా!

ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం.

By~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/-world-suicide-prevention-day-34-38154.html#.VGxUpjSUdQA


No comments:

Post a Comment