November 19, 2014

మన కోపమే మన శత్రువు

మన కోపమే మన శత్రువు


మంచి వంటకం కుదరాలంటే అన్ని రుచులు వేటికవి సమపాళ్ళలో పడాలి. అప్పుడే కమ్మని వంటకం తయారవుతుంది. పొరపాటున ఏ ఒక్క రుచి ఎక్కువైనా వంటకంమొత్తం పాడైపోయినట్టే. జీవితం కూడా అంతే కదా! అన్ని భావావేశాలు వేటి స్థాయిలో అవి ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ ఒక్క భావావేశం మనసుని అతిగా ఆక్రమించినా మొత్తం చికాకుగా తయారవుతుంది. మనం గుర్తించంగానీ, కొన్నిసార్లు కొన్ని భావావేశాలు మనల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బందిపెడతాయి. ఎటొచ్చీ అలవాటు పడిపోయిన మనం వాటిని గుర్తించడానికి, వాటిని వదిలించుకోవడానికి, మనం మారడానికి ఇష్టపడం.

కోపం మనల్నే దహిస్తుంది..
చాలామందిని ఇబ్బందిపెట్టే కోపాన్నే తీసుకోండి. ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలవుతుందో తెలీదు. అప్పటి వరకు ప్రశాంతంగా వున్న మనసు ఒక్క నిమిషంలో అల్లకల్లోలంగా మారిపోతుంది. సర్దుకుందామని, ఆ కోపాన్ని దూరంగా నెట్టేద్దామని ప్రయత్నించిన కొద్దీ మరికొంచెం ఎక్కువవుతుందే గానీ తగ్గదు. ఒకోసారి ఆ కోపాన్ని అంత తొందరగా వదులుకోవడం ఇష్టంలేనట్టు మనం కూడా ఒకదానిపై నుంచి మరో దానిపైకి మన కోపాన్ని మళ్ళిస్తూనే వుంటాం. మండే కట్టె మంటని ఎగజిమ్ముతూనే తనని తాను దహించుకున్నట్టు కోపం వచ్చినప్పుడు ఎవరిమీదో కోపం చూపిస్తున్నాం అనుకుంటాం. కానీ, అది మనల్నే ఎక్కువ బాధపెడుతుంది.

కోపంతో జీవితం శూన్యం..
ఆ నిమిషానికి వచ్చిపోయే కోపం పెద్దగా హాని చేయకపోయినా కొంతకాలం పాటు కొందరిపై నిలిచిపోయే కోపం తప్పకుండా బంధాలను బలహీనపరుస్తుంది. ఒకోసారి మన మనసుని, జీవితాన్ని కూడా శూన్యంగా మార్చేస్తుంది. ఒక్కసారి గుర్తుచేసుకోండి ఎప్పుడైనా ఎవరిపైన అయినా వచ్చిన కోపానికి కారణం మొదట చిన్నదే అవుతుంది. రానురాను ఒకదానికి ఒకటి చేరుతూ మందమైపోతుంది. మనసుని రాయిగా మార్చేస్తుంది. మనకి తెలీకుండానే ఎదుటి వ్యక్తిని బాధపెడతాం. విసుక్కుంటాం. విసిరికొడతాం. ఫలితం తెలిసిందే. కానీ, ఎంత కోపం వచ్చినా మనం అంత తీవ్రంగా ఒక వ్యక్తిని బాధపెట్టడం కరెక్టేనా?

మనసులని గాయపరచొద్దు..
మనసులో ఎక్కడో దాగున్న అక్కసుని తీర్చుకునేందుకు కోపాన్ని సాధనంగా వాడుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటుండదు. ఒకరిని చూసి మరొకరు, ఒకరు చేశారు కదా అని మరొకరు ఇలా మనసుల్ని గాయపరచుకుంటూ వెళుతుంటే కొన్నాళ్ళకు గాయపడ్డ మనసులు, దూరమైన బంధాలు మిగులుతాయి. పరిగెట్టే కాలంతో అన్నీ సవ్యంగా వుంటేనే బంధాలని కాపాడుకోవడం కష్టంగా మారిన కాలంలో మనసుల్ని గాయపర్చుకుంటూ వెళితే ఆత్మీయత అనే లేపనాన్ని రాసేపాటి అవకాశం కూడా వుండదు.

ఒక మంచి మాట చాలు...
క్షమించడం లాంటి పెద్ద పదాలు వాడక్కర్లేదుగానీ, చెదిరిపోయిన మనసుల్ని, బంధాల్ని సరిచేసే ఒక మంచి మాట మనసు లోతులోంచి వస్తేచాలు అద్భుతాలు జరగక మానవు. కోపం, పగ, ప్రతీకారం వంటి లక్షణాలను ప్రత్యేకంగా అలవర్చుకోనక్కర్లేదు. ముందు తరాల వారికి అలవాటు చేయక్కర్లేదు. వద్దన్నా అవి మన మనసుపై దాడి చేస్తూనే వుంటాయి. ఆత్మీయత అనే కవచాన్ని ధరిస్తే వాటి దాడి నుంచి తప్పించుకోవచ్చు. ద్వేషాని ద్వేషించి దూరంగా తరిమికొట్ట గలిగితే మనకి మనం మంచి చేసుకున్నవారమవుతాం. ప్రేమాప్యాయతలనే మంచి గంధాన్ని మనసు మూలల్లో దాచినా చాలు.. అది సువాసనలు వెదజల్లకపోదు. చుట్టూ తన పరిమళాన్ని నింపకపోదు. ఏమంటారు.. ఆలోచించండి!

By~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/anger-is-your-worst-enemy-35-40356.html#.VGxYZjSUdQA


No comments:

Post a Comment