******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******
23 వ శ్లోకం
భక్తాపాయభుజంగగారుడమణి: త్త్రైలోక్యరక్షామణి:
గోపీలోచనచాతకాంబుదమణి: సౌందర్యముద్రామణి:
య: కాంతామణిరుక్మిణీఘనకుచ ద్వంద్వైకభూషామణి:
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణి:
భావం:-
సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి. వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ, మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను దరిచేరకుండ తొలగించును.
No comments:
Post a Comment