March 28, 2016
శ్రీ గోదా మన్నార్ రంగనాథ స్వామి దేవాలయం- ఏదులాబాద్ ...... (ఆంధ్ర శ్రీవిల్లిపుత్తూరు)
{ఈ నెల (మార్చి) 25 న హోలీ రోజున గోదా అమ్మవారిని దర్శించుకుందామని అమ్మ, చెల్లెళ్ళతో కలసి ఏదులాబాద్ వెళ్ళాము. అక్కడ పురోహితులని అడిగి తెలుసుకున్న విశేషాలు మీతో పంచుకుంటున్న.}
గోదాజననం:
శ్రీమహావిష్ణువు సేవకుడైన గరుక్మంతుడు, శ్రీమన్నారాయణుడు తనకి అల్లుడిగా కావాలన్న కోరికను విష్ణుమూర్తికి ఒకరోజు తెలియచేసాడు. అల్లాంటిదే మరో సంభవం. ---- హిరణ్యాక్షుడు సముద్రంలో ముంచేసిన భూమిని, శ్రీహరి వరాహరూపుడై సముద్రం నుండి వెలికితీసి, తన కోరలపై పైకెత్తి, యథాస్థానమందుంచగా, శ్రీమహావిష్ణువు దివ్యస్పర్శనొందిన భూదేవి, తనను వివాహం చేసుకోమని కోరింది. గరుత్మంతుని కోరికతో బాటు, ఈ కోరిక కూడా కలియుగంలో సిద్ధింపజేస్తానని శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు. వీరిద్దరూ తమ కోర్కెలను తీర్చుకోవడానికి కలియుగంలో గరుక్మంతుడు - విష్ణుచిత్తులుగాను (పెరియాళ్వారు), భూదేవి - గొదాదేవి (ఆండాళ్ళు) గాను శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు.
విష్ణుచిత్తులవారు శ్రీమన్నారాయణు(వటపత్రశాయి)ని పాదపద్మాలను అనన్యభక్తితో పుష్పకైంకర్యం, హరి నామ స్మరణలతో సేవించేవారు. శ్రీరంగనాథునికి ప్రతిరోజూ తులసిని కోసి మాలలు కట్టి ఇవ్వడం విష్ణుచిత్తుల వారి నిత్యకృత్యం. ఈయన పెంచిన తులసీ వనంలో ఒకరోజు గోదాదేవి పసిపాపలా కనిపించింది (దొరికింది). భూదేవి అంశతో, అయోనిజగా అవతరించిన ఆ బిడ్డను కుమార్తెగా స్వీకరించి, విష్ణుచిత్తులు ఆమెను విష్ణుభక్తురాలుగా పెంచి పెద్ద చేశారు.
యుక్త వయసుకు వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించేది. ఒకరోజు ఈ రహస్యం విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలను తీసుకువెళ్ళలేదు. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇకమీదట ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలే కావాలని తెలియచేసారు. దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది. వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసుడైన శ్రీరంగనాథునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ వైష్ణవాలయాలలో పఠిస్తారు. గోదా రంగనాథుల కళ్యాణానికి సూత్రధారులు విష్ణుచిత్తులవారు (గరుడాళ్వార్) అగుటవలన, ఆలయంలో గోదా రంగనాథుల ప్రక్కనే విష్ణుచిత్తులవారి విగ్రహం కూడా ప్రతిష్టించబడింది, విష్ణుచిత్తుల వారు కూడా గోదా రంగనాథులతో పాటు పూజలందుకుంటున్నారు.
విష్ణుచిత్తులవారికి గోదాదేవి దొరికినట్టే, అప్పల దేసికాచార్యుల వారికి గోదాదేవి విగ్రహం లభించింది.
ఏదులాబాద్ ఆలయ చరిత్ర :
రంగారెడ్డి జిల్లా, ఘటకేసర మండలంలో ఏదులాబాద్ (రాయపురం) గ్రామంలో శ్రీగోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం ఉంది. ఇది హైదరాబాద్ కి సుమారు 30 కి మీ దూరంలో, ఘటకేసర మండల కేంద్రానికి 5 కి మీ దూరంలో ఉంది. సుమారు 600 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. అందమైన రాజ గోపురం. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పుష్కరిలో భక్తులు స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. అద్భుతమైన పురాతన కట్టడాలు, చక్కని శిల్పకళతో ఎంతో అందంగా ఉంది ఈ ఆలయం. వైష్ణవ సంప్రదాయం ప్రాకారం, శ్రీవిల్లిపుత్తూరులో ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో, ఇక్కడ కూడా అదే విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని అక్కడ పురోహితులు తెలియచేసారు.
రంగారెడ్డి జిల్లా, ఘటకేసర మండలంలో ఏదులాబాద్ (రాయపురం) గ్రామంలో శ్రీగోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం ఉంది. ఇది హైదరాబాద్ కి సుమారు 30 కి మీ దూరంలో, ఘటకేసర మండల కేంద్రానికి 5 కి మీ దూరంలో ఉంది. సుమారు 600 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. అందమైన రాజ గోపురం. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పుష్కరిలో భక్తులు స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. అద్భుతమైన పురాతన కట్టడాలు, చక్కని శిల్పకళతో ఎంతో అందంగా ఉంది ఈ ఆలయం. వైష్ణవ సంప్రదాయం ప్రాకారం, శ్రీవిల్లిపుత్తూరులో ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో, ఇక్కడ కూడా అదే విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని అక్కడ పురోహితులు తెలియచేసారు.
ఈ ఆలయ చరిత్రకి భిన్న కథనాలు ఉన్నాయి. ఏదులాబాద్ ని పూర్వం రాయపురం అని పిలిచేవారట. ఒకానొకప్పుడు అప్పల దేసికాచార్యులు అనబడే వైష్ణవస్వామి ఈ క్షేత్రములో ఉండేవారట. ఒక మహర్షి మంత్రోపదేశంతో అతను మధురై సమీపంలో ఉన్న శ్రీవిల్లి పుత్తూరులో ఉన్న గోదాదేవిని దర్శించుకున్నారట. ఆ రాత్రి గోదాదేవి అతనికి కలలో కనిపించి, అతనికి ఒక విగ్రహం ఇచ్చి, తనను రాయపురం తీసుకొని వెళ్ళమని చెప్పిందట. అలా అతనికి దక్కిన విగ్రహాన్ని తీసుకొనివచ్చి ఇక్కడ (ఏదులాబాద్ లో) ఒక చిన్న భవనాన్ని నిర్మించి, పూజలు చేస్తూ ఉన్నారంట. దేసికాచార్యులకి ఒకరోజు అమ్మ కలలో కనిపించి, తనకి ఒక దేవాలయం కట్టించమని అడిగిందంట, వెంటనే ఆచార్యులవారు, తల్లీ నాకు ఆలయం కట్టించే స్థోమత లేదని చెప్పారంట. అదేరోజు గోదా అమ్మవారు, ఆ ఊరి పెద్దలకి కలలో కనిపించి తనకి ఆలయ నిర్మాణం చెయ్యమని ఆదేశించిందట. అంతే, మరుసటి రోజు గ్రామస్తులంతా కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారట. ఇప్పటికీ ఈ ఆలయంలో అప్పల దేసికాచార్యుల వంశస్థులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు ఈ ప్రాంతమంత చెట్లు ,గుట్టలతో నిండి ఉండేదంట, ఈ ప్రాంతంలో గరుడ పక్షులు ఎక్కువగా తిరిగేవంట, అందుకే దీనికి గరుడాద్రి అని కూడా పిలుస్తారని చెప్పారు.
ఆలయం లో అమ్మవారిని దర్శించి, కోరికలు కోరుకుని, ముడుపులు కడితే, గోదాదేవి తప్పకుండ నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
గర్భాలయానికి ఆనుకొని, కుడివైపున శ్రీ తాయారు సన్నిధి, ఎడమ వైపున ఆళ్వార్ల సన్నిధి ఉన్నాయి.
శ్రావణమాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. భోగి పర్వదినాన శ్రీరంగనాథునితో గోదాదేవి కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు
Subscribe to:
Posts (Atom)