October 29, 2013

దీపావళి పర్వదినం (పండుగ) విశేషాలు

దీపావళి పర్వదినం (పండుగ) విశేషాలుహిందువుల (భారతీయుల) పండుగులలో ముఖ్యమైనది దీపావళి పండుగ. వయోభేదం లేకుండా, కులమతాలకతీతంగా యావత్భారతదేశం అంతా ఐకమత్యంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపావళి పండుగ.
నరకాసురుడు అనే రాక్షసుని సంహారంతో, ప్రజలు ఈతిబాధల నుండి విముక్తి పొందటంవల్ల, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగే ఈ దీపావళి పండుగ. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి రావటంతో, సీతమ్మ ఒక దీపాన్ని వెలిగించటంతో, ఆ రాజ్యంలోని ప్రతీ ఇంటిలోనూ దీపాలు వెలిగించి అందరు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ చేసుకున్నారు అని ఒక కథనం. జగతిలోని చీకటిని పారద్రోలి, దీపాలతో అంతటా వెలుగును నింపే పండుగ కనుక ఈ పండుగను దీపావళి పండుగ అని అంటారు. ఈ పండుగను ప్రతీ సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీనినే నరక చతుర్థశి అంటారు.

దీప + ఆవళి = దీపాల సమూహం అని అర్థం.

ఈ దీపాలని పెట్టడంలో రెండు అర్థాలు దాగి ఉన్నాయి. చీకటితో నిండి ఉండేది నరకం కాబట్టి, చీకటి నిండియున్న  ఈ అమావాస్యలో పితృదేవతలందరికీ త్రోవని చూపించేందుకు దీపాలని పెడతారు అని ఒక విశేషం. ఇక రెండోది -- లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ప్రీతి. ఇంటినిండుగా దీపాలున్న గృహమంటే ఆమెకు ఎంతో ఇష్టం.


పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషపడి, ఒక విలువైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని అహంభావముతో తన దగ్గర ఉన్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కినుజ్జు నుజ్జు చేసింది. అది చూసిన దుర్వాసమహర్షి ఆగ్రహముతో  దేవేంద్రుని శపిస్తాడు. శాప ఫలితంగా  దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని ఏం చెయ్యాలో పాలుపోక  మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. విషయం గ్రహించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సలహా ఇస్తాడు.ఇంద్రుడు విష్ణువు చెప్పినట్లే చేయగా,   లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. నిన్ను ఏ విధంగా పూజిస్తే నీ కృపకు పాత్రులమవుతాము?? అంతట మహాలక్ష్మి " త్రిలోకాథిపతీ.!. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి కోర్కెలకు  అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, సంతానాన్ని కోరే వారికి సంతానలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునిఅవుతాను" అని   సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.నరకాశురుని చరిత్ర...

ఆశ్వయుజ బహుళ చతుర్థశినే నరక చతుర్థశి అంటారు.పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు సామాన్యులను, ఋషులను, మునులను అందరినీ హింసించి, వేధిస్తూఉండేవాడు. కృతయుగం నాటి మాట. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని ఎత్తుకొని వెళ్ళి సముద్రం అడుగున దాగుకొనగా, విష్ణుమూర్తి వరాహఅవతారమున వచ్చి, హిరణ్యాక్షుని సంహరించి, భూదేవిని సముద్రంలోనుండి పైకి తెచ్చెను. ఆ సమయమున వరాహ అవతారుడైన విష్ణువుకి-- భూదేవికి అసురసంధ్యా సమయంలో జన్మించినవాడే నరకాసురుడు.  అసురసంధ్యా సమయమున జన్మించుట వలన.... నరకునికి అసుర లక్షణాలు కలిగియుండుట వలన, నరకుడు లోకకంటకుడై... ప్రజలను, ఈతిబాధలకు గురిచేసేవాడు. అతడు లోక కంటకుడైనా కానీ మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా మహావిష్ణువు నుండి వరం పొందుతుంది భూదేవి. నరకుని బాధలు తాళలేక ఇంద్రాదిదేవతలంతా వెళ్ళి  విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించారు. భూదేవి సత్యభామగా  అవతరించింది. శ్రీకృష్ణుడు నరకుని సంహారమునకై వెళుతుండుట గమనించి,  సత్యభామాదేవి కూడా  రణరంగానికి వెళ్ళింది. భూదేవికి -- నరకునికి మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. అందుకే ప్రజలు ఈ రెండు రోజులు  ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.
విశేషాలు 

 అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు. పుత్రులు లేని వారికి పున్నామనరకం నుండి తప్పించటానికి, దీపావళి నాటి ఈ దీపాల వెలుగే దారి చూపుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి, దిబ్బు దిబ్బు దీపావళి.......మళ్ళీ వచ్చే నాగులచవితి...అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి, లేదా ఆముదం కొమ్మలకి  చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి,  దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజామందిరంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి, దీపాలకి నమస్కరించి, లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజిస్తారు. (లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలంటే చాలా ఇష్టం. అందుకని దీపావళి నాడు తెల్లని బట్టలని ధరించాలని శాస్త్రం చెబుతున్నది.) పూజానంతరం అందరూ ఉత్సాహంగా రకరకాల బాణాసంచా కాల్చుతారు.ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి మన పురాణాలలో ఒక ప్రయోజనం చెప్పబడింది.  ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశించి,  వాతావరణం ఆహ్లాదంగా ఏర్పడుతుంది. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి వారు కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.


పిల్లాపెద్ద వయోభేదం లేకుండా అందరూ కలసి ఆనందంగా జరుపుకొనే ఆనందాల దీపావళి మతాబులు          
      

అమావాస్యనాడు వెన్నెల వెలుగులు మిత్రులందరికీ దీపావళి పర్వదిన (పండుగ) శుభాకాంక్షలు :) 

వీరగంధము తెచ్చినారము-వీరుడెవ్వడొ తెల్పుడీ

వీరగంధము తెచ్చినారము-వీరుడెవ్వడొ తెల్పుడీ

వీరగంధము తెచ్చినారము-వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము- మెడను వైతుము - పూలదండలు భక్తితో ||వీర||

తెలుగు బావుట కన్ను చెదరగ - కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తి దెబ్బలు - గండికోటను గాంచిచినప్పుడు ||వీర||

తెలుగు వారల వేడి వెత్తురు - తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున్న సహ్యాజ - కత్తి నెత్తురు కడిగినప్పుడు ||వీర||

ఇట్టి సందియ మెన్నడేనియు - బుట్టలేదు రవంతయున్
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు - లేకపోయిరి సుంతయున్ ||వీర||

నడుము కట్టిన తెలుగు బాలుడు - వెనుక తిరుగండెన్నడున్
బాస యిచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడున్||వీర||

ఇదిగో యున్నది వీర గంధము - మైనలందుము మైనలందుము
శాంతి పర్వము చదువవచ్చును - శాంతి సమరంబైన పిమ్మట ||వీర||

తెలుగు నాటను వీర మాతను - జేసి మాత్రము తిరిగి రమ్మిక
పలు తుపాకులు పలు ఫిరంగులు - దారికడ్డము రాక తప్పవు
వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వడో తెల్పుడీ  ||వీర||
October 27, 2013

లేపాక్షి వీరభద్రస్వామి

లేపాక్షి వీరభద్రస్వామి 

అనంతపురం జిల్లలో హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉన్న లేపాక్షిలో ఈ వీరభద్ర ఆలయం నెలకొని ఉన్నది. క్రీ. శ. 1538 లో ఈ ఆలయం నిర్మించబడియున్నదని చరిత్ర చెబుతుంది.ఇక్కడ ఉన్న శిల్పసంపద చూడటానికి రెండు కన్నులు చాలవు. ఒక్కొక్క స్తంభంపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ కళ్యాణమండపంలో స్తంభములపైన రెండు కోతులనే చెక్కి, వాటిని తన చాతుర్యంతో నాలుగు కోతులుగా కనిపించేలా శిల్పి చెక్కాడు. ఒకే ఆవు శరీరానికి 3 తలలు చెక్కి మూడు ఆవులుగా చూపించటగలగటం శిల్పి యొక్క అద్భుతమైన శిల్పకళాచాతుర్యం మనం ఇక్కడ చూడవచ్చును. 70 స్తంభాలున్న మండపంలో రంభ నాట్యం చేస్తున్నట్లు, వాయిద్యాలు వాయిస్తున్న సంగీత కళాకారుల శిల్పాలు, పై కప్పు పైన 100 రెక్కలున్న తామరపువ్వుల చిత్రాలను మనం ఇక్కడ చూడవచ్చును.ఆలయ బయటి ప్రాకారంలో 7 తలల నాగుపాము పడగనీడలో కొలువైయున్న శివలింగాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చును. ఒకరోజు ఈ ఆలయాన్ని నిర్మించే పనులలో ఉన్న శిల్పులకు భోజనం తయారుచేయటం ఆలస్యం అయినప్పుడు ఆ సమయంలో నాగలింగాన్ని చెక్కినట్లు స్థానికులు చెప్పుకుంటారు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన శిల్పం.సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకువెళుతున్నప్పుడు ఈ ప్రదేశంలో జటాయువు అడ్డుకొని యుద్ధం చేయగా, రావణుడు దాని రెక్కలను నరకివేసినట్టు, కొనఊపిరితో ఉన్న జటాయువును రాముడు చూసి లే పక్షి అన్నాడని, అందుకే ఈ చోటికి "లేపాక్షి" అనే పేరు వచ్చిందని చెప్పుకుంటూఉంటారు.


ఆలయం నుండి సుమారు 600 అడుగుల దూరంలో ఒక పెద్ద రాతిపై 27 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఒక నందిని చెక్కారు. ఆలయంలోని నాగలింగాన్ని ఇక్కడినుండే కనిపించేటట్టు చెక్కిన ఈ నందికి కొన్ని చిన్న చిన్న గంటలు, మరెన్నో అలంకారాలతో మనకు విజయనగర సామ్రాజ్యంలో ఎంత గొప్ప శిల్పులుండేవారో తెలియచేప్తోంది.


 
ఆలయ చరిత్ర -- విశేషాలు

14 వ శతాబ్దం నాటి మాట........ విజయనగరం రాజులలో అచ్యుత రాయలు పాలిస్తున్న సమయంలో ఆయనవద్ద కోశాధికారిగా పనిచేస్తున్న విరుపణ్ణ , రాజుకు ఎంతో విశ్వాసంగా ఉండేవాడు. అతను భగవంతునిపై ఎనలేని విశ్వాసం, భక్తి ఉన్నవాడు.

ఒకరోజు విరుపణ్ణకు కలలో వీరభద్రస్వామి ప్రత్యక్షమై "విరుపణ్ణ ! దక్షుడి యాగాన్ని భగ్నం కావించాక, ఆవేశంతో అటు ఇటు తిరుగుతున్న నన్ను భద్రకాళి కన్యకారూపంలో వచ్చి గాంధర్వ వివాహం చేసుకుంది. ఆమె చూపిన ప్రేమ నాలోని ఆవేశాన్ని అణచివేసింది. ఇప్పుడు నేను కూర్మ శైలంపై స్వయంభూవుగా అవతరించాను. అక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించు. " అని ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానమైనాడు.

విజయనగరం సామ్రాజ్యంలో లేపాక్షి అనే ప్రాంతంలో తాబేలు ఆకారంలో ఉన్న ఒక కొండను కూర్మశైలం అని పిలిచేవారట. ఆ కొండపైకి వెళ్ళి తనకు కలలో కనిపించిన రీతిలో, ఆ వీరభద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకసాగాడు విరుపణ్ణ. కలలో చూసిన విధంగా అక్కడ ఒక స్వయంభూవు లింగం కనిపించేసరికి అతని ఆనందానికి అవధులులేకుండాపోయాయి. అక్కడ ఒక పెద్దఆలయం నిర్మించటమే కాక పార్వతీ పరమేశ్వరుల వివాహవేడుకుల దృశ్యాలను ఒక కళ్యాణమంటపంలో రాతిపై చేక్కించాలని ఆ పనులలో నిమగ్నమైనాడు విరుపణ్ణ.

గర్భగుడి,  గోపురం అద్భుతమైన శిల్పకళతో ఆలయ నిర్మాణం పూర్తి చేసి, కళ్యాణమండపం పనులు చకచకా జరుగుతున్నాయి. విజయనగరసామ్రాజ్యంలో విరుపణ్ణకు ఉన్న పేరుప్రఖ్యాతులు చూసి రాజు యొక్క సన్నిహితులకి కిట్టక, రాజుగారికి అతని ఖజానాలో ఉన్న సొమ్ముతో వీరభద్రునికి విరుపణ్ణ ఆలయం నిర్మిస్తున్నాడు అని,  అతనిపై  ఉన్నవి లేనివి కల్పించి చాడీలు చెప్పారు. రాజు వారి మాటలు నమ్మి, ఎవరినీ విచారించక, విరుపణ్ణ కన్నులను పీకించమని అజ్ఞ జారీ చేసాడు. రాజుగారి ఉత్తరువు తెలిసిన విరుపణ్ణ ఎంతో న్యాయంగా జీవించిన తనకు ఇటువంటి శిక్షా ? అని ఆవేదనతో రాజుగారి సైనికులు తనను చేరకమునుపే తన కనులను తానీ స్వామికి అర్పించాలని తన 2 కనులను మండపంలో ఒక గోడపై వేశాడు. అందుకే ఈ కళ్యాణమండపం అసంపూర్ణంగా నిలిచిపోయింది అని చరిత్రకారులు చెబుతున్నారు.


గర్భగుడిలో విరుపణ్ణఇంటి దేవుడైన వీరభద్రస్వామి స్వయంభువు లింగం మనం దర్శనం చేసుకోవచ్చును. శివలింగ దర్శనం వల్ల మన మనస్సులో ఎనలేని భాగ్యాన్ని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది.శివరాత్రి, దశరా పండుగల వేడుకలు జరిగినప్పుడు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి జన సందోహం కిక్కిరిసిపోతుంది. లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించి పూజించి మోక్షమార్గం పొందుదాం. ప్రతీఒక్కరు జీవితంలో కనీసం ఒక్కసారి ఐనా తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం.          
           లేపాక్షి వీరభద్రస్వామి October 26, 2013

శ్రావణబెళగొళ:--


శ్రావణబెళగొళ:--

కర్ణాటక రాష్ట్రంలో ..... బెంగుళూరు పట్టణంలో ....... ఈ శ్రవణబెళగొళ నెలకొన్ని యున్నది. 
ఇది రెండు గుట్టల నడుమ ఉన్న ఒక అందమైన పట్టణము. ఈ పట్టణం నడిబొడ్డున ఉన్న సరస్సుకు "బెళగొళ" అనే పేరు. బెళగొళ---అంటే "శ్వేతసరస్సు" అని అర్థం. శ్రవణ-- అంటే "జైనముని" అని అర్థం. ఇది జైనమతస్థులకు ముఖ్యయాత్రాస్థలము. దక్షిణకాశీ గా ప్రసిద్ధిగాంచినది. 

దక్షిణదిశవైపు ఉన్న పెద్దగుట్టను "ఇంద్రగిరి" అని పిలుస్తారు. ఉత్తర దిశగా ఉన్న గుట్టను "చంద్రగిరి" గా పిలుస్తారు. ఈ చంద్రగిరి గుట్టమీద అత్యంత ప్రాచీన శిలాలేఖనాలు ఉన్నాయి. ఇతిహాసానికి ప్రసిద్ధ స్థలమైన ఈ గుట్టలికి "తీర్థగిరి" -- "ఋషిగిరి" అనే పేర్లు ఉండేవి.

ఇంద్రగిరి గుట్టమీద అనేక కట్టడాల మధ్య 58 అడుగుల ఎత్తు..... 26 అడుగుల వెడల్పు గల గోమటేశ్వర విగ్రహాన్ని... రాజమల్లన్న మంత్రి యైన.....చాముండరాయుడు ద్వారా ప్రతిష్టించబడినది. ఈ గోమటేశ్వర స్వామికి ప్రతీ 12 సంవత్సరములకు ఒకసారి మహా మస్తకాభిషేకం చాలా వైభవంగా జరుగుతుంది. ఇప్పటికీ కూడా జైన మతస్థులు దేశం నలుమూలల నుండి వచ్చి ఈ గోమటేశ్వరుని దర్శిస్తూఉంటారు.
భగవన్నామ సంకీర్తన మహత్యము:--


భగవన్నామ సంకీర్తన మహత్యము:--

వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని వారి పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టిన పేరుగా పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి యొక్క సమస్త పాపాలను నసింపచేస్తుందట. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితమిస్తుందంటే.........ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు.... స్వయంగా పరమాత్మనే ఇక్కడకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడంట.

నాహం నాసామి వైకుంఠె యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll

నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా నేను వైకుంఠములో ఉంటాననుకుంటున్నారు... కానీ నేను వైకుంఠములో లేను, ఉండను.... కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతుంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను...అని చెప్పారంట. అందుకేనేమో నారద మహర్షుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడంట.

హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా ll

ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదంట.

ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభించండి. ఒకవేళ మనం రేపే ప్రయాణమవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక.... మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది.14 లోకాలు

14 లోకాలు 

భూమి తో సహా మొత్తం 14 లోకాలు ఉన్నట్లు మన పురాతన గ్రంధాలు చెపుతాయి. 
భూమి కంటే కింద నున్న 7 లోకాలను పాతాళ లోకాలు అని అంటారు. అవి,

1. అతల, 2. వితల, 3. సుతల, 4. రసాతల, 5. తలా తల, 6.మహాతల, 7. పాతాళ లోకాలు .

ఈ పాతాళ లోకాల పైన ,

1.భూఃలోక, 2. భువర్లోక , 3. సువర్లోక , 4. మహార్లోక , 5. జనర్లోక , 6.తపోలోక 7. సత్యలోక అను మరో 7 లోకాలు ఉన్నవి .

వీటిలో భూః అంటే మనము ఉంటున్న భూమి అని అర్ధం.

అసలు నిర్వచనం ప్రకారం పాతాల లోకాలు అంటే మొత్తం భూగోళానికి కింద విశ్వం లో ఉన్న లోకాలని , ఊర్ద్వ లోకాలు భూగోళం పై ఉన్న దేవ లోకాలు అని అర్ధం. ( Aliens అంటే ఇప్పటి పిల్లలకు బాగా అర్ధం అవుతుందేమో.)
దశ వాయువులు

దశ వాయువులు 

పంచ ప్రాణాలు 

ప్రాణ వాయువు: శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు

అపాన :
ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు

వ్యాన:
శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం

ఉదాన:
వాక్కు రూపంలో ఉండేవాయువు

సమాన:
జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు

ఉప ప్రాణాలు 

నాగ :
త్రేన్పు గా వచ్చే గాలి

కూర్మ :
రెప్పవేయటానికి కారణమైన గాలి

కృకల
: తుమ్ము 

ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.

దేవదత్తం :
ఆవులింత లోని గాలి

అనే దశ వాయువులు శరీరంలో ఉంటాయని అంటారు. 

ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.

ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది.

పంచ ప్రాణాలు ఐదు + ఉప ప్రాణాలు ఐదు..... ఈ పదింటిని కలిపి దశ వాయువులు అని అంటారు.సోహం అంటే ఏమిటి ?

సోహం అంటే ఏమిటి ?

భావశూన్య సద్భావ సుస్థితి: |
భావనా బలాద్భక్తిరుత్తమా ||

శూన్య భావనా చింతన కన్నా, సద్భావన (పరమాత్మయే నేను అనే అభేద చింతన) శ్రేష్టము. ఇట్టి భావనతో కూడుకున్న అభేదభక్తి ఉత్తమము.

సోహం భావన

స: అంటే అతడు పరమాత్మ. అహం అంటే నేను. ఆ పరమాత్మతో నేను ఏకమై యున్నాను. ఈ ఐక్యాన్ని సద్విచారణ ద్వారా జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది జ్ఞానంతో పొందదగినదే కానీ, ధ్యానంతో కాదు. సమాజంలో చాలామంది మేము సోహం మెడిటేషన్‌ నేర్చుకున్నాం. రోజూ అరగంట ప్రాక్టీసు చేస్తున్నామని చెబుతుంటారు. సోహం అనేది జ్ఞానపర వాక్యంగా సాధకుడు గ్రహించాలి.
సోహం అని ధ్యానం చేయకూడదా? తప్పక చెయ్యవచ్చు. సోహం అంటూ ధ్యానం చేస్తే ఏం కలుగుతుంది? నేను ఈ సృష్టికర్తయైన పరమాత్మ (హిరణ్యగర్భుని)తో ఏకమై యున్నానని భావిస్తూ సోహం.. సోహం.. సోహం.. అని జపంచేస్తూ ధ్యానం చేయడంవల్ల విశేష పుణ్యం కలిగి, సుఖభోగాలు లభించి హిరణ్యగర్భలోకం సిద్దిస్తుందని ఉపాసనాకాండ వివరిస్తూంది.

తం యథాయథా ఉపాస్తే తదేవ భవతి!
ఈ ఉపాసనలో నేను అనే జీవభావం పూర్తిగా తొలగదు. పరమాత్మ తత్త్వ జ్ఞానం కలగదు. కేవలం నేను పరమాత్ముడనై యున్నానని భావిస్తాడంతే! కావున వీడు జీవుడిగానే వుంటూ మరో లోకాన్ని పొంది, ఉపాసనా బలం వున్నంతకాలం అనుభవిస్తాడు. ఉపాసనా ఫలితం తీరిన తర్వాత మళ్లీ మామూలుగా ‘‘క్షీణ పుణ్య మర్త్యలోకం విశంతి’’ పుణ్యఫలం తీరిపోతే తిరిగి ఈ భూలోకంలో ఈ దేహాన్ని పొంది ‘‘పునరపి జననం పునరపి మరణం’’ జనన మరణాలలో చిక్కుకుని తిరుగుతుంటాడు.

అందుకే ఈ సోహం అనే పదాన్ని వివేకయుక్తుడై శాస్త్రప్రమాణంతో విచారణ చేస్తే, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విచారణలో ఉదయించిన జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. అజ్ఞానం నశిస్తే సంసారక్షయం. సంసారక్షయమే మోక్షం.


మాభవగ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మాచమాభవ భావనామఖిలం త్యక్త్వా యచ్ఛిష్టం తన్మయోభవ కర్మలు, ఉపాసనలు, వాటివల్ల కలిగే ఫలాలు, వాటిని పొందాలనే భావాలన్నింటిని అధిగమించి, ఏదైతే నిత్యశుద్ద చైతన్యమై అన్నింటికి విలక్షణమై వెలుగొందుతుందో అట్టి తత్త్వరూపమై నీవు వెలుగొందమని భావం. కనుక కర్మ, ఉపాసన కూడా మోక్షాన్ని, శాశ్వతానందాన్ని ఇవ్వలేవు.


 —

ఆదిమ వానరుడు ఋక్ష విరజుడు......


ఆదిమ వానరుడు ఋక్ష విరజుడు.....

రామాయణంలో కనిపించే వాలిసుగ్రీవుల తండ్రి ఋక్షవిరజుడు. బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన కళ్ళ నుండి రాలిన అశ్రువుల నుంచి జన్మించిన వాడు ఋక్షవిరజుడు. అరణ్యంలో తిరుగుతుండగా కనిపించిన ఒక చెరువులో దిగిన ఋక్షవిరజుడు, ఆ చెరువు నుంచి బయటకు వచ్చేసరికి స్త్రీగా మారిపోతాడు. గతంలో పార్వతి ఆ చెరువులో స్నానం చేయడం వల్ల అలా జరిగిందని బ్రహ్మ అతనికి చెబుతాడు. స్త్రీగా మారిన ఋక్షవిరజుడికి ఇంద్రుని వల్ల వాలిసుగ్రీవులు జన్మిస్తారు. ఆ తర్వాత వానరజాతి విస్తరించిందని మన పురాణాలూ చెప్పిన వివరణ.
ఆళ్వార్లు

మన ఆళ్వార్లు 
మంగళగిరి పానకాల నరసింహ స్వామి(క్షేత్ర మహత్యం)

మంగళగిరి పానకాల నరసింహ స్వామి(క్షేత్ర మహత్యం) 

శ్రీమన్నారాయణుడు స్వయంభూగా అవతరించిన పుణ్యక్షేత్రాలు ఎనిమిది. శ్రీరంగం, శ్రీ ముష్ణం, నైమిశారణ్యం, పుష్కరం, సాలిగ్రామం, దోదాద్రి, భద్రికామ్రం, వెంకటాద్రి. ఇందులో దోదాద్రి ఎంతో పవిత్రమైన మంగళగిరి పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ స్వామి స్వయంభూవుగా అవతరించిన వైనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కృతయుగం కాలంలో........ పరియత్రుడు అనే రాజుకు హ్రస్వశ్రుంగి అనే పుత్రుడు జింకరూపంతో ఉండేవాడు. తన జింకరూపం మారి మామూలు మనిషి రూపం దాల్చటానికి అతడు దోదాద్రిలో తపస్సు చేసాడు.

అతని తపస్సుకి సంతసించిన ఇంద్రుడు ప్రత్యక్షమై నీవు నారాయణుని ధ్యానించి కఠిన తపస్సు చెయ్యు.... నారాయణుడు నీవు కోరిన వరాన్ని ప్రసాదించగలడు. అని ఆశీర్వదించి అద్రుశ్యమయ్యినాడు.

దోదాద్రి పై తపస్సుచేస్తున్న పుత్రుడిని తీసుకెళ్ళి, సింహాసనముపై కూర్చుండబెట్టి, పట్టాభిషేకము చెయ్యాలని నిర్ణయించుకొన్న పరియత్రుడు అక్కడికి వెళ్ళాడు.

రాజ్యానికి తిరిగి వెళితే నారాయణుడు ఆశీర్వాదము తనకు లభించదు భయంతో హ్రాస్వశ్రుంగి ఏనుగు రూపం లో ఉన్న ఒక కొండగా మారాడు. ఎటువైపునుండి చూసినా నేటికీ ఆ కొండ ఏనుగు రూపంలో కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా నముచి అనే అసురుడు బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేసాడు. అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. నముచి "తడిగా ఉన్న ఏ వస్తువుతో కానీ, ఎండిపోయి రాలిపోయిన ఏ వస్తువుతో కానీ, నాకు మృత్యువు వాటిల్లకూడదు" అని అడుగగా బ్రహ్మ తథాస్తు అని అన్నాడు.

నముచి తన వర ప్రభావంతో దేవతలని నానా బాధలు కలుగ జేశాడు. ఇంద్రుడు నారాయుని వద్దకు వెళ్ళి, నుముచి నుండి అన్యాయములను అంతమొందించమని వేడుకొన్నాడు. వెంటనే నారాయణుడు ఇంద్రునకు తన చక్రం ఇచ్చి నుముచి పై దండెత్తమని చెప్పాడు. ఇంద్రుడు తన సైన్యంతో నముచి యొక్క సైన్యాన్ని పై దండెత్త సాగాడు. నముచి.... బ్రహ్మా ఇచ్చిన వరాలని రక్షక కవచంగా భావించి, దొదాద్రి కొండపై, ఒక గుహలో తన దేహాన్ని వదిలి ఆత్మ రూపంలో ఉన్నాడు .


ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నీటిలో--నురగలో ముంచి తీసాడు.అది తడి కాకుండా, ఎండినట్లు కాకుండా ఉన్న చక్రాన్ని దోదాద్రి వైపు విసిరాడు. సుదర్శన చక్ర రూపంలో ఉన్న నారాయణుడు.... ఉగ్రనరసింహ రూపునిగా ఆ దుష్టుని సంహరించాడు. నముచి సంహారము తరవాత కూడా నరసింహ స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. అందుచేత ఇంద్రాది దేవతలు, నరసింహస్వామిని.... అమృతాన్ని సేవించమని కోరారు. అమృతం సేవించిన తరవాత, నారసింహని రౌద్రం శాంతించింది. ----కనుక త్రేతాయుగంలో---నెయ్యి, ద్వాపరయుగంలో---పాలు, కలియుగంలో----పానకం తాగి తాను శాంతిస్తానని స్వామి చెప్పారు.

హ్రస్వసృంగి సదా నారాయణుని ధ్యానించి, ఇక్కడే అవతరించమని వేడుకొనగా, నారాయణుడు ఈ పర్వతం మీదనే వెలసినాడు. లక్ష్మీదేవి కూడా ఇక్కడే అవతరించటం వల్ల ఈ (ప్రాంతాన్ని) క్షేత్రాన్ని "మంగళగిరి" అని అంటారు.

గర్భగుడిలో స్వయంభూమూర్తి 15 cm వరకు, నోరు తెరిచినట్లుగా ఉన్న నరసింహ స్వామి దర్శనం మహదానందాన్ని కలిగిస్తుంది. శంఖంతో స్వామికి పానకాన్ని సమర్పించినప్పుడు, మనం నీరు తాగేటప్పుడు వచ్చే శబ్దం వలె మనకు వినిపిస్తుంది. పానకం లోపలి వెళ్ళేటప్పుడు శబ్దం ఎక్కువై , తదుపరి నిశ్శబ్దమైపోతుంది. తరవాత స్వామివారి నోట పానకం చూడగలం. ఆ పానకమే తీర్థముగా అందరికీ పంచిపెడతారు. పానకము ఆలయములో ఉన్నాగానీ..... చీమ , ఈగ... ఏవీ కూడా మనకు కనిపించవు.

రాత్రిపూట స్వామిని పూజించుటకు దేవతలు వస్తారని.... పురాణాలు పేర్కొంటున్నాయి. అందుచే భక్తులకు పగటిపూట మాత్రమే ఆలయంలోకి వెళ్ళే అనుమతి లభిస్తుంది.

ఈ స్వామిని దర్శిస్తే అనారోగ్యాలు తగ్గి, ఆరోగ్యవంతులు అవుతారు. కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి. మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి కృప అందరికి కలుగును గాక. 


ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి

ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి 

పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైన పట్టణం ఏలూరు. ఇక్కడ నుండి 40 కి. మి. దూరంలో ద్వారకాతిరుమల ఉంది. ద్రావిడ సంప్రదాయం ప్రకారం నిర్మించబడింది. ఈ ఆలయం దక్షిణాన రాజగోపురం 5 దశలున్న గోపురం. ఆలయ సమీపంలో గజ, గోశాలలు ఏర్పరచారు. అభయ ఆంజనేయస్వామి విగ్రహం, సుదర్శన చక్రము దర్శనమిస్తాయి.

ఒక గర్భగుడి (విమానం) క్రింద రెండు మూల విగ్రహాలు ఉండటం చాలా అరుదైన దృశ్యం. గర్భగుడిలో కాలు పెట్టగానే ఏంటో ప్రశాంతత లభిస్తుంది.

మూలవిగ్రహాలలో ఒకటి శిరస్సు భాగం దాకా కరుణావీక్షనాలతో దర్శనమివ్వగా మరొకటి స్వామి రూపం మొత్తంగా దర్శనమిస్తుంది. వేంకటేశ్వరస్వామి శిరస్సు నుండి ఛాతీ వరకు దర్శనం లభించగలదు. పాతాళంలో బలిచక్రవర్తి పూజించటానికి వీలుగా మిగిలిన అవయవాలు భూమిలోపల పాతుకుపోయాయని అంటారు.

శిరస్సు నుండి పాదాల వరకు గల (విగ్రహాన్ని) స్వామిని కళ్యాణవైకుంఠవాసుడు అని అంటారు. కంఠం వరకు దర్శనమిచ్చే స్వామిని దర్శిస్తే ముక్తి లభిస్తుంది. శిరస్సు నుండి పాదాల వరకు ఉన్న స్వామిని దర్శిస్తే ధనము, ధాన్యము, మోక్షము అన్నీ లభిస్తాయని ప్రతీతి. తిరుపతిలో జరిగే పూజలు ఇక్కడ కూడా జరుగుతాయి.

తిరుపతికి వెళ్లి కానుకలును సమర్పించుకుంటామని మొక్కుకున్నవారు, తలనీలాలు సమర్పించుకోవాలని మొక్కుకున్నవారు, ఇంకా మొక్కుబడులను చెల్లించాలనుకొని తిరుపతి వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించనివారు ద్వారకాతిరుమలకు వెళ్లి మొక్కులను తీర్చుకోవచ్చును. అందుకే ద్వారకాతిరుమలను "చిన్నతిరుపతి"  అని కూడా వ్యవహరిస్తారు.

ప్రతీ ఏటా రెండుసార్లు కళ్యాణాలు జరుగుతాయి. వైశాఖమాసంలో మరియు ఆశ్వీయుజ మాసంలో జరుగుతాయి.

ఆలయ చరిత్ర విశేషాలు:

ద్వారకా మునీశ్వరులు విష్ణువుని దర్శించాలని ఎంతోకాలంగా తపించారు. అందువల్ల ఆయన తిరుమల అనే ఒక చిన్న కొండపై కఠిన తపస్సు ఆచరించాడు. ఆ కొండ పూర్వం నుండే ఆదిశేషుడి అవతారంగా చెప్పుకునేవారు. కఠిన తపస్సు చేస్తున్న ఆ మునిపై చీమలపుట్ట, పెద్దపుట్టగా ఆయనపై ఏర్పడింది. అయినా మహర్షికి తపోభంగం కలిగించలేదు. ఆయన తపస్సుకి మెచ్చిన కరుణామూర్తి అయిన నారాయణుడు ఆతని ముందు ప్రత్యక్షమై ఆదిశేషుని అవతారమైన ఆ కొండపై తానూ కొలువైనట్టు తెలిపాడు. అంతట ద్వారకాముని ఆ కొండపై గోవిందుని కోసం వెతికాడు. ఒకచోట తన శిరస్సు మాత్రం లోకంలోని ప్రజలకు దర్శనమిచ్చేట్లు గోవిందుడు ఉండటం గమనించాడు. విష్ణురూపం తన కళ్ళకు కనిపించగానే ఆనందం పట్టలేకపోయాడు ద్వారకామునీశ్వరుడు.

స్వామి స్వయంభూవుగా అక్కడే కొలువైయున్న విషయం అక్కడనున్న మునులందరికీ తెలియచేసాడు. స్వామివారి పాదాలను దర్శించకుండా భక్తులకు దర్శనం పరిపూర్ణత చెందదని మిగిలిన మునులు ఆ స్వయంభూవు విగ్రహానికి వెనుకవైపు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసారు.

నిల్చున్నట్లు ఉన్న ఆ స్వామిని పదకొండవ శతాబ్దంలో శ్రీరామనుజలవారు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. కృతయుగం నుండి ద్వారకాతిరుమల ఉందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరాముని తాతగారైన అజ మహారాజుకు యుక్తవయసులో ఉన్నప్పుడు,  ఇందుమతి అనే రాకుమారి  స్వయంవరానికి ఆహ్వానం అందింది. ఇందుమతి గురించి అంతకుముందే ఎంతో గొప్పగా విన్న అజుడు ఆమె తన సతీమణి కావాలన్నఆసక్తితో ఆ స్వయంవరానికి వెళ్ళాడు. వెళ్ళే దారిలో ద్వారకాతిరుమల వద్ద రథం ఆగింది. తను స్వయంవరానికి వెళ్ళే లోపే స్వయంవరం జరిగిపోతే ....... ఏం చెయ్యాలి ? అని ఆలోచించి ద్వారకాతిరుమలలో ఆగి, స్వామిని  దర్శించకుండానే ముందుకు సాగిపోయాడు అజ మహారాజు.

రాకుమారి ఇందుమతి పూలమాలతో రాకుమారులందరు ఉన్నసభలో చుట్టూ చూడగా అజ మహారాజు కనిపించాడు. మరుక్షణం ఆమె అతని మేడలో వరమాలను వేసింది. అజ మహారాజుకు ఎనలేని ఆనందం కలిగింది. అయితే ఆ ఆనందం ఒక ఘడియ మాత్రమే. ఇతర దేశాల నుండి వచ్చిన రాకుమారులు వెనువెంటనే అజునిపై కత్తి   దువ్వారు. వారితో యుద్ధము చేసి గెలిస్తేనే తన దేశానికి తిరిగి వెళ్ళటం సాధ్యమవుతుంది అని అజుడు తెలుసుకున్నాడు.

స్వయంవరంలో రాకుమారి ఎవరో ఒకరినే వివాహమాడగలదు. ఆమె ఎన్నుకోని మిగిలిన రాజులూ కల్యాణోత్సవంలో పాల్గొని విందుభోజనం ఆరగించి వెళ్ళటం ఆనవాయతీ. అయితే ఏ స్వయంవరంలోనూ ఎన్నుకోబడని రాజులు యుద్ధానికి సిద్ధబడరు. మరి తనకు మాత్రం ఎందుకిలా జరుగుతోంది అని అజుడు ఆలోచించాడు. వచ్చేదారిలో ద్వారకాతిరుమలలో ఆగినా, స్వామిని దర్శించకుండానే స్వయంవరానికి రావటం తాను చేసిన పెద్ద పొరపాటు అని గ్రహించాడు. వెంటనే "కళ్యాణవైకుంఠవాసా ! అపచారం జరిగిపోయింది, శాంతించు, రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు తప్పక నిను దర్శించుకుంటాను " అని మొక్కుకున్నాడు. సంభ్రమాశ్చర్యాలు కలిగేలా యుద్ధానికి ముందుకు వచ్చిన రాజులంతా స్వయంవరంలో అజు మహారాజు  గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఆనాటి నుండి అజ మహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు మరియు రఘువంశానికి చెందిన రాజులందరునూ ద్వారకాతిరుమల కళ్యాణవైకుంఠవసునికి పరమ భక్తులైనారు.

ఈ ద్వారకాతిరుమల స్వామిని దర్శించగానే మనస్సంతా ఎంతో సంతోషంతో, ఏదో విచిత్రమైన అనుభూతిని పొందగలం.                             

శ్రావణశుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతకథ

                                                 శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి కథ 

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.

పార్వతీదేవి "నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి" అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, "ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి,

నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే l
శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే ll


అని అనేక విధములు స్తోత్రం చేసింది.
"ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది", అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.

ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే l
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా ll


అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసారు. 
తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. 

వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.

దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును" అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.

శ్రావణశుక్రవారం వరలక్ష్మీదేవి వ్రత కథ:---

శ్రావణశుక్రవారం వరలక్ష్మీదేవి వ్రత కథ:---


సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.


పార్వతీదేవి "నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి" అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, "ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి,నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే l
శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే llఅని అనేక విధములు స్తోత్రం చేసింది."ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది", అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే l
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా llఅను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును" అన్నాడు పరమశివుడు.సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.********వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.**********October 25, 2013

కోటి పుణ్యములను ప్రసాదించు గోమాత పూజ

కోటి పుణ్యములను ప్రసాదించు గోమాత పూజ 

పుట్టినబిడ్డకు తల్లిపాలకు సమానంగా ఆవుపాలను ఇస్తారు. అందువల్ల భూలోక ప్రజలకు అమృతతుల్యమైన పాలనిచ్చే ఆవు ..... తల్లితో సమానంగా వ్యవహరిస్తారు. తల్లి స్థానంలో వుండే ఆవు ప్రజలకు ప్రత్యక్షదైవము అంటే అతిశయోక్తి కాదు.

అంతేకాక సకల దేవతలు ఈ పవిత్రమైన గోమాత శరీరంలో కొలువై వుండటంవల్ల గోమాతను దర్శించినా, స్పర్శించినా పుణ్యం లభిస్తుంది.

(1) బ్రహ్మ, నారాయణుడు కొలువైన ఆవుకొమ్ములను పూజిస్తే జ్ఞానము, ముక్తి లభిస్తాయి.

(2) ఆవు నొసట .... ఈశ్వరుడు కొలువై ఉండుటవల్ల, నొసలు పూజిస్తే విశ్వేశ్వరుడిని దర్శించిన భాగ్యం లభిస్తుంది.

(3) ముక్కు వద్ద సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉండుటవల్ల నాసిక భాగాన్ని పూజించినవారికి సంతానభాగ్యం లభిస్తుంది.

(4) దూడను ప్రసవించిన ఆవును పూజిస్తే జాతకదోషాలు తొలగిపోయి, వివాహం జరుగుతుంది. ఆవు యోనిని పూజిస్తే జన్మకాల, దుష్ట నక్షత్రముల దోషము పరిహారమవుతుంది. ఎన్నో కష్టాలను కలిగించే ఋణబాధలు తీరిపోతాయి.

(5) అక్షయపాత్ర వంటి ఆవు పొదుగుని పూజిస్తే నాలుగు సముద్రాలను పూజించిన పుణ్యఫలం దక్కుతుంది.

(6) గోవుపాలు, గోమూత్రము, నెయ్యి మొదలైన ఔషధగుణాలు ఉన్నట్లు విజ్ఞానపూర్వకంగా నిరూపించబడింది.

(7) ఆవు పేడను బూడిదలా చేసి, నొసట రాసుకుంటే దుష్టశక్తుల నుండి రక్షించబడతాము.

గోమాతను పూజించండి...... కోటిపుణ్యాలను పొందండి.     


దేవతల వాహనాలు 

                

October 20, 2013

అట్లతద్ది

అట్లతద్ది 

"అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు.... 
చప్పట్లోయ్ తాళాలోయ్ దేవుడిగుళ్ళో మేళాలోయ్ 
పప్పుబెల్లం దేవుడికోయ్ ...పాలు నెయ్యి పాపాయికోయ్" 
అంటూ జరుపుకునే అట్లతదియ పండుగ పదహారణాలా తెలుగువారి పండుగ. కన్నెవయసు పిల్లలు సరదాగా గెంతుతూ, ఆటలు ఆడుకొనే తదియ కాబట్టి "ఆటల తదియ" కాగా, గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టే తదియ కాబట్టి, అట్లతదియగా మారి.....కాలక్రమంలో అట్లతద్ది లేదా అట్లతదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. అట్లతద్దికి ముందురోజు చేతులకు   పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది.


అట్లతద్ది నోము 

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.

ప్రాచీనకాలం నాటి మాట .......  ఒక రాజు కూతురు, తన చెలికత్తెలతో  అట్లతద్ది నోము నోచింది.  చెలికత్తెలు అందరూ ఉపవాసము ఉన్నారు. రాకుమార్తె కూడా ఉపవాసం ఉన్నది.    ఇంతలో రాకుమార్తె సుకుమారి కావటం వల్ల, ఉపవాసం ఉన్నందువల్ల,  ఆకలితో సొమ్మసిల్లి పడింది. అంత ఆమె సోదరుడు తన చెల్లి అవస్థ చూసి, ఆరిక కుప్పకు నిప్పు పెట్టి, చెట్టుకొనకు ఒక అద్దం వ్రేలాడదీసి, మంట చూపించి , చంద్రోదయము అయ్యిందని భోజనం చేయవచ్చు అని తన చెల్లికి ఒక చిన్న అబద్దం చెప్పాడు.  

రాకుమార్తె అన్నగారి మాట నమ్మి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

తన తోటివారికందరికీ అందమైన భర్తలు లభించి, తనకి వివాహము కానందుకు బాధపడింది.  అంతట  ఆమె ఆ రాజ్యంలో గల పార్వతీ పరమేశ్వరుల దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం(అట్లతద్దినోము) చేస్తే, నీకు అందమైన భర్తగా లభిస్తాడు అని చెప్పిరి. అంతట ఆమె ఆ నోము చేసి, కథ చెప్పి అక్షింతలు వేసుకుంది. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.

అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.   


ఉద్వాసన:--

సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానమాచరించి, గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నం భుజించి, మళ్ళీ రాత్రి నక్షత్రదర్శనం అయ్యేవరకు ఏమీ భుజించకుండా ఉండి, చంద్రోదయము అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చేయాలి. అలా 9 సంవత్సరములు నోము నోయాలి. 10 వ సంవత్సరమున 10 మంది ముత్తయిదువలని పిలచి, తలంటి స్నానము చేయించి, పదిమందికి పదేసి అట్లు, పసుపు, కుంకుమ, జాకట్టుముక్క, దక్షిణ , తాంబూలము సమర్పించి , సంతృప్తిగా భోజనం పెట్టవలెను. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం,  గోరింటాకు పెట్టుకోవటం ఈ పండుగ విశేషం. 

ఉయ్యాల పండుగ

ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు.   


అట్లలో దాగి ఉన్న రహస్యం 

ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్థముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.... ఇలాంటి పండుగనే కొంచెం మార్పులతో ఉత్తరాదిన మరుసటి రోజున "కర్వా చౌథ్" అనే పేరుతో జరుపుకుంటారు  


శాస్త్రీయ దృక్పథం

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.

చెమ్మచెక్క చారడేసి మొగ్గ .... 
అట్లుపోయ్యంగా ఆరగించంగా 

ముత్యాలచెమ్మచెక్క .. ముగ్గులేయ్యంగా 
రత్నాల చెమ్మచెక్క ... రంగులేయ్యంగా 

పగడాల చెమ్మచెక్క ... పందిరేయ్యంగా 
పందిట్లో మాబావ పెళ్ళి చేయ్యంగా

సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి 
మా వాళ్ళింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి 

రాజుగారింట్లో పెళ్ళి రమణులారా రండి 
దొరగారింట్లో పెళ్ళి దోచుకోద్దాం రండి   

ఇలా ఆడుకుంటూ అరచేతుల మీద .... అరచేతులతో కొట్టటం వలన ఊపిరితిత్తులలోకి గాలి బలంగా వెళ్ళటం, లోపలి నుండి నిశ్వాసం కూడా బలంగా రావటం .... చేతులను ముందుకి వెనక్కి వేగంగా కదపటం.... కాళ్ళతో ముందుకు వెనక్కు పాటకు అనుగుణంగా గెంటుట వలన, శరీరంలో అన్ని భాగాలకి వ్యాయామం చేసినట్లు అవుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది ఒక విశేషం.

ఒప్పులకుప్పా -- వయారి భామా 
సన్నా బియ్యం -- ఛాయ పప్పు 
బావిలో కప్పా -- చేతిలో చిప్పా 
రోట్లో తవుడు -- నీ మొగుడెవరు ???
గూట్లో రూపాయ్ -- నీ మొగుడు సిపాయ్..... 

నూకల బియ్యాన్ని-- ఛాయ మినప్పప్పుతో రుబ్బుతూ, కొబ్బరికోరుని, బెల్లపు అచ్చుని కలిపి, రోట్లో కొంచెం తవుడు పోసి రుబ్బి, ఒక బొమ్మ ఆకారాన్ని చేసి, సన్నగాజులను అటూ ఇటూ చెవులుగా చేసి, రూపాయబిళ్ళను కళ్ళలాగా ఏర్పాటుచేసి, ఆ ఏర్పడ్డ రూపం అమ్మాయికి మొగుడు అని ఆటలలో ఏడిపిస్తారు. బొమ్మలను తయారుచేయటం ఒకపక్క.....వ్యాయామం ఒకపక్క. ఈ ఆట వలన నడుంనొప్పులు, వెన్నెముక దోషాలు, మడమ నొప్పులు రానేరావు. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఆరోగ్యానికి మంచి ఆటలు ఇటువంటివి.             

 స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది. సాంప్రదాయ వాదమైనా, శాస్త్రీయ దృక్కోణమైనా, పెద్దలు చెప్పే ఆచారమైనా మానవుల జీవన గతిలో కించిత్‌ మార్పును చొప్పించి, సంతోషాలను అందించేందుకు ఉద్దేశింపబడిందే. హైటెక్‌ యుగంలో పండుగలను కూడా సినిమాలతోనో, షికార్లతోనో గడిపేస్తున్నాం. అసలు పండుగల్లో దాగున్న ఆంతర్యమేమిటో అర్థం చేసుకుంటే సామాజిక ప్రగతికి అవి ఎంత దోహదకారులో తెలుస్తుంది.

పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోతూ రెండు వరుసలుగా ఏర్పడి, ఎదురెదురుగా నిలబడి, ఒకరితరువాత ఒకరు రాములవారి పాటపాడి ఇళ్ళకు వెళ్ళిపోతారు.

ఉత్తముని పేరేమి?  ఊరు పేరేమి ?  
ఉత్తముడు రాముడు....... ఊరు అయోధ్య 

ఉత్తముని ఆలి ఎవరు ? ఊరు పేరేమి ?
ఉత్తముని ఆలి సీతమ్మ..... ఊరు మిధిల

రాముడంతటివాడే బాధ పడ్డాడు 
సీత అంతటి ఆమె నింద మోసింది

మానవులము మేమెంత ? నింద పడకుండా ? 
అయోధ్యరామయ్య..... మిధిల సీతమ్మ 
రక్షించి దీవించండి మీరిద్దరూ     

అలా  పాడుకుని వెళ్ళే పిల్లలకి ఇంట్లో ఉండే అమ్మమ్మో లేక నాయనమ్మో చిన్న మొట్టికాయవేసి, రెండు అట్లు పెట్టి, ఒక ముద్దు పెట్టుకుంటారు. మళ్ళీ ఈ అట్లతద్ది పైసంవత్సరానికి కదా వచ్చేది... అని వీడుకోలు చెప్పుకొని ఎవరిఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రాములవారి పాటలో లోకానుభవం, రమ్యమైన జీవనవిధానం ఎంత దాగిఉందో మనం తెలుసుకోగలం.        


October 10, 2013

జమ్మివేట

జమ్మివేట 

అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట పడకుండా శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు. అజ్ఞాతవాసము  ముగింపులో విజయదశమినాడు పాండవ మధ్యముడు విజయుడు(అర్జునుడు) ఆయుధాలను బయటికి తీసి, పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి, దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి "విజయదశమి" అయ్యింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధ పూజ. 

దసరా పండుగ నాడు సింహాచలంలో నెలకొనియున్న శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారు కొండదిగువనున్న ఉద్యానవనమునకు వెళ్ళి, జమ్మివేట చేసి( అనగా జమ్మి చెట్టుకి బాణం వేసి, కొమ్మని నరుకుతారు). అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. బాణాసంచా వెలిగిస్తారు. తరవాత స్వామివారు వీధులలో తిరువీధి చేసి, కొండపైకి వెళతారు. ఇది దసరానాడు సింహాచలంలో జరిగే పెద్ద ఉత్సవం. 


          

అమ్మవారి నామాల్లో మనకు గోచరించే స్ఫూర్తి

అమ్మవారి నామాల్లో మనకు గోచరించే స్ఫూర్తి 

దుర్గాదేవికి తెలిసిన సౌందర్యం లోకంలో మరెవరికీ తెలియదు. స్త్రీ తన శరీరంలో నలభైఏడు స్థానాల్లో అలంకరించుకోవచ్చని అ జగన్మాత నిరూపిస్తుంది. తలమీద ధరించే కిరీటం నుంచి కాలికి పెట్టుకొనే ఆభరణం వరకు ఏయే భాగాలలో ఏవి అలంకరించుకుంటే బాగుంటుందో అమ్మవారిని చూసి తెలుసుకోవచ్చును.

చేతికి గాజులు ధరించి అవి అటూఇటూ కదిలినప్పుడు మణికట్టుకి రాపిడి కలగాలి. ఇది సంతానప్రాప్తికి దోహదం చేసే అంశంగా ఉపయోగపడుతుందని లలితాసహస్రం మనకు తెలియచేస్తుంది.

"చంపకాశోక పున్నాగ,సౌగంధిక లసత్కచా"......అంటే లలితాదేవి చంపక, అశోక, పున్నాగ, సంపెంగ వంటి సువాసనలిచ్చే పువ్వులని అలంకరించుకుంటుంది. అశోకపువ్వు జుట్టులోని ఒత్తుదనాన్ని తగ్గించదు. పున్నాగ క్రిములూ, కీటకాలను దూరం చేస్తుంది. ఇలా సౌందర్యముతో పాటు, కేశ సౌందర్యానికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శ్లోకాలు తెలియచేస్తాయి. పూలు పెట్టుకోవటం, సహజ ఉత్పత్తులతో అలంకరణ చేసుకోవటం అనుసరణీయమని సూచిస్తాయి.

పసిడికాంతులకు ఓటు 

"తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా"......... ఆకాశంలోని నక్షత్ర కాంతి కన్నా దుర్గామాత ధరించే ముక్కుపుడక, నత్తు. ఈ రెండింటికే ఎక్కువ కాంతి అని అర్థం. నాసికకు బంగారు నగలు ధరించటం వల్ల, శ్వాసతీసుకొనేటప్పుడు ఇబ్బందులు ఉండవు. అలాగే పసిడి చర్మానికి తగలటం వల్ల చర్మసమస్యలు రాకుండా ఉంటాయి. దానికి ఒత్తిడిని నివారించే శక్తి ఉంటుంది. అందుకే వివాహితులైన స్త్రీలు మంగళసూత్రం ధరించాలి అంటారు.

ఇద్దరిదీ ఒకే మాట   

వేయినామాల్లో నీకు ఏది అత్యంత ప్రీతిపాత్రమైనది అని శంకరుడు పార్వతీదేవిని అడుగగా..... అమ్మవారు వెంటనే "కామేశ బుద్ధ మాంగల్యసూత్ర శోభిత కంథరా" అంటూ బదులిస్తుంది. అమ్మవారికి భర్తను ఎలామంచిచేసుకోవాలో తెలుసును. అందుకే తనకు ఇష్టమైన ఆభరణం మెడలోని మాంగల్యమని సమాధానమిచ్చింది. మాట్లాడేతీరుకి ఎప్పుడూ మంచి మార్కులుంటాయి. ముఖ్యంగా భర్తతో మాట్లాడే తీరు జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. శంకరుడు, పార్వతీ ఒకే దేహంలో చెరిసగం. అందువల్ల ఆలోచన నుంచి ఆచరణ దాకా ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట. సంసారాలు నిలబడాలంటే ఇదే సాధన అవసరం. 

ఆరోగ్య సూచనలూ అందులోనే 

గర్భం దాల్చి, నవమాసాలు సజావుగా సాగి, పండంటిబిడ్డను చేతుల్లోకి తీసుకోవాలంటే.... స్త్రీలు కొన్ని   రకాల ఆహారం తీసుకోవాలి. "పాయసాన్న ప్రియా" అంటే మొదటి నెలలో పాయసాన్నం తీసుకోవాలి. "వదనద్వయ సంయుత... స్నిగ్ధౌదన ప్రియా"...... రెండో నెలలో నేతితో తడిపిన అన్నం తినాలి. మూడో నెలలో "గూడాన్న ప్రీత మానసా"..... బెల్లపు అన్నం తినాలి. నాలుగో నెలలో "దధ్యాన్న సక్త హృదయా"..... పెరుగు అన్నం తినాలి. ఆరో నెలలో "హరిద్రాన్నైక రసికా".... పులిహోర, ఏడో నెల వచ్చేసరికి తీసుకొనే ఆహారం మోతాదు పెంచాలి. "సర్వౌదన ప్రీత చిత్తా"..... అన్నిటితో కలిపిన ముద్ద తినాలి. అప్పుడే ఆరోగ్యం బావుంటుంది.

ఓర్పు --- నేర్పు 

ఇల్లాలిగా మహిళ నిర్వహించే బాధ్యత ఎంతో విలువైనది. "హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవనౌషధి"  అని లలితాసహస్రంలో శంకరుడు మన్మధుడిని మసిచేయటం గురించి చెప్పబడింది. భర్త చేసిన దానికి  పార్వతి నలుగురిలో చులకన చేయలేదు. అలాగని సాటి మహిళని రతీదేవిని వితంతువుగా చూడాలనుకోలేదు. అందుకే చాకచక్యంగా సమస్యను పరిష్కరించింది. కేవలం రాతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపించేలా చేసింది. దుర్యోధనుడు అమ్మవారివద్దకు వెళ్లి పూజించినప్పుడు "యతో ధర్మః , తతో జయః" అని దీవిస్తుంది. ధర్మం ఉన్నవైపే విజయం అని పరోక్షంగా తెలియచేస్తుంది.......