October 26, 2013

సోహం అంటే ఏమిటి ?

సోహం అంటే ఏమిటి ?

భావశూన్య సద్భావ సుస్థితి: |
భావనా బలాద్భక్తిరుత్తమా ||

శూన్య భావనా చింతన కన్నా, సద్భావన (పరమాత్మయే నేను అనే అభేద చింతన) శ్రేష్టము. ఇట్టి భావనతో కూడుకున్న అభేదభక్తి ఉత్తమము.

సోహం భావన

స: అంటే అతడు పరమాత్మ. అహం అంటే నేను. ఆ పరమాత్మతో నేను ఏకమై యున్నాను. ఈ ఐక్యాన్ని సద్విచారణ ద్వారా జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది జ్ఞానంతో పొందదగినదే కానీ, ధ్యానంతో కాదు. సమాజంలో చాలామంది మేము సోహం మెడిటేషన్‌ నేర్చుకున్నాం. రోజూ అరగంట ప్రాక్టీసు చేస్తున్నామని చెబుతుంటారు. సోహం అనేది జ్ఞానపర వాక్యంగా సాధకుడు గ్రహించాలి.
సోహం అని ధ్యానం చేయకూడదా? తప్పక చెయ్యవచ్చు. సోహం అంటూ ధ్యానం చేస్తే ఏం కలుగుతుంది? నేను ఈ సృష్టికర్తయైన పరమాత్మ (హిరణ్యగర్భుని)తో ఏకమై యున్నానని భావిస్తూ సోహం.. సోహం.. సోహం.. అని జపంచేస్తూ ధ్యానం చేయడంవల్ల విశేష పుణ్యం కలిగి, సుఖభోగాలు లభించి హిరణ్యగర్భలోకం సిద్దిస్తుందని ఉపాసనాకాండ వివరిస్తూంది.

తం యథాయథా ఉపాస్తే తదేవ భవతి!
ఈ ఉపాసనలో నేను అనే జీవభావం పూర్తిగా తొలగదు. పరమాత్మ తత్త్వ జ్ఞానం కలగదు. కేవలం నేను పరమాత్ముడనై యున్నానని భావిస్తాడంతే! కావున వీడు జీవుడిగానే వుంటూ మరో లోకాన్ని పొంది, ఉపాసనా బలం వున్నంతకాలం అనుభవిస్తాడు. ఉపాసనా ఫలితం తీరిన తర్వాత మళ్లీ మామూలుగా ‘‘క్షీణ పుణ్య మర్త్యలోకం విశంతి’’ పుణ్యఫలం తీరిపోతే తిరిగి ఈ భూలోకంలో ఈ దేహాన్ని పొంది ‘‘పునరపి జననం పునరపి మరణం’’ జనన మరణాలలో చిక్కుకుని తిరుగుతుంటాడు.

అందుకే ఈ సోహం అనే పదాన్ని వివేకయుక్తుడై శాస్త్రప్రమాణంతో విచారణ చేస్తే, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విచారణలో ఉదయించిన జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. అజ్ఞానం నశిస్తే సంసారక్షయం. సంసారక్షయమే మోక్షం.


మాభవగ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మాచమాభవ భావనామఖిలం త్యక్త్వా యచ్ఛిష్టం తన్మయోభవ కర్మలు, ఉపాసనలు, వాటివల్ల కలిగే ఫలాలు, వాటిని పొందాలనే భావాలన్నింటిని అధిగమించి, ఏదైతే నిత్యశుద్ద చైతన్యమై అన్నింటికి విలక్షణమై వెలుగొందుతుందో అట్టి తత్త్వరూపమై నీవు వెలుగొందమని భావం. కనుక కర్మ, ఉపాసన కూడా మోక్షాన్ని, శాశ్వతానందాన్ని ఇవ్వలేవు.


 —

No comments:

Post a Comment