January 30, 2014

గోపికల రథము పై సింహాద్రి అప్పన్న తిరువీధి ఫోటోలు

గోపికల రథము పై సింహాద్రి అప్పన్న తిరువీధి ఫోటోలు 











సింహాద్రి అప్పన్న తెప్పోత్సవ చిత్రాలు

సింహాద్రి అప్పన్న తెప్పోత్సవ చిత్రాలు 







తిరువళ్ళూరు --- శ్రీ వీరరాఘవేంద్ర స్వామి -- పుష్య బహుళ అమావాస్య

తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవేంద్ర స్వామి - పుష్య బహుళ అమావాస్య


త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు-‘దివ్యతిరుపతులు’,‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు’లో శ్రీ మహావిష్ణువ ‘శ్రీవీరరాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు

కృతయుగంలో బదరికాశ్రమంలో ‘పురుపుణ్యర్’ అనే మహర్షి నివసిస్తుండేవాడు. ఆయన భార్య సత్యవతి. శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు. దీనితో వారు పుత్ర సంతానం కోరుతూ ఒక సంవత్సర కాలం పుత్రకామేష్టీ యాగం చేసారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా, శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావించిన ఆ పిల్లవాడికి ‘శాలిహోత్రుడు’ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికీ చిన్నతనంనుంచే విష్ణు భక్తి  అలవడింది.

అటువంటి శాలిహోత్రుడు యుక్తవయసు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం ‘తిరువళ్ళూరు’ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ‘హృత్తాపనాశని’ తీర్ధం చూసి...అది ఎంతో పవిత్రమైనదని గుర్తించి, అందులో స్నానమాచరించి, దైవప్రార్దనలు చేసాడు. ఈ సమయంలో ఇక్కడే వుండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు. ఒక సంవత్సరం పాటు తపస్సు, యజ్ఞయాగాలు చేసాడు. సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం నైవేద్యాన్ని మూడు భాగాలు చేసాడు. ఒక భాగాన్ని దేవునికి సమర్పించాడు.  ఇక రెండో భాగాన్ని ఆహుతుడి కొరకు, మూడవ భాగాన్ని తనకోసం వుంచుకుని ఆహుతుడి కోసం ఎదురు చూడసాగాడు. ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడుపంపిన ఆహుతుడుగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధుడిని ఆహ్వానించి ఆహుతుడి కోసం వుంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దానిని భుజించిన వృద్ధుడు తనకు ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తనకోసం వుంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్లిపోయాడు. అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు. దానితో తన తపస్సులో ఏదో లోపం వుండడంవల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేసాడు. కానీ ఇంతకుముందులాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాగా...ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు. శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన ‘‘నాకు భుక్తాయాసంగా వుంది. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి?’’ అని శాలిహోత్రుడిని అడగ్గా... ‘‘ఇక్కడనే పవళించండి’’ అని శాలిహోత్రుడు సమాధానం ఇచ్చాడు. దీనితో బ్రాహ్మణుడు దక్షిణంవైపు తలపెట్టి, ఉత్తరంవైపు కాళ్లు వుంచి తూర్పువైపు చూస్తూ పవళించాడు. ఈ విధంగా పవళించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షం అవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్ధించాడు.

శాలిహోత్రుని కోరిక ప్రకారం తాను విశ్రాంతికోసం పవళించిన శయన రూపంలోనే ‘శ్రీ వీర రాఘవస్వామి’గా కొలువుతీరినట్టు స్థలపురాణ కథనం. అత్యంత ప్రాచీన కాలంనుంచే వున్న ఈ ఆలయాన్ని క్రీశ 8,9 శతాబ్దాల కాలంలో పునర్నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. చోళ వంశస్తులు ఈ ఆలయాన్ని వివిధ మండపాలను నిర్మింపచేసారు. తర్వాతి కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు చరిత్ర చెప్తోంది.

ప్రధాన గర్భాలయంలో ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవస్వామివారు శయనించి దర్శనమిస్తారు. భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరివున్న స్వామివారు ఒక చేయిని కిందికి ముని శిరస్సుపై వుంచి మరోచేయి పైకి ఎత్తి గర్భాలయ వెనక గోడకు ఆనించి దర్శనమిస్తారు. స్వామివారి తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటాడు. స్వామివారి గర్భాలయంపై వున్న గోపురం విభిన్నంగా ఉంటుంది. మామూలుగా గర్భాలయాలపై ఏక కలశ గోపురం వుంటుంది. అయితే ఈ క్షేత్రంలో గాలిగోపురం లాగా ఐదు కలశాలను కలిగిన గోపురంవుండడం విశేషం.  తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామికి ఉప్పు, మిరియాలు అంటే ప్రీతి. శ్రీ వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు, మిరియాలను సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మవ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెబుతూ ఉంటారు.


కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీ వీరరాఘవేంద్ర స్వామి. పుత్రసంతానము లేని వారు పుష్య బహుళ అమావాస్య నాడు వరిపిండి మరియు బెల్లంతో కూడిన చలివిడి చేసి, ఆ చలివిడి మధ్యలో ఆవునెయ్యి - ప్రత్తితో దీపం వెలిగించి, ఆ దీపం ఘనం అయ్యాక ముగ్గురు లేక మన స్థోమతను బట్టి కొంతమంది ముత్తైదువులకు దక్షిణ - తాంబూలాలను ఇచ్చుకోవాలి. దీపము వెలిగించిన వత్తిని చలివిడి లేక పాలు లేక నీళ్ళతో మింగినట్లయితే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నానుడి. పిల్లలు లేనివారికి ఇచ్చిన పుణ్యమే. పిల్లలు ఉన్నవారు మింగితే కడుపుచలువ అంటారు. 

       
'వీరరాఘవుడు' ని 'వైద్య రాఘవుడు' అని కూడా అంటారు. రాఘవేంద్రుడు ఔషధుల మూటని తన తలక్రింద ఉంచుకొని పడుకుంటాడని, బాధలతో (అనారోగ్యంగా) ఉన్నవారు అతనిని కొలిస్తే, వారి బాధలని తొలగించుతాడు అని అంటారు. 

పుష్యబహుళ అమావాస్య రోజున మరొక విశేషము ఉంది. ఈరోజున సింహాచలంలో వెలసిన లక్ష్మీ వరాహ నృసింహ స్వామికి కొండ దిగువనున్న వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. దీనినే 'తెప్ప తిరునాళ్ళు' అని కూడా అంటారు. సింహాద్రి అప్పన్న శ్రీకృష్ణుని అలంకరణలో, ఉభయ దేవేరులతో కలసి తెప్పలో వాహ్యాళి చేసి, అనంతరం గోపికల రథంపై కొండ దిగువున తిరువీధి తిరిగుతాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.

              

January 29, 2014

మత్స్య జయంతి

మత్స్య జయంతి 



పరీక్షిత్తు మహారాజు మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతతో ..... విష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గూర్చి వివరించమని శుకబ్రహ్మను కోరగా నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మునులకు ఈవిధంగా వివరిస్తున్నాడు.  భగవానుడు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, సాధువులను, వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములను ధరిస్తూఉంటాడు. భగవానుడు ఏ రూపమును ధరించినా ఆ రూపము యొక్క గుణ దోషములు తనకు అంటవు.


ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములు  ప్రసిద్ధమైనది. మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.

బ్రహ్మకు ఒక పగలు అంటే - వెయ్యి మహాయుగాలు ....  గడిస్తే  ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగ చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని 'కల్పం' అని అంటారు.

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెల్లి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలలోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది "రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు" అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు ... ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం "తాను శ్రీమన్నారాయణుడుని  అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని" పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.






 
మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి, 'వైవస్వత మనువు' గ ప్రశిద్ధికెక్కాడు.




బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు  నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా,  "సొమకాసురుడు" అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి, సముద్రగర్భంలోకి  వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా, అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి,, అతని కడుపుని చీల్చి ......  వేదాలను - దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని, బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని, శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.



వేదాలను అపహరించటం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేసుకోవటం అని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృస్టికార్య  ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరల గ్రహించటం అని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.


మత్స్య జయంతి  చైత్ర బహుళ పంచమి రోజు జరుగుతుంది.      
                                                         

January 23, 2014

రథసప్తమి ...

రథసప్తమి


సూర్యుడు మాఘశుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.

విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య. ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున - యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంత కాలము భర్తకు దూరంగా ఉన్నసమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం చేత ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు(శని)  జన్మించాడు.

తాను ఉదయించి జగతిని చైతన్యపరచేవాడు, తన స్పర్శతో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయపాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు --- సూర్యభగవానుడు. 'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థము. చరాచర జగత్తు అంతా ప్రేరణ పొందేది, తమతమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ -- సూర్యుని ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుడిని 'కర్మసాక్షి' అని అంటారు. సూర్యుని జన్మతిథి 'మాఘశుక్ల సప్తమి' . ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారంగా కలిగి ఉంటాయంట. అందుకే ఈరోజుని రథసప్తమి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యునికి... సప్త (ఏడు) సంఖ్యకు చాలా దగ్గర సంబంధం ఉన్నదంట. సూర్యుని జన్మతిథి సప్తమి, అతని రథానికి గుర్రాలు ఏడు, అతని పయనం సప్తద్వీప పర్యంతం, అతని కిరణాలలో ఉండే కాంతి యొక్క రంగులు ఏడు రంగులతో కూడుకొని ఉండే సమాహారం. అతని వెలుగులు సప్తసముద్రాలు దాటుతాయి. అందుకే సూర్యభగవానుని సప్తలోక ప్రదీపునిగా అందరూ స్తుతిస్తారు.


సౌరకుటుంబములో అన్ని గ్రహాలకు సూర్యుడే ఆధారం. సూర్యకాంతి వల్లనే స్వయం ప్రకాశం లేని చంద్రుడు, నక్షత్రాలు,  గ్రహాలు మొదలైనవి ప్రకాశిస్తున్నాయి. జీవుల యొక్క సృష్టి - స్థితి - లయలకు ఆధారం సూర్యుడే అని కొన్ని పురాణాలు తెలియచేస్తున్నాయి. విజ్ఞానశాస్త్ర దృష్ట్యా గమనించినట్లయితే ఈమాట నిజమే అని అనిపిస్తుంది. సూర్యుని చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రాణి పుట్టుటకు, ఉనికికి, ఆధారమైన నీరు ఉన్నది --- ఒక్క భూగ్రహం మీదనే. ఆ నీటినుంచే ప్రాణికోటి ఆవిర్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యుడే అని మనకు తెలుస్తుంది.       


కాలగణనలో ఒక్కొక్క మనువు పేరుతో ఒక్కొక్క  మన్వంతరం ఉంది. వాటిల్లో ముఖ్యమైనది ప్రస్తుతం జరుగుతున్నది -- వైవస్వత మన్వంతరం. ఈ పేరుకు మూలాధారుడైన వైవస్వత మనువు, వివస్వంతు(సూర్యు) ని కుమారుడే. తండ్రి జన్మదినమైన రథసప్తమి రోజునే ఈ మన్వంతరం మొదలై అమలులోకి వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సూర్యునివల్లే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతుందని మనకందరికి తెలుసును. సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాలితె తేజస్సు పెరుగుతుంది - అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందుకే అనునిత్యం ఆదిత్యహృదయం చదవటం, సంధ్యావందనం ఆచరించటం, సూర్యనమస్కారాలు చేయటం, అర్ఘ్య ప్రదానం ఇవ్వటం వంటివి సూర్యుని ఎదురుగా నిలబడి చెయ్యాలి అని శాస్త్రాలు చాటుతున్నాయి, మన పెద్దలు చెబుతున్నారు. ఏదోఒక మిషతో నీరెండలో నిలబడటం ఆరోగ్యప్రదము అంటున్న విజ్ఞాన శాస్త్రం ఈ విషయాన్ని బలపరుస్తోంది. విదేశీయులు కూడా సూర్యస్నానం పేరుతొ నీరెండలో నిలబడుట ఆంతర్యం ఇదే. 

రథసప్తమి నాడు పాటించవలసిన విధులు
రథసప్తమి రోజున ఆచరించే అనేక కర్మలలోని మర్మం -- ఆరోగ్యానికి చాలా సూత్రాలు దాగి ఉన్నాయి. వాటిల్లో మొదటిగా ----- షష్ఠి నాడు రాత్రి ఉపవాసం చేసి,  సప్తమినాడు సూర్యోదయమున స్నానచేసినట్లైతే, ఏడు జన్మల పాపములు తొలగిపోయి, రోగశోకములు నశించి పోతాయని విశ్వాసం. ప్రాతఃకాలములోనే స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి, మట్టి ప్రమిదలలో, దేనిలోనైనా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీపజ్యోతులను తలపై పెట్టుకుని నదీ జలాల్లో గానీ, మనకు దగ్గరగా కాలువలో పారే జలాల్లోగానీ తటాకాదులకు గాని, వెళ్లి సూర్యుని ధ్యానించి, ఆ దీపమును నీటిలో వదిలి, రేగుపండు కాని , ఆకు కాని ..... జిల్లేడు ఆకులు కలిపి తలమీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. ఈవిధంగా చెయ్యటం వలన సూర్యుని కిరణాలలోని ఆరోగ్య కారక లక్షణాలను, శక్తిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉందని ఆయుర్వేద నిర్వచనం. ప్రతీరోజూ ఈవిధంగా చేసినట్లయితే చాలా మంచిది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కనుక సూర్యజయంతి రోజున అర్క (జిల్లేడు) పత్రం శిరస్సు మీద ధరించి,

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే || 

("సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.)

అని ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేసినట్లయితే, శుభ ఫలితాలు కలుగుతాయి - అని మన పెద్దల ఉవాచ. 

రెండవది ----- పాయసాన్ని నివేదన చెయ్యటం. ఈరోజు కొత్తబియ్యం + కొత్త బెల్లం కలిపి సూర్య కిరణాలు ప్రసరించే ప్రదేశంలో ఆవుపాలతో పాయసం వండుతారు. దాన్ని చిక్కుడు ఆకులమీద ఉంచి సూర్యునికి నివేదన చేస్తారు. అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. రథసప్తమి నాడు సూర్యకిరణాలలో ఉన్నశక్తి ఆ పాయసంలో చేరి, ఔషధగుణాలు కలిగి చిక్కుడు ఆకులతో కలిగిన రసాయనిక చర్యవల్ల ఆ ప్రసాదం తిన్నవారికి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. 

మూడవది ---- సూర్యుణ్ణి స్తుతించే 'అరుణం' 'మహాశౌరం' వంటివి చదవటం వలన ఆ ధ్వనితరంగాలు పరిసర ప్రాంతాలలో వ్యాప్తిచెంది, ఆ ప్రదేశమంతా ఆరోగ్య వాతావరణం కలిగి ఉంటుంది మన పెద్దల భావన. 


వేదవిహితమైన గాయత్రీమంత్రం, ఋగ్వేదంలోని మహాశౌరం పేరున రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్యహృదయం, భారత భాగవతాలలోని సూర్య స్తుతులు ..... ఇవి అన్నీ సూర్యుని గొప్పతనాన్ని మహిమలను చాటి మనకి తెలియచేస్తున్నాయి. 


నవగ్రహలలోఅగ్రస్థానం సూర్యునిదే. దేశాలు, ప్రాంతాలు, ఆచారాలు, ఆరాధనావిధానాలు వేర్వేరుగా ఉన్న చాలా ఎక్కువ దేశాల ప్రజలు దేవుడు అని నమ్మేది, ఒప్పుకునేది, ఆరాధించి పూజించేది సూర్యభగవానుడినే. సూర్యుడు మనకందరికీ ప్రత్యక్షదైవం.       

రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో  అరసవిల్లిలో వెలసిన సూర్యనారాయణుని విగ్రహంపైన సూర్యకిరణాలు పడతాయి. ఇది మనకు భగవంతునిపై ఉన్న నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం.  సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రమే సూర్యకిరణాలు స్వామిపై పడతాయి.  


                                           
రథసప్తమి యొక్క కథ :--

మన్వంతరము ప్రారంభమున సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి రోజున తన రథమును ఎక్కి ఆకాశసంచారము ప్రారంభించాడు. అందువల్ల కాలచక్రము పరిభ్రమించుటకు కారణమైన సూర్యుని పూజించిన, వ్రతము - జపము - దానము మొదలగునవి చేసిన విశేషఫలితాలని ఇస్తాయి. 

పూర్వము యశోవర్మ అనే రాజుకు అంగవైకల్యముతో ఒక కొడుకు పుట్టెను. రాజుకు కొడుకు పుట్టినందుకు సంతోషము కలిగిన ...... అంగవైకల్యముతో ఉన్నందుకు బాధపడి, పండితులని పిలచి విచారించగా వారు ఈ విధంగా చెప్పిరి. "రాజా ! నీ కుమారుడు గతజన్మలో ధనవంతుడు కానీ లోభత్వముతో ఉండెడివాడు. ఒక రోజున పక్కింటివారు రథసప్తమి వ్రతమును చేస్తుండగా చూసి, ప్రసాదమును స్వీకరించాడు. అందువల్ల అతను రాకుమరునిగా జన్మించాడు. కానీ దానము చేయక లోభత్వముతో ఉండిన వాడు కనుక అంగవైకల్యమును పొందాడు. ఇప్పుడు మీరు ఇతనితో రథసప్తమి వ్రతమును చేయించినచో తగు ఫలితము లభించును." అని చెప్పిరి. రాజు వారు చెప్పినట్లే తన కుమారునిచే రథసప్తమీ వ్రతమును చేయించెను. కొద్దికాలానికి రాకుమారునికి వైకల్యము తొలగిపోయి, పూర్తి ఆరోగ్యవంతుడయ్యెను.  

ఆరోగ్యప్రదాత అయిన ప్రత్యక్ష నారాయణుని సూర్యభగవానుడుని  కొలిచి సర్వజనులు ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ....... 
                                                         సర్వేజనా సుఖినోభవంతు        

         
                                                                          అరసవిల్లి కోవెల

January 21, 2014

హోలీ పండుగ ...... హోలీ పౌర్ణమి

హోలీ పండుగ ...... హోలీ పౌర్ణమి


దేశమంతా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు కారణాలతో, రకరకాలుగా ఉత్సవాలు జరుపుకునే వాటిల్లో హోలీ పండుగ ఒకటి. త్రిమూర్తులను దంపతసహితంగా పూజించే రోజు ఒకే ఒక్కరోజు. అదే ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పున్నమి). 

ఫాల్గుణోత్సవం, కళ్యాణ పూర్ణిమ, డోలాపున్నమి, హుతశనీపూర్ణిమ, కాముని పున్నమి, అనంగపూర్ణిమ, హోళికాదహో, హోళికాపూర్ణిమ, వసంతపూర్ణిమ, హోలీ ----- ఇలా రకరకాల పేర్లతో పిలవబడిన, అవన్నీ ఒక్కటే, అదే హోలీ పండుగ. ఈరోజు జరిపే కార్యక్రమాలు, అనుసరించే ఆచారాలు, జరిపే పూజలు అన్నీ భిన్నమైనవే. అన్నింటి వెనుకా ఆనందంతో పాటు, ఆరోగ్య భావన, ఆధ్యాత్మిక తత్త్వం, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అనేక కథనాలు దాగిఉన్నాయి. 

శివపార్వతులను కలిపే ప్రయత్నంలో మదనుడు శివుని ఆగ్రహానికి గురై దహనమయ్యాడు. అతని భార్య రతీదేవి అభ్యర్థన చేసిన మీదట, ఆమెకు మాత్రమే సశరీరునిగా, మిగిలిన వారికి అనంగునడిగా ... తిరిగి లేచిన రోజు ఫాల్గుణ పౌర్ణమి. కనుక ఈరోజుని 'కాముని పున్నమి' - 'అనంగ పూర్ణిమ' అనే పేర్లు వచ్చాయని మనకు పురాణాలు వివరిస్తున్నాయి. 



ఉత్తరాంధ్రా ప్రాంతాలలో శివాలయాల్లో శివపార్వతులను (విగ్రహాలను) డోలిక (ఉయ్యాల) లో వేసి ఊపుతూ ఉత్సవం జరుపుతారు. బృందావనంలో బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి ఊపుతూ, రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. ఈ రెండు కారణాల వలన 'డోలా పూర్ణిమ' అనే పేరు వచ్చింది. 

మధుర మీనాక్షిదేవి తపస్సు చేసి, సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నరోజు ఫాల్గుణ పౌర్ణమి.కనుక దక్షిణాది దేవాలయాలలో ఈరోజుని కళ్యాణ (లక్ష్మీనారాయణ) వ్రతం చేస్తారు. అందుకే కళ్యాణ పూర్ణిమ అనే పేరు వచ్చిందని విష్ణుపురాణం తెలియచేస్తుంది. 


ఉత్తర హిందూప్రాంతంలో వసంతఋతువు ఆగమనాన్ని స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, జ్ఞానప్రదాత్రి అయిన సరస్వతిదేవిని పూజిస్తారు. దీనినే ఫాల్గుణోత్సవం అని అంటారు. ఆ మరుసటిదినం (ఫాల్గుణ బహుళ పాడ్యమి) చంద్రమానం ఆచరించేవారికి కొత్త సంవత్సరాది. కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సంతోషాలని వ్యక్తం చేసుకునేందుకే ఒకరిపైఒకరు రంగుల పొడులు, రంగునీళ్ళు జల్లుకుంటూ "హోలీ హోలీ రెరంగ హోలీ చమకేళిర హోలీ" అని పాడుతారు. ఈపాటకి భావం ---- "మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. (ఆ రసం ఎర్రగా ఉంటుంది). దీనికి వసంతం అని పేరు. దాన్ని వారు వావి వరుసలు చూడకుండా (పాటించకుండా) అందరూ ఒకరిపై ఒకరు జల్లుకొవాలని" దాని అర్థం. మోదుగపూలు దంచగా కషాయం ఈమాస వాతావరణంలో ఒంటిమీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. శరీరంలో కలిగే ఉద్రేకాలు (రక్తపోటు వంటివి) మానసిక దుర్వికారాలు వంటివి తగ్గుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది. 

                                                                    

మహా మాఘి ........... మాఘ పౌర్ణమి

మహా మాఘి ........... మాఘ పౌర్ణమి



చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరువచ్చింది. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేయుటకు ఈమాసం శ్రేష్టమైనది అని మన పెద్దలు చెబుతుంటారు. యజ్ఞాలకు అధిష్టాన దైవం 'ఇంద్రుడు'. అందుకే ఇంద్రుణ్ణి 'మఘవుడు' అని కూడా అంటారు. ఈ మాసంలోనే శిశిరఋతువు వస్తుంది. చెట్ల ఆకులు రాలిపోతూ ఉంటాయి. శూన్య పుష్యమాసం అనంతరం వచ్చే కళ్యాణకారక మాసం ఇది.

వైశాఖ - కార్తీక మాసాల లాగే, ఈ మాఘమాసం కూడా స్నానాలకి జనులు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. మఘస్నానం అతి పవిత్రమైనదని చెబుతారు. పాపాలు తొలగుటకు నదీస్నానం చేయటం మాఘమాసం సాంప్రదాయం. ఈమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి, సూర్యోదయ కాలంలో --- సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయంట. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు కనిపిస్తాయి. మాఘస్నాన విధులను 'మాఘపురాణం' వివరిస్తుంది, మఘస్నాన మహాత్మ్యాన్ని 'బ్రహ్మాండ పురాణం' వివరిస్తుంది.

మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంటివద్ద స్నానం చేస్తే -- ఆరు సంవత్సరాల యజ్ఞ, స్నానఫలం లభిస్తుంది అంటారు. బావినీటితో స్నానం చేస్తే -- 12 ఏళ్ళ పుణ్యఫలం, తాటాక స్నానం చేస్తే -- ద్విగుణం, నదీస్నానం చేస్తే శతగుణం, త్రివేణీ సంగమ స్నానం చేస్తే -- నదీ శతగుణ ఫలం ఇస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి.

మాఘపౌర్ణమిను 'మహామాఘి' అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని, అన్ని పున్నమిలలోకెల్లా ఉత్తమమైన పున్నమిగా భావిస్తారు. స్నాన, దాన, జపాలకు ప్రశస్తమైన రోజు ఈరోజు. మఘమాసమంతా స్నానాలకి ఒక ప్రాముఖ్యము ఉంటే, మఘపౌర్ణమి రోజు స్నానానికి అతి పవిత్రమైన విశిష్టత ఉంది. ఈ పౌర్ణమి రోజున 'సింధుస్నానం' చేయాలని శాస్తవిధి. సింధువు అంటే సముద్రము. ఈరోజు సముద్రస్నానం కలుషహరమని, మహామహిమాన్వితమని విశ్వసిస్తారు. ఈ మాఘమాసంలో దివ్య తీర్థాలని స్మరిస్తూ, పౌర్ణమి స్నానం చేయటం సనాతన సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే, ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మృకండ మహర్షి - మనస్వినిల మాఘస్నానం ఫలితము వలననే వారి కుమారుడగు మార్కండేయునికి అపమృత్యు దోషం తొలగిందని పురాణాలు చెబుతున్నాయి.

మహామాఘి రోజునే 'కపిల మహర్షి' జయంతి. కపిలుడు విష్ణువు అంశ సంభూతుడు. దేవహూతి - కర్దమ మునిల పుత్రుడు. కపిలుని భార్య పేరు శ్రీమతి. సగర పుత్రులు -- యజ్ఞాశ్వం కోసం వెదుకుతూ - వెదుకుతూ, కపిలుడు తపస్సు చేస్తున్న సమీపంలో అశ్వం ఉండుట చూసి, అతడే అశ్వాన్ని అపహరించాడు అని భావించి, అతనిని బంధించబోగా, కపిలుడు కళ్ళు తెరచి చూసేసరికి వారంతా భస్మమయ్యారు. వారికి శాప విమోచనం ...... వారిపై (ఆ భస్మంపై) గంగాజలాన్ని ప్రవహింపచేయటమే, అని తెలిపాడు. భగీరథుడు ఘోర తపస్సు చేసి, గంగను భూమిపైకి రప్పించి, వారికి శాప విమోచనం కలిగించాడు.

              

సహజ రంగుల హోళీ పండుగ

సహజ రంగుల హోళీ పండుగ

హోళీ పర్వదినాన్ని మనం చాలా భక్తి స్రద్దలతో చాలా ఆనందంగా జరుపుకుంటాము కదా.... కాని హోళీ రంగుల్లో రసాయనాలని ఉపయోగించకుండా సహజ రంగులని ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ఆనందం పొందినవారమవుతాము కదా..... ఒక్కసారి ఆలోచించండి...... ఆ సహజ రంగులు ఏవో నేను చెబుతాను మీరు కూడా వాడి చూడండి.. నేను ప్రతీ సంవత్సరము ఇలాగే రంగులు తయారుచేసి వాడుతూ ఉంటాను.... అందుకే మీకు చెబుతున్నాను.......

1)పసుపుని సెనగపిండితో కలిపితే పసుపు రంగు వస్తుంది...... ఇది నీటిలో కలిపి జల్లుకుంటే ఎటువంటి ప్రమాదము ఉండదు..పసుపుని చందనం పొడితో కలిపి నీటిలో వేసినా పసుపు రంగు వస్తుంది.....

2)పాలకూర వంటి ఆకుకూరలని సెనగపిండితో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది...... లేదంటే గోరింటాకు పౌడర్ ని సెనగపిండితో కలిపి నీటిలో కలుపుకోవచ్చును & కేవలము గోరింటాకు పౌడర్ ని నీటిలో కలిపినా ఆకుపచ్చ రంగు వస్తుంది.....

3)బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గులాబీ రేకులతో కలిపి రాత్రంతా నీటిలో నానపెడితే లేత ఎరుపు రంగు వస్తుంది.......టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపినా ఎరుపు రంగు వస్తుంది... మందారపూలుని ఎండబెట్టి పౌడర్ చేసి నీటిలో కలిపినా ఎరుపు రంగు వస్తుంది.....

4)గులాబి రేకులని నీటిలో నానపెట్టి గ్రైండ్ చేస్తే అందమైన గులాబి రంగు వస్తుంది....

5)నారింజ-- బత్తాయి తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసుకొని నీటిలో కలిపితే నారింజ రంగు వస్తుంది....

6)రకరకాల పువ్వులను & ఆకులను కలిపి నీటిలో నానబెట్టి గ్రైండ్ చేస్తే సరికొత్తరంగు తయారవుతుంది..

ఈ విధంగా మీరుకూడా మీకు కావలసిన రంగులను తాయారు చేసుకుని రంగురంగుల--ఆనందాల హోళీని జరుపుకోండి......ఆనందంగా ఉండండి...........


January 16, 2014

కనుమ పండుగ


కనుమ పండుగ

సంక్రాంతి మూడురోజుల పండుగ.మూడవరోజును కనుమ పండుగ అని అంటారు. ఈరోజును పశువుల పండుగ అని అంటారు.రైతుల ఇళ్ళకు పాడిపంటలను సమృద్ధిగా అందించిన పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ రైతులు చేసే పండుగే ఇది. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. ఆవులు - ఎద్దుల కొమ్ములకు పసుపు - కుంకుం రాసి, వాటిని పూజిస్తారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఈ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం, కలగలపు కూరలు, తీపి గుమ్మడి ముక్కలు కలిపిన పులుసు చేసుకోవటం కొన్ని ప్రాంతాలవారి ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు.







గోపూజ 
భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పద్మం ముగ్గులు వేయటం సంప్రదాయంగా వస్తోంది. సిరి - సంపదలని ఇచ్చే లక్ష్మీదేవిని ఆహ్వానించటమే వాటి ఉద్దేశ్యం. భోగి రోజున చంద్రహారం ముగ్గు, సంక్రాంతి రోజున అష్టదళ పద్మం ముగ్గు, కనుమ రోజున రథం ముగ్గూ వెయ్యాలి. ముగ్గు వేసిన వాళ్ళకే కాదు, వాళ్ళింటికి ఎవరు వెళతారో వాళ్ళకూ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.


అష్టదళపద్మం ముగ్గు

రథం ముగ్గు విశిష్టత 
ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని, ఆ రథం నడిపేవాడు పరమాత్మఅని భావిస్తూ, ఈ నాశారీరమనే రథాన్ని సరైన త్రోవలో నడిపించవలసిందిగా పరమాత్మని ప్రార్థించటమే ముగ్గులోని రహస్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు తమకి అన్నీ శుభాలని కలిగించాలని కోరుకుంటూ, ఇంటిముందు రథం ముగ్గు వేసి, పళ్ళు - పూలు, పసుపు - కుంకుం అన్నీ ముగ్గు మధ్యలో వేసి గౌరవంగా సాగనంపుతారు.ఒకింటిలో రథం ముగ్గు యొక్క గీత(తాడు)ని .... పక్కింటి రథం ముగ్గు గీతతో కలిపి, ఈవిధంగా ప్రతీ ఇంటిముందు గీసిన గీతలన్నీ ఊరు పొలిమేరవరకు సాగుతాయి. కూడా ఉంది. 


రథం ముగ్గు

రథం ముగ్గు వేయుటకు మరొక ఆధ్యాత్మిక కథనం 

బలిచక్రవర్తి పాతాళం నుంచి ఈ మూడురోజులూ భూలోకానికి వస్తాడు అని, పండుగ పూర్తయిన తరవాత అతనిని సాగానంపుటకు ఇంటింటా ఈ విధంగా ఏర్పాటు చేస్తారని కొందరు అంటుంటారు. ఈవిధంగా మన పెద్దలు ఏర్పాటు చేసిన పండుగలలో ఆధ్యాత్మిక - లౌకిక - విజ్ఞాన మొదలైన విషయాలతోపాటు, మన సంస్కృతి - సంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయి. కనుక మనం వీటిని ముందుతరాలవారు మరచిపోకుండా, తెలుసుకొని ఆచరించేలా చేయటం, అందరికీ వాటి అంతరార్థం తెలిసేలాగా ప్రచారం చేయటం, మన కనీస కర్తవ్యం మరియు బాధ్యత కూడా ఉంది. 



సర్వేజనా సుఖినోభవంతు

January 14, 2014

సంక్రాంతి పండుగ అంటేనే పోషకాల పండుగ

సంక్రాంతి పండుగ అంటేనే పోషకాల పండుగ



సంక్రాంతికి పొంగలి, అరిసెలు, కమ్మటి మినపసున్ని ఉండలు, తప్పనిసరిగా చేసుకుంటాము. రేగుపళ్ళు, తేగలు, చెరకుగడలు, ఇవన్నీ పండుగ సమయంలోనే వస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

బెల్లం - చెరకు 
సంక్రాంతికి చేసే పొంగలిలో కొత్త బియ్యము, కొత్త బెల్లము వాడుతారు. బెల్లంతో అరిసెలు కూడా చేస్తారు. బెల్లంతో చేసిన వంటలు తక్షణ శక్తిని ఇస్తాయి. అరిసెలు జీవక్రియలని వేగవంతం చేసి, వేడిని పుట్టిస్తాయి. పిల్లలు - పెద్దలు అంతా ఎంతో ఇష్టంగా తినే చెరకుకి ఈ పండుగలో ప్రాధాన్యం ఇవ్వటానికి కూడా ఇదే కారణం. చెరకు నుంచి సహజ సిద్ధంగా లభించే చక్కెరలు, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు అందుతాయి.


సున్నుండలు 
మినపపప్పుతో చేసే సున్నుండలలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. నెయ్యి - బెల్లంతో కలిపి చేసిన వీటిలో మంచిపోషకార విలువలు ఉంటాయి. మినప్పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. కొవ్వు శాతం తక్కువ. ఎముకల పటుత్వానికి ఉపయోగపడుతుంది. వీటిని తినటం వలన శరీరానికి ప్రోటీన్లు బాగా అందుతాయి. పీచు పదార్ధం ఉండటం వలన త్వరగా అరుగుతుంది. మినప్పప్పులో ఉండే మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరగటానికి ఉపయోగపడుతుంది.


నువ్వులు 
నువ్వులని అరిసెలలో వాడటమే కాదు, పిండివంటల్లో నువ్వుల ఉండలని ప్రత్యేకంగా చేస్తారు. వీటితో శరీరానికి మేలుచేసే కొవ్వులూ, మోనో అన్ శాచురేటెడ్ ఫ్లాటీ ఆమ్లాలు ఉంటాయి. మన శరీరం తయారుచేసుకోలేని, తప్పనిసరిగా అవసరమయ్యే పోషకాలని ఇవి అందిస్తాయి. స్త్రీల శరీర అవసరాలకి తగినంత కాల్షియంను నువ్వులు అందిస్తాయి. వీటి నుంచి లభించే విటమిన్ 'ఇ' రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వులగింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలూ ఉన్నాయి. వాటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండెకు మేలు చేస్తాయి. వీటిలో సమృద్ధిగా లభించే విటమిన్ 'బీ' ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచుతుంది.   

                          
రేగుపళ్ళు
తీయగా, పుల్లగా ఉండే రేగుపళ్ళను తింటే మనకి 'c' విటమిన్ లభిస్తుంది. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచి, వివిధరకాల ఇన్ఫెక్షన్లకు మనకు దూరంగా చేస్తాయి.


తేగలు
వీటిల్లో ఆరోగ్యవంతమైన కార్బోహైడ్రేట్లతోపాటూ పీచు అధికంగా ఉంటుంది. ఇవి నిదానంగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చూస్తాయి. రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తాయి.


ఆయురారోగ్యాల  సంక్రాంతి అందరం ఆనందంగా చేసుకుందాం 
సంక్రాంతి శుభాకాంక్షలు