January 16, 2014

కనుమ పండుగ


కనుమ పండుగ

సంక్రాంతి మూడురోజుల పండుగ.మూడవరోజును కనుమ పండుగ అని అంటారు. ఈరోజును పశువుల పండుగ అని అంటారు.రైతుల ఇళ్ళకు పాడిపంటలను సమృద్ధిగా అందించిన పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ రైతులు చేసే పండుగే ఇది. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. ఆవులు - ఎద్దుల కొమ్ములకు పసుపు - కుంకుం రాసి, వాటిని పూజిస్తారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఈ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం, కలగలపు కూరలు, తీపి గుమ్మడి ముక్కలు కలిపిన పులుసు చేసుకోవటం కొన్ని ప్రాంతాలవారి ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు.







గోపూజ 
భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పద్మం ముగ్గులు వేయటం సంప్రదాయంగా వస్తోంది. సిరి - సంపదలని ఇచ్చే లక్ష్మీదేవిని ఆహ్వానించటమే వాటి ఉద్దేశ్యం. భోగి రోజున చంద్రహారం ముగ్గు, సంక్రాంతి రోజున అష్టదళ పద్మం ముగ్గు, కనుమ రోజున రథం ముగ్గూ వెయ్యాలి. ముగ్గు వేసిన వాళ్ళకే కాదు, వాళ్ళింటికి ఎవరు వెళతారో వాళ్ళకూ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.


అష్టదళపద్మం ముగ్గు

రథం ముగ్గు విశిష్టత 
ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని, ఆ రథం నడిపేవాడు పరమాత్మఅని భావిస్తూ, ఈ నాశారీరమనే రథాన్ని సరైన త్రోవలో నడిపించవలసిందిగా పరమాత్మని ప్రార్థించటమే ముగ్గులోని రహస్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు తమకి అన్నీ శుభాలని కలిగించాలని కోరుకుంటూ, ఇంటిముందు రథం ముగ్గు వేసి, పళ్ళు - పూలు, పసుపు - కుంకుం అన్నీ ముగ్గు మధ్యలో వేసి గౌరవంగా సాగనంపుతారు.ఒకింటిలో రథం ముగ్గు యొక్క గీత(తాడు)ని .... పక్కింటి రథం ముగ్గు గీతతో కలిపి, ఈవిధంగా ప్రతీ ఇంటిముందు గీసిన గీతలన్నీ ఊరు పొలిమేరవరకు సాగుతాయి. కూడా ఉంది. 


రథం ముగ్గు

రథం ముగ్గు వేయుటకు మరొక ఆధ్యాత్మిక కథనం 

బలిచక్రవర్తి పాతాళం నుంచి ఈ మూడురోజులూ భూలోకానికి వస్తాడు అని, పండుగ పూర్తయిన తరవాత అతనిని సాగానంపుటకు ఇంటింటా ఈ విధంగా ఏర్పాటు చేస్తారని కొందరు అంటుంటారు. ఈవిధంగా మన పెద్దలు ఏర్పాటు చేసిన పండుగలలో ఆధ్యాత్మిక - లౌకిక - విజ్ఞాన మొదలైన విషయాలతోపాటు, మన సంస్కృతి - సంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయి. కనుక మనం వీటిని ముందుతరాలవారు మరచిపోకుండా, తెలుసుకొని ఆచరించేలా చేయటం, అందరికీ వాటి అంతరార్థం తెలిసేలాగా ప్రచారం చేయటం, మన కనీస కర్తవ్యం మరియు బాధ్యత కూడా ఉంది. 



సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment