March 30, 2022

చైత్రమాసం విశిష్టత

 చైత్రమాసం విశిష్టత

“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. 

చైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తాడు.

చైత్ర శుద్ధ పాడ్యమి – (ఉగాది నుండి) చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు అని మనమందరం జరుపుకుంటాం 

సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, 

రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, 

మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. 

సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా హిందువులంతా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. 

రామాయణానికి - ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు, వనవాసానికి వెళ్ళటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం, శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. 

చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు.

చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి, మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.

చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి, డోలోత్సవం నిర్వహిస్తారు.  పార్వతీదేవి, సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాలని పొందారని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. 

ఈ రోజు మత్స్య జయంతి కూడా – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి, వేదాలను రక్షించిన రోజు.  

చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అనే మహానాగులను పూజించి, పాలు, నెయ్యి నివేదించాలి.

అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించుకుంటే మంచిదంట. ఒకవేళ చేయలేకపోయినా, శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు.

చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఈరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పిందట.

చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. 

చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి, కామద ఏకాదశి అని అంటారు.

చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుందట. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది అని నానుడి. కొన్ని ప్రాంతాలవారు ఈరోజున హనుమజ్జయంతిని జరుపుకుంటారు.

చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.

ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు, ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని మన పెద్దలు సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని, రామాయణ సారాన్ని గ్రహించి, సీతారాముల కళ్యాణం చూసి తరించి, సనాతన ధర్మాచరణకై పాటుపడదాం. 


March 25, 2022

Tiruppavai Songs

Tiruppavai Songs

తెల్లవారగ లేచి తెలతెల్లవారగ లేచి
త్రివిక్రమా నీదు విక్రమమే తలచి......
నీ చరణముల సేవింప కోరికతో....
వున్న గొల్ల కన్నియలమే..కృష్ణా................!!తెల్లవారగ!!
జన్నజన్మలకు నిను వీడబోము
పఱకొఱకని మిషతోడచేరితిమి!! 2!!
పఱకన్న నీ సాంగత్యమె మిన్న
మా కన్నయ్య మము వీడకు.............!!.తెల్లవారగ!!
అన్యకోరికల ఊసే వలదు
అన్యానందములువలదు
కృష్ణ కృపరసానందమే..........
కృష్ణ కృపరసానందమే పరమ
పెన్నిధియని కొలిచేము కృష్ణా.......!!తెల్లవారగ!!
రచన:శ్రీకృష్ణ మాధవి

మేలు కొలుపు-0
పల్లవి : ఏతెంచె హేమంతము విరబూసే చామంతులె హేమవర్ణముతో హిమబిందు వులే మిలమిలలాడా......!!ఏతెంచె! !
అనుపల్లవి : మార్గశీర్షమాసమున ఎల్ల గోపకాంతలే త్వరపడి త్వరపడి అందరినేలువానికొరకై వేగిరముతో మేలుకొందురుహెచ్చరికతో !!ఏతెంచె! !
చరణం : మడుగుల జలములకై చూసి అడుగుఅడుగు అణకువతో పరకొరకై నీరాడుదమనుచు పరువు
లెత్తుమనసులతో పదిలముగా పదుమనాభుని తలచి హెచ్చరికతో !!ఏతెంచె! !
చరణం : కొమ్మ కొమ్మ ని కోరి కోరి కొమ్మ కొమ్మ నీ కోరికోరి రమ్మనుచు కలుపుకునుచు కమనీయ రూపుని నందగోపాలుని చూడవేడుకతో అన్నియు విడిచి కృష్ణ స్మరణతో కృష్ణ స్ఫురణతో హెచ్చరిక తో!!ఏతెంచె! !
రచన : శ్రీ కృష్ణ మాధవి
2-12-2019
7.30P.M
నీరాట్టము: స్నానము చేయడం.: పరమాత్మ ని తలుచుకోవడము కలుసుకోవడము అసలైన స్నానము. సూక్ష్మ పరిశీలన. తిరుప్పావై మొత్తం నీరాడపోదుమని వుంటుంది కాని వారు మామూలు స్నానమాచరించడము మనకు కనిపించదు.
కొమ్మ : పడుచు; పరమపురుషుడు ఒక్క రే పురుషుడు. మిగతా వారు అందరూ స్త్రీ లనే భావన ఇక్కడ.

పల్లవి :
కలికి కొలికి గళరవమున రాగములు మత్తకోయిలలై కులుకులు పోవ ...కృష్ణ రాగమే ..పురివిప్పియాడే....కృష్ణ గానమే...నటనలు చేసే......!!కలికి!!

అనుపల్లవి:
కృష్ణ కృష్ణ యని కృష్ణ చూడ్కులుగని మోహితులై....మోహనరాగమే....ఆలపించిరి....!!కలికి!!
చరణం :
వలపుల వగవులు మమతలు విప్పారిన విరజాజులై వన్నెకాడు యమునా విహారినే మరి మరి మరీ మరీ చూచె సిగ్గు దొంతరలు దొంతరలై దొరల మరలిపోని భావనలో మరు మల్లియ మాలలై.....!!కలికి!!
చరణం :
జలతారు మధురిమలు జాలువారా .... ..కలకంఠి కంఠమున( కొంగ్రొత్త ) నవ నవ్యరాగములు రవళించ రసానుభూతుల ఓలలాడి రసరమ్య తరంగముల ఘుమఘుమ లే....వ్యాపింప జలముల మీనగతిన హొయలు పొయెటి వేణి కృష్ణవేణి తరంగిణిలా....!!కలకంఠి!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
30-11-2019
రచనాసమయం :11.15 A.M

తిరుప్పావై --3
పల్లవి :రారండు చెలులారా. ..రారండు చెలులారా
కలిమి తోటి చెలిమి తోటి చేయుదము వ్రతము!!రారండు! !
అనుపల్లవి : కొండెమాటలన్ని విడిచి కొండంతవానిని కోరినంత పలుకువానికై చేయుదమీ వ్రతము !!రారండు! !
చరణం : బాలవటువై ఏతెంచె బాలతేజుడే బలికడకు !!2!!
దానమడిగినాడు మూడు అడుగులే.... ..మూడు అడుగులే...........ఫక్కున నవ్వి జాలిపడియె బాలుడని....దానమిచ్చె మూడడుగులు....శ్రీహరి మాయలు తెలుకొనగ !!రారండు !!
చరణం: ఏటికి ముమ్మారులు వరి నారులు పెరిగినటుల చూచునంతలోనే ................పెరిగి ..పెరిగి తాను పెరిగి భూమి ఆకాశములు కొలిచినాడే. .రెండు అడుగులా........తలవంచిన బలి తలపై....
మూడో అడుగుంచిన శ్రీ చరణ సన్నిధినే పొందడానికై ..త్రివిక్రమావతారునే శరణనుచూ చేయుదమీ వ్రతము! !రారండు! !
రచన : శ్రీ కృష్ణ మాధవి
7-12-2019
రచనాసమయం :5.30A.M


అలకలమొలకల చిలుకలలారా.....
కనుకొలకుల కాటుక ఏదమ్మా....
కురులను మురిసే విరులేవమ్మా....
ఘుమఘుమ ఘృతములేమాయే.......!!అలకలమొలకల!!
కినుక తోడ భక్తి వింతగాగ
ఈ కినుకలే కానుకలుగాగ
అతివలమందరము కలసి
భక్తితో నోతుము ఈ నోము రా రే......!!అలకలమొలకల!!
అలివేణి నీలవేణి నీలమ్మ
హృదిన నిదురించువానికై
నిజమానసమున నియతి
తోడి చేతుము శ్రీ వ్రతము..రా రే......!!అలకలమొలకల!!
రచన:శ్రీకృష్ణ మాధవి

నిదురలేవే ముద్దు పలుకుల మొలక
నిదుర లేవే.......వచ్చెద...నే వచ్చెద...
ఇచ్చకాలు మాని ఇంపుగా మాకింపుగ
రావే నళిని శిరోమణి నీవేలే....నీవేలే.....!!నిదురలేవే!!
కలసికట్టు గా వచ్చితిరా..కలకాదుగా..
కలలన్ని పండి కాంతుని శ్రీకాంతుని
చేరెదమే...మేమందరము కూడితిమే
కాలయాపన..లేల... త్వరకలిగి లేవే....!!నిదురలేవే!!
అరిషడ్వర్గములనణచు యా హరి ని
గొల్లపిల్లవానిని గుర్తెరిగి కొలువ రావే...
చందురుని మోము కల ముదిత రావే
సురలు కొలుచు వానికయి ....లే....లేవే.....!!నిదురలేవే!!
రచన:శ్రీకృష్ణ మాధవి

అలరు బోడివే అలివేణివే అంబుజాక్షీ........
ఇంత మరుపేలనే నీ కింత మరుపేలనే......
పిలుతునని మము పిలుతునని పిలవక
బిడియము వదలి నిదురపోతివేలనే ....!!అలరుబోడివే!!
విరిసే ఎఱ్ఱని కలువలు ముడుచుకొనే
నల్ల కలువలు హరిభక్తులు వడిగా చేరే
కోవెల శంఖచక్రధారుని చేరికొలవగా.......
ఇంత అలసత్త్వమేలనే నీకిది తగునే......!!అలరుబోడివే!!
మధురతర గానము సేయవే....పంకజ
హరి హరి హరి హరిగానము సేతుమే
సర్వజనులశ్రేయము కోరి సంపదనొసగ
భక్తి సంపద ల నొసగ కీర్తనల వేడదమే....!!అలరుబోడివే!!
రచన:శ్రీకృష్ణ మాధవి

ఈ రేయి నీకింత నిదురేలనో
నవమోహనాంగివని వేచితిమే.....!!ఈ రేయి!!
శ్రీ తులసీధారునికై పురుసార్ధసాధనకై
నిను కూడుదుమని చూచితిమే........
రావణానుజుడు తన నిదుర నీవశమె
చేసెనా.....చెరగని తరగని గని రంగని సేవ ని.....!!ఈ రేయి!!
తడబాటులేలనే....తరుణీ మణీ...
నీతలుపు చెంత నిలిచితిమే నిర్మలావదనా...
తలపున నిలిపి నీ తలపున నిలిపి...
తలుపు తీయవే తీయని పలుకుల తన్వంగి....
చేతుము శ్రీ వ్రతము భక్తి సిరులు కురియ .!!ఈరేయి!!
రచన, : శ్రీ కృష్ణ మాధవి
25--12--2020

ఇంతమత్తు నీకేలనే.....ఇంతమత్తు నీకేలనే
రావణసోదరుడు తన నిదుర నీకిచ్చెనా..........
మాటలేక కనులుమూసి నటనలయాటలా
తగనివారమా మేము తగని వారమా.........!!ఇంతమత్తు!!
తులసిమాలలు ధరియించు వానికై
తులసీ మాలలు ధరియించు వానికై
త్వరకలిగి రావమ్మ తడబాటులొదిలి
మోమాటము మరచి పోవమ్మా మంజరీ.....!!.ఇంతమత్తు!!
నీవులేక అడుగు పడక..... మాటతోచక
భక్తి సంపద కల సంపన్నవని వింటిమే
మా వైపు చూసి మా తోటి కలసి రావమ్మ
నోచెదమీ నోము శ్రీరంగ నాయకుని కై........!!ఇంతమత్తు!!
రచన:శ్రీకృష్ణ మాధవి

మణిపరిమళ భవనశయనా....
శశివదనా...సౌరభా.... లేవేలా.......!!మణిపరిమళ!!
తలుపు తీయవే మెరుపు తీవవే....
తలపున నీవే ....రతనాలబొమ్మా......
సుగుణాలరాశి ఓ....అత్తనీవైన పిలవవా....
కృష్ణ నామరస పారవశ్యమా.................!!మణిపరిమళ!!
ఒంటిగ నీకిది తగునా.......తగవేల...
వినియు వినక కనక ఇదిఏమి........
సోగకన్నుల సౌకుమారి......వేచితిమే.....
కూడి చేతుము శ్రీ వ్రతము.....రావే రసరమ్యా....!!మణిపరిమళ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
24--12--2020

దీపముల మణి దీపముల వెలుగుల జిలుగుల
ధూపముల అగరు ధూపముల ఘుమఘు లా
సుతిమెత్తని శయ్యన శయనించిన నెరజాణవే
మా మామకూతురా మేల్కాంచవమ్మా మాధురి...!!.దీపముల!!
మా పిలుపులు వినలేవా....ఇంతలింత
పారవశ్యమా
మాటైనా మాటడవా.....తగని వారమా నీ మాటకు
మంత్రబద్ధమైతివా..శ్రీకృష్ణ మంత్రబద్ధమైతివా అతివా..
వేగము మము చేరి పంచగలేవా మధురమంత్రం........!!.దీపముల!!
మాయలకు మాయ యను పేరున్న వానిని
మాధవా.....వైకుంఠవాసా ....యని...పిలువ
మా తోడి కలువమ్మా కలువల నేత్రి కమలాక్షి
కలసి మెలసి చేతుము శ్రీకృష్ణ నామ సంకీర్తనం.....!!.దీపముల!!
రచన:శ్రీకృష్ణ మాధవి

తూరుపు రేకులు విరిసే.....
ఆలమందల తో..కాపరులు వెడలే.......!!తూరుపు!!
ఆశ కలిగిన హరిణేక్షణా.....
హరి ప్రీతి కలిగిన హరీణేక్షణా....
కేశాంతకుని మల్లయోధులన
ణచిన వీరుని కొలువ రావమ్మా.......!!తూరుపు!!
దేవాధిదేవుడు శ్రీ శుడు.....
కృపజేయు కృపాళుడే........
మనసార తలచీ.....కొలవగా
మా తోడుగ నిలవ రావమ్మా.......
శ్రీశునికై చేతుము శ్రీ వ్రతము...!!తూరుపు! !
రచన:శ్రీ కృష్ణ మాధవి
22--12--2020

మూసినకనుల దాచిన కలల దొరలుదువేల
వేవేల నామముల వానిని కూడుటకై రావే....
ముసుగు తీయవే మాలతీ....మానినీ మణీ...
నిదురలేవోయీ తొలిమంచు శుభవేళ శుభాంగి.....!!మూసిన!!
గోశాలల గోవులు వెడలినవి వనములకు
అంబారావముల ఛంగున ఉరికే దూడలతో
కనుమా ఇటు కనుమా చెలీ నొకపరి కనుమా
కూడి నిలిచితిమి చెలులమిచట నీ వాకిట.....!!మూసిన!!
మల్లయోధుని భుజబల కీర్తన సేయుదమే....
వైకుంఠవాసుని నామ సంకీర్తనమే చేతుమే
నోరారగా మనసు నిలిపి మదిన నిలిపి......
నళిన మనోహరుని నయముగా చేరెదమే....!!మూసిన!!
రచన:శ్రీకృష్ణ మాధవి

తెల్లవార వచ్చే మగువా....ఓ....మగువా...
కిచకిచ చాతక సందడులను వినవే.........
తెల్లవార వచ్చేనే......గురుతులన్ని గనవే....
ఏమమ్మా......ఏ మాయన వుంటివో............!!తెల్లవార!!
అందెలసవ్వడి తారాహారాల గలగలలు...
సోకనేలేదా చెవుల దధిమధన క్రీడ......
..సొగసుగా శయనించితివేలనే...
అందాల బొమ్మ రావమ్మ ముందుగా......!!తెల్లవార!!
కేశవాయని కేశినారి హరిని తలవ
మాధవా యని మురహరిని పిలువ
నారాయణ అన్ని నీవే ననుచు తలవ
తెరువవే నీ మది గడియలు రావే వే.. వేగ....!!తెల్లవార!!
రచన:శ్రీకృష్ణ మాధవి

ఈ నీహారపు వేళ చెలియా నిదుర లేవవే .........
కొండలన్నీ....మారుమ్రోగే...ఖగసేనారావముల...
తెల్లవారనే చెలియా......నిదురలేవవే...
వినవే....పక్షుల రాగముల భావములనీ........!!.ఈ నీహారపు!!
అలల తేలు ఫణిశయనుడు....ఆ....ఆ......
చేరి నందకులమున....ఆనంద వాడల
చేసెనట చేయుదములు వినలేదా ........
ఘనకీర్తిని పొందిన ఘనతరుని లీలలు....
తొలిఝామున నోరారగ పాడగ నిదురలేవే.......!!ఈ నీహారపు!!
తీయని కోకిల స్వరమున కోకిల లే వినగా.....
ఆమని వేళాయనుకొనగ ఈ హేమంతమునా.....
వినిపింపవే నీ మృదు స్వరమును.....మృదులా....
వేణువు పరుగున వేణుగోపాలుడు చేరునే మనదరి....!!ఈ నీహారపు!!
హరి హరి హరి యని ముమ్మారుల పిలువ
కూరిమితోడ రావే నిదురవీడవే లతాంగి...!!2...!!.ఈ నీహారపు!!
రచన:శ్రీకృష్ణ మాధవి


మాయాలీలా మధురాపాల
నందకులదీపా.....ఆనందా....!!మాయాలీలా!!
యదుకులతిలకా దామోదరా
నిను తలచిన ఝుల్లను మనమే
వెన్నమరిగి పడతుల మనసే దోచి
వెన్నుడనేనని వెన్నుడనే యను.......!!మాయలీలా!!
అలల యమున నీపదముల
తాక ఎగసెగసి పడగా............
అంకీయంకనీయక పద
యుగళి యాడిదాటితివే........!!మాయలీలా!!
చేసితివట చోద్యములెన్నో....
చూపితివట నోట బ్రహ్మాండమే....
గొల్ల సతి పొందెనట నక్కజమే....
అఘటనఘటనా విశేషా...........!!మాయలీలా!!
అఘములన్ని నిప్పువడిన
దూది యగునే కృష్ణ కృష్ణ
నీకై చేతుమీ వ్రతము.......
శ్రీ వ్రతము నియతితో కృష్ణా....!!మాయలీలా!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
20--12--2020
అఘము; పాపములు
అక్కజము:ఆశ్చర్యము
గొల్ల సతి:యశోదమ్మ
చోద్యములు:వింతలు

మేని మేలి పసిడిఛాయ మిసమిస ల
ఆకర్ణాంతము ఎఱ్ఱకలువల కనుదోయి
తలపైనిఛత్రము ధగధగల జందెము
త్రిదండ ధారియైన వామన మూర్తి..........
పెరిగినాడోయమ్మా..పెరిగినాడోయమ్మా...
ఇంత వాడు అంతంతాయే... ....
ఆవరించే గగనాంతరమంతయు...
అవధులెరుగని వాడు త్రివిక్రముడై.....
వానినే తలచి కొలచి పొందుదుమమ్మ
సస్యసంపదల్ ఇహపరములా నెలతలారా.....
భక్తిభావము పొంగి పొరలగా నోతుమీ వ్రతము......
రచన:శ్రీకృష్ణ మాధవి

తిరుప్పావై--29
పల్లవి: ఓ....ఓ....గోకులవంశోద్భవా...........యదువంశతిలకా.........ఈ గోపకన్నియల మొర ఆలింపుమా........గోవిందా...!!ఓ..గోకులవంశోద్భవా!!
అనుపల్లవి:పఱయను మిషయే గోవిందా మాత్వరనీకై గోవిందా.........!!ఓ....ఓ...గోకులవంశోద్భవా!!
చరణం:దివ్యమైన నీ మోము చూచువరమే నిరవధిక సేవాఫలమే బ్రోవుమా గోవిందా !!2!! ఇతరేతర వాంఛలే సమయగా నీనామసంకీర్తనమే రేయిపగలు జిహ్వేంద్రియములు పాడుబలమునా!!ఓ..ఓ..!!
చరణం: నిత్యానపాయని సేవయే దరిచూపే....చేసితిమి శ్రీవ్రతమే....శ్రీ వ్రతమే....నీచరణసేవ ధారక పోషకములు గోవిందా...గోవిందా.....మంగళ మిదియె గైకొనుమాగోవిందా
వింజామరసేవలు చేయుచేతులా మంగళమిడు భాగ్యముమాదే
గోవిందా............!!ఓ.....ఓ....గోకులవంశోద్భవా!!
నిత్యానపాయని--శ్రీ మహాలక్ష్మి .అయ్యవారిని విడిచి ఒకక్షణకాలము కూడా వుండరు. ప్రతిక్షణము స్వామి వారి సేవలో తరిస్తారు.
పఱ--వైకుంఠం
మిష--వంక,సాకు
సమయుట--నశించి పోవు,తొలగిపోవుట
త్వర--తొందర
జిహ్వ
--నాలుక
నిరవధిక-అడ్డులేక
రచన:శ్రీ కృష్ణ మాధవి
18-12--2019
7.30p.m

తిరుప్పావై--27
పల్లవి: ఓ.....దివ్యగుణప్రకాశా........దేదీప్యమానా......దివ్యజ్యోతిస్వరూపా......జయము..జయము....కృష్ణా......!!ఓ..దివ్యగుణప్రకాశా!!
అనుపల్లవి: నీదరి చేరిన దీ సుదినముననే.....సుదర్శనచక్రధరా...........కృష్ణా.....!!ఓ...దివ్యగుణప్రకాశా!!
చరణం:- భువిదివి యాయె....వైకుంఠధామమాయె....ఆనందనందనుని ...గూడి....ఙ్ఞాన భక్తి ప్రేమామృతములే....పొంగిపొరలే........ప్రపన్నులకి!!2!! చేకూరే...ప్రసన్నతా........కృష్ణా......!!ఓ...దివ్యగుణప్రకాశా!!
చరణం: అలంకారములకే.....అలంకారములు
సర్వాభరణములు వచ్చిచేరెను నీ సాంగత్యమున కృష్ణా......క్షీరఘృతముల మృష్టాన్నమే మోచేతులజారే......
నినుకూడిచేయు విందు పసందుగాగా ...నీమేని స్పర్శ యే.....కృష్ణా...కృష్ణా నందముచేకూర్చే..........కృష్ణా....!!ఓ..దివ్యగుణప్రకాశా!!
రచన: శ్రీకృష్ణ మాధవి
17--12--2019
7.30p.m

తిరుప్పావై-23
పల్లవి:-ఓ....అప్రమేయ.....శౌరీ.....సింగమా.....వెడలిరావయ్యా........ఠీవియంతయు మా కనులు చూచునటులా..!!ఓ!!
అనుపల్లవి:- ఉదారస్వభావా...వేంచేయుము...సభాస్థలికి......ఆసనమే వేచివున్నదీ........!!ఓ!!
చరణం:అతులిత సౌందర్య..సౌకుమార్య.........వీర..ధీర...గంభీర....కృపారసా.......ఆజానుబాహు......సుందర వదనా...సూర్యచంద్రనేత్రా.......విందుచేయుము....మనసులకు...ఈ అతివలకు...నిరంతర నీనామగాన ప్రియులకు ......నీగుణవిశేష పరవశులకు....!!ఓ!!
చరణం:-గోపబాలికలారా! అమాయక వర్తనులారా.....వేణువులబోలు హృదయకమల విలసితులారా......తుషార సమయమున వెరవక...శ్రమంబడితిరా.....మీమనోరధములెల్ల
నీడేర్తును....విరిబోణులారా...పరాకున..ఆలసించితినని అలుకవలదు......వలదు...........
శరణు శరణు కృష్ణా...........శరణు శరణు కృష్ణా.....
రచన:-శ్రీ కృష్ణ మాధవి
16-12-2019
5.30p.m

తిరుప్పావై-18
పల్లవి: నందగోపుని కోడలా.......జనని నీలమ్మా........మేలుకో...దేవీ....మేలుకో...!!నందగోపుని!!
అనుపల్లవి: అపురూప లావణ్య.....పురుషకారిణీ .......దర్శనమే ...మార్గదర్శనమే...చేయుమమ్మా......!!నందగోపుని!!
చరణం: సుగంధపరిమళ భూయిష్ఠా.......కృష్ణ ప్రియా......మాధవీలత ల కోయిలలు...పాడుచున్నవి....పుంజులన్నియుగుంపులుగ కూడి పలుకుతున్నవి కృష్ణ కృష్ణాయని.......శ్రీకృష్ణ పరవశ మేలుకొనుమా.......!!నందగోపుని!!
చరణం: శ్రీ యుతా........గాజుల గలగల...లా...అందెల...రవళులా.....ఘల్లుమను గజ్జెలు మ్రోగుచు కదలి రావమ్మా......నునులేత చేతులకృష్ణశయన మందిరమే...తెరువమ్మా..........నీలాసుందరి..........!!నందగోపుని!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
14-12--2019
రచనాసమయం: 1.30p.m

తిరుప్పావై--16
పల్లవి: ఓ.....ఓ.....భవనపాలకా....ద్వారపాలకా....గడియతీయగ రాదా....ఓ.....ఓ.....!!భవన!!
అనుపల్లవి: తిరుమంత్ర రక్షకా......ఆచార్యవర్యా...........ఘడియసేపైన జాగుసేయక...తీయగరాదా...ద్వారబంధమ్ములు...!!ఓ...ఓ..!!
చరణం: త్రేతాయుగ రక్కసులము గాము....కంసుడంపిన వారము గాము.......!!2!! గొల్ల పడుచులమే మేము....
డొల్లతన ఆభరణమే మాసొత్తు......నీలనీరదుని శయనసౌందర్యకాంక్షయే మాకు....కాంచవేల మా స్థితి.....!!ఓ..
ఓ....భవన!!
చరణం: ఙ్ఞాననిధీ....వజ్రంపు ద్వారమే తెరువు తెఱువరీ......!!2!
ఆర్తిగనలేవా....మా ఆర్తిగనలేవా....ఆచార్య నందగోపా.....!!2!!
నిరపేక్షులకుస్వాగతమనియే నందగోపుడూ.......!!2!!
!!ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవోభవా.................నమోస్తు ..నమోస్తు....నమోస్తు!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
13-12--2019
రచనాసమయం:3.45p.m
గమనిక: 1నుండి5 పాశురములు కాత్యాయని వ్రతము మరియు వ్రతనియమాలు, వ్రతము రచించుటకు వలయునవి తెలుసుకున్నాను.
6వ పాశురములు నుండి 15వ.పాశురముల వరకు 10మంది ఆళ్వరునాయికలను 5లక్షల మంది గోపికలతో కలసి మేల్కొలిపినాము.
16వ.పాశురము శ్రీ కృష్ణుని భవనానికి ద్వారమునకు కావలి కాచిన ఆచార్యులు తిరుమంత్ర రక్షకులు అయిన నందగోపులకు భవనద్వారములు తెరవమని ప్రార్ధించి ద్వారములు తెరిచిన పిమ్మట దయామయులైన ఆచార్యులని కీర్తిస్తూ భవనప్రవేశము చేసినారు శ్రీ ఆండాళ్ళు తల్లి గోపికలు.
ఇది ఈరోజు విశేషము.
!!శ్రీ మన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీ మతే నారాయణాయ నమః!!
!! అన్యధా శరణం నాస్తి అనన్య శరణం నాస్తి!!


తిరుప్పావై--13
పల్లవి: ఓ......ఆశ్రిత ప్రేమికా.......లే చిగురు లేమా..........మేలుకో....మేలుకో......!!ఓ..ఆశ్రిత!!
అనుపల్లవి: భగవదనుభవ ఐశ్వర్య దాయిని......మేలుకో...మేలుకోవమ్మా.....మేలుకో..!!ఓ..ఆశ్రిత!!
చరణం : పక్షిరక్కసుని చీల్చి న దిటవైన వానిని కీర్తించెసమయమాయే....రావేమి....!!2!!
సంపూర్ణ వికసిత ఙ్ఞాన కమలా......నీస్నేహమే కోరుచుంటిమి
కోమలాంగి.....నిదుర లేవమ్మా ......నిర్మలాంతఃకరణీ....మేలుకో!!ఓ...ఆశ్రిత!!
చరణం: నల్లని తుమ్మెదల బోలు కనుదోయి కల భామా....దోషరహితుని దోషనాశకుని చేరుటకై గోపకులవృద్ధులే ఇచ్చిరనుమతి ....వజ్రకాంతుల ఙ్ఞానరాశి ..శుక్రుడుదయించే....మాయతనము వీడి మాయవిని చేరుదమే వే వేగముగా.....మేలుకో!ఓ...ఆశ్రిత!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
12-12--2019
రచనాసమయం: 3.30P.M


తిరుప్పావై--12
పల్లవి: మేలుకో చెలి....మేలుకో చెలీ.........భాగవత సేవా పరాయణి.....మేలుకోవమ్మా....మేలుకో చెలీ...!!మేలుకో!!
అనుపల్లవి: శ్రీ దామసహోదరీ.......క్షణమైన వీడక కృష్ణ సాన్నిధ్యమే భాగ్యమని తలుచు అన్నకు ప్రియమైనచెల్లి మేలుకో!! మేలుకో!!
చరణం: ఙ్ఞాన దధి క్షీరములు పొంగి పొరలెనే....ఇచట.....బురదమయమాయే....జారక నిలుచుటకే పట్టుగా నీ ద్వారబంధమే ఆలంబనముగా...పట్టినిలిచితిమి..
ఉపరితలమున....అపరిమిత మంచు ముంచుచున్నది ..జాలిగొని మాయందు లేచిరావమ్మా ....మేలుకోవమ్మా.....!!మేలుకో!!
చరణం: లంకేశుని ...నిర్మూలించిన వాని నామమే పాడుదుము.....జయ రామ..రామ యని.....పాడుకుందుమే!!2!! ఇది యంతయు నిదురయేనా.....ఇదియేమి వింతయే...లోకక్షేమమే..మనకు రక్షకాగా....నీ మై మరపు వీడి మేలుకోవమ్మా....!!మేలుకో!!
చరణం: తిరుమంత్రోపాసక నీవే రావలయునమ్మా !!2!! ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమోనారాయణ యని జపియించు జవరాల కాంచవేమి మము.....స్ఫటికతుల్యమే నీమనసని నమ్మి వచ్చితిమి.....!!మేలుకో!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
11--12--2019
రచనాసమయం: 8.15P.M


తిరుప్పావై --9
పల్లవి : శ్రీ కృష్ణా నురక్తిన రంజిల్లు మణిదీపికా............మేల్కాంచవమ్మా.....మేల్కాంచవమ్మా. ..!!శ్రీ కృష్ణా! !
అనుపల్లవి : మణి భవనమునా ......భక్తి మణిసౌందర్యా.....నిదురేలనే..
మేల్కాంచవమ్మా! !శ్రీ కృష్ణా! !
చరణం : ఏకాంతమందిరమున...కాంతునియందే..నిలచి..మముకాంచవేలా.........!!2!!
గడుసరి.....బహుసొగసరీ...మాయలేల..తడబాటు
ఏలనమ్మా. .మోమాటమా..మాముందు నీవుండి దారి చూపుమా...మణిమంజరీ....నీవెలుగులన్నీ తెలిసినవి మాకు మారాడక రావమ్మా! !శ్రీ కృష్ణా! !
చరణం : బధిరత్వము ఏల?మూగతనము ఏల?
ఈ నటనలన్ని ఎవరి కొరకో....!!2!!
కోరివచ్చి నిలచితిమి నీకై మాయావి మాధవుని నామమ్ము కీర్తించి స్మరియించి స్వామి తోడిబంధమే పంచుకొందమందరము మమతయే వెల్లువెత్త లేవమ్మా రావమ్మా! !శ్రీ కృష్ణా! !
శ్రీ హరీ శ్రీ హరీ జయ జయ జయ శ్రీ హరీ శ్రీ హరీ
రచన : శ్రీ కృష్ణ మాధవి
9-12-2019
రచనాసమయం : 9.30P.M

శుభమును పలుకవే శుభాంగి
శుభకరుని దరి చేరుదమే.........
మార్గళి వచ్చేనని మరువకే
మదనాపహారుని కడకేగుదమే.......!!శుభమును!!
నిదురలేవగనే పలకవే ముమ్మారు
హరి హరి హరి యని తరియింపగ
తరలిరమ్మని తరుణల పిలువగ
వేకువన నిదురలేవవే వనితామణి.....!!శుభమును!!
జలముల కోరవే జగన్నాథా యని
భక్తి ప్రేమల కు లోటేలేక కాచుకో
మని కోరవే కోమలాంగుల చేరికతో
చేరి చెంగలువరాయుడు మనవాడని....!!.శుభమును!!
రచన:శ్రీకృష్ణ మాధవి

పాలకడలి --54
పల్లవి: పాలకడలినా పుట్టిన మాలక్ష్మి .......తులసీ వనమునా గోదాగామారే...శ్రీ గోదా గా మారే!!పాలకడలినా!!
అనుపల్లవి: ఎంతటి పిల్లమ్మా......మరి ఎంతటి పిల్లమ్మా...శ్రీగోదా....శ్రీగోదా......!!పాలకడలినా!!
చరణం: పేరు మారినా... జన్మస్థలము మారినా...
మారనీ...మనసు తో తోడుగా తోయజాక్షునే కోరే
కోరి కోరి...తండ్రి అల్లిన తులసి మాల తాను ధరియించె......
తాను ధరియించె....నొచ్చుకొనే తండ్రి స్వామి కై అల్లిన మాలికనీ!!పాలకడలినా!!
చరణం: నవ్వుకొనే శ్రీరంగడు...విష్ణు చిత్తుచూచి...
స్వప్న మున కనిపించి, శ్రీగోదా మాలయే ప్రియమనీ ,...... తెలిపే
తనకు ప్రియమనీ తెలిపే ,....కనికరమున తెలియపరచె
దేవరహస్యమును ...దేవరహస్యమును!!పాలకడలినా!!
చరణం: గోదమ్మ పట్టే నోము సిరినోము..
శ్రీనోము.....అయిదులక్షల గోపికలకూడి చేసె నమ్మ వ్రతము
మంచుకురియు సమయమని వెరవక ఝడవక....
కష్టమనీ ఎంచక స్వామి సన్నిధికై చేసెనమ్మ వ్రతము!!పాలకడలినా!!
చరణం: భోగి రోజు నా సర్వాలంకార భూషితయై, మేళతాళముల నృత్య గీతముల బంగరు పల్లకినెక్కి ,
రంగని చేరి పరిణయమాడెను గోదమ్మ .....శ్రీ రంగనాయకియై
శ్రీ రంగ రంగ కళ్యాణ రంగ ఆనందతరంగా....వైభవంగా చేపట్టి నాచ్చియారును... మురిసి పోయెను .....మురిసి పోయెను.....మెరిసెను...సిరి శ్రీ గోదా తో శ్రీరంగనాధుడు!!
!! జయహో శ్రీరంగ నాయకి నాయకులకు జయహో!!
రచన:శ్రీకృష్ణ మాధవి
13--1--2020
రచనాసమయం:11.25A.M


అలక వీడెను గోదమ్మ అలక
వీడెనుగోదమ్మ కన్నని పై.........
అనురాగ వల్లరి శ్రీగోదా
ప్రేమస్వరూపిణి శ్రీగోదా ........!!అలకవీడెను!!
ఆకాశమంటి నుదురున
దిద్దెను తిలకము నిలువుగా
తిరుమణి చంద్రవంకలా ....
సొగసుకన్నులకాటుక పెట్టెను.......!!అలకవీడెను!!
దట్టమైన నల్లని కేశములు
నున్నగ దువ్వి కొప్పుముడిచి
మల్లెలుజాజులు మరువపు మాలలు
తురిమి అద్దమున తన మోము చూసి
మురిసి హంసనడకల రంగనిచేరెను......!!.అలకవీడెను!!
అమ్మమ్మా...మా గోదమ్మ...ఏమమ్మా
ఈవైభవము? చూడకన్నులు చాలవాయె
మనసు నిండే సంతసమున...నీదు
మార్గమే మాకు శరణము దీవించవమ్మా
మము దీవించవమ్మా మము దీవించవమ్మ......
రచన:శ్రీకృష్ణ మాధవి

కల్యాణ వైభవమే శ్రీగోదా
కల్యాణ వైభవమే శ్రీరంగని
కూడి అంగరంగవైభవమే
శ్రీగోదారంగనాధుల చూడ....!!..కల్యాణ!!
శ్రీవిల్లిన వెలసి వటపత్రశాయిని.......
వటపత్రశాయిని భక్తి ప్రేమల సేవించి.........
గెలిచినది వలపు సీమను ఈ కొమ్మ
స్వయముగ శ్రీరంగడే........చేపట్టిన....!!.కల్యాణ!!
చిత్రవీధుల జనములచిత్తములు.....
చిత్రమని విచిత్రమని నిలువడి........
కనులన్ని విప్పార్చి చూసు సమయాన
ఙ్ఞానఖని ఇందువదనమనగోదమ్మ
లీనమాయె రంగని యందు...............!!కల్యాణ!!
రచన:శ్రీకృష్ణ మాధవి

బంగారు బొమ్మ గోదమ్మ
చల్లనివెన్నెల వేదరాశీ బొమ్మ
విష్ణుచిత్తుని ముద్దుల పట్టి
విష్ణుదేవుని విడువనట్టిదీ.........!!బంగారు!!
పాలకడలిలో పవళించిన వాని
వలపు చేతల మాయచేసి భక్తి
వలపు చేతల మాయచేసినదో
గొల్ల గుంపులచూసి గుండెచెదిరెనో....!!.బంగరు!!
ముడిచివిడిచిన మాలల సొగసు
పరిమళముల మరవని స్వామి
అక్కునచేర్చి పరిణయమాడే
శ్రీరంగ రంగనాయకి పరిణయ
వైభవమే లోకాలకే పండుగ.గా..........!!బంగరు!!
రచన:శ్రీకృష్ణ మాధవి

తాకి తాకి కూర్చుని తాగుదామ పాయసం
కృష్ణ నామ రసమనే పాయసమే తాగుదాము
సఖులారా.....చెలులార చవులూరు పాయసమే.....
ఇది చవులూరు కృష్ణ భక్తి ఙ్ఞాన క్షీర పాయసమే.....!!తాకి తాకి!!
అఙ్ఞానపు చీకటులను భోగిమంటలవేసి.........
ఙ్ఞానపు జ్యోతులను వెలిగించి...........
ఆ వెలుగుల న అందరము కూడి
ఆనందలహరిన హరిహరి.యని.....!!తాకి తాకి!!
కర్ణాభరణముల జిగజిగ జిలుగుల
కాలియందియల ఘల్ ఘల్ రవముల
థళథళ కొంగొత్త మెరుపుల చీరలా......
కృష్ణానందమె పొంగగా కృష్ణ ఝురుల తేలగ......!!తాకి తాకి!!
రచన:శ్రీకృష్ణ మాధవి

మాలికల పూమాలికల లలిత
లలిత పరవశ పురుషోత్తమ.......
మణుల ఇంద్రనీలమణుల వర్ణతేజుడా
నీరాడ జాగేల రా రా..రా ...నీలిమేఘా.!!2!!.....!!మాలికల !!
తెల్లని శంఖముల వినసొంపు ధ్వనుల
పఱ నిత్తువని.........పఱనిత్తువని....
పరుగున వచ్చి ఇచ్చేటి హారతులు..
..గైకొనుమా మా.....హారతులు
కుంభ హారతులు ..నక్షత్రహారతులు........!!మాలికల!!
రారా కృష్ణ రారా కృష్ణ నీకొరకే వేచేము
రారా కృష్ణ రాధా మనోహర ముద్దుకృష్ణ
రారా కృష్ణ రుక్మిణి ప్రాణవల్లభ తులసిప్రియ
రారా కృష్ణ ఎల్లరి హృదుల సందడి చేయుచు....!!మాలికల!!
రచన:శ్రీకృష్ణ మాధవి

నీపాదసేవ కోరిన అబలలము
ఆర్తితో వేచినామిచట దామోదరా.......!!నీపాదసేవ!!
క్షీరమడుగులే పొరలగా......గో
క్షీరమడుగులే పొరలగా ఙ్ఞాన
క్షీరమడుగులే పొరలగా నంద
నందనా............నంద కిశోర .......!!నీపాదసేవ!!
వేదవేద్యా....వేకువయాయే
వేదనతీర్చుము వరదరాజా
పఱ కొఱకు త్వరయే పరమ
పురుషా.....దారలమని ఉదా
రతన మేల్కొనుమా గోవర్ధన.........!!నీపాదసేవ!!
ఆశ్రితమందార ఆదరముతో....
ఆర్తిగని మాఎల్లరిఆర్తిగనిన ......
మెలమెల్లనతెఱచునీనేత్ర
సౌందర్యమేకాంచమా మాధవా......
కల్యాణగుణశాలికమలాపతీ....!!నీపాదసేవ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
5--1--2021

రంగ రంగా.....నిను తలచి మము మేము మరచి
నీ తలపులనే మదిలోన నిలిపి నిను మాలోన
ఎదుట ...ఇచట..అచట...అంతట...చూడ.....
దర్శనమే ఈయవయ్యా......నిగమాంతరంగ ......!!రంగ!!
అభిమానమునా....నీయందభిమానమున
తరలి వచ్చితిమే.....నెరపుమా నీచూపుమాపై
కరిగించుమా ఇహలోకపు వ్యధలను రంగా
వినిపింపుమా నీ మృదుపదరవళులను శ్రీరంగా....!!రంగ!!
నినుకనుగొన మా ఆశలను నెరవేర్చుమా...
జన్మజన్మల బంధములను సడలింపుమా
తెరువుమా మోక్షద్వారములను క్షీరసాగర
నిలయా మా శ్రీవ్రతము ఫలియింపగ శ్రీ రంగా....!!రంగ!!
రచన:శ్రీకృష్ణ మాధవి

ఏఱులై పొరలు పాలుమీగడల......
నీ అడుగులు జూడముచ్చటకాగా.......
పిలుచుచున్నాము ఆర్తి తోడ రావయ్యా
నిదురవీడి వేదవేదాంగ వేదనారాయణా.....!!.ఏఱులై!!
హరి నారాయణ హరిప్రియులమని
మాలోన నెలకొన్న అరులభంజింప
వేవేగ లేచి రావయ్య ఆశ్రితపాలిత
నీపదపంకజముల ఆశకలిగి వేడగ...........!!ఏఱులై!!
పద్మములు పారిజాతములు మల్లియలు
తులసిమాలలు గైకొని కొలువుసేయు ఆశన
వేచివున్నామయ్య నీ గడపన మేలుకొనవయ్య
ఇకనైన .....మాకనుల అశ్రుధారలు కనుగొని లేవయ్యా...!!.ఏఱులై!!
రచన:శ్రీకృష్ణ మాధవి

అరివీర హరి......హరీ....
అగణిత గుణశాలి శౌరీ...........!!.అరివీర!!
వెన్నుదన్నుగ నిల్చువెన్నుడా
అడిగియుఅడగకనే ............!!2!!
దివిలోని వేల్పులకు వేల్పుడవే
నారాయణా.........కినుకేలమాపై.......!!అరివీర!!
పరిపూరిత కమలముఖీ శ్రీ రమా
ఒసగుమా వరములనే రమాపతి
చేరి చేరికతోఓరిమితో ఓరగ చూచి
సరసముతో కూడు సిరిమాలచ్చినీవే.......!!అరివీర!!
హరివాత్సల్య జలముల జలకము
లాడ ఇచ్ఛయే తీర్చగా తీరువుగ
రారే రమ్యమనోహర తమకములే
సమయగా మాతమకమే సమయ.......!.!అరివీర!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
4-1-2021

ముక్కోటిదేవతలు వేచిచూసేరు
అలరి నీ పాద సేవకై వేచి చూసేరు
అమరగణముల ఆర్తి బాపు వేంకటేశా
వేడెదరు అనుక్షణము నిను వీడక
చరణం: దర్పమెరుగక దర్పణమీయవే
వేసటదీర్చు వీవెననీయవే నినుచూచి.........
నినుచూచి మాటాడి మా బెంగ తీరగ
నిను కలయు క్షణము నీయవే............!!ముక్కోటి!!
వీరాధి వీరుడు.....ఇభబలవీరుని
నిదురలేపవే అమ్మా నీలమ్మా......
ఇరువురి నడకల సొబగుల చూసి
మా కనులు తరియింప జనరే..........!!ముక్కోటి!!
రచన: శ్రీకృష్ణ మాధవి

పూలబంతులయాటలాడు
పూబోణి నందగోపకోడలా.....!!పూలబంతుల!!
తొలిఝాముకోడి కూతలేనెరపే
కోయిలజంటలు ఋతుగానమే
చేసే సౌగంధిక కేశపాశిని కేశవుని
వీడి ద్వారబంధమే తెరవవమ్మా......!!పూలబంతుల!!
కంకణములఖణఖణల
చేకంకణములఖణఖణలా
ఒంపుసొంపులనడకలతో
ద్వారబంధమేతెరువరావమ్మా .....!!పూలబంతుల!!
నినుచేరినవారిని అక్కున
చేకొన గ్రక్కునరావే మాఅమ్మ
ఓనీలమ్మ ఘనకాంచనరూప
సౌందర్యరాశీభూతరావమ్మా.....
ద్వారబంధమేతెరువరావమ్మా ........!!పూలబంతుల!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
2--1--2021

శయనించిన స్వామి చక్కనిమా స్వామి
ఆ నీలవేణిని మెత్తని శయ్యగ తలచి
శయనించిన స్వామి చక్కని మా స్వామి
ఓపలేక క్షణమాత్రపు విరహము ఒద్దిక తోడ .....!!.శయనించిన!!
మణిదీపముల పందిరిమంచముపై
వెచ్చగా నులివెచ్చగ శయనించినావా
మంచు న వుండి ఒణుకుతో వుంటిమి
చూడకున్నావేమి మా ఒంటి బాధని .....!!శయనించిన!!
మము కలుపుకొనవే .....తగదే కపటము
తాపమోర్వలేకున్నాము జాగు సేయకే......
జిగిబిగి సొగసుల కాటుక కనులదాన
బంధమేసడలించు శయన సుందరి......!!.శయనించిన!!
రచన:శ్రీకృష్ణ మాధవి

గడియ తెరవ జాగుయేల
గట్టితనము వీడుమోయి
గొల్లవాడా మామంచి వాడా......!!గడియ!!
నీలమణి రాశికై వేచినాము !!2!!
పఱ ఇచ్చు వానికై వేచినాము
ఇచ్చినమాట తప్పనే తప్పడు
యాదవవీరుడు.. ...నల్లకలువకై .......!!గడియ!!
ఘఢియ ఘఢియ జరుగుచుండె
జాగుసేయకోయి గడియతెరవవో
మారుమాట వలదోయి గొల్ల వాడా
వేచివుంటిమి నీలమేఘునికై.....!!గడియ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
31--12--2020
గొల్ల:ద్వారపాలకుడు (ఇది ఒక అర్ధం వున్నది)
నీలమణిరాశి:శ్రీకృష్ణుడనే భావన
నల్లకలువ :శ్రీ కృష్ణుడనే భావన

అంబరమంట ఆనందము మా ఆనందము
నందగోపకుమారా.....నిదురలేవయ్యా.......
వ్రేపల్లె వాడల తిరిగి అలసిన నిదురవీడి
నీకొరకే కాచుకొను కొమ్మల వినతి వినవయ్యా
అవధులెరుగని అనంత పద్మనాభుడ...........!!.అంబరమంట!!
భువనభాండములాక్రమించిన భువనమోహనా.....
నీభవనద్వారము తెరిపించి మము బ్రోవరా....
నీమోము చూపరా యశోద తనయుడా........
రామకృష్ణులు నిదురలేచి మము చూడరా............!!అంబరమంట!!
సంబరముగా అంబరములు ధరియించి
మేము నీకొరకే వత్తుమురా కేశి నారి హరి
నిదురమేల్కొనరా.......రాసవిహారీ........
రాకేందు వదనలందరు కూడితిరి నీ....కై......!!అంబరమంట!!
రచన: శ్రీకృష్ణ మాధవి

చిలుక చిలుకని రవ్వ చేతురే ......
ముత్యాలముగ్గులనా బొమ్మలే
చేరిరా.........అందాలబొమ్మలందరు
చేరిరా........................................!!చిలుక!!
చేరి చేరి కూడి కూడి ఆడి పాడి
అలరింతుమే నందనందనుని
ఆ....నందకిశోరుని.............
మనసులుప్పొంగ ముదము నా.....!!చిలుక!!
కువలయాసురమర్ధనుని మదన
మోహనుని..మోహకాంక్షలు విడచి
విందుగా పసందుగా కనువిందుగ
వినసొంపుగా.....గానమే చేతుమే.....
చేతుమేవ్రతము శ్రీ వ్రతయుక్తలారా......!!చిలుక!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
30--12--2020

కాపుకాసే నందగోపుడా....కాపు కాసే నందగోపుడా
ఏమరుపాటు అసలే లేక కాపుగాసే నందగోపుడా....
మా మొరవిని తలుపులు తెరువమోయీ..............
నవరత్నములు తాపిన గడియలు తెరువమోయి.....!!కాపుకాసే!!
అన్నెపున్నెమెరుగని గొల్లవారిమని ఆదరించి
తలుపు తెరచి గోవర్ధనుని గోవిందుని చూపవే
పఱకోసమే పఱ కోసమే వచ్చి నిలిచినామిచట
ఇత్తునని చెప్పినాడని వచ్చి నిలిచినామిచట......!!..కాపుకాసే!!
అన్యకోరికలేమి కోరక అన్యధ్యాసలపోవక
గోవిందునామ ధ్యానమున స్తుతిచేసెడివారిమే
అడ్డుకోవలదయ్యా....ఆడుకోవలదయ్యా.......
తలుపుతీసి మా నోము పండించవయ్యా..........!!కాపుకాసే!!
రచన:శ్రీకృష్ణ మాధవి

చిలుక పలుకుల కలికి
కనుదోయి తెరవవేలనే....!!చిలుక!!
బాసమరచిన బాల వెరవు లేదే
తొలుత వత్తునని మరపేలనే....
నిదురపోయె కలువబాలలు
నిదురలేచే కమలభామినులు
చూపు నెరపవేలనే...చంచితా......!!చిలుక!!
స్వరమాధురీ వీణియ స్వరమున
గానాలాపనల పద్మాక్షునర్పింపవే
మధుర గానమునమాధవుకొలవా
మైమరచి మాధవుడే వేంచేయ
చేతుము వ్రతము శ్రీవ్రతము............!!చిలుక!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
29--12--2020

గోసంపన్న...గోపవనితా
గోపాలప్రియ నిదురలేవే....!!గోసంపన్న!!
రావణభంజకుని కొలువా
నామదీపమే మదినిడుకొని
చెలిమికోరి చేతుమే శ్రీ వ్రతము
వేగమే మేలుకొనవే మనోహరి.....!!గోసంపన్న!!
వాడవాడల జనులు కోరి
చేతురమ్మ ఈ వ్రతము...
మేలుకోరి జగముల మేలుకై
నిబద్ధత నా సన్నద్ధతౌ..కృష్ణా
ను రక్తిన కృష్ణ గానమున
చేతుము శ్రీ వ్రతము రావమ్మా
...........!!గోసంపన్న!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
25--12--202

క్షీరము పొంగి పొరల గోవత్సములు కల
సోదరుని తోబుట్టువా......మేల్కాంచవే.....
క్షీరవాహినిన నుంచుని మింటన మంచు
ముంచగ నిలిచినామమ్మ నీ...వాకిట రావే.....!!క్షీరము!!
వారధిగట్టి దశశిరసుని పరిమార్చిన వాని....
నామసంకీర్తనము సేతుమే.....చెలీ..........
పంచమస్వరమున పాడుటకు చేరవే..
మము చేరవే మా కీ వరమీయవే గోపికా....!!.క్షీరము!!
నీలోన నీవు పాడుకొనిన చాలదు
మము చేరి కలపవే నీ స్వరము
పొందుదమందరము శ్రీకృష్ణుని
మేల్కొనవే తొగరుపలుకులదానా.....!!.క్షీరము!!
తొగరుపలుకులు:చిలుకపలుకులు
రచన:శ్రీకృష్ణ మాధవి


పుట్టలో చుట్టుకున్న నాగుపాము చుట్టు కుదురుల కుముదా
లేచిరావమ్మా......మేఘశ్యాముని కలవ కలలన్నీ తీరా......
తీరైన తీవవు తీరుగా రావమ్మా మాధవసేవల మనసవ్వగా
లేచిరావమ్మా.......లలనా.....నవనీత హృదయుని కై రావమ్మా....!!పుట్టల!!
ఆలమందల ఆటలాడు గోపబాలుడనీ.....
గోపాల బాలుడని భామవే గొల్లభామవే
గుండెలయలు తప్పుచున్నవి రావేమని
మాహృదయలయలు నిలపగ లేచిరావమ్మా...!!.పుట్టలో!!
ఉలుకుపలుకులే లేక ఉలుకు పలుకులే లేక
ఊరకుంటివేలనమ్మా......?.....వివరమేమొ...
మాకేల.... ?నీ రాకయే మాదు భాగ్యమని........
వేచివుంటిమిచట రాక తప్పదు నీకు ఓ తన్వితా....!!.పుట్టలో!!
తన్విత:చూచుటకు అందముగా అగుపించునది
రచన:శ్రీకృష్ణ మాధవి.


వారణమాయిరమ్ --1
పల్లవి: ఓచెలీ.....ప్రియచెలీ.....నా..నెచ్చెలి......కలగంటినే
నే కలగంటినే......!!ఓచెలీ!!
అనుపల్లవి: కనివిని ఎరుగని కలయే......ఇది నిజమే చెలీ.......కలగంటినే...!!ఓచెలీ!!
చరణం: నల్లని వాడే...సోగ కనులవాడే
సొగసు మీఱ తిరిగే.....నగరమంతటా
మన నగరమంతటా.....వేయి ఏనుగులతో
పూర్ణ కుంభములతో.....నగరమంతటా
ఊరేగెనే....ఊరేగెనే.....నీలమేఘమావరించినటులా !!ఓచెలీ!!
చరణం: దీపకాంతుల నక్షత్ర కాంతుల మెరిసే
రంగవల్లికలు రమ్యముగా తీర్చిరే...మేలు
వర్ణపు మేలైన విరులు తోరణాలు కట్టిరే......
శిఖఫింఛము మెరయగ పీతాంబరధారుడై
ఊరేగెనే...ఊరేగెనే....ఘననీలమేఘుడై....!!ఓచెలీ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
9--2--2020.....4.P.M 

వారణమాయిరమ్--7

పల్లవి:వేదపురుషుడే.....కనిపించెనే.........చెలీ...!!2!!
అనుపల్లవి:వేదసాగరమే....అనిపించెనే......చెలీ..!!2!!
చరణం:వేదమంత్ర పఠనమే ....చేసిరే....కంచుకంఠముల
.వేదపండితులు--వేదపురుషునెదురుగా!!2!!
శుభసమయమిదే ఇదే చెలీ....!! వేద!!
చరణం: హోమమే ఉవ్వెత్తుగ ఎగయా...చిటికెన వేలందుకొని
హోమప్రదక్షిణ సలిపితిమే......!!2!!
నారాయణ నారాయణ యనుచూ అగ్నినారాయణ సేవించితిమే!!2!! వేద!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
16--2--2020 ...... 11.45!AM

తిరుప్పల్లాండు--2

పల్లవి: కృష్ణా..నీచరణ దాసులం
శరణు శరణు శరణు శరణు కృష్ణా!!
అనుపల్లవి: కనలేని ఆత్మానుబంధమే మనది
నిలవాలీ....కలకాలము..!!..కృష్ణా.....నీ!!
చరణం: అమిత కరుణ తో హృదయ దేవేరి తో
దిగి వచ్చిన దివ్య తేజా........శుభములుబడయు
అన్యుల చూపుల పడక అనుగ్రహించుమా
తేజోశాలికీ శౌరికిదే మంగళం జయమంగళమ్!!కృష్ణా...నీ!!
చరణం:కోటిసూర్యప్రభల వెలుగొందు చక్రధారీ
సుదర్శన చక్రధారీ....శతృ భీతీకర ఘోషలు
మారుమోగంగ పూరించు పాంచజన్య ధారీ
శ్రీయుత శుభకరా శ్రీ రంగనాధా మంగళం జయమంగళమ్!!కృష్ణా..నీ!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
20--1--2020
ర.స:5A.M

తిరుప్పల్లాండు--4
పల్లవి: శ్రీవైష్ణవ కూటమికి ఎల్ల ...వైష్ణవులు రారండీ......
వేవేగమే రారండీ........!!శ్రీవైష్ణవ!!
అనుపల్లవి:మనసున విష్ణు నే నిలిపి శరణనుచూ........తరలి రారండీ.....!!శ్రీవైష్ణవ!!
చరణం:వీధి వీధుల వాడ వాడల నాడు నాడులా.......
శ్రీహరి కీర్తనలే మారు మ్రోగా........గళములన్ని ఏక గళమె కాగా..........కీర్తించి నర్తనమే నయనానందము కలగ..
చే..య........!!శ్రీవైష్ణవ!!
చరణం: గరుడుని పై అరుదెంచె ఇలకు .....
సకల పరివారముతో.డి ........అలవైకుంఠనాధుడే ..!!2!!
వర్ధిల్లు వర్ధిల్లు వేనవేల యుగములు మంగళ రూపా...!!2!!
నీరాజనమిదె గైకొనుమా.......సదా.....!!శ్రీవైష్ణవ!!
రచన:శ్రీకృష్ణ మాధవి
22--1--2020
10 A.M

తిరుప్పల్లాండు--7
పల్లవి: శంఖుచక్రముద్రాంకితులారా......శ్రీ వైష్ణవులారా....స్వామి వారికీ .. హారతులిడ రారండీ!!శంఖు!!
అనుపల్లవి: శ్రీ మన్నారాయణ తేజములకు మంగళ మని పాడ!!శంఖు!!
చరణం:కోటిసూర్యప్రభల శోభిల్లు నారాయణా
సుదర్శన శంఖు చక్రధారీ...సుదర్శన రూపా....!!2!!
సన్మంగళాకారా నీకివే మా మంగళ హారతులు !!శంఖు!!
చరణం: దివ్యాయుధముల వేనభుజముల సవ్యసాచీ
బాణుని బట్టి న కళ్యాణకారకా...నీలోత్పలా...నీరాజనమిదె
మా ఘన నీరాజనమిదె అందుకొనుమా మంగళ హారతులు!!శంఖు!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
25--1--2020
10.30AM

తిరుప్పల్లాండు--9
పల్లవి: పీతాంబరధారి-పరమపావనా....శ్రవణోద్భవా
భవసాగర నివారా.....శ్రీ హరీ....హారతిదే....ముత్యాల హారతిదే గైకొనుమా...........!!పీతాంబరధారి!!
అనుపల్లవి:జగములన్ని ఏలేటి స్వామి భక్తి చిత్తముల ఇచ్చేటి
ఇంపైన హారతిదే గైకొనుమా.......!!పీతాంబరధారి!!
చరణం: అనన్తవైభవా-ఆనతినీయుమా..నీఆనతి కై వేచామిచట......ఆనతులౌదాల్చి సేవలెన్నొ చేసేము
రంగరంగ శ్రీ,రంగ జివ్వాది గంధములె సొగసు గా పూసేము
సమ్మోహనాకార అందుకో మంగళ హారతులు !!పీతాంబరధారి!!
చరణం: నీ తులసిమాలలే హరియించు మా మనసు
నీ శేషవస్త్రమనిన మహాపెన్నిధే నీపాదపద్మముల పూలు
శిరోధార్యములు మాకు మా కులదైవమనెంచి ఇచ్చుహారతులు
మంగళ హారతులు గైకొనుమా గోవిందా...!!పీతాంబరధారి!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
27--1--2020