స్వాగతం సుస్వాగతం
హరి హృదయ వాసినికి స్వాగతం
క్షీరసముద్భవికి స్వాగతం
పంకజ వాసినికి స్వాగతం
చల్లనిచూపుల తల్లి - చంద్ర సహోదరికి స్వాగతం
కొరినకోర్కెలు తీర్చే - కనకమహలక్ష్మికి స్వాగతం
సౌభాగ్యముల నొసగే - శ్రావణలక్ష్మికి స్వాగతం
వరముల నొసగే - వరలక్ష్మికి స్వాగతం
అష్టైశ్వర్యాల నొసగే - అష్టలక్ష్మికి స్వాగతం
సిరిసంపదల నొసగే - శ్రీమహాలక్ష్మికి స్వాగతం
త్రిజగన్మాత--79
పల్లవి: త్రిజగన్మాతా.......వందనము
శాంతరూపిణి .....వందనము.....అభివందనం !!త్రిజగన్మాతా!!
అనుపల్లవి:దయగల అమ్మవు....దాక్షాయణీ.....
వీరరసరూపిణి ....భద్రకాళి వీ..
వందనము.....అభివందనం!!త్రిజగన్మాతా!!
చరణం: యుగమేదైనా దుష్టసంహారిణివే..
దుష్టమనముల.....దహనకారిణీ....అమ్మా
శాంత చిత్తుల......శాంతి దేవతవే......
వనముల నెలకొన్న....వనదేవతవే...
పొలములందూ..సస్యరూపిణీ.......అమ్మా.....!!త్రిజగన్మాతా!!
చరణం: వాక్కునందునా...వాగ్దేవీ.....శారదా...
గృహములందునా......గృహలక్ష్మి వే.............
బిడ్డ లచూసి మురిసే.....శ్రీ మాతవే
సౌభాగ్యలక్ష్మివై....నిత్యము సత్యమై వర్ధిల్లవమ్మా.....అమ్మా!!త్రిజగన్మాతా!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
7--3--2020
శోభాయమానముగ రావే....
శుభములిడగ రావే........
శుభకర శ్రీకరముగ రావే.....
శుభకృత్యములే నృత్యముచేయగా...!!శోభాయమానముగ!!
హరితవర్ణ తరు కలాపముల
శుకపిక స్వర సల్లాపముల....
మాకందమానంద
రవళుల....రావే వసంతయామినీ...కొంగ్రొత్తయాశల....!!శోభాయమానముగ !!
వలపు తలపు ల లేతగాలుల
ఒయ్యారి వసంతమా...రావే...
వేయికన్నుల వేచి చూడగ......
ఈయవే వేవేల శుభములు ...!!శోభాయమానముగ!!
రచన: శ్రీకృష్ణ మాధవి
దేశభాషలందు--73
పల్లవి:దేశ భాషలందు తెలుగు లెస్సనియే....
శ్రీ కృష్ణ దేవరాయా......!!దేశ!!
అనుపల్లవి: మధురమీ భాషయనీ మధూపధారలే
అక్షరక్రమమనీ......తెలియచేసే.....!!దేశభాషలందు!!
చరణం: త్యాగరాజ కీర్తనలా...కీర్తింపబడిన భాష
పద్యప్రాభవమున------ ప్రవహించెనే మన భాషా.....!.!2!!
విశ్వనాధ కలమునా...కల్పవృక్షమాయెనీ భాషా....
జాషువా వర్యుల మనమున పరువులే పెట్టెనీ భాషా...!!దేశభాషలందు!!
చరణం: ఎందరో కవులు-- సొగసులే దిద్దిరీభాషకీ
గాయనీగాయకుల గళముల జాలువారు భాషా....
సులభమైనదీ.....సుందరతరళమైనదీ.. భాషా....
అమ్మ లా కరిగిపోవు భాషా....మరువవద్దు...వదలవద్దు.మనభాషనీ.....!!దేశభాషలందు!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
21-2-2020
చూడుమయా శ్రీ నారసింహా
దయచూడుమయా...చల్లని
చూపులమందహాసమున పరి
పాలించగ మము నారసింహా...!!.చూడుమయా!!
ప్రీతిగ చేసితి పానకము నేరము
లెంచక గ్రోలవయ !!2!!
మల్లియ మాలికల అర్చనచేతును
అరమరికలు విడచి ఆదరించుమయ
శ్రీ నారసింహా.........!!చూడుమయా!!
నారికేళ కదళి బదరీ ఫలములు
వేచెనయా నీ ఉదరసేవకై గొనుమా
మము గనుమా వేదనారసింహా....
యోగనారశింహా ప్రసన్నవదనా.....!!చూడుమయా!!
రచన:శ్రీకృష్ణ మాధవి
18--2--2022
వింధ్యాచలవిరాజిత వారిజాసన
సౌదామిని సౌమ్యరూప శ్రీప్రదా నమోస్తుతే...!!..వింధ్యాచలవిరాజిత!!
చిత్రగంధ చిత్రాంబరమాలిక.
చిత్రమాల్యవిభూషిత నమోస్తుతే...!!వింధ్యాచలవిరాజిత!!
చతుర్వర్గ ఫలదాయినీ
చతురాసన సర్వశాస్త్ర
రూపిణి చంద్రలేఖ విభూషిత
కుందహాస సౌజన్యా నమోస్తుతే...!!వింధ్యాచలవిరాజిత!!
మహావిద్యప్రదాయ ముఖే
ముఖే విస్తార యోగినీ యోగ
కారకాయ శ్రీ వైష్ణవీ నమోస్తుతే
శ్రీ వైష్ణవీ నమోస్తుతే నమోస్తుతే.....!!వింధ్యాచలవిరాజిత!!
ఇతి శ్రీ సరస్వతి ప్రార్ధన. సర్వవిద్యాఫలదాయకం.
కూర్పు: :శ్రీ కృష్ణ మాధవి
16--2--2021
10.22A.M
తిరిపెము--79
పల్లవి: తిరిపెము అడిగే నెలతాలుపువే
మరుభూముల.(ఎ)..లరారు వానివె!!తిరిపెము!!
అనుపల్లవి: నశ్వరమేయడిగి నెలగకానుకలు ఇచ్చేవు!!2!!!!తిరిపెము!!
చరణం: కైలాసవాసా-లయకారా.......!!2!!
లయముగ నాట్యమె చేసేవు నటరాజా........
కైలాసగిరులు భళి -భళీ యన ....భళిర
భళిర ఓ...నటరాజా.....ఒహోహో..నటరాజ!!తిరిపెము!!
చరణం: శివ శివ యనిన ఓయని పలికే..
.ఓహటమెరుగనివాడా.....
భోళాశంకర బిరుదా...జటాజూటా..శివశంకర
హరశంకరా.....శివ శివ శంకర హరహర శంకర
తిన్నగ మమ్ము కావుమయా ..!!తిరిపెము!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
14--2--2020
రచనాసమయం:11.30PM
గమనిక: అచ్చతెలుగు పద సంపద:M.సత్యభామ
తిరిపెము : బిక్ష అడగుట
నెలతాలుపు: ఈశ్వరుడు
మరుభూమి: స్మశానం
నశ్వరము: క్షీణించేది.
భళి భళీ: మెచ్చుకొనుట
ఓహటమెరుగక:వెనుదీయక
మనసు నిండే....వ్యధల
గుండె రగిలే......సెగల.......!!మనసు!!
చోటులేదే మరి దేనికీ.....
ఇమడలేదీ లోకములో...
మనసు మార్చి మాటమారి
ఏమార్చి గోరంక గూడోదిలే.....!!.మనసు!!
పొగిలి పొగిలీ పొరలనే
ఈవేళ...ఏదారి....ఏదారీ .
దారిదొరకదేలనో ..........
గూడుమరలదేల
చిలకమ్మ....................!!మనసు!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
5--2--2021
అమ్మలందరు కలసి--68
పల్లవి: అమ్మ లందరు కలసి లాల ఊపేరు లాలీ మురిపాలబాలునికి లాలీ లాలీ.........!!అమ్మ!!
అనుపల్లవి:అనురాగ మే రాగమై జోజోల పాడేరు జోజోల పాడేరు జో జో జో ల బాబు జో జో!!అమ్మ!!
చరణం:ముత్తెపు పందిరి లో ముత్యాల జోల...
రతనాలబాబుకి రతనాల జోల జోజోల
పగడమంటి బాబుకి పగడాల జోల
కెంపుల నవ్వులకి కోరి కోరి జోల జో జో ల..!!అమ్మ!!
బంగారు బాబుకి భామ ల్లజోల భామల్ల జోల......!!అమ్మ!!
చరణం : దోగాడు బాబుకి దొడ్డమ్మ జోల
తప్పటడుగుల నడిచేటి బాబుకి తాతయ్య జోల జోజోల
ముద్దు మురిపాల బాలునికి ముచ్చటగ జోల జోజోల
చిన్నారిబాబు.....మాచక్కని బాబు..జో..జో...జోజోల...!!అమ్మ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
29--1--2020
6.10P.M
పల్లవి: జో జో పాపాయీ జో జో పాపాయీ
బజ్జో పాపాయీ బజ్జో పాపాయీ.......!!జో జో!!
అనుపల్లవి:అందాలపాపడికి అందమైన లాలీ
ముత్యమంటి పాపడికి ముత్యాల లాలీ!! జో జో!!
చరణం:చుక్క లాంటి పాపడికి చుక్కలా లాలీ.....
బోసినవ్వుల పాపడికి వుంగా వుంగా లాలీ....
చొంగల్లు కార్చేటి చిన్నారి పాపడికి చిన్నమ్మ లాలీ
పాకేటి పాపడికి పాలపుంత లాలీ లాలీ లా...లీ....!!జో జో!!
చరణం: చల్లగా నవ్వే పాపడి కి చిరుగాలి లాలీ
దోబూచులాడు చిలిపి పాపడికి దొంతరమల్లి లాలీ
కిలకిలా నవ్వులా నిదురపోని పాపడికి నిదురమ్మ లాలీ
ఆవలింతల నడుమ ఊయలూగు పాపడికి అమ్మ లాలీ
అమ్మ లాలీ లా......లీ......లా............లీ!!జో జో!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
27--1--2020
ఈ మేలు పొద్దున
మేలు మేలనుచు
మేలుకొనవే మేలైన
మాలిని వనమాలికై.......!!ఈ మేలు!!
కమలాక్షుకనుల నిలిపి
పద్మహస్తుని మదిన తలచి
పరిపరి విధముల సేవించి
పరిమళ గంధములిడుటకై....!!ఈ మేలు!!
ఓ..వివశ పరవశ వంశీప్రియ..
తలపుల తనువు తడబడి
తీయని కలల కడలి లో
మమతలపందిరి వీడని శాలినీ..........!!ఈ మేలు!!
రచన:శ్రీకృష్ణమాధవి
వేణువు కన్నీరు-1
పల్లవి:- మూగవోతినేలనో ఈ....వేణువు....మూగవోతినేలనో........ఈ.....వేణువు!!మూగవోతినేలనో!!
అనుపల్లవి:- పలుకైన పలుకలేదు.....స్వరమేమో.....రాదాయే...........ఏమి ఈ వింతా..............కొంతైన తెలువదాయే......!!మూగవోతినేలనో!!
చరణం:- ఏమి వుంచుకొనని లోకువా....ఏమి లేని దానని లోకువా....నిరుపేదనని చూడరా ......నిలువ లేమి నాలోన వుండనే వుండవని....లోకువా.......నిలుపగలేరా నను మీయందు...నిలుపగలేరా....నను..మీయందు!!మూగవోతినేలనో!!
చరణం:- విలువలెరుగక విసిరినారని జాలి పొందు దునా...
శ్రీ కృష్ణ శ్వాసల మ్రోగు దానినే.....మరచినారా......!!2!!
శ్రీ కృష్ణ కరముల మెరయు దానినే...మరచినారా.......మరచినారా.....రాధమ్మకృష్ణయ్య ప్రేమ గురుతునే............మరచినారేలా!!మూగవోతినేలనో!!
రచన:-శ్రీ కృష్ణ మాధవి
15-12-2019
5.30A.M
మనసుతేనియ--44
పల్లవి : మనసు తేనియ లొలికే వేణువై పలికే ...
పదబంధములన్నీ అనుబంధములై.......!!మనసు!!
అనుపల్లవి : అనురాగ నాదము లా గానమునకే
నాట్యమే చేసే....అ ..న...వ...ర..త
..ము..నిను తలచు ...! !మనసు!!
చరణం : సింగారించిన సిరులన్నీ.............!!2!!
గుబురు గుబురు పొదలుగ మారి.........
పొదపొద ఎదలన్ని...ఏరువాకలై....వేణుగానమే
వినిపించే. .....వీనులవిందు చేసెనే.. సంగీతమే..
!!మనసు!!
చరణం : సరస సంగీత బాణీలో. ..వాణిలో....
నిలచివున్న వేణుగోపాలునికై.....వెల్లువాయె గీతాలాపనలే.....గానము చేసే......తీయతీయని గానాలాపనములే......గగరిగ రిరిగగ గగగగా..యని...!!మనసు! !
రచన : శ్రీ కృష్ణ మాధవి
8--12--2019
రచనాసమయం : 8A.M
కలిహంతక--42
పల్లవి : కలిహంతక దుష్కరకలిహంతక బిరుదాంకిత ఏలనయా ఘోరకలి !!కలిహంతక! !
అనుపల్లవి : కలినాప రావేలనో గోవిందా...రాక్షసులకు నెలవైనదీ అవనీ...గోవిందా. ....!!కలిహంతక! !
చరణం : మృగము కన్న హీనమైన ప్రవృత్తి తో
తో ప్రవర్తించు వారి యడ చూపవేమి నీ శక్తి
ఎంతకాలమీ బాధ ఉపశమింప రావేమి!!2!!
బలహీనుల మీదన దయ చూపగ రావేల....గోవిందా! !కలిహంతక! !
చరణం : ఆదిశక్తి నీ సోదరియే శక్తి నిచ్చి పంపితివే రక్కసులమీదకి మరి నేడేల ఈ వింత గోవిందా. ...శక్తి హీనతేల వచ్చె నారీమణులకి ధర్మం చర ధర్మం చెర అగుచున్నదేల గోవిందా గోవిందా...!!కలిహంతక! !
రచన : శ్రీ కృష్ణ మాధవి
5-12--2019
రచనాసమయం : 9.30A.M
కన్నా కన్నాళువు లేల--41
పల్లవి : కన్నా. ...కన్నాళువు లేల.....కన్నా. ...కన్నా....కన్నాళువు లేల....?
అనుపల్లవి : కందుకుందు లెరుగని గోపబాలికలము!!2!!
కైవారమె చేయజొచ్చెడి వారము కన్నాకు పోలు వారిమి ......!!కన్నా! !
చరణం : కనుకలి వినుకలి కలిగి కనుకొదమల కనుగంట కనుగొంటిమి అంతలోనే. .........!!2!!
కనుచెదఱే.............గరిమన నందనందనుడే...........!!2!!
కనుచాటులేలనింక...కన్నా. .. కన్నా. .............!!కన్నాళువు...!!
చరణం : కడకడలనుండు ...కడకంటనగుతో...!!2!!
కన్నెలమనసే......................కన్నెలమనసే ...కట్లసరులతో.కట్టువానివే.....కడిమాడము సేసేము నీకై......కదలిరారా....ఆరగించరారా. ...కన్నా ..!!.కన్నాళువు...!!
కన్నాళువు : గొడవలు
కందుకుందులు: నిష్కళంకమైన
కన్నాకు: తాంబూలములో మొదట పెట్టే తాజా తమలపాకు.
కైవారము : స్తోత్రపాఠములు
కనుకలి : చూచుటతోనే కలుగు ప్రేమ
వినుకలి : వినుట తో కలిగే ప్రేమ
కనుకొదమలు : ఉత్తమనేత్రములు
కనుచాటు : రహస్యము
కడకడలనుండు : దూర దూరంగా
కడకంటనగుతో : కళ్ళ తో నవ్వడం
కట్లసరులు : ఒక విధమైన గొలుసులు
కడిమాడము : అమూల్యమైన విందు భోజనం
రచన : శ్రీ కృష్ణ మాధవి
4-12--2019
రచనాసమయం : 2.30
నిశిరేయినకృష్ణా -40
పల్లవి : ఈ నిశిరేయిన కృష్ణా. ..ఒంటిగ వేచివుంటినోయీ...కృష్ణా నీ రాక కై ..నువు లేని ఈ రేయి ఎటులగడుచునో..కృష్ణా. ...!!ఈ నిశి!!
అనుపల్లవి : చుక్కలన్ని దాగుకొనియే. ...చిక్కని చీకటినా..నీ రాధ నీకై వేచి వున్నదోయీ....!!ఈ నిశి!!
చరణం : వేణువైన వినిపింపవేలనో గుండెయే తల్లడిల్లె నిను తలచి తలచి మనసు తడబడియె దిగులేలావరించెనో.....అవధులెరుగని వాడ నీకే యెఱుక. ...కృష్ణా. .కృష్ణా! !ఈ నిశి!!
చరణం : లతలన్ని నిదురవోయె....చిగురాకు ముడుచుకొనియె ...
!!2!!
నిదురవోని జాజి మల్లె మొల్లలే నగుచున్నవి...ననుచూసీ......నగుచున్నవి ననుచూసీ. ..నవనీత హృదయా .......నాహృది నీయందే నీహృది ఎందెందు కృష్ణా. .....!!ఈ నిశి! !
రచన : శ్రీ కృష్ణ మాధవి
3-12-2019
రచనాసమయం :3P.M
వెన్నెల పిలిచినదా నిను రమ్మనీ
రా రమ్మనీ వేణుగానమే వినపడెనా
ఆ...ఆదిబిక్షువే ఆగలేకపోయనా
లలిత లలిత పదములకై...నీకై........!!వెన్నెల!!
విధాత తలపున మెదిలి కదిలి
చేరితివో ఆకాశపు దారి రాదారిగా
చిత్ర విచిత్ర జగతి కలలని వదిలి
మరలిరాని లోకాలకేల ఏగితివో........!!వెన్నెల!!
ఆటపాటల అక్షర మాలికవై
అమరలోకములనేలుటకై
ఏతెంచితివో.....నవరసముల
నవరాగమాలికలు అల్లుటకో.....!!..వెన్నెల!!
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అక్షర నివాళి
శ్రీకృష్ణ మాధవి
మెరిసిన తలపుల
విరిసెను కలువలు
విరిసిన కలువల
ఒలికే మధురభావం........!!మెరిసిన!!
హొయలు పోయే
రాయంచలు..........
ఆనడకల కులుకులలో
చిలికే మంజీరనాదం........!!మెరిసిన!!
వినువీధుల వినిపించే
మృదుపదరవళి.....
ఆరవళుల
ఆలకించే నృత్యగీతం......!!మెరిసిన!!
రచన:శ్రీకృష్ణమాధవి
కొండలన్ని కోనలన్ని మురిశాయి
శ్రీరఘురాముడేతెంచుననీ...........!!కొండలన్ని!!
చిలకమ్మ కోయిలమ్మ జతగా
పాటలెన్నొ పాడాయి శ్రీరామా.....యనుచు..........
జింకపిల్లలపరుగుల రామరామ...కీర్తనే
మారుమోగె అడవంతా రామరామా యనీ......!!కొండలన్ని!!
గున్నమావి గురివింద పూలు
గుసగుసల అల్లిబిల్లిఊసులాడె.....
అందాలరాముని అతివసీతమ్మనీ
తలచి తలచి పులకరించె తీవెలు.....!!కొండలన్ని!!
రచన:శ్రీకృష్ణ మాధవి
హరిహర మాసమిది.....
హరిహర ప్రియమాసమిది....
శివశివా శివానందమున
దామోదరా యను నామమునా.....!!హరిహర!!
అర్థనారీశ్వరుని నటనలో
శ్రీరమావినోది కేశవుని లీలలలో .....
హరునిజూచి హరి....హరినిజూచి
హరుడుప్పొంగు సమయమిది........!!.హరిహర!!
కైలాస నాధుని స్మరణన
వైకుంఠనాధుని భజనలా.....
శివోహం ....శివోహం...
ఓం నమఃశివాయ.....
గోవింద గోవింద
ఓం నమోనారాయణాయ
ఒండొరుల సేవల శిష్టభక్తులు తరియింప.......!!హరిహర!!
రచన:శ్రీకృష్ణ మాధవి
1--11--2021
2.41 p.m
108 దివ్యదేశముల ప్రాభవ గీతిక
___________________________
దివ్యదేశవైభవం శ్రీవైష్ణవ విభవము
దివ్యదేశ వైభవమ్ ఘనుడు భూసు
రుడు వెలసిన వేద దేశముల వైభవమ్
సత్యరూపునకు నిత్యకల్యాణోత్సవ........!!దివ్యదేశ!!
నిడుపైన గోపురముల ధగధగ శోభల
పచ్చందనముల పసిడి వన్నెల....
శుభతారక వేదనాద ధ్వనుల......
విలసిల్లు దివ్య నగరముల.........!!దివ్యదేశ!!
నూరెనిమిది దేశముల తలచిన
కాంచిన పునీతమే సఫలమే.....
జన్మరాహిత్యమే ..........................
పరమపద ప్రాప్తియే....................!!దివ్యదేశ!!
రచన:శ్రీకృష్ణమాధవి
దివ్యదేశమ్...భవ్యదేశమ్
శ్రీవైష్ణవ దివ్యదేశమ్.......
సౌందర్య సాగరనిలయం....
భవహర శ్రీరంగ ధామం............!!.దివ్యదేశమ్!!
భుజగశయనుడు
గజతురగ సేవితుడు
సుపర్ణ విహారుడు....
కొలువైన దేశమ్ ఈ.....!!.దివ్యదేశమ్!!
రంగనాయకి శ్రీరంగ
నాయకి కొలిచిన దైవమ్
కావేరి తట వాసి
ఆత్మోద్దీపకుని నిలయమీ.....!!దివ్యదేశమ్!!
కొలిచిరి ఆళ్వారులు
తలచిరి లిఖియించిరి
గుణవైభవములను
రంగ రంగా శ్రీరంగా.....!!.దివ్యదేశమ్!!
దసరా పండుగ వచ్చింది
సరదాలెన్నో తెచ్చింది........
ఆహాహా..........ఓహోహో.....
ఆ .......ఆ........ఆ........ !!దసరా!!
ఆటబొమ్మలు బుట్టబొమ్మలు
నాటకాలు నృత్యాలు బూరాలు
ముత్యాలపందిరిలు వీధి వీధులా....
సందడులే సరిగమలే ఓ...ఓ......ఓ...!!.దసరా!!
సరిగంచుచీరల రెపరెపలు
గాజులగలగలలు ఘల్లు ఘల్లు
గజ్జెల సవ్వడులు తీర్చిదిద్దిన
పసుపుకుంకుమ రంగవల్లుల
బతుకమ్మలు....ఓహోహో..........!!దసరా!!
అయ్యవారికి చాలు ఐదువరహాలు
పిల్లవాండ్లకుచాలు పప్పుబెల్లాలు
ఆనందకోలాటం బాలానందం
విజయీభవ దిగ్విజయీ భవ ........!!దసరా!!
రచన:శ్రీకృష్ణ మాధవి
నిను వినాఎవరిని కొలుతు
ఎవరిని తలుతు వెంకట రమణ
శ్రీ వెంకట రమణా .....................!!.నిను వినా!!
నిలిచితివి సప్తగిరులపై
కొలిచితిమి నిను మరువక
జాలమేలరా....మము బ్రోవ....
జాగుయేలరా....ఏమి వలయు నో....!!.నిను వినా!!
అగ్గలించు ఆర్తి తోడ
వేడితిజాలమేలరా........!!2!!
చొరవగ జొరవడి రావేలరా....
రాకేందు వదన...సరగునరా రా....!!నిను వినా!!
రచన:శ్రీకృష్ణ మాధవి
13--9--2021
విఘ్న హరణ నిర్విఘ్నకారక
సిద్ధి
వినాయక ప్రధమపూజ యిదియే
మా...ప్రధమ పూజయిదియే....
సద్ బుద్ధి నొసగుమా వరసిద్ధి వినాయక.....!!విఘ్న!!
గరిక చాలందువు అమరికగ
అమల హృదయా...శ్రీప్రదా...
శ్రీగౌరి ప్రియ తనయా.........!!2!!
నీకిదే మా...ప్రధమ పూజ....!!.విఘ్న!!
సురవర పూజిత లలిత
లలిత పద కలిత లలిత
లాలిత మోదక ప్రియ ఆ..
మోదమున నందుకొనుము
మా...ప్రధమ పూజా......!!విఘ్న!!
రచన:శ్రీకృష్ణ మాధవి
హృదయ స్థిత రూప మందస్మిత వదనా
క్షీరసాగర తరంగిత సుఖ హేలా లోలా.......!!హృదయ!!
గోపీజన సఖీ ప్రియా గోవిన్దా....
కలవేణు నాద రసికా గ్రేసర...
వసుదేవసుత దేవకీతనయా
విశ్వతేజ విస్మయరూపోద్భవ....కృష్ణా.....!!..హృదయ!!
యశోద స్తన్యప్రియ వర్ధిత శ్రీ వత్స
చిహ్న అమితాశ్చర్య బాలకా వ్రజ
ప్రజ ఆనంద కారకా నందగోప
కుమారా అసుర హరణోత్సాహ...కృష్ణా...!!హృదయ!!.
మృదుమంజ్ఞీర చరణ కేళీ శౌరి
యమునాతట సంచారి శ్రీ హరి
గోపీజన కుంకుమాంజ్ఞ్కితానంద
మోహావర్త నివారక కృష్ణ హరే......!!.హృదయ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
గోవిందునికేలనో ఇంత అలకా
అలిగిన మోము పద్మరాగ రంజితము.......!!..గోవిందునికేలనో!!
అలకలన మూతిముడిచి
దోచితివి లలనల మనసులు....!!2!!
దోచిన మదులు తల్లడిల్లగా
ఒంటిగనిచట ఎందుకుంటివో
ఒకసారి ఒకసారి తెలుపుమా.......!!గోవిందునికేలనో!!
అలకవీడి పిల్లగాలి కైనా పలకరాదా
నీ అడుగులసడికై వేచే యమునా
ఇకనైన నీఅధరమునచేరనీ వేణువు
నీ హృదిలయల చేయనీ నాట్యము
రాధననీ నీ రాధ ననీ వేడుకొంటి స్వామి...!.!గోవిందునికేలనో!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
థీమ్: ఆచార్యులవారు
సుమధుర హాసిత భాషిత సుందర జానక
రాములచరితము శ్రీ వాల్మీకి లిఖితమ్.....
రామాయణమ్.....శ్రీ రామాయణమ్........!!సుమధుర!!
సాధన స్వరసుస్వాధన చేసిరి కుశలవులు
కృతికర్త వాల్మీకి యే గురువు గా శ్రీ రామచరితమ్
రాగ భావ తాళ లయల ఇంపుగా వినసొంపుగా
ఆలపించిరి శ్రీ రాముని చరితమ్...తన్మయమందిరి ఋషిగణము .................!!సుమధుర!!
మధురాభినయన పాటవమున నవరసములు
పలికించిరి సప్తస్వరముల తంత్రీ నాదమున
భళిభళీ యనెను అయోధ్యాధిపతి సాదరమున
అక్కునచేర్చి మిక్కలి ప్రేమన ప్రేమాశ్రువులు కురిపించె.....!!
సుమధుర!!..
రచన:శ్రీ కృష్ణ మాధవి
19-7-2021
సాగరోల్లంఘన కృత్యుడాయె హనుమ !!2!!
శ్రీ రామకార్యమని మించనీక సమయము
సమాయత్తమాయే ఆ అంజనీ తనయుడు
తరులన్నీ విరులన్నీ చేసే పుష్పాభిషేకము
సాగనంపె ప్రేమగా సాగరోత్తరణకై .........!!.సాగరోల్లంఘన!!
నిర్భయాకారుడా మారుతి ఆఘమేఘముల
పయనించే పవనాత్ముడు మలయమారుతమునా
చేరె సీతమ్మ సాన్నిధ్యమునందించే రామచిహ్నము
వహియించే శ్రీ రామకార్యభారము నెఱపే రాయబారము...!!సాగరోల్లంఘన!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
17--7--2021
భక్తి ఙ్ఞాన సిద్ధినీయ వేడెద నాధా
జగన్నాధా.....కడలి కదలి రావయా.......!!భక్తి!!
ఆత్మశుద్ధి అరయక చేసితిమని జపతపములు
బ్రోవ సందేహమా...... వీడుమా సందియము
కరివరదా.....కరుణసాగర నీకిదే..... మా
విన్నపము పన్నగ శయన పరమపురుషా..........!!భక్తి ఙ్ఞాన!!
జీవన పయనమునా మా.....జీ
వన పయనమున నీవే గతి... నొసగు
మా సద్గతి జగన్నాధా శరణు
శరణయా..... శరణు శరణయా ..........!!.భక్తి ఙ్ఞాన!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
10--7--2021
వరమీయవమ్మా వాగ్దేవీ......