November 29, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ముప్పదవ రోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ముప్పదవ రోజు కథ

శ్రద్ధగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని, శౌనకాది ఋషులు మహాభాగా ! కలియుగ కల్మషగతులు, రాగాదిపాశయుక్త సంసారగ్రస్తులూ అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది ? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది ? దేవతలందరిలోనీ దేవాది దేవుడు ఎవరు ? దేనివల్ల మోక్షం కలుగుతుంది. మొహం దేనివలన నశిస్తుంది ? జరామృత్యు పీడితులు, జడమతులు మందులూ అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి ? అని అడిగాడు. అనంతరం సూతుడు ఈ విధంగా చెప్పసాగెను మంచి ప్రశ్నలను వేశారు. ఇటువంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాలను దర్శించి, ఆయా క్షేత్రాలలో స్నానాదులు చేయడం వలన వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్లా  కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణువు  ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినీ కాను, సమయమూ చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి.

విష్ణుభక్తి కంటే తరుణోపాయము లేదు. విష్ణు గాథలను వినేవాళ్ళు విగతపాపులై, నరకానికి దూరంగా ఉంటారు. హరి ప్రీత్యర్థకంగా స్నాన, దాన జప, పూజ, దీపారాధనలను చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశియందు ఉండే నెలరోజులూ కూడా క్రమం తప్పకుండా కార్తీక వ్రతమును ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులౌతారు. కార్తీక వ్రతమును చేయనివాళ్ళు, కుల, మత, వయో లింగబేధము లేకుండా 'అంధతామిస్రము' అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీనదీ స్నానం చేసినవాళ్ళు దేవతలచే కీర్తింపబడి, విష్ణు లోకాన్ని చేరుతారు. కార్తీకస్నానం చేసి, విష్ణు అర్చన చేసినవాళ్లు వైకుంఠమును చేరుతారు. ఈ వ్రత ఆచరణ చేయనివాళ్ళు వెయ్యిసార్లు ఛండాలపు జన్మలపాలు అవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకమూ, పుణ్యకరమూ అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధానం ధన -ఫల -ధాన్య-గృహాది దానాలు అమిత పుణ్యఫలాలు. కార్తీకము ముప్పది రోజులూ కార్తీక మహాత్మ్యాన్ని వినినా - పారాయణ చేసినా కూడా సకల పాపాలూ నశించిపోతాయి. సంపదలు కలుగుతాయి. పుణ్యాత్ములు అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణ వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి.
                                                          
కార్తీకమాసం ముప్పదవ(ఆఖరి)రోజు కథ పారాయణం సమాప్తందీపతో లభతే విద్యాం - దీపదో లభతే శ్రుతమ్‌| 

దీపతో లభతే చాయు: - దీపతే దివమ్‌||

దీపంజ్యోతి పరంబ్రహ్మదీపం సర్వతమోపహం | 

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే || 


____//\\____  సర్వేజనా సుఖినోభవంతు _____//\\____

November 28, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై తొమ్మిదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై తొమ్మిదవరోజు కథ

అనంతరం అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి -"మహామునీ ! నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందు ఆరగించి, నా సర్వదోషాలనూ ఉపశమింపచెయ్యు అని ప్రార్థించాడు. దూర్వాసుడు అతనిని తన బాహువులతో లేవనెత్తి "రాజా ! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవు అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడనూ తాపసినీ నీకనా వయోవృద్ధుడినీ  అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగానీ మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడంలేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీవంటి ధర్మాత్మునితో కలిసి భోజనము చేయటం మహాద్భాగ్యం" అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం, పరీక్షకునిగా వచ్చి దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తికావడంతో తన ఆశ్రమానికి తరలివెళ్ళిపోయాడు. కనుక కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, వ్రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, ఉత్తమ పదాన్ని, మోహాన్ని పొందుతారు.  

కార్తీకమాసం ఇరవై తొమ్మిదవరోజు కథ పారాయణం సమాప్తం 

                      

November 27, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఎనిమిదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఎనిమిదవరోజు కథ

"ఓ విష్ణుచక్రమా ! ఆగుము ! ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపటమే ప్రధానము అనుకుంటే ముందుగా నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మము కానీ, యాచన చేయడం ధర్మం కాదు. విష్ణు ఆయుధానివి అయిన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు. నిన్ను జయించగలిగినది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినా నా బలాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్ళపాటు ఆ శ్రీహరి హస్తలలోబ్రతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను. అన్ని క్షాత్రధర్మపాలనికై, తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్థారియై నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. "అంబరీషా ! నాతో యుద్ధమంటే సంబరము అనుకుంటున్నావా ? మహాబల మదమత్తులైన మధుకైటభుల్నీ  దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులనీ అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిచూడటానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతోందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తియైన ఈ దూర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమే అని మరచిపోకు. ఉభయ తేజోసంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చెయ్యగలవు ? క్షేమం కోరుకొనేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగానీ, ఇలా యుద్ధానికిదిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కనుక ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకుపోయి వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు. 

ఈ మాటలతో అంబరీషుని కనులు ఎరుపెక్కాయి.'ఏమిటి సుదర్శనా ! అలా మాట్లాడుతున్నావు ? నా దైవమైన హరి ఆయుధానివి అని ఇంతవరకూ ఉపేక్షించానుగానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో వేల ముక్కలు చేసి ఉండేవాడిని. దేవ బ్రాహ్మణులపైనా, స్త్రీలూ , శిశువుల పైనా, గోవులపైనా బాణ ప్రయోగం చెయ్యను. నీవు దేవతవైన కారణంగా నీకింకా నా కౄర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర) ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్దమును చెయ్యు" అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏక కాలంలో ఇరవై బాణాలను వేశాడు. అతని పౌరుషానికీ, ధర్మరక్షణా దీక్షలో దైవనికైనా జంకని క్షాత్రానికీ సంతోషించిన సుదర్శనచక్రం సంతోషించి దరహాసము చేస్తూ "రాజా ! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించానేగానీ విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుడిని వదిలివేస్తున్నాను అని చెప్పి, అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై "సుదర్శనా ! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించటంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ  ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారములు " అంటూ సాష్టాంగనమస్కారం చేశాడు. అందుకు సంతోషించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి, అభినందించి, దీవించి, అదృశ్యుడు అయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యయనాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా అనేక భోగాలను అనుభవించి, జీవిత అంత్య దశలో ఉత్తమగతులను పొందుతారు అని తెలియచేయటంలో ఎటువంటి సందేహమూ లేదు.   

కార్తీకమాసం ఇరవై ఎనిమిదవరోజు కథ పారాయణం సమాప్తం              

                                     

November 26, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఏడవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఏడవరోజు కథ

శ్రీమహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగెను "ఓ  దూర్వాసా ! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనిష్టుని వలె బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు, రాజు అయినందుకు గో, బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మపరిపాలనమును చేయాలి కాని, బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. 

వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దోషియైన బ్రాహ్మణుని దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి, ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము, లేదా వస్త్రహరణము, స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు -- బ్రాహ్మణుడవైన నీకు తనవల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు దుఃఖిస్తున్నాడు. కనుక నువ్వు తక్షణమే అంబరీషుని వద్దకు వెళ్ళు. తద్వారా మీ ఇరువురకూ శుభం కలుగుతుంది." అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అమ్బరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని వీడి అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురువెళ్ళి "ఓ సుదర్శనమా ! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందునా బ్రాహ్మణుని ఈ విధంగా కౄరంగా హింసించటం న్యాయం కాదు. అంటూ ఇంకా ఇలా చెప్పసాగెను. 

కార్తీకమాసం ఇరవై ఏడవరోజు కథ పారాయణం సమాప్తం


November 25, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఆరవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఆరవరోజు కథ

ప్రాణభీతుడైన దూర్వాసుడు లోకాలన్నీ సంచరించి, చివరకు విష్ణు లోకాన్ని వైకుంఠమును చేరాడు. "హే బ్రాహ్మణప్రియా ! మాధవా ! మధుసూదనా ! కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శనచక్రం నన్ను చంపడానికై వస్తోంది. బ్రాహ్మణపాదముద్రా సుశోభితుడవైన నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి" అని ఘోషిస్తూ శ్రీహరిని శరణు కోరాడు. అంతట విష్ణువు చిరునవ్వు నవ్వుతూ "దూర్వాసా ! ప్రపంచానికి నేను దైవాన్నైనా -- నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు, కానీ నువ్వు సద్భ్రా హ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవూ అయ్యి ఉండీ కూడా అంబరీషుడిని ఆకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు - ఆలస్యముగా రాదలుచుకున్న వాడిని నీ కోసం ఎదురు చూడకుండా, ద్వాదశీఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వలేదు. ద్వాదశి దాటుటకు కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయములో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే తప్ప ఆకలితోనో, నిన్ను అవమానించాలనో కాదు కదా. నిషిద్ధ ఆహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చేబుతూండగా అదేమంత తప్పని నువ్వు శపించావు ??? ఆత్రేయా ! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ, కోపగించుకోలేదు కదా ??? అయినాసరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవటం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయింది అనే లోకోపవాదము నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయములో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ "గృహ్ణామి"  అన్నవాడినీ నేనేగానీ, ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవు ఇచ్చిన శాపం సంగతే తెలియదు.

ఋషి ప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహా మత్స్యంగా అవతరిస్తాను. దేవదానవుల క్షీరసాగర మధనము సమయంలో మందరగిరిని మూపున ధరించడానికై కుదురుగా ఉండేందుకుగానూ కూర్మవతారుడు (తాబేలు)ని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుడిని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం వికృతాకారముగల రూపాన్న అవతరిస్తాను. సర్వదేవతా సంరక్షణ కొరకు ధర్మ బలుడైనా కూడా దానవుడు కనుక 'బలి' అనే వాడిని శిక్షించేందుకు వామనుడను అవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారునిగా జన్మించి,  సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడను అనే దానిని మరచిపోయి మాయామానుష విగ్రహుడైనదశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానినీ, బలవంతుడను అయి ఉండీ కూడా, రాజ్యాధికారం లేకుండా (బలరాముడు) కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగం ఆరంభమున పాపమోహము కొరకు పాషాండ మత ప్రచారకుడనై బుద్ధునిగా అవతరిస్తాను. ఓ దూర్వాసా ! నా ఈ దశావతారములను -- ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా , చదివినా , తెలుసుకున్నా వారి పాపాలు తొలగిపోతాయి.

ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి దేశ , కాల , వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ఉంది. అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక, తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము - భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం ఈ రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను" అని విష్ణువు పలికెను.

కార్తీకమాసం ఇరవైఆరవరోజు కథ పారాయణం సమాప్తం

                           

ఆత్మనిగ్రహం

ఆత్మనిగ్రహం


November 24, 2013

మనోవికాసానికి మంచి భక్తిమార్గం

మనోవికాసానికి మంచి భక్తిమార్గం


దేవతలతో సమానమైనవారు

దేవతలతో సమానమైనవారు


లక్ష్మి నివాస స్థానాలు

లక్ష్మి నివాస స్థానాలు


పెద్దలు చెప్పిన సుద్దులు

పెద్దలు చెప్పిన సుద్దులు


మంచి మాటలు

మంచి మాటలు


పుణ్యఫలితాలను మనం ఈ విధంగా పొందవచ్చును

పుణ్యఫలితాలను మనం ఈ విధంగా పొందవచ్చును


మానవ ధర్మాలు

మానవ ధర్మాలు


భూమ్మీద పెట్టకూడని వస్తువులు

భూమ్మీద పెట్టకూడని వస్తువులు


ప్రేమలు - రకాలు

ప్రేమలు - రకాలు


తులసీమాతను కొలిచేటప్పుడు చదివే శ్లోకాలు

తులసీమాతను కొలిచేటప్పుడు చదివే శ్లోకాలు


గోమాతను దర్శించేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు

గోమాతను దర్శించేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు


భోజనం ముందు -- తరవాత చదువ వలసిన శ్లోకాలు

భోజనం ముందు -- తరవాత చదువ వలసిన శ్లోకాలు


స్నానము చేసిన తరవాత చదువ వలసిన శ్లోకము

స్నానము చేసిన తరవాత చదువ వలసిన శ్లోకము 


స్నానము చేయునప్పుడు చదివే శ్లోకం

స్నానము చేయునప్పుడు చదివే శ్లోకం 


భూమి మీద పాదము మోపుతూ చదివే శ్లోకం

భూమి మీద పాదము మోపుతూ చదివే శ్లోకం 


ప్రభాత శ్లోకం

ప్రభాత శ్లోకం 


బ్రహ్మీ ముహూర్తాన ధ్యాన శ్లోకం

బ్రహ్మీ ముహూర్తాన ధ్యాన శ్లోకం 


కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఐదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఐదవరోజు కథ

“మహారాజా అంబరీషా ! పురాకర్మానుసారియై నీకిప్పుడు  రెండు ప్రక్కల నుంచీ ఈ ధర్మసంకటము ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చేవరకు ఆగాలో, లేక ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో  ఏదో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులం ఐపోతున్నాం కనుక “ఆత్మబుద్ధి –స్సుఖంవైచ” అనే సూత్రం వలన భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు” అన్నారు బ్రాహ్మణోత్తములు. ఆ మాటలు వినగానే అంబరీషుడు “ఓ బ్రాహ్మణులారా ! బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. 

శృత్యర్థబోధక ప్రమాణం చేత, ప్రస్తుతం నేను కొన్ని మంచినీళ్ళు తాగుతాను. అందువల్ల అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తినిన దోషం రాదు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితమూ ఉంటుంది. ఇందువలన దుర్వాసుడు కోపించి, శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపము నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అన్నాడు. అలా అంటూ వారి ఎదుటనే కొన్ని నీళ్ళు తాగాడు. నోటి దగ్గర నీటి పాత్ర ఇంకా నేలమీద పెట్టకుండానే దుర్వాసుడు అక్కడ అడుగుపెట్టాడు. 

రాజు చేతిలో జలపాత్రను చూడగానే జరిగిందేమిటో దుర్వాసుడు గ్రహించాడు. చూపులతోనే కల్చేస్తాడా ?? అన్నట్లు చురచురా చూసాడు. మాటలతోనే మరణహోమం చేస్తాడా ??? అన్నట్లుగా --- "ఓయీ ! దురహంకార పూరిత రాజాధమా ! అతిథినైన నేను లేకుండానే ద్వాదశీ పారణ చేస్తావా ??? స్నానం చెయ్యకుండా భోజనము చేసేవాడు, పరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు, తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనము చేసేవాడు --- అశుద్ధములో పురుగువలె మలాశియే అవుతాడు. పండినది కానీ, పత్రం గానీ, నీళ్ళుగానీ, భోజనర్థంగా భావించి సేవించినది ఏదైనాసరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీచేత అంగీకృతుడనై అతిథిని(నేను) రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలమును సేవించావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణా ప్రియుడైన విష్ణువునకు భక్తుడివి ఎలా అవుతావు ??? నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు" అని ఆగ్రహంతో అన్నాడు.... ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసిలి ఒగ్గి "మునీంద్రా ! నేను పాపినే ... పరమ నీచుడినే అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడను కనుక ఈ ఆభిజత్యము, అహంకారము వల్లనో తప్పే చేశాను --- కానీ నువ్వు బ్రాహ్మణుడవు అయిన కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు, నీవంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు???" అని అంటూ దూర్వాసుని పాదాలపై పడి ప్రార్థించాడు. 

అయినాసరే ఆ దూర్వాసుని కోపం తగ్గలేదు. కిరీటము ధరించి ఉన్న ఆ రాజు తలను తన ఎడమకాలితో తన్ని, కొంచెం ప్రక్కకు జరిగి "ఎవరికైనా కోపం వస్తే వాళ్ళని ప్రార్థించగానే వాళ్ళు శాంతులు అవుతారు. కానీ నేను అలాంటివాడిని కాను. నాకు కోపం వస్తే శాపం ఇవ్వకుండా ఉండను. చేపగా, తాబేలుగా, పందిగా మరుగుజ్జుగా, వికృతమైన ముఖం కలవాడిగా, కౄరుడైన బ్రాహ్మణునిగా, జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగా, అధికారంలేని క్షత్రియునిగా, దురాచార భూయిష్టమైన పాషండ మర్గావేదిగా, నిర్దయా పూర్వక బ్రాహ్మణహింసకుడవైన బ్రాహ్మణునిగా ---- ఈ విధంగా పదిజన్మల (గర్భనరకాల)ను అనుభవించు" అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతర కాలంలో లోకకళ్యాణార్థము, బ్రాహ్మణా వాక్యాన్ని తిరస్కరించకూడదు అనే వ్రతం వల్లా ..... ఆ పదిజన్మల శాపాన్ని తానూ భరించదలచి "గృహ్ణామి" అని ఊరుకున్నాడు. --- ఇన్ని - శాపాల్ని ఇస్తే - గృహ్ణామి - అని అంటాడేమిటి ఈ రాజు, ఐతే వీనికి ఇంకా పెద్ద శాపమే ఇవ్వాలి నిర్ణయించుకొని దూర్వాసుడు మరోసారి శాపము ఇచ్చుటకు నోరు తెరవబోయాడు భక్తుడైన అంబరీషునికి రక్షణగా తన ఆయుధమైన సుదర్శనాన్ని విడిచిపెట్టడంతో అక్కడి పూజా స్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వైపు కదిలింది... తనవైపు రివ్వున దూసుకువస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి దూర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకుండా భూమండలము అంతా క్షణాలమీద తిరిగాడు, అయినా సుదర్శనం అతనిని తరుముతూనే ఉంది. భయకంపితుడైన ఆ దూర్వాసుడు  వసిష్టాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్ట దిక్పాలకులని, చివరికి శివ – బ్రహ్మలని కూడా శరణు కోరాడు—కానీ అతని వెనుకనే మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికివారే తప్పుకున్నారే తప్ప,  ఎవరూ అభయమీయలేదు.

కార్తీక మహాత్మ్యం ఇరవై ఐదవరోజు కథ పారాయణం సమాప్తం...... 

                                                         

November 23, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవైనాల్గవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవైనాల్గవరోజు కథ 

ఓ అగస్త్యా ! కార్తీకమాస శుక్లద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే - అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా - అన్నివిధాలైన యజ్ఞాలనూ ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్ల, ఏకాదశిపట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ, ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏపుణ్యం చేసినా, పాపం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్కమెతుకు దొంగిలించినా - కోటిమెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి. ఒకవేళ ఏరోజుకైనా ద్వాదశీ ఘడియలు తక్కువగా వున్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనాసరే పారణకు ఉపయోగించాలే కానీ, ద్వాదశి దాటినా తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనాసరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ - ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి.

అంబరీషుని చరిత్ర 

పరమ భాగవతోత్తముడూ, ఏకాదశీ వ్రతాచరణ తత్పరుడూ అయిన అంబరీషుడనే మహారాజు - ఒకానొక కార్తీకశుద్ధ ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు ద్వాదశీ ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాసమహర్షి వచ్చి - ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానం - అనుష్టానమునకై నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికీ మళ్ళీ రాకపోవటంతో అంబరీషుడు ఆత్రుతపడ్డాడు. ఆరోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సివుంది. అతిథి వచ్చేవరకు ఆగటం గృహస్థధర్మం దానిని వదలలేడు.

ద్వాదశి వ్రతాన్ని ఉల్లఘించినవాడు, విష్ణుభక్తిని విసర్జించినవాడు అవుతాడు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంతపాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణచేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు - ఒక్క ద్వాదశి పారణను అతిక్రమిస్తే, ఆనాటి వ్రతఫలంతో పాటుగా.... అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల  మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యఫలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పారణ అతిక్రమణ వల్ల విష్ణు విరోధభీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణ అవసానమయమైనాసరే, పారణ చేయటమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణశాపం వల్ల  కల్పాంత దుఃఖమే కలుగును.దూర్వాస ఆగమనం అనంతరము కన్నా, ద్వాదశి తిరోగమన పూర్వమే పారణ చేసి, హరిభక్తిని నిలుపుకున్నట్లైతే - కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చికూడా, ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు, ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించివున్నా తన ధర్మసందేహాన్ని తెలియచేసాడు.

మనోవ్యథ పొందిన అంబరీషుడు.   
                                         
వేదస్వరూపులైన ఆ విప్రులు, అంబరీషుని సమస్యను విని క్షణాలమీద శృతి - స్మృతి శాస్త్రపురాణాదులన్నిటినీ మననం చేసుకొని, "మహారాజా ! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందునా జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణవాయువుచేత ప్రజ్వలింపచేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి, యుక్తాహారంచేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయటమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న  జఠరాగ్నిజగన్నాధ స్వరూపం కనుకనే.

తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా - ఛండాలుడైనా సరే, ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే -- అతనిని విసర్జించటం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు. . పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణునికంటే ముందుగా తానే భోజనం చేయటం బ్రాహ్మణుని అవమానించటమే అవుతుంది. భూసురావమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం, నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన, బ్రాహ్మణ అవమానం సర్వదేవతలనూ అవమానించటంతో సమానమవుతుంది. జాతిచేతమాత్రం  బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా - కేవలం జన్మవలననేగాక, జ్ఞానం వలనా, తపోమహిమ వలనా, శుద్ధరుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి, ఆయనకంటే ముందే పారణ చేయటం ధర్మమని చెప్పటం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా బ్రాహ్మణాతిధికంటే ముందుగా భుజించుట కీర్తికరమైంది మాత్రం కాదు.

మహీపాలా ! ద్వాదశిపారణ పరిత్యాగం వలన, తత్పూర్వదినమయిన ఏకాదశ్యుపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేది లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి.                                    

కార్తీకమాసం ఇరవైనాల్గవరోజు కథ పారాయణం సమాప్తం.              


November 22, 2013

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైమూడవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైమూడవరోజు కథ

దైవకృప వలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రునివలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యాశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ - ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై, విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణువుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరమూ కూడా శ్రీహరి పూజప్రియుడై - ఏ దేశాలలో, ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏఏ విధాలుగా పూజించటం వలన తన జన్మ తరిస్తుందా - అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా - ఒకనాడు ఆకాశవాణి -"పురంజయా ! కావేరీతీరంలో శ్రీరంగక్షేత్రం వుంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసియున్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి .... జనన - మరణాల నుంచి కడతేర్చమని ప్రభోదించడంతో , రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి - తగినంత చతురంగ బలయుక్తుడై - అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ , కావేరీనదిలో స్నానాదులని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ, ప్రతీక్షణమూ కూడా 'కృష్ణా ! గోవిందా ! వాసుదేవా ! శ్రీరంగనాథా ! అని హరినే స్మరిస్తూ జపదానాది విధ్యుక్త ధర్మాలన్నిటినీ నిర్వర్తించి, కార్తీకమాస వ్రతం పూర్తిచేసుకొని - పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదులను పొంది, కొన్నాళ్ళకు సర్వభోగ వివర్జితుడై, భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి - కార్తీక వ్రతాచరణ - విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠమును చేరుకున్నాడు.

కార్తీకమాసం ఇరవైమూడవరోజు కథ పారాయణం సమాప్తం

    

November 21, 2013

కార్తీక మహాత్మ్యం -- ఇరవైఒకటవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం -- ఇరవైఒకటవ రోజు కథ 

ఈ విధంగా సాధారణంగా మొదలైన యుద్ధం ---- మహాయుద్ధంగా మారింది. ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుని గొడుగుగా జెండాను, రథాన్ని కూలగొట్టాడు. తరవాత మరో అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశి, మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను, కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజరాజు కవచాన్ని చీల్చి, గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికితీసి, ఆ కాంభోజుడు "ఓ పురంజయా ! నేను పరులసొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వానినే తన వింట సంధించి, పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారధిని చంపివేసాయి. పురంజయుని మరింత గాయపరచాయి, అంతటితో మండిపడిన అయోధ్యాపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని కంభోజునిపై వదిలగానే....... గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవటంతో కంభోజుడు మూర్చపోయాడు. దానితో య్యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుఱ్ఱాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ -- మొండాలు వేరుగాబడి ..... గిలగిలా తన్నుకుంటున్న కల్బంటుల కళేబరాలతో ---- మృత వీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మియైన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజ్రుంభణను తట్టుకోలేక -- ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి, పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తూన్న పురంజయుని చూసి, సుశీలుడు అనే పురోహితుడు ---"మహారాజా ! శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే --- ఈ క్షణమే భక్తితో విష్ణువును సేవించటమొక్కటే మార్గము ....... ఇది కార్తీక పౌర్ణమి .... కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈవేళ --- ఈ ఋతువులో దొరికే పూలను సేకరించి, హరి ముందు మోకరించి భక్తితో పూజించు . విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. గోవిందా - నారాయణా - ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు --- ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీకమాసంలో ఆరాధించిన భక్తుల రక్షణార్థం విష్ణువు వేయి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరివల్ల అయ్యేపని కాదు. భూపతీ ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవటమే కానీ, నీకు శరీరబలం లేకపోవటం కానీ కానేకాదు. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం ---- తద్వారా దైవబలం తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణం. కనుక పురంజయా ! శోకాన్ని వదలి .... భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం వలన ఆయురారోగ్యాలు --- ఐస్వర్యాలు -- సుఖసంపదలు -- సౌభాగ్యం కలుగుతాయి. నా మాటలను విస్వశించు".

 -: కార్తీకమాసం ఇరవైఒకటవ కథ పారాయణం సమాప్తం :-   
                                    
          

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైరెండవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైరెండవరోజు కథ 

అత్రి మహర్షి ఇంకా చెప్పసాగెను ..... "అగస్త్యా ! ఈవిధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి, వివిధ ఫల - పుష్ప పల్లవ దళాదిగా షోడసోపచారములతో పూజించి, మేళతాళాలతో కీర్తించి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి, పారవశ్యంతో నర్తించాడు. బంగారు విష్ణు ప్రతిమను చేయించి, దానికి కూడా దీపాలు వెలిగించి - పూజలు చేయించాడు. ఆ రాత్రంతా విష్ణుసేవలో లీనమై, మరుసటిరోజు ఉదయమే మిగిలిన సైన్యంతో మళ్ళీ యుద్ధరంగానికి చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే --- శతృవులను ఆహ్వానిస్తూ..... భీషణమైన ధనుష్టంకారాన్ని చేసాడు. ఆ శబ్దం చెవినపడగానే -- కాంభోజ, కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కున్నాయి. వజ్రాలవంటి కట్టులతోనూ ..... పిడుగుల్లాంటి బాణాలతోనూ....... అతివేగంగా పరుగెత్తే గుర్రాలతోనూ ...... ఐరావతాల్లాంటి ఏనుగులతోనూ ....... ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ ------- క్రమక్రమంగా యుద్ధం ఘోరంగా పరిణమించసాగింది. గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకి సంతుష్టుడైన విష్ణువు --- అతనికి దైవబలాన్ని తోడుచేయటం వలన, ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఓడిపోయాయి. కాంభోజుల గుర్రాలు - ఏనుగులు - వివిధ రాజుల రథబలాలు, పదాతి దళాలు పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుని చేతిలో  ఓడిన రాజులు ప్రాణభీతితో రణరంగాన్ని వదలి....... తమ రాజ్యాలకు పారిపోయారు. శత్రువులను ఓడించున పురంజయుడు అయోధ్యలో ప్రవేశం చేసాడు.   దేనికైనా దైవబలం ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే ముఖ్యం. ధర్మాచరణంలో ముఖ్యమైన కార్తీక వ్రతాన్ని ఎవరైతే శ్రీహరిని నిష్ఠగా సేవిస్తారో - వారి సమస్త దుఃఖాలు నశిస్తాయి. విష్ణుభక్తి సిద్ధించుటే కష్టం. కార్తీక వ్రతము -- శ్రీహరిసేవ ఎవరైతే వదలకుండా చేస్తారో ..... వారు శూద్రులైనప్పటికీ వైష్ణవోత్తములుగా లెక్కింపబడతారు. వేదవిదులైన బ్రాహ్మణులైనప్పటికీ ---- కార్తీక వ్రతాన్ని ఆచరించని వారు కర్మచందాలులుగా పరిగణించబడతారు. ఏజాతి వారైనా సరే... ఈ సంసారం సాగరాన్నుంచి బైటపడి, ఉత్తమగతిని పొందాలనే కోరికతో విష్ణువును పూజించినట్లయితే, వెంటనే వారి పాపాలు హరించి పోతాయి. భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి, రక్షించగలిగిన దైవం విశ్వమంతా వ్యాపించియున్న విష్ణువునందు భక్తి కలిగిన వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం పుణ్యం దక్కుతుంది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా -- కనీసం మహత్యాన్ని మనస్పూర్తిగా విన్నా .... వారు చేసిన పాపాలు తొలగి, వైకుంఠమునకు చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ ఇరవైరెండవరోజు కథని శ్రార్థకాలంలో చదివితే వారి పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు." అని అత్రి మహర్షి చెప్పారు.

                                       -:ఇరవైరెండవరోజు పారాయణం సమాప్తం:-   


                                                 

November 20, 2013

కార్తీక మహాత్మ్యం -- ఇరవయ్యవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం -- ఇరవయ్యవ రోజు కథ 

 కార్తీక మహాత్మ్యం గురించి మునుల మధ్య జరిగిన సంవాదము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిముని అగస్త్యుని చూసి కుంభసంభవా! లోకకళ్యాణం కోసం కార్తీక మహాత్మ్యం గురించి ఒక కథ వినిపిస్తాను విను. వేదంతో సమానమైన శాస్త్రం గాని,హరికి సాటైన దైవం గాని, కార్తీకంతో సమానమైన నెల గాని లేవు.కార్తీక స్నానాలు,దీప దానాలు,భగవత్ స్మరణ వలన సమస్త కోరికలు తీరుతాయి. కలియుగంలో కేవలం దైవభక్తీ వల్ల మాత్రమే సర్వ సంపదలు పొందగలుగుతారు. ఇందుకు ఉదాహరణే  ఈ కథ.

పురంజయుని చరిత్ర 

త్రేతాయుగంలో సూర్యవంశపు రాజైన పురంజయుడు అనే అతను,అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. సర్వశాస్త్ర కోవిదుడు,ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అధిక ఐశ్వర్యం కలగటంతో,అహంకారం కలిగి,బ్రాహ్మణులను ద్వేషిస్తూ,వారి మాన్యాలను లాక్కొని చోరులను చేరదీసి వారి దొంగతనాలు,దోపిడీలు చేయిస్తూ,  ధనంలో సగం వాటా తీసుకొని ప్రజలను భయపెడుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలము గడిచిన పిదప, అతని దౌర్జన్యాలు నలుదిక్కులా వ్యాపించి, సామంతులైన కాంభోజ, కురుజాదులు అనేకమంది ఏకమై, చతురంగ బలాలతో వచ్చి, అయోధ్యను చుట్టుముట్టి నలువైపులా శిబిరములు నిర్మించి, నగరమును దిగ్భంధనము చేసి, యుద్ధమునకు సిద్ధపడిరి.

ఈ వార్త తెలుసుకున్న పురంజయుడు కూడా శతృవులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద - పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినదీ, ధనుర్బాణము మొదలైన శస్త్రాలు వెంట తీసుకొని, అనేక యుద్ధాలలో విజయం సాధించిన గుర్రాలను రథాలకు కట్టి, తమ సూర్యవంశ రథాన్ని అధిరోహించి, చతురంగ బలాలతో శత్రుసైనికులపై విరుచుకు పడ్డాడు.

-:కార్తీక మహాత్మ్యం ఇరువది రోజు పారాయణము సమాప్తము:- 

   

కార్తీక మహాత్మ్యం - పంతొమ్మిదవరోజు కథ.

కార్తీక మహాత్మ్యం - పంతొమ్మిదవరోజు కథ.

జ్ఞానసిద్ధులవారు ఈ విధంగా విష్ణువును స్తుతించారు. వేదవేత్తల చేత - వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగానూ, అద్వితీయునిగానూ కీర్తింపబడేవాడా ! సూర్యచంద్ర శివబ్రహ్మాదులచే, మహారాజాధి రాజులచే స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా ! నీకు నమస్కరిస్తున్నాను. పంచాభూతాలూ, సృష్టిసంభూతాలైన సమస్త ప్రపంచము కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివ సేవిత చరణా ! నువ్వు పరమము కంటెను పరముడవు, నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచమూ కూడా - దానికి కారణమైన మాయతో సహా నీ యందే ప్రస్ఫుటమవుతుంది. సృష్టి యొక్క ఆది, మధ్య , అంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. చతుర్విధ అన్న రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు నీవే. హే ఆనంద సాగరా ! ఈశ్వరా ! సమస్తానికి ఆధారము, సకల పురాణ సారమూ కూడా నీవే.  ఈ విశ్వము అంతా నీవల్లే జనించి, నీలోనే లయమవుతుంది. ప్రాణులందరిలోనూ నీవే ఉంటావు. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చెయ్యు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నాజన్మకు సాఫల్యాన్ని చేకూర్చు. సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను ఉద్ధరించు. హే ముకుందా ! అనంతా ! దయామయీ ! విష్ణో ! నీకు నమస్కారము.    

నిత్యానంద సుధాబ్ది వాసీ ! తేజోమయా ! ఆత్మారామా ! దేవదేవేశా ! గోవిందా ! నీకిదే నమస్కారము, నీపాదాలకివే నా ప్రణామాలు. నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించ గలిగినవాళ్ళు మాత్రమే, నిన్ను ఆత్మ స్వరూపునిగా గుర్తించి , తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధృవ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే, సమస్త పాపాలూ నశించిపోతున్నాయి. ఓ కేశవా ! నన్ను రక్షించుము. ఈ విధంగా స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుడిని చిరునవ్వుతో చూస్తూ "జ్ఞానాసిద్ధా ! నీ స్తోత్రానికి నేను సంతోషంతో పారవస్యుడిని అయ్యాను. నీకేమి వరము కావాలో కోరుకో" అనెను. "హే జగన్నాధా ! నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే, నాకు వైకుంఠ ప్రాప్తి కలిగించు." అని జ్ఞానసిద్ధుడు అనెను. "జ్ఞానసిద్ధా ! నీ కోరిక నెరవేరుతుంది. అత్యంత దుర్మార్గులతో నిండిపోతున్న ఈ నరకంలో మహా పాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను. సత్పురుషా ! నేను ప్రతీ ఆషాఢశుద్ధ దశమి రోజు లక్ష్మీ సమేతుడనై, పాలకడలిలో పవళించి -- కార్తీక శుద్ధ ద్వాదశి రోజు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలూ, ఎవరైతే వ్రతాలను ఆచరిస్తారో ....... వారు విగత పాపులై,  నా సాన్నిధ్యాన్ని పొందుతారు. నేను చెప్పిన చాతుర్మాస వ్రతాన్ని ఆచరించని వాళ్ళు , బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర - మెలకువ , కల అనేవి అనేవి ఏమీ లేవు . నేను వాటికి అతీతుడను. నా భక్తులను పరీక్షించుటకు నేను అలా నిద్రా మిషతో జగన్నాటకాన్ని చూస్తూ ఉంటాను. నీవు నాపై చేసిన స్తోత్రాన్ని రోజూ మూడు పూటలా చదివిన వాళ్ళు తరిస్తారు. ఇవన్నీ లోకంలో ప్రచారము చెయ్యు" అని చెప్పి విష్ణువు పాలసముద్రముపై శయనించాడు.

దురాత్ములైనా, పాపులైనా, భగవంతుని ధ్యానిస్తూ చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అన్ని జాతుల వారు కూడా) వారి జన్మ ధన్యమవుతుంది. చేయనివారు కోటిజన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధా - భక్తులతో ఆచరించేవారు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది, చివరి దశలో విష్ణు లోకాన్ని పొందుతారు.

-:కార్తీక మహాత్మ్యం -- పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము:-    

   

November 19, 2013

కార్తీక మహాత్మ్యం -- పద్దెనిమిదవరోజు కథ

కార్తీక మహాత్మ్యం -- పద్దెనిమిదవరోజు కథ

అంగీరసుడు చెప్పినది విని కర్మయోగాన్ని గురించి ఉద్భూత పురుషుడు ప్రశ్నించటంతో సకలవిద్యా సంపన్నుడు అంగీరసుడు ఇలా చెప్పసాగెను. “సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ, తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ శంసయగ్రస్తుడో, వాడు మాత్రమే కర్మలను చేసి, తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారియైన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలయిన స్నానసౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి.

స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే – ఏనుగు తిన్న వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందులోనీ బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై ఉంది.ప్రతీరోజూ ప్రాతఃస్నానము చేయలేనివారు సూర్యడు సంచారము చేయు తులారాశి -- కార్తీకం, మకరరాశి -- మాఘమాసం, మేషరాశి - వైశాఖమాసంలోనైనా చేయాలి. జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతఃస్నానాలు చేసేవారు, సరాసరి వైకుంఠమునకు చేరుతారు. చాతుర్మాసం మొదలైన పుణ్యకాలాలలో గానీ సూర్య - చంద్ర గ్రహణ సమయాలలో గానీ, స్నానము చాలా ప్రధానము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వప్రజలకు -- స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయాలి. స్నానము చేయనివారు రౌరవ నరక గతుడై -పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. పుణ్యకాలాలన్నిటిలో కార్తీకమాసం ఉత్తమమైనది. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగు లేనట్లుగా ---కార్తీకమాసంతో సమానమైన పుణ్యకాలము లేదు. 

కర్మమార్గాన్ని తెలుసుకొని, ఈ మాసంలో ధర్మాన్ని ఆచరించేవారు వైకుంఠమునకు చేరుతారు. విష్ణువు లక్ష్మిసమేతుడై, ఆషాఢశుక్ల దశమి అంతంలో -- పాలసముద్రాన్ని చేరి , నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధినీ అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిద్రలేస్తాడు. ఈ మధ్య నాలుగు మాసాలూ ఎవరైతే భగవంతుని ధ్యానము, పూజలను చేస్తూ ఉంటారో, వారి పుణ్యాలు అనంతమై, విష్ణు లోకాన్ని చేరుతారు. 
సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము
కృతయుగంలో, వైకుంఠములోనున్న - లక్ష్మీసమేతుడైన విష్ణువుకు నమస్కరించి, నారదుడు "ఓ శ్రీహరీ! భూలోకంలో వేద విధులు అడుగంటుతున్నాయి. జ్ఞానులు సైతము సుఖాలకు లోనవుతున్నారు. ప్రజలంతా వికర్మలై ఉన్నారు, వారు ఏ విధంగా విముక్తులవుతారో తెలియక నేను మధనపడుతున్నాను." అని అనగా, విష్ణువు అతని మాటలను విశ్వసించి, సతీసమేతుడై, వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి, తీర్థక్షేత్రాలలోనూ, బ్రాహ్మణులుండే పట్టణాలలోనూ, పర్యటించాడు. కొందరు వారికి అతిథి సత్కారాలు చేశారు, కొందరు తిరస్కరించారు, మరికొందరు లక్ష్మీనారాయణుల విగ్రహాలకు పూజలు చేస్తూ, వీరిని తిరస్కరించారు. కొందరు తినకూడనివి తింటున్నారు. ఒకటేమిటి? పుణ్యం చేసేవారు తక్కువ, పాపం చేసేవారు ఎక్కువ మందిని చూచి, శ్రీహరి అన్యమనస్కుడై ఉండి ---- చతుర్భుజాలతో .... కౌస్తుభాది ఆభరణాలతో తన నిజరూపంలో ప్రత్యక్షమవ్వగా --జ్ఞానసిద్ధుడనే ఋషి అతని శిష్యులతో వచ్చి విష్ణువును ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు.
-:కార్తీక మహాత్మ్యం - పద్దెనిమిదవరోజు పారాయణం సమాప్తం:-

      

కార్తీక మహాత్మ్యం – పదిహేడవరోజు కథ

కార్తీక మహాత్మ్యం పదిహేడవరోజు కథ
అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ
కర్మబంధము, ముక్తికార్యము, కారణము – స్థూలసూక్షము. ఈ ద్వంద్వ సంబదితమే దేహము అనబడును. జీవుడంటే వేరెవరూ కాదు.
అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకీ, బుద్ధికీ సాక్షి – సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కుండవలె రూపాదిగా వున్న పిండ శేషము – ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా – ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప – ఆత్మమాత్రము కాదు. ఇదేవిధంగా ఇంద్రియాలుగానీ,  అగోచరమైన మనస్సుగానీ, అస్థిరమైన ప్రాణముగానీ –ఇవేవీ కూడా  ‘ఆత్మ’ కాదు – అని తెలుసుకో. దేనివలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ‘ఆత్మగా’ తెలిసికొని – ఆ “ఆత్మపదార్థమే నేనై వున్నాను” అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైతే అయస్కాంతమణి తాను ఇతరాచలచేత – ఆకర్షించబడకుండా – ఇనుమును తాను ఆకర్షించునో – అదేవిధంగా – తాను నిర్వికారియై – బుద్ధ్యాదులను సైతము చలింప చేస్తుందో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. “దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియమనః ప్రాణాలు భాసమానాలౌతున్నాయో – అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై – నిద్రాజాగ్రత్ స్వప్నాదులనూ, వాటి ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే – దేహేతరమై ‘నే’ ను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది – జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీనత్వ, నాశాంగ తత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా – అదే నీవుగా --- ఆ నీవే నేనుగా – నేనే నీవుగా “త్వమేవాహం” గా భావించు. ఈ విధంగా “త్వం” (నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్ఛబ్దార్థాన్ని గ్రహించాలి. (తత్ శబ్దానికి ‘బ్రహ్మ’ అని అర్థం.)

సాక్షా ద్విధిముఖాత్ అంటే – “సత్యం జ్ఞానమనంతరం బ్రహ్మ అనే వాక్యలద్వార సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే ‘ఆత్మ’ నరయగలగాలని అర్థము. ఆ ‘ఆత్మ’  సంసార లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టి గోచరము కాదని, చీకటి నెరుగనిదనీ – లేదా – చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ – పూర్వోక్త సాధనలవలన తెలుసుకో దేనినైతే “సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం” గా వేదాలు కీర్తిస్తున్నాయో – ఆ బ్రహ్మ ”నేనే” అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో – అదే ఆత్మ అదే నువ్వు. అదే నేను “తదను ప్రవిశ్య” ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్రవేశము – ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము – కర్మ ఫలప్రదత్వమూ – సర్వజీవ కారణ కర్ర్తుత్వమూ – దేనికైతే చెప్పబడుతూ వుందో – అదే ‘బ్రహ్మ’  గా తెలుసుకో.

ఓ జిజ్ఞాసా ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మే ఆ పరమాత్మ – ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో – అప్పుడు మాత్రమే ‘తత్’ శబ్దార్థం తనేనని ‘త్వం’ శబ్దం సాధనమేగానీ, ఇతరం కాదని తేలిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో –శ్రవణమననాదికాల నాచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురుకటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిన చేరతాము. దానినే ముక్తి – మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా వుండి, తత్ఫలితాన్ని  దైవార్పణం చేస్తూండడం వలన – ప్రారబ్దాన్ననుసరించి ఆ జన్మలో గానీ, లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాస పరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకొని ముక్తులవుతారు.” అని అంగీరసుడు చెప్పగా ......ధనలోభుడు నమస్కరించి ఈ విధంగా పలికెను.

-:కార్తీక మహాత్మ్యం  పదేహేడవరోజు పారాయణం సమాప్తం:-
  
               

కార్తీక మహాత్మ్యం – పదహారవరోజు కథ

కార్తీక మహాత్మ్యం – పదహారవరోజు కథ
దామోదరు(విష్ణువు)నకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసం నెలరోజులూ నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠమునకు చేరుకుంటారు. సంతానము కోరుకునేవారు కార్తీకపౌర్ణమి రోజు వాంఛా సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన – దానాలను చేయటం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిన కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు దూరమవుతాయి. దుర్మరణాలు, సంతాన విచ్ఛేదాలు కానీ జరుగవు.
స్తంభరూపము
పౌర్ణమి రోజు విష్ణు సన్నిధిలో స్తంభద్వీప ప్రజ్వలనం వలన వైకుంఠము సిద్ధిస్తుంది. గరుడధ్వజ స్తంభానికి పైన ఆకాశదీపం పెట్టకూడదు. అలా పెట్టినవారు నరకలోకం పాలవుతారు. ప్రత్యేకంగా రాతితోగానీ, కొయ్యతోగానీ, స్తంభం చేయించి, దానిని విష్ణువు ఆలయమునకు ముందు ఉంచి, తదనంతరము శాలిధాన్యమును, వీహ్రిధాన్యమును, నువ్వులను పోసి, దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు, హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే, సమస్త పాపాలు నశిస్తాయి.
కైవల్యము పొందిన కొయ్యమొద్దు
వివిధ వృక్షలతా మండితమైన మాతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయము ఉండేది. ఎందరో మునులు ఆలయానికి వచ్చి, కార్తీక వ్రతమాచరిస్తూ, ఆ నెలరోజులూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ పూజిస్తూండేవారు. ఒకానొక కార్తీకమాసంలో, వ్రతస్థలంలో, ఒక ముని “విష్ణు సన్నిధిన స్తంభదీపం పెట్టడం వలన లభిస్తుంది, కనుక మనము కూడా ఈ ఆలయప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము.” అని సూచించాడు. వంపులులేని స్థూపాకారపు చెట్టును ఒక దానిని చూసి, దానినే స్తంభంగా నియంత్రించి, శాలివిహ్రీ తిలసమేతంగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి, విష్ణువుకు అర్పణం చేసి, కోవెలలోకి వెళ్ళి, పురాణ కాలక్షేపం చేయసాగేరు మునులు. అంతలోనే వారికి ఫెళఫెళమని శబ్దం వినిపించటంతో, వెనక్కి తిరిగి స్థంభదీపం వైపు చూసారు. వాళ్ళు అలా చూస్తూండగానే స్తంభం నిలువునా పగిలి నేలపై పడిపోయి, అందులో నుండి ఒక పురుషాకారుడు బయటకు రావటంతో, ఆశ్చర్యచకితులైన మునులు “ నీవు ఎవరువు? ఈ విధంగా స్తంభంగా ఎందుకు ఉన్నావు? నీ కథ ఏమిటి? తెలుపు” అని అడుగగా ----- ఆ దివ్యపురుషుడు “ ఓ మునులారా ! నేను గతంలో ఒక బ్రాహ్మణుడను. వేదశాస్త్రాలు చదవటం గానీ, హరికథాశ్రవణం గానీ, తీర్థయాత్రలు చేయటం గానీ చేయలేదు. పెక్కు ధనమున్నప్పటికీ బ్రాహ్మణ ధర్మాన్ని వదలి—రాజునై పరిపాలన చేస్తూ, దుష్టబుద్ధితో ప్రవర్తిస్తూ, వేదపండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను క్రింది ఆసనాలపై కూర్చోబెట్టి, నేను ఉన్నతాసీనుడనై ----- ఎవరికీ దానధర్మములు చేయక, తప్పనిసరి అయినప్పుడు దానమిస్తాను అని వాగ్ధానము చేసి, సొమ్మును మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను ..... నేను స్వంతానికి వాడుకొనేవాడిని. వాటి ఫలితంగా మరణించిన పిదప --- నరకగతుడనై 52 వేలసార్లు కుక్కగాను, పదివేల సార్లు కాకిగాను, పదివేల సార్లు తొండగాను, మరో పదివేల సార్లు పురుగుగాను, కోటిజన్మలు చెట్టుగాను, కోటి జన్మలుగా ఇలా మొద్దుగాను కాలము గడుపుతూ ఉన్నాను. ఇన్ని పాపాలు చేసిన నేను, ఇప్పుడు ఎలా శాపవిమోచనం తొలగిందో ....... సర్వజ్ఞులైన మీరే తెలియచేయగలరు.” అని తన వృత్తాంతమును తెలియచేసేను.
“ఈ కార్తీక వ్రతఫలము యదార్థమైనది. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మనందరి కళ్ళముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది. అందులోని కార్తీకపౌర్ణమి రోజు, స్తంభదీపమును పెట్టటం శుభప్రదం. మాచే పెట్టబడిన దీపము వలన మొద్దు రూపంలో ఉన్న నీకు ముక్తి కలిగింది. మొద్దైనా, రాయి అయిన సరే కార్తీకమాసంలో దైవసన్నిధిలో దీపాన్ని పెట్టడం, దామోదరుని దయవలన నీకు మోక్షం కలిగింది.”  అని మునులు చెప్పగా “ దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు – బుద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి” అని ప్రార్థించగా, అంగీరసుడు అనే ముని అతనికి ఈ విధంగా జ్ఞానబోధ చేయసాగాడు.

-:కార్తీక మహాత్మ్యం పదహారవరోజు పారాయణం సమాప్తం:-
        
            

కార్తీకమహాత్మ్యం పదిహేనవరోజు కథ

కార్తీకమహాత్మ్యం పదిహేనవరోజు కథ
కార్తీకమాసంలో ఎవరైతే హరిహరుల దేవాలయాల ముందర నాట్యము చేస్తారో, వాళ్ళు శ్రీహరి ముందర నివసులౌతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువును అర్చించే వారు – స్వర్గనాయకులౌతారు. ఈనెలరోజులూ నియమముగా విష్ణువు లేక శివాలయానికి గాని వెళ్ళి, దైవదర్శనం చేసుకునేవాళ్ళు, సాలోక్యమోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ – ఒక్కొక్క అశ్వమేధయజ్ఞ ఫలాన్ని పొందుతారు. ఈమాసంలో అస్సలు ఏ దేవాలయానికి వెళ్లనివారు ఖచ్చితంగా రౌరవాది నరకానికో, కాలసూత్ర నరకానికో పోతారు. కార్తీకశుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతీ సత్కర్మా అక్షయ పుణ్యాన్ని......... ప్రతీ దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్లాద్వాదశి నాడు విప్రసహితుడై , భక్తియుతుడై , గంధపుష్పాక్షత, దీపధూప, భక్ష్య, నివేదనలతో, విష్ణువును పూజించిన వారికి --- పుణ్యానికి మితి అనేది లేదు. శుద్ధ ద్వాదశి నాడు శివ – విష్ణువు ఆలయాలాలో ఎక్కడైనా గానీ, లక్షదీపాలను వెలిగించి, సమర్పించే వాళ్ళు, దేవతావిమానమెక్కి దేవతలచే పొగడబడుతూ, విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. ఈనెలరోజులూ దీపము పెట్టలేనివారు ..... శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి --- ఈ మూడు రోజులైనా దీపాన్ని పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవసన్నిధిలో దీపాన్ని వెలిగించేవాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులుంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని, మళ్ళీ వెలిగించేవాళ్ళు ఘోరమైన పాపాల నుండి తొలగింపబడతారు.
దివ్యపురుషునిగా మారిన ఎలుక
పూర్వకాలంలో సరస్వతీ నదీతీరంలో ఎన్నోఏళ్ళ నుండి పూజలులేక శిధిలమైపోయిన ఒక విష్ణువు ఆలయం ఉండేది. కార్తీకస్నానం కోసం ఆ నదికి వచ్చిన ఒక ముని, ఆ ఆలయాన్ని చూసి, తన తపొధ్యానానికి ఆ ప్రదేశం ఏకాంతంగా ఉంటుందని తలచి, ఆ గుడిని శుభ్రపరచి, దగ్గరలో ఉన్న గ్రమాన్నుంచి నూనె, ప్రత్తి, పన్నెండు ప్రమిదలను తెచ్చి, దీపాలను వెలిగించి  ‘నారాయనార్పణమస్తు’ అని తనలో తానే అనుకొని, ధ్యానము చేసాడు. ఆ ముని ప్రతీరోజూ ఈవిధంగా చేస్తూండగా --- ఒకసారి కార్తీకశుద్ధద్వాదశి రోజున రాత్రి , ఆహారం ఎక్కడా దొరకని, ఆకలితోనున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి, దీపాల దగ్గరకు వచ్చి, ఒక ప్రమిదలో ఆరిపోయిన నూనె వత్తిని ఆహారంగా భావించి, నోట కరచుకొని, ప్రక్కనే వెలుగుతున్న మరోదీపం ఈ వత్తుకు అంటుకొని వెలిగెను. ఆరోజు కార్తీక శుద్ధ ద్వాదశి అగుట, ఆలయంలో ఆరిపోయిన వత్తిని వెలగటం వలన ఆ ఎలుక దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది.
ధ్యానంలోనున్న ముని లేచి “ఎవరు నువ్వు? ఇక్కడకు ఎలా వచ్చావు?” అని అడుగగా ...... ఆ అద్భుత పురుషుడు “ఓ మునివర్యా ! నేను ఒక ఎలుకను. నాకీదివ్యతేజం ఎలా వచ్చిందో, పూర్వజన్మలో నేనెవరినో, ఎలుకగా ఎందుకు జన్మించవలసి వచ్చిందో తెలపండి” అని చేతులు జోడించి ప్రార్థించాడు. అంతట ఆ ముని తన మనోనేత్రంతో అతని గతజన్మను దర్శించి , ఈ విధంగా చెప్పసాగెను.
బాహ్లికుని చరిత్ర
“పూర్వం జైమనీగోత్ర సంజాతుడవైన బహ్లికుడనే బ్రాహ్మణుడివి నీవు. సంసార పోషణకై, నిరంతరము స్నానసంధ్యాదులని వదలి, వ్యవసాయమును చేబట్టి, విప్రులను – యోగ్యులను నిందిస్తూ, సంభావనా లాలసతో శ్రాద్ధ భోజనానలను చేస్తూ, నిషిద్ధ రోజులలో రేయింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. అందగత్తెయైన నీభార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయంకోసం, ఒక దాసీని నియమించి, బుద్ధి వక్రించిన వాడివై,  నిత్యం ఆ దాసీని తాకుతూ, మాట్లాడుతూ, నీ పిల్లలు – నీవునూ కూడా ఆమె చేతి భోజనమే చేస్తూ, అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు – పెరుగులు అమ్ముకుంటూ సొమ్మును కూడబెట్టావు. కొంత సొమ్మును తీసుకొని కన్నా కూతురిని కూడా అమ్ముకన్నావు. ఈ విధంగా కూడబెట్టిన సొమ్మును-  ఒక గోతిలో దాచిపెట్టి ..... అర్థాంతరంగా కన్నుమూసావు. ఆ పాపాల కారణంగా నరకాన్ని అనుభవిస్తూ, చివరికి ఎలుకగా జన్మించి, ఈ శిధిలమైన ఆలయంలో బాటసారులు దేవునికి సమర్పించిన వాటిని భుజిస్తూ కాలం గడిపావు. ఈరోజు మహాపుణ్య మైన కార్తీకశుద్ధ ద్వాదశి అవ్వటం వలన, ఆరిపోయిన దీపం నీచేత వెలిగించబడటం వలన, ఇది విష్ణువు సన్నిధి కారణంగా.....నీకు ఎలుక రూపం పోయి –నారా రూపం వచ్చింది.”
ముని చెప్పినది విని – తన గతజన్మ పాపాలకు పశ్చాత్తాపం చెంది, ముని చెప్పినట్టుగా ఆ మరునాటి నుండి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఆ మూడురోజులూ, సరస్వతీ నదిలో ప్రాతః స్నానాన్ని చేస్తూ, ఆ పుణ్య ఫలము వలన వివేకవంతుడై, ప్రతీ సంవత్సరమూ కార్తీక వ్రతాచరణ చేస్తూ, చివరి కాలంలో  సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భాగవత్పరాయణుడై – స్నాన, దాన, దీప మొదలైనవి ఆచరించేవారు—విష్ణువుకు ప్రీతిపాత్రుడై సాయుజ్య పదాన్ని పొందుతారు.
-:కార్తీకమహాత్మ్యం పదిహేనవ ప్రయాణం సమాప్తం:-


కార్తీకమహాత్మ్యం పదునాల్గవరోజు కథ

కార్తీకమహాత్మ్యం పదునాల్గవరోజు కథ:-
ఆబోతును అచ్చుబోసి వదులుట(వృషోత్సర్గం)
కార్తీకమాసమంతా పూర్వోక్తసర్వధర్మ సంయుక్తంగా కార్తీకవ్రతాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీకపౌర్ణిమ రోజున వృషోత్సర్గం చేస్తారో – వారియొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆవుయొక్క కోడెదూడను – అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే “వృషోత్సర్గం” అంటారు. ఈమానవలోకంలో ఏ ఇతర కార్యాచరణాల వలనా కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే, కార్తీకపౌర్ణమినాడు పితృదేవతా ప్రీత్యర్ధం ఒక కోడె(ఆవు)దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలాచేయుట వలన గయా – క్షేత్రంలో, పితరులకు కోటిసార్లు శ్రార్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది.

ప్రతీమనిషి యొక్క పూర్వీకులు – తమవంశమందు ఎవ్వరు అబోతుని దానమిస్తారో అని ఎదురుచూస్తూ ఉంటారు. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీకపౌర్ణమి రోజు వృషోత్సర్గం చేయనివాడు  ‘అంధతామిస్రము’ అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలనగానీ, ప్రతివర్షాబ్దికాల వలనగానీ, తీర్థస్థలాలలో తర్పణం వలనగాని,  వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పూర్వీకులు పొందరు.      
కార్తీకమాస వివిధ దానాలు – ఆహారనియమాలు
ఉసిరిక ఫలాన్ని దక్షిణాయుతంగా దానమిచ్చేవారు -- సార్వభౌములౌతారు. పౌర్ణమి రోజున దీపదానము చేయటం వలన – త్రికరణ కృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని పొందుతారు. పౌర్ణమి రోజు లింగదానము వలన – సమస్త పాపహరము , అత్యంత పుణ్యదాయకం.  ఈ దానాలు చేయుటవలన ఈజన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు.
ఇతరుల అన్నము
పితృశేషము
తినకూడనివి తినటము
శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళి భుజించుట
నువ్వులను దానము పట్టుట
ఈ ఐదు పనులు చేయకూడదు.
సంఘాన్నము, శూద్రాన్నాము, అపరిశుద్దాన్నము,  విధవ చేతి భోజనము తినకూడదు. ఆదివారము రోజు సూర్యచంద్రగ్రహణాల రోజులలోను , నిషిద్ధ రోజులలోను, రాత్రిపూట భోజనము నిషేదము. ఈనెలలో వచ్చే ఏకాదశి రోజు రాత్రి – పగలు రెండు పూటలూ కూడ భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము(అనగా తమ నీడ – శరీరము కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట) ఉత్తమమని పూర్వీకుల వాక్కు. ఈమాసంలో “తైలాభ్యంగనము- పగటినిద్ర – కంచుపాత్రలో భోజనము – పరాన్నభోజనము – గృహస్నానము – నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము – వేదశాస్త్ర నింద” ఈ ఏడింటిని జరపకూడదు.
సమర్థులై యుండీ కూడా నదీస్నానము చేయకుండా .....ఇంటివద్దే వేడినీటి స్నానము చేసినట్లయితే-----అది కల్లుతో స్నానము చేసినట్లు సమానమని బ్రహ్మశాసనము.
సూర్యుడు తులారాశిలో ఉండగా నదీస్నానము అత్యంత ప్రధానము. దగ్గరలో నదులు లేకపోయినట్లైతే .....చెరువులో గానీ, కాలువలలో గానీ, నూతి(బావి)వద్ద గానీస్నానము చేయవలెను. అటువంటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ స్నానము చేయాలి. ఎక్కడ చేసినా ప్రాతఃకాలమునే చెయ్యాలి.అలా చేయనివారు నరకానికి పోయి , ఛండాలపు జన్మనెత్తుతారు. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని, సాయంకాలం మరల స్నానము చేసి, షోడసోపచారాలతో భగవన్నామస్మరణ చేయాలి.       
షోడసోపచార పూజా సంకల్పం
1) ఓం నమః                        -- ధ్యానం సమర్పయామి (పుష్పాక్షతలు)
2) ఓం సధ్యోజాతాయ నమః        -- పాద్యం సమర్పయామి (నీటిచుక్కని చల్లాలి)
3) ఓం లోకేశ్వరాయ నమః          -- అర్ఘ్యం సమర్పయామి (నీటిని జల్లాలి)
4) ఓం వామదేవా నమః             -- ఆచమనీయం సమర్పయామి ( నీటిని జల్లాలి)
5) ఓం గంగాధరాయ నమః          -- స్నానం సమర్పయామి (
6) ఓం నీలకంఠాయ నమః           -- వస్త్రం సమర్పయామి (వస్త్రయుగ్మం)
7) ఓం త్రయంబికాయ నమః          -- ఉపవీతం సమర్పయామి (ఉపవీతం)
8) ఓం భాక్తవత్సలాయ నమః         -- గంధం సమర్పయామి (కుడిచేతి వ్రేలితో గంధం చిలకరించాలి)
9)  ఓం అంబికానాధ నమః            -- అక్షతాన్ సమర్పయామి (అక్షతలు)
10) ఓం త్రిలోకేశాయ నమః           -- పుష్పం సమర్పయామి (పువ్వులు)
11) ఓం విశేస్వరాయ నమః             -- ధూపమాగ్రాపయామి( అగరబత్తి లేక సాంబ్రాణి ధూపమీయాలి)
12) ఓం భూతపతయే నమః            -- దీపం సమర్పయామి ( ఒక వత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపాలి)
13) ఓం సర్వభూత దమనాయ నమః       -- నైవేద్యం సమర్పయామి (శక్తి కొలది నివేదన చేయాలి)
14) ఓం మనోన్మనాదాయ నమః           -- తాంబూలాదికం సమర్పయామి(5 తమలపాకులు, 2 పోక చెక్కలు సమర్పించాలి.)
15) ఓం భవాయ నమః                       -- నీరాజనం సమర్పయామి
16) ఓం దేవదేవాయ నమః                  -- నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాలి)

ఈ విధంగా మాసమంతా పూజించాలి.  అనంతరము యధాశక్తి దీపాలను విలిగించి, బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈవిధంగా వ్రతాన్ని ఆచరించిన వారు, వంద వాజపేయాలు, వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక చతుర్దశి రోజు బ్రాహ్మణులకు భోజనము పెట్టుటవల్ల, వారి పితృ(పూర్వీకు)లందరూ కూడా సంతృప్తులౌతారు...... ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వల్ల – పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈరోజు (చతుర్దశి రోజు) ఉపవాసం ఉండి, శివారాధన చేసి, తిలలను దానం చేసిన వారు కైలాసమునకు క్షేత్రధిపతి అవుతారు. ముఖ్యంగా ఈ 14వ అధ్యనాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా, వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.
-:కార్తీక మహాత్మ్యం పదునాల్గవ రోజు పారాయణం సమాప్తం:-