November 23, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవైనాల్గవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవైనాల్గవరోజు కథ 

ఓ అగస్త్యా ! కార్తీకమాస శుక్లద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే - అన్ని తీర్థాలలోనూ స్నానం చేయుటవలన కలిగే పుణ్యమూ - అన్నివిధాలైన యజ్ఞాలను చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్ల, ఏకాదశిపట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ, ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏపుణ్యం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యము లభిస్తుంది.   ఏ ఒక్కమెతుకు దొంగిలించినా - కోటిమెతుకులు దొంగిలించిన పాపము లభిస్తుంది. ఒకవేళ ఏరోజుకైనా ద్వాదశీ ఘడియలు తక్కువగా వున్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనాసరే పారణకు ఉపయోగించాలే కానీ, ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనాసరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ - ద్వాదశీ పారణను మాత్రం విడిచిపెట్టకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి.

అంబరీషుని చరిత్ర 

పరమ భాగవతోత్తముడూ, ఏకాదశీ వ్రతాచరణ తత్పరుడూ అయిన అంబరీషుడనే మహారాజు - ఒకానొక కార్తీకశుద్ధ ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు ద్వాదశీ ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాసమహర్షి వచ్చి - ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానం - అనుష్టానమునకై నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికీ మళ్ళీ రాకపోవటంతో అంబరీషుడు ఆత్రుతపడ్డాడు. ఆరోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సివుంది. అతిథి వచ్చేవరకు ఆగటం గృహస్థధర్మం దానిని వదలలేడు.

ద్వాదశి వ్రతాన్ని ఉల్లఘించినవాడు, విష్ణుభక్తిని విసర్జించినవాడు అవుతాడు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంతపాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణచేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు - ఒక్క ద్వాదశి పారణను అతిక్రమిస్తే, ఆనాటి వ్రతఫలంతో పాటుగా.... అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల  మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యఫలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పారణ అతిక్రమణ వల్ల విష్ణు విరోధభీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణ అవసానమయమైనాసరే, పారణ చేయటమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణశాపం వల్ల  కల్పాంత దుఃఖమే కలుగును.దూర్వాస ఆగమనం అనంతరము కన్నా, ద్వాదశి తిరోగమన పూర్వమే పారణ చేసి, హరిభక్తిని నిలుపుకున్నట్లైతే - కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సుతో ఒక నిర్ణయానికి వచ్చీ కూడా, ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు, ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించివున్న వేదవిదులకు తన ధర్మసందేహాన్ని తెలియచేసాడు.

మనోవ్యథ పొందిన అంబరీషుడు.   
                                          
వేదస్వరూపులైన ఆ విప్రులు, అంబరీషుని సమస్యను విని క్షణాలమీద శృతి - స్మృతి శాస్త్రపురాణాదులన్నిటినీ మననం చేసుకొని, "మహారాజా ! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందునా జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణవాయువుచేత ప్రజ్వలింపచేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి, యుక్తాహారంచేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయటమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న  జఠరాగ్నిజగన్నాధ స్వరూపం కనుకనే.

తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా - ఛండాలుడైనా సరే, ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే -- అతనిని విసర్జించటం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు. . పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణునికంటే ముందుగా తానే భోజనం చేయటం బ్రాహ్మణుని అవమానించటమే అవుతుంది. భూసురావమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం, నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన, బ్రాహ్మణ అవమానం సర్వదేవతలనూ అవమానించటంతో సమానమవుతుంది. జాతిచేతమాత్రం  బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా - కేవలం జన్మవలననేగాక, జ్ఞానం వలనా, తపోమహిమ వలనా, శుద్ధరుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి, ఆయనకంటే ముందే పారణ చేయటం ధర్మమని చెప్పటం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా బ్రాహ్మణాతిధికంటే ముందుగా భుజించుట కీర్తికరమైంది మాత్రం కాదు.

మహీపాలా ! ద్వాదశిపారణ పరిత్యాగం వలన, తత్పూర్వదినమయిన ఏకాదశ్యుపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేది లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి.                                     

కార్తీకమాసం ఇరవైనాల్గవరోజు కథ పారాయణం సమాప్తం.              


No comments:

Post a Comment