November 15, 2013

కార్తీకమాస మహాత్మ్యం -- పన్నెండవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం -- పన్నెండవరోజు కథ 

కార్తీక సోమవారం నాడు తెల్లవారుఝామునే లేచి, నదీస్నానముచేసి శక్తికొలది బ్రాహ్మణులకు దానము చేసి, సాయంత్రం అయ్యాక నక్షత్రదర్శనంచేసి, ఆహారాన్ని తీసుకోవాలి. ఈవిధంగా చేసినవారికి సకలపాపాలు తొలగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీకసోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో...అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు -- కార్తీకపౌర్ణమి వెయ్యిరెట్లు -- శుక్లపాడ్యమి లక్షరెట్లు -- శుక్లఏకాదశి కోటిరెట్లు -- ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తుంది. మోక్షంకోసం కోసమని శుక్లఏకాదశి నాడు ఉపవాసము చేసి, ద్వాదశినాడు బ్రాహ్మణులతో కూడి పారాయణ చేసినట్లయితే వారి సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. కార్తీకద్వాదశి నాడు అన్నదానము చేసినవారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో కోటిమంది బ్రాహ్మణులకు అన్నదానము చేయుటవలన ఎంతపుణ్యం లభిస్తుందో -- అంతపుణ్యం కేవలం ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునికి అన్నము పెట్టడం వలన కలుగుతుంది. వెయ్యి గ్రహణ పర్వాలు , పదివేల వ్యతీపాత యోగాలు , లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా --- ఒక్క ద్వాదశిలో చేసిన పుణ్యఫలితంలో  పదహారోవంతు ఫలితాన్ని కూడా ఇవ్వవు. మనకు ఉన్న తిథులులలో పుణ్య తిథులెన్నో ఉండవచ్చును ..కానీ వాటి అన్నిటికంటే విష్ణువుకి ఇష్టమైన ఈ కార్తీకద్వాదశి అత్యంత ఫలప్రదము.

కార్తీకద్వాదశి దానాలు -- వాటి ఫలితాలు 

కార్తీక ఏకాదశిరోజు రాత్రి యాయముండగా ,,, కార్తీక శుద్ధద్వాదశినాడు పాలసంద్రం నుండి శ్రీమన్నారాయణుడు నిద్రలేస్తాడు. అందువల్ల ఈ  ద్వాదశికి "హరిబోధిని ద్వాదశి" అని కూడా అంటారు.

ఆరోజున పండ్లుతో తాంబూలము , యజ్నోపవీతాలను దక్షిణతో కూడిన దానము చేసి, కనీసం ఒక్కబ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తే వారికి ఇహములో భోగాలను , పరంలో భోగిశయనామ సేవనాన్ని పొందుతారు.

ద్వాదశినాడు పెరుగు - అన్నదానం చేయటం సర్వోత్క్రుష్టమైన దానముగాచెప్పబడుతుంది.

ఈరోజున ఎవరైతే పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి , పూజించి దూడతోసహా గోదానము చేస్తే -- వారికి ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమలుంటాయో అన్నివేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు.

ఈరోజు వస్త్రదానం చేసినవాళ్ళు సంచితార్థాలన్నీసమసిపోయి వైకుంఠమును చేరుతారు.

ఈరోజు సాలగ్రామాన్ని - బంగారపు తులసిమొక్కని దక్షిణతో దానము చేస్తారో ... వారు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యఫలాన్ని పొందుతారు.....అందుకు ఉదాహరణే ఈ క్రింద చెప్పబడిన కథ.




ధర్మవీరుని  చరిత్ర --- సాలగ్రామ దానమహిమ

పూర్వము వైశ్యుడొకడు గోదావరీ తీరంలో నివసిస్తూ ఉండేవాడు. అతను దురాచారవంతుడు, పరమపిసినారి, దానధర్మాలు చేయకపోవటమేకాక తానుకూడా తినకుండా కూడబెట్టేవాడు, ధనధాన్యాలే కాదు - కనీసం ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు. ప్రతీరోజు ఇతరులను నిందిస్తూ , పరులద్రవ్యాసక్తుడై -- ధనమును వడ్డీలకు తిప్పుతూ తన మూలధనాన్ని పెంచుకోసాగాడు.

అతను తనగ్రామానికి సమీపంలో నున్న ఒక పల్లెలో బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవుటకై అతని గ్రామానికి వెళ్ళి , తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు "ఈ నెలాఖరుకల్లా మీ బాకీని చెల్లిస్తాను, మీ ఋణం ఉంచుకోను ...... ఋణం తీర్చకుండానే పోయినట్లయితే మరుజన్మలో ఋణదాతకు సంతానముగా జన్మించి, ఆ ఋణాన్నితీర్చుకోవలసి వస్తుంది....అందుకే ఏదోవిధంగా మీ ఋణాన్ని తీరుస్తాను... అంతవరకూ ఓర్పు వహించండి" అని అనెను.

అ బ్రాహ్మణుని మాటలు పరాభవముగా భావించి, "నా సొమ్మును నాకు ఇప్పుడే తీర్చాలి ...లేకుంటే ఈ కత్తితో నిన్ను నరికివేస్తాను" అన్నాడు. అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేను అని బ్రాహ్మణుడు చెప్పగానే..... వైశ్యుడికి కోపం వచ్చి -- బ్రాహ్మణున్ని జుట్టుపట్టుకొని లాగి, నేలకు పడద్రోసి,  కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో అతని గొంతుకోసి చంపెను. హత్య చేసినందుకు రాజు తనను దండిస్తాడనే భయంతో తొందరగా ఇంటికి పారిపోయెను. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ..... గుట్టుగా ఉన్నంత మాత్రాన్న ఎల్లకాలం బ్రతకలేము కదా ! బ్రాహ్మణహత్య -- బ్రహ్మహత్యతో సమానము ......అతనికి ఆపాపమావహించి కుష్ఠువ్యాధి సోకి .....వివిధ రకాల బాధలనుభవించి చివరకు మరణించాడు. అతను నరకంలో రౌరవాది యమబాధలనుభవించాడు.

ఆ వైశ్యునికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను మహాదాత , పరోపకారి -- పిత్రార్జితాన్ని ప్రజల కొరకు-- చెరువులు, నూతులు తవ్వించి, తోటలు వేయించి -- వంతెనలు కట్టించి -- పేదలకు పెళ్ళిళ్ళు చేయిస్తూ -- యజ్ఞయాగాది క్రతువులను -- అన్నార్తితో ఉన్నవారికి తరతమ బేధం లేకుండా అన్నదానమును చేస్తూ-- ధర్మాత్మునిగా పేరుతెచ్చుకున్నాడు. ఒకరోజు ధర్మవీరుడు విష్ణుపూజచేస్తున్న సమయంలో త్రిలోకసంచారియైన నారదమహర్షి హరినామస్మరణ చేసుకుంటూ అతని  ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునికి భక్తితో నమస్కరించి, వివిధ ఉపచారాలతో పూజించి, " మహానుభావా ! మీ రాకతో మాగృహము పావనమయ్యింది... నాజన్మ ధన్యమయింది. నేను మీ దాసుడని ....నన్నేమి చేయ్యమంటారో ఆజ్ఞాపించండి - చేస్తాను" అనెను. "ధర్మవీరా ! నాకోసం నువ్వేమి చెయ్యనవసరం లేదు. నీ శ్రేయస్సుకై నేను కొన్ని మాటలు చెప్పదలచి వచ్చితిని, కార్తీక ద్వాదశి మహావిష్ణువుకు అత్యంత ప్రేతికరమైన రోజు. ఆ రోజున స్నానదాన, జపతప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాలని ఇస్తాయి. సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్ఠగా ఉపవాసము ఉండి, సాలగ్రామమును దానం చేసేవారు -- దరిద్రులుగానీ, నాలుగు జాతులలో ఎవరైనా కానీ, స్త్రీ ఐనా - పురుషుడైనా , పతివ్రత ఐనా - వ్యభిచారిని ఐనా--- ఎవ్వరైనా సరే జన్మజన్మాల పాపాలు పోయి, పుణ్యాన్ని పొందుతారు. నీతండ్రి యమలోకంలో పడరానిపాట్లు పడుతున్నాడు....అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి -- నువ్వు ఆరోజున సాలగ్రామాన్ని దానం చెయ్యు " అని నారదుడు తెలిపెను.

ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను విని నవ్వి , "మునివర్యా ! నేను నేను గో - భూ, తిల - సువర్ణ దానాలెన్నిటినో చేశాను. కేవలం సాలగ్రామము అనే రాతిని దానంచేస్తే ఎవరికి ఉపయోగపడుతుంది ? తినడానికి పనికిరాదు, నవరత్నాలలో ఒకటి కాదు, ఏ రకంగానూ - ఎవరికీ పనికిరాదు, ఆ దానం పట్టినవానికి సుఖము ఉండదు. ఆకలి - దాహము తీరదు ..... మరెందుకు ఈ దానమియ్యాలి? నేను దానమివ్వనుగాక ఇవ్వను" అని అన్నాడు.

నారదుడు ఎంతచెప్పినా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని విడువలేదు. అతని మొండితనానికి విచారించి నారదుడు "సాలగ్రామము శిలకాదు, శ్రీమహావిష్ణువు యొక్క ప్రతిరూపము, దానిని దానము చేస్తే....నీతండ్రి నరకబాధల నుండి విముక్తి పొందటానికి ఈ దానము తప్ప వేరే మార్గము లేదు" అని చెప్పి వెళ్ళిపోయెను. కొంతకాలమునకు ధర్మవీరుడు మరణించెను.....అతను ఎన్ని దానధర్మాలు చేసినప్పటికీ ...సాలగ్రామ దానమీయనందుకు నరకగతుడై, అనంతరము మూడుసార్లు పులిగాను, మూడుసార్లు కోతిగాను, అయిదుసార్లు ఆబోతుగాను , పదిసార్లు స్త్రీగాను జన్మించి - వైధవ్యపీడను పొందటం జరిగింది. పదకొండవజన్మలో కూడా ఒక బ్రాహ్మణునికి కూతురిగా పుట్టి, యుక్తవయసు రాగానే వివాహం చేసుకొని, పూర్వజన్మ కర్మవలన, తన భర్త అనతికాలంలోనే మరణించటంతో -- ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి , ఆ బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో తన కూతురి పూర్వజన్మ కర్మఫలాన్ని తెలుసుకొని, ఆ విషయాలన్నీ ఆమెకు తెలిపి, --- కార్తీక సోమవారంనాడు వేదోక్తవిధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలప్రాప్తి వలన మరణించిన పెళ్ళికొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ధర్మకామసౌఖ్యాలతో గడిపి, కాలాంతరమున స్వర్గమును చేరి, పుణ్యఫలాలను అనుభవించారు. తరవాత ధర్మవీరుడు ఇరవైమూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి, పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ -- ఆ పుణ్యఫలంగా మోక్షాన్ని పొందాడు. ఇతని సాలగ్రామదానము మహాపుణ్యం వలన అతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యెను.

ఎంతటి పాపానికైనా సరే ....సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము........కార్తీకశుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామదానము చేసిన దానఫలము ......

-:పన్నెండవరోజు పారాయణం సమాప్తం:- 


No comments:

Post a Comment