November 19, 2013

కార్తీక మహాత్మ్యం – పదిహేడవరోజు కథ

కార్తీక మహాత్మ్యం పదిహేడవరోజు కథ
అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ
కర్మబంధము, ముక్తికార్యము, కారణము – స్థూలసూక్షము. ఈ ద్వంద్వ సంబదితమే దేహము అనబడును. జీవుడంటే వేరెవరూ కాదు.
అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకీ, బుద్ధికీ సాక్షి – సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కుండవలె రూపాదిగా వున్న పిండ శేషము – ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా – ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప – ఆత్మమాత్రము కాదు. ఇదేవిధంగా ఇంద్రియాలుగానీ,  అగోచరమైన మనస్సుగానీ, అస్థిరమైన ప్రాణముగానీ –ఇవేవీ కూడా  ‘ఆత్మ’ కాదు – అని తెలుసుకో. దేనివలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ‘ఆత్మగా’ తెలిసికొని – ఆ “ఆత్మపదార్థమే నేనై వున్నాను” అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైతే అయస్కాంతమణి తాను ఇతరాచలచేత – ఆకర్షించబడకుండా – ఇనుమును తాను ఆకర్షించునో – అదేవిధంగా – తాను నిర్వికారియై – బుద్ధ్యాదులను సైతము చలింప చేస్తుందో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. “దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియమనః ప్రాణాలు భాసమానాలౌతున్నాయో – అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై – నిద్రాజాగ్రత్ స్వప్నాదులనూ, వాటి ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే – దేహేతరమై ‘నే’ ను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది – జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీనత్వ, నాశాంగ తత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా – అదే నీవుగా --- ఆ నీవే నేనుగా – నేనే నీవుగా “త్వమేవాహం” గా భావించు. ఈ విధంగా “త్వం” (నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్ఛబ్దార్థాన్ని గ్రహించాలి. (తత్ శబ్దానికి ‘బ్రహ్మ’ అని అర్థం.)

సాక్షా ద్విధిముఖాత్ అంటే – “సత్యం జ్ఞానమనంతరం బ్రహ్మ అనే వాక్యలద్వార సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే ‘ఆత్మ’ నరయగలగాలని అర్థము. ఆ ‘ఆత్మ’  సంసార లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టి గోచరము కాదని, చీకటి నెరుగనిదనీ – లేదా – చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ – పూర్వోక్త సాధనలవలన తెలుసుకో దేనినైతే “సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం” గా వేదాలు కీర్తిస్తున్నాయో – ఆ బ్రహ్మ ”నేనే” అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో – అదే ఆత్మ అదే నువ్వు. అదే నేను “తదను ప్రవిశ్య” ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్రవేశము – ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము – కర్మ ఫలప్రదత్వమూ – సర్వజీవ కారణ కర్ర్తుత్వమూ – దేనికైతే చెప్పబడుతూ వుందో – అదే ‘బ్రహ్మ’  గా తెలుసుకో.

ఓ జిజ్ఞాసా ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మే ఆ పరమాత్మ – ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో – అప్పుడు మాత్రమే ‘తత్’ శబ్దార్థం తనేనని ‘త్వం’ శబ్దం సాధనమేగానీ, ఇతరం కాదని తేలిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో –శ్రవణమననాదికాల నాచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురుకటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిన చేరతాము. దానినే ముక్తి – మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా వుండి, తత్ఫలితాన్ని  దైవార్పణం చేస్తూండడం వలన – ప్రారబ్దాన్ననుసరించి ఆ జన్మలో గానీ, లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాస పరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకొని ముక్తులవుతారు.” అని అంగీరసుడు చెప్పగా ......ధనలోభుడు నమస్కరించి ఈ విధంగా పలికెను.

-:కార్తీక మహాత్మ్యం  పదేహేడవరోజు పారాయణం సమాప్తం:-
  
               

No comments:

Post a Comment