November 15, 2013

కార్తీక మహాత్మ్యం - పదమూడవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం - పదమూడవ రోజు కథ 

కార్తీక మాసంలో ప్రాతఃస్నానాలు చేయటం, యోగ్యుడైన పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయించటం, విద్యాదానం,వస్త్రదానం ,అన్నదానం,కన్యాదానం ఇవి చాల ప్రధానమైనవి.ధనం చేత పేదవాడు,గుణం చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునకి, కార్తీక మాసంలో ఒడుగు చేయించి, దక్షిణ ఇస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి.ఆ విధంగా తమ ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వల్ల, దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. ఎన్నినూతులు,చెరువులు తవ్వించినా పైన చెప్పినట్లుగా బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసినందువల్ల వచ్చు ఫలితానికి సరితుగావు. అంత కన్నా ముఖ్యమైనది కన్యాదానం, ఈమాసం లో భక్తిశ్రద్దలతో కన్యాదానం చేస్తే, వారు తరించటమే కాక, తమ పితృదేవతలను కూడా తరింపచేసినవారు అవుతారు. ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవా,బ్రాహ్మణ సమారాధనలు వీటి వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది.


సువీరుని చరిత్ర 

ద్వాపరయుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి రూపవతి,గుణవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు దాయాదులచే ఓడింపబడి  రాజ్యభ్రష్టుడై, భార్యతో అడవులలోకి పారిపోయి కందమూలాలను భుజిస్తూ, కాలం గడపసాగాడు. కొంతకాలానికి అతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది. వారి పోషణకి చిల్లి గవ్వైనా లేని హీన పరిస్థితులలో, తన పూర్వ జన్మ కర్మలని నిందించుకుంటూ, అతి కష్టం మీద వారి కుమార్తెను పెంచసాగారు. ఎనిమిదేళ్ళ వయసుకే ఏంతో అందంగా ఉన్న ఆమెను చూసి, మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్ళి చేయమని రాజుని కోరాడు. అందుకు ఆ రాజు "మునిపుత్రా! ప్రస్తుతం నేను ఘోరదరిద్రంతో ఉన్నాను, కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా నాకు ఇచ్చి, నా కూతురుని పెళ్ళాడు" అని  అన్నాడు. ఆ పిల్ల మీదున్న మక్కువతో ఆ ముని కుమారుడు "రాజా! నేను కేవలం ముని కుమారుడనైన కారణంగా నీవుఅడిగినంత దానం తక్షణమే నేను ఇవ్వలేను. తప్పస్సు చేసి ధనాన్ని సంపాదించి తెచ్చి ఇస్తాను" అని చెప్పి నర్మదా నదీ తీరంలో కుబేరుని గురించి ఘోరతపస్సు చేసి,  అతనిని మెప్పించి, ధనాన్ని సంపాదించి, దానిని సువీరునకు ఇచ్చి, ఆ రాజు కుమార్తెను పెళ్ళి చేసుకుని, తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు.
కన్యావిక్రయ ద్రవ్యంతో రాజు తన భార్య తో సుఖంగా ఉండసాగాడు. కొంత కాలానికి రాజు భార్య మరొక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనం సంపాదించినట్లే, ఈ పిల్ల ద్వార కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని అనుకున్నాడు. ఆ బిడ్డకు యుక్త వయస్సు వచ్చింది. ఒక సాధువు నర్మదా స్నానానికై వచ్చి రాజుని చూసి "ఈ అరణ్యంలో భార్య బిడ్డలతో నివసించటానికి కారణమేమిటి"  అని అడిగాడు. అంతట ఆ రాజు "రాజ్యాన్ని పోగొట్టుకుని ఇలా అడవుల పాలు అయ్యాను" అన్నాడు. మొదటి కుమార్తెకు కన్యాశుల్కం తీసుకుని వివాహం చేసి ఆ దానంతో ప్రస్తుతం సుఖంగా కాలం గడుపుతున్నాను అని చెప్పాడు.
సువీరుని సమాధానానికి ఆశ్చర్యపోతూ ఆ ముని "ఓ రాజ! ఎంత పని చేసావు, మూర్ఖుడివై కన్యని అమ్ముకొని పాపాన్ని మూటగట్టుకున్నావు. ఇలా జీవించేవారు 'అసిపత్రం' అనే నరకాన్ని అనుభవిస్తారు.ఈ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన,తర్పణాలు చేస్తే, వారు కూడా ఈ నరకాన్ని చవిచూస్తారు. వారు ఈ కర్తకు జన్మజన్మలకు కూడా పుత్రసంతానం కలుగకూడదని శపిస్తారు. ఆడపిల్లల్ని అమ్ముకుని జీవించటమే వృత్తిగా ఎంచుకున్నవారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. ఎన్నో రకాలైన పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయిగాని, కన్యావిక్రయం చేసిన వారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కావున కార్తీకంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా  పెళ్ళి జరిపించు. కార్తికమాసంలో విద్యావంతుడైన వరునికి కన్యాదానం చేసినవారు గంగలో స్నానం చేసిన ఫలం, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందటమే కాక, మొదటి కన్యను అమ్మిన పాపం కుడా తొలగిపోతుంది"  అని హితబోధ చేసాడు.

నీచబుద్దితో కూడుకొనిన సువీరుడు నవ్వి, "ఓ మునివర్యా ! ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని జారవిడుచుకోమంటారా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు,నా రెండవ కుమార్తెను కూడా పెద్దపిల్ల కంటే అధికంగా దానం ఇచ్చేవరికే ఇచ్చి పెళ్ళి చేస్తాను, నేను కోరుకున్న సుఖలన్నీ అనుభవిస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను"  అని నిక్కచ్చిగా చెప్పి మునిని వెళ్ళగొట్టాడు.ఆ మాటలకు ముని ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళిపోయాడు.

శ్రుతకీర్త్యుని చరిత్ర 

సువీరుని పూర్వీకులలో శ్రుతకీర్తి అనే రాజు -- ధర్మప్రవక్తా, శతాదిక యాగకర్తా అయిన అతను, తాను చేసిన పుణ్యకార్యాల వలన స్వర్గములో ఇంద్రాదులచేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూఉండేవాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు శ్రుతకీర్తిని నరకమునకు తీసుకువచ్చిరి. అందులకు శ్రుతకీర్తి యమధర్మరాజుని "నేను ఎన్నడూ ఏ పాపము చేయలేదు....స్వర్గములోనున్న నన్ను -- ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి ? " అని నిలదీసి అడిగెను. అందుకు యముడు "శ్రుతకీర్తి ! నీవు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే , కానీ నీ వంశీకుడైన సువీరుడు తన పెద్ద కుమార్తెను కన్యాశుల్కం తీసుకొని వివాహము జరిపించాడు. అతడు చేసిన ఆ మహాపాపము కారణంగా, మీ వంశీయులంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడవైనందున, నీకొక అవకాశము ఇస్తున్నాను. సువీరుని రెండవ కుమార్తె ..... తన  తల్లితో నర్మదానదీ తీరంలో జీవిస్తూ ఉంది. ఆమెకు ఇంకా పెళ్ళికాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన మానవశరీరము దాల్చి, అక్కడకు వెళ్ళి, ఒక సద్బ్రాహ్మణునికిచ్చి,  ఆ కన్యకు ....కన్యాదానం(వివాహం) జరిపినటైతే....నువ్వు - నీ పూర్వీకులు ఈ నరకము నుండి విముక్తి పొందుతారు. అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండీకూడా - సంతానము లేనివాడు , బ్రాహ్మణ కన్యాదానానికిగాని, కన్యాదానము అందుకోబోతున్న బ్రాహ్మణునికిగాని, ధనసహాయము చేసినట్లయితే, ఆ ధనదాత....కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు - స్వలాభాపేక్షారహితులై - రెండు పాడి ఆవులను చెల్లించి, కన్యను కొని , ఆ కన్యను చక్కటి వరునకిచ్చి, పెళ్ళిచేసినవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు. కావున నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి, నేను చెప్పినట్లు చేస్తే, నీపితృగణము తరిస్తారు. వెంటనే బయలుదేరు" అని చెప్పసాగాడు.



శ్రుతకీర్తి యమునకు నమస్కరించి, భూలోకమునకు చేరి....నర్మదానదీ తీరమునకు చేరి, సువీరుని భార్యకు హితవు చెప్పి, ఆమె కూతురిని ...ఒక బ్రాహ్మణునికి కన్యాదానము చేసి, ఆ పుణ్యమహిమవల్ల సువీరుడు  నరకపీడా విముక్తుడై స్వర్గమునకు చేరుకోనేను, అనంతరము శ్రుతకీర్తి పదిమంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయటంవల్ల ---- వారి పూర్వీకులంతా కూడా స్వర్గమునకు చేరుకున్నారు. కావున కార్తీకమాసంలో కన్యాదానము చేసేవారికి సర్వపాపాలు నశింపచేసుకుంటారు. అలా చేయలేనివారు, వివాహానికి మాటసాయము చేసినా పుణ్యాన్ని పొందుతారు. ఎవరైతే కార్తీకమాసంలో యధావిధిగా వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని....... ఆచరించనివాళ్ళు నరకాన్ని పొందుతారు.  


                         

No comments:

Post a Comment