November 21, 2013

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైరెండవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైరెండవరోజు కథ 

అత్రి మహర్షి ఇంకా చెప్పసాగెను ..... "అగస్త్యా ! ఈవిధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి, వివిధ ఫల - పుష్ప పల్లవ దళాదిగా షోడసోపచారములతో పూజించి, మేళతాళాలతో కీర్తించి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి, పారవశ్యంతో నర్తించాడు. బంగారు విష్ణు ప్రతిమను చేయించి, దానికి కూడా దీపాలు వెలిగించి - పూజలు చేయించాడు. ఆ రాత్రంతా విష్ణుసేవలో లీనమై, మరుసటిరోజు ఉదయమే మిగిలిన సైన్యంతో మళ్ళీ యుద్ధరంగానికి చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే --- శతృవులను ఆహ్వానిస్తూ..... భీషణమైన ధనుష్టంకారాన్ని చేసాడు. ఆ శబ్దం చెవినపడగానే -- కాంభోజ, కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కున్నాయి. వజ్రాలవంటి కట్టులతోనూ ..... పిడుగుల్లాంటి బాణాలతోనూ....... అతివేగంగా పరుగెత్తే గుర్రాలతోనూ ...... ఐరావతాల్లాంటి ఏనుగులతోనూ ....... ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ ------- క్రమక్రమంగా యుద్ధం ఘోరంగా పరిణమించసాగింది. గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకి సంతుష్టుడైన విష్ణువు --- అతనికి దైవబలాన్ని తోడుచేయటం వలన, ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఓడిపోయాయి. కాంభోజుల గుర్రాలు - ఏనుగులు - వివిధ రాజుల రథబలాలు, పదాతి దళాలు పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుని చేతిలో  ఓడిన రాజులు ప్రాణభీతితో రణరంగాన్ని వదలి....... తమ రాజ్యాలకు పారిపోయారు. శత్రువులను ఓడించున పురంజయుడు అయోధ్యలో ప్రవేశం చేసాడు.   దేనికైనా దైవబలం ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే ముఖ్యం. ధర్మాచరణంలో ముఖ్యమైన కార్తీక వ్రతాన్ని ఎవరైతే శ్రీహరిని నిష్ఠగా సేవిస్తారో - వారి సమస్త దుఃఖాలు నశిస్తాయి. విష్ణుభక్తి సిద్ధించుటే కష్టం. కార్తీక వ్రతము -- శ్రీహరిసేవ ఎవరైతే వదలకుండా చేస్తారో ..... వారు శూద్రులైనప్పటికీ వైష్ణవోత్తములుగా లెక్కింపబడతారు. వేదవిదులైన బ్రాహ్మణులైనప్పటికీ ---- కార్తీక వ్రతాన్ని ఆచరించని వారు కర్మచందాలులుగా పరిగణించబడతారు. ఏజాతి వారైనా సరే... ఈ సంసారం సాగరాన్నుంచి బైటపడి, ఉత్తమగతిని పొందాలనే కోరికతో విష్ణువును పూజించినట్లయితే, వెంటనే వారి పాపాలు హరించి పోతాయి. భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి, రక్షించగలిగిన దైవం విశ్వమంతా వ్యాపించియున్న విష్ణువునందు భక్తి కలిగిన వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం పుణ్యం దక్కుతుంది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా -- కనీసం మహత్యాన్ని మనస్పూర్తిగా విన్నా .... వారు చేసిన పాపాలు తొలగి, వైకుంఠమునకు చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ ఇరవైరెండవరోజు కథని శ్రార్థకాలంలో చదివితే వారి పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు." అని అత్రి మహర్షి చెప్పారు.

                                       -:ఇరవైరెండవరోజు పారాయణం సమాప్తం:-   


                                                 

No comments:

Post a Comment