November 19, 2013

కార్తీక మహాత్మ్యం – పదహారవరోజు కథ

కార్తీక మహాత్మ్యం – పదహారవరోజు కథ
దామోదరు(విష్ణువు)నకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసం నెలరోజులూ నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠమునకు చేరుకుంటారు. సంతానము కోరుకునేవారు కార్తీకపౌర్ణమి రోజు వాంఛా సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన – దానాలను చేయటం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిన కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు దూరమవుతాయి. దుర్మరణాలు, సంతాన విచ్ఛేదాలు కానీ జరుగవు.
స్తంభరూపము
పౌర్ణమి రోజు విష్ణు సన్నిధిలో స్తంభద్వీప ప్రజ్వలనం వలన వైకుంఠము సిద్ధిస్తుంది. గరుడధ్వజ స్తంభానికి పైన ఆకాశదీపం పెట్టకూడదు. అలా పెట్టినవారు నరకలోకం పాలవుతారు. ప్రత్యేకంగా రాతితోగానీ, కొయ్యతోగానీ, స్తంభం చేయించి, దానిని విష్ణువు ఆలయమునకు ముందు ఉంచి, తదనంతరము శాలిధాన్యమును, వ్రీహిధాన్యము, నువ్వులను పోసి, దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు, హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే, సమస్త పాపాలు నశిస్తాయి.
కైవల్యము పొందిన కొయ్యమొద్దు
వివిధ వృక్షలతా మండితమైన మాతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయము ఉండేది. ఎందరో మునులు ఆలయానికి వచ్చి, కార్తీక వ్రతమాచరిస్తూ, ఆ నెలరోజులూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ పూజిస్తూండేవారు. ఒకానొక కార్తీకమాసంలో, వ్రతస్థలంలో, ఒక ముని “విష్ణు సన్నిధిన స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుంది, కనుక మనము కూడా ఈ ఆలయప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము.” అని సూచించాడు. వంపులులేని స్థూపాకారపు చెట్టును ఒక దానిని చూసి, దానినే స్తంభంగా నియంత్రించి, శాలివిహ్రీ తిలసమేతంగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి, విష్ణువుకు అర్పణం చేసి, కోవెలలోకి వెళ్ళి, పురాణ కాలక్షేపం చేయసాగేరు మునులు. అంతలోనే వారికి ఫెళఫెళమని శబ్దం వినిపించటంతో, వెనక్కి తిరిగి స్థంభదీపం వైపు చూసారు. వాళ్ళు అలా చూస్తూండగానే స్తంభం నిలువునా పగిలి నేలపై పడిపోయి, అందులో నుండి ఒక పురుషాకారుడు బయటకు రావటంతో, ఆశ్చర్యచకితులైన మునులు “ నీవు ఎవరువు? ఈ విధంగా స్తంభంగా ఎందుకు ఉన్నావు? నీ కథ ఏమిటి? తెలుపు” అని అడుగగా ----- ఆ దివ్యపురుషుడు “ ఓ మునులారా ! నేను గతంలో ఒక బ్రాహ్మణుడను. వేదశాస్త్రాలు చదవటం గానీ, హరికథాశ్రవణం గానీ, తీర్థయాత్రలు చేయటం గానీ చేయలేదు. పెక్కు ధనమున్నప్పటికీ బ్రాహ్మణ ధర్మాన్ని వదలి—రాజునై పరిపాలన చేస్తూ, దుష్టబుద్ధితో ప్రవర్తిస్తూ, వేదపండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను క్రింది ఆసనాలపై కూర్చోబెట్టి, నేను ఉన్నతాసీనుడనై ----- ఎవరికీ దానధర్మములు చేయక, తప్పనిసరి అయినప్పుడు దానమిస్తాను అని వాగ్ధానము చేసి, సొమ్మును మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను ..... నేను స్వంతానికి వాడుకొనేవాడిని. వాటి ఫలితంగా మరణించిన పిదప --- నరకగతుడనై 52 వేలసార్లు కుక్కగాను, పదివేల సార్లు కాకిగాను, పదివేల సార్లు తొండగాను, మరో పదివేల సార్లు పురుగుగాను, కోటిజన్మలు చెట్టుగాను, కోటి జన్మలుగా ఇలా మొద్దుగాను కాలము గడుపుతూ ఉన్నాను. ఇన్ని పాపాలు చేసిన నేను, ఇప్పుడు ఎలా శాపవిమోచనం తొలగిందో ....... సర్వజ్ఞులైన మీరే తెలియచేయగలరు.” అని తన వృత్తాంతమును తెలియచేసేను.
“ఈ కార్తీక వ్రతఫలము యదార్థమైనది. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మనందరి కళ్ళముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది. అందులోని కార్తీకపౌర్ణమి రోజు, స్తంభదీపమును పెట్టటం శుభప్రదం. మాచే పెట్టబడిన దీపము వలన మొద్దు రూపంలో ఉన్న నీకు ముక్తి కలిగింది. మొద్దైనా, రాయి అయిన సరే కార్తీకమాసంలో దైవసన్నిధిలో దీపాన్ని పెట్టడం, దామోదరుని దయవలన నీకు మోక్షం కలిగింది.”  అని మునులు చెప్పగా “ దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు – బుద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి” అని ప్రార్థించగా, అంగీరసుడు అనే ముని అతనికి ఈ విధంగా జ్ఞానబోధ చేయసాగాడు.

-:కార్తీక మహాత్మ్యం పదహారవరోజు పారాయణం సమాప్తం:-
        
            

No comments:

Post a Comment