November 13, 2013

కార్తీక మహాత్మ్యం -- పదవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం -- పదవ రోజు కథ

నరకలోకంలో యముడితో - యమదూతలు " ప్రభూ ! మమ్మల్ని అడ్డగించి,  అజామీళుడిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిరి ... మేము విచారవదనంతో వెనుదిరిగి వచ్చితిమి" అని  తెలియచేయగా .....యముడు తన దివ్యదృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొనెను.

 అజామీళుని పూర్వజన్మ వృత్తాంతం 

పూర్వజన్మలో అజామీళుడు సౌరాష్ట్రదేశంలో ఒక శివాలయంలో అర్చకునిగా ఉండేవాడు.  కానీ అతను ఆ జన్మలో కూడా స్నానసంధ్యాదులు చేయక,  దేవునికి ఉపయోగించే ద్రవ్యాలను దొంగలించుచు , దుష్టులతో స్నేహం చేస్తూ  ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ ఉండేవాడు. అదే గ్రామంలో ఒక బీదబ్రహ్మణుడు ఉండేవాడు. అతని భార్యకి - అజామీళునికి రహస్య సంబంధము ఉండెడిది. ఒకరోజు బీదబ్రాహ్మణుడు - ఊరూరు తిరిగి తెచ్చిన వెచ్చములు ఇంట్లో ఉంచి "బాగా ఆకలిగా ఉంది వండి వడ్డించు" అని భార్యని అడిగేసరికి ఆమె తన కామపుటాలోచనలకు అంతరాయం కలిగించినందుకు భర్తను కొట్టి - తిట్టి ....అతనిని ఇంటినుండి వెడలగొట్టింది. మగడు ఇల్లువదిలి వెళ్ళిపోవటంతో సంతోషించి .....అందంగా ముస్తాబై ఒక రజకుని (చాకలి) ఇంటికి వెళ్ళి ... "ఈ రాత్రి నాతో గడుపు" అని కోరగా నీతిమంతుడైన అతడు -- ఆమె కోర్కెను అంగీకరించక .... ఆమెకు బుద్ధులు చెప్పి వెళ్ళిపోయెను. అంతట ఆమె శివాలయ అర్చకుడు(అజామీళు) ని సమీపించి -- రాత్రంతా అతనితో సుఖించి....తెల్లారేసరికి ఇంటికి చేరుకున్నాక ....అంతవరకూ ఆమె చేసిన పనులకు తనలోతానే పశ్చాత్తాప పడిభర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి ఇంటికి తీసుకువచ్చి అతని పాదాలపై పడి ..... తాను చేసిన తప్పులను క్షమించమని ప్రాధేయపడింది. అది మొదలు అతని మాటలకు ఎదురు చెప్పకుండా నీతిగా బ్రతకసాగింది.

ఇటువంటి పాపాలు చేయుట వలన చనిపోయిన తరవాత ఆ శివార్చకుడు(అజామీళుడు) రౌరవాది మహానరకాలు అనుభవించి, సత్యనిష్టుడి కొడుకైన అజామీళుడుగా జన్మించి -- కార్తీకపౌర్ణమి నాటి శివసందర్శనం .....చివరి సమయంలో హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.

బీదబ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి మరణించి, నరకానుభావమును పొంద కన్యాకుబ్జములోని ఛండాల గృహంలో బాలికగా జన్మించింది ..... ఆమె తండ్రి గండాన్న పుట్టడంవలన వారు ఆమెను అడవిలో వదిలివేశారు.  ఒక బ్రాహ్మణుడు బాలిక ఏడుపుని విని జాలిపడి తనతో తీసుకొనివెళ్ళి , తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ వద్ద పెరిగిన పిల్లే అజామీళుడుకి చేరువ అయ్యింది. ఇది అజామీళుని యొక్క పూర్వ జన్మవృత్తాంతం..... స్వచ్చమైన మనస్సుతో చింతలన్నిటిని విడిచిపెట్టి,  భగవంతుని స్మరించి,  దానధర్మములు చేస్తూ, భగవంతుని కథలు వింటూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు. అదే విధంగా కార్తీక ధర్మాచరణమునే సూక్ష్మమార్గము కూడా చాలా పుణ్యాన్ని ఇస్తుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీకమాస వ్రతమునకే ఉన్నది. ఎవరైతే ఈ వ్రతమును ఆచరిస్తారో వాళ్ళు నరకలోకమునకు పోరు.....కార్తీకమాస వ్రతమును చదివినా ....విన్నా అట్టి వారు మోక్షానికి అర్హులే......

-:పదవరోజు పారాయణం సమాప్తం:-

                   

1 comment:

  1. We are not scroll the page to right side also. Please do the needful.Thank you very much for Karthika Mahatyam.

    ReplyDelete