November 13, 2013

కార్తీక మహాత్మ్యం -- తొమ్మిదవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం -- తొమ్మిదవ రోజు కథ

విష్ణుదూతలు ...యమదూతలను ఈ విధంగా అడిగారు -- "ఓ యమదూతలారా ! మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి ? పుణ్యాత్ములెవరు ? పాపాత్ములెవరు ? యమదండనకు అర్హులెవరు ? మాకు విపులీకరించి చెప్పండి !" ...అని ప్రశ్నించగా ....అందుకు జవాబుగా యమదూతలు "ఓ విష్ణుదూతలారా ! వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులూ , సాధుజన బహిష్కృతులు యమ దండనకు అర్హులు. అసత్యం పలికేవారు , జంతువులను హింసించేవాడు , దానము చేసినదానిని మరలా ఆశించేవాడు , డాంబికుడు , దయారహితుడు , దయలేనివాడు , పరుల భార్యలని  ఆశించేవాడు (కోరేవాడు) , సోమ్ము తీసుకొని సాక్ష్యం చెప్పేవాడు , చేసిన దానం -- ఇతరులకు చెప్పేవాడు , మిత్రద్రోహిని - కృతఘ్నులని - ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడు , కన్యాశుల్కంతో జీవించేవాడు , తల్లిదండ్రుల శ్రార్ధకర్మలను చేయనివాడు , కేవలం భోజనం గురించే ఆలోచించేవాడు , ఇతరుల దానాన్ని నిరోధించేవాడు , నిత్యం స్నానసంధ్యలు చేయనివాడు , బ్రాహ్మణ - అశ్వ - గోహత్య మొదలైన పాపాలు చేసేవాడు మొదలైన పాపాలు చేసేవారు ...యమలోకంలో మాచేత దండించబడతారు.....ఇక ఈ అజామీళుడు బ్రాహ్మణ పుట్టుక పుట్టి , దురాచారములకులోనై , కులభ్రష్టుడై , దాసీసంగమలోలుడై , చేయరాని పాపాలు చేసిన వీడు విష్ణులోకానికి ఎలా అర్హుడు ????

విష్ణుదూతలు ఈ విధంగా సమాధానమిచ్చారు .... "ఉత్తమలోకాలకి అర్హతలు ఏమి కావాలో మేము చెప్పేవి వినండి -- ఏ కారణమువల్లనైనా చెడ్డవారి స్నేహం వదలి ...మంచివారితో స్నేహం చేసినా , ప్రతీరోజూ దైవచింతన కలిగి స్నానసంధ్యలు చేసేవాడు,  అసూయ లేనివాడు , జపాలు - అగ్నిహోత్రాలు చేసేవారు (నిర్వహించేవాడు) , చేసినకర్మలను బ్రహ్మకు అర్పించేవాడు, విద్యాదానము చేసేవాడు (గురువు) పరోపకారం చేసేవాడు , వివాహ - ఉపనయనాలను చేయించేవాడు , అనాథలకు సంస్కరించేవాడు , అనునిత్యం శాలిగ్రామాన్ని పూజించి - తీర్థము తీసుకునేవాడు, తెలిసోతెలియకో భగవన్నామాన్ని స్మరించేవాడు,  గోదానము చేసేవాడు ...... అవసానదశలో ఒక్కమారు భగవంతుడిని స్మరిస్తే చాలు వారు  మాలోకమునకు అర్హులు."

అజామీళుడు విష్ణు - యమదూతల సంభాషణలు విని ఆశ్చర్యపోయి " నేను పుట్టిన దగ్గర నుండి ఈరోజువరకు భగవంతునికి పూజగానీ , వ్రతముగానీ , దానధర్మాలుగానీ చేయలేదు , తల్లిదండ్రులకు నమస్కరించలేదు ....చివరి క్షణంలో కేవలం "నారాయణా ! " అని పిలిచినందుకే నాకు వైకుంఠ ప్రాప్తి కలిగినదా ???? ఇదంతా నా తల్లిదండ్రుల పుణ్యఫలము .... నా పూర్వజన్మ సుకృతమును ...నేను ఎంత అదృష్టవంతుడిని... " అని తలస్తూ విష్ణుదూతలతో వైకుంఠమునకు బయలుదేరెను.

-:తొమ్మిదవరోజు పారాయణం సమాప్తం:-      

       

No comments:

Post a Comment